పవన్‌పై పరువు నష్టం కేసు.. పోటీకి అనర్హుడిని చేయాలనే ప్లాన్?
posted on Jul 26, 2023 6:44AM
ఏపీలో అధికార వైసీపీ, జనసేన మధ్య యుద్ధం తార స్థాయికి చేరుకుంటుంది. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ యుద్దానికి ఆజ్యం పోశాయి. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజల డేటాను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేస్తున్నారని.. ఆ డేటా ఆధారంగా ఏపీలో మహిళలను ట్రాప్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లతో పాటు ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఆరోపణలకు ఇంత వరకూ ప్రభుత్వం నుండి వివరణ అయితే రాలేదు కానీ.. ఇష్టారాజ్యంగా పవన్ వ్యక్తిగత జీవితంపై మాటల దాడి చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే ఏపీ మహిళా కమీషన్ కూడా నోటీసులు ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా పరువు నష్టం కేసు వేశారు. అది కూడా క్రిమినల్ డిఫమేషన్ కేసు కావడం విశేషం.
ఓ మహిళా వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సివిల్ కోర్టులో ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు. పవన్ అనుచిత వ్యాఖ్యల పట్ల తాను మానసిక వేదనకు గురయ్యానని మహిళా వాలంటీర్ పేర్కొన్నారు. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేయగా.. న్యాయమూర్తి కేసును విచారణకు కూడా స్వీకరించారు. నిజానికి ముందుగా ప్రభుత్వమే పవన్ పై పరువు నష్టం కేసు వేయాలని నిర్ణయించింది. వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పవన్ వ్యాఖ్యలపై 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సీసీపీ 199/4 యాక్ట్ కింద కేసు నమోదు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది.
కానీ, ఈ లోగానే ప్రభుత్వ తరపున కాకుండా ఓ మహిళా వాలంటీర్ తో పరువు నష్టం డిఫమేషన్ కేసు నమోదయ్యేలా చేశారు. ఇలా మహిళా వాలంటీర్ తో పిటిషన్ దాఖలు చేయించడం వ్యూహాత్మకమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఆ వ్యూహం ఏంటన్నది తెలియాలంటే ముందుగా మనకి పరువు నష్టం కేసు, డిఫమేషన్ కేసుపై కాస్త అవగాహనా కావాలి. ఇప్పుడు పవన్ పై పెట్టిన కేసు బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పెట్టిన కేసులాంటిదే. 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈ కేసు దాఖలు చేశారు. ప్రధాని ఇంటి పేరుతో ఉన్న వాళ్లంతా దొంగలే అనే అర్ధం వచ్చేలా చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో హైకోర్టు కూడా రాహుల్ కి వ్యతిరేకంగా తీర్పు నివ్వగా ఈ కేసు ప్రస్తుతం సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉంది.
ఒకవేళ సుప్రీమ్ కోర్టు కూడా రాహుల్ కి రిలీఫ్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ 2024 ఎన్నికలలో పోటీకి అనర్హుడు అవుతారు. ఇప్పుడు పవన్ పై కూడా అలాంటి కేసు పెట్టడం వెనక జనసేనానిని కూడా ప్రత్యక్ష పోటీకి అనర్హుడిగా చేయాలన్నప్లాన్ ఉండవచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే, 2024 ఎన్నికలకు నిండా ఏడెనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా ఈ కేసు ఈలోగా తేలడం కష్టమే. రాహుల్ గాంధీ కేసు ఇప్పటికి నాలుగేళ్లు అయినా ఇంకా తెలనేలేదు. మరి ఇప్పుడు వాలంటీర్ తో వైసీపీ నేతలు పెట్టించిన ఈ కేసులో ఫైనల్ తీర్పు ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియదు.