కేసీఆర్ ను వెంటాడుతున్న ఓటమి భయం!
posted on Aug 4, 2023 @ 9:57AM
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి, చివరకు మహారాష్ట్రలో పాగాకు పరిమిత ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే ఓటమి భయం వెంటాడుతుందా? జాతీయ రాజకీయాలేమో కానీ.. సొంత రాష్ట్రంలో బొక్కబోర్లా పడబోతున్నామన్న గుబులు రేగుతోందా? అంటే విశ్లేషకులు ఔననే అంటున్నారు. తెలంగాణలో తిరుగులేదని భావించిన కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఆర్‌గా మార్చి జాతీయ నేతగా మారిపోయారు. ఢిల్లీలో రాబోయే కాలంలో మనమే కీలకమంటూ ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో చెప్పుకుంటూ వచ్చారు.
కానీ, తెలంగాణ ప్రజల్లో తన ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందన్న సంకేతాలు రావడంతో కేసీఆర్‌కు కొత్త భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో దేశ రాజకీయాల సంగతి తరువాత ముందు సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ చేతికి అందిన సర్వేల ఆధారంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని అర్ధమైందని, దీంతో కేసీఆర్ మళ్లీ ప్రజలను తనవైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రైతు రుణమాఫీ, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు వంటి నిర్ణయాలని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి సీఎం పీఠం దక్కించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల కాలం వరకు తెలంగాణలో తిరుగులేదని భావించిన కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగేలా షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తరువాత తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఇతర పార్టీల్లో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండంతోపాటు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఏకతాటిపైకి రావడంతో అధికార బీఆర్ఎస్‌కు దీటుగా ఆ పార్టీ ఎదిగింది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ తప్పదని తేలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దీంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారని అంటున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వంపై రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగానే గత నాలుగేళ్లుగా ఇదిగో అదిగో రుణమాఫీ అంటూ వచ్చిన కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ దెబ్బకు దిగొచ్చారు. రుణమాఫీ అమలుకోసం రూ.19వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకించారు. గత ఎన్నికల సమయంలో లక్ష వరకు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత విడుతల వారిగా రైతు రణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. కానీ, నేటికీ రూ.35వేలలోపు వారికి మాత్రమే రుణం మాఫీ అమలైంది. మిగిలిన రైతులు రుణమాఫీకోసం ఎదురుచూపులు తప్పలేదు. తాజాగా, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేసీఆర్ పూర్తిస్థాయిలో రుణమాఫీకి హామీ ఇచ్చారు. విడుతల వారిగా సెప్టెంబర్ రెండవ వారం వరకు పూర్తి రుణమాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నం చేశారు.
అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్న ప్రకటన. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాల్సి ఉంది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఆర్టీసీ భూములను అమ్ముకొని సొమ్ముచేసుకునేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపిస్తున్నాయి. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 20,555 మంది వీఆర్ఏ లబ్ధిపొందనున్నారు. వీరిని విద్యార్హతను బట్టి వివిధ శాఖల్లో కేటాయింపులు చేయనున్నారు. దీనికితోడు పోడు భూముల పట్టాల పంపిణీసైతం ప్రభుత్వం చేపట్టింది. ఇలా వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకొనేందుకు సీఎం కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ వర్గాల్లో మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటం వల్లే కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో వరాలు కురిపిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది.