ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే.. కేసీఆర్ గాలి తీసేసిన మంత్రి మల్లారెడ్డి
posted on Aug 3, 2023 @ 12:14PM
మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ గాలి తీసేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కేవలం ఎన్నికల స్టంటేనని అసలు నిజం చెప్పేసి నాలిక కరుచుకున్నారు. ఔను కేసీఆర్ తాను అసాధ్యం అని గతంలో చెప్పిన సంగతి విస్మరించి మరీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
గతంలో కేసీఆర్ మీడియా సమావేశంలోనే.. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా? అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం అది జరిగేది కాదు. అని చెప్పారు. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ గతంలో తాను చెప్పిన మాటలను తానే ఖండించిన చందంగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశారు.
దీనిపై కేసీఆర్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ( ఆగస్టు 2) విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఆర్టీసీ విలీనం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని కుండబద్దలు కొట్టేశారు. బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ అనీ, ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల స్టంట్ లు కామనే కదా అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలనీ, అవి రెండూ తమ అధినేత వద్ద పుష్కలంగా ఉన్నాయనీ మల్లారెడ్డి తన వ్యాఖ్యలను సమర్ధించుకుని, సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా.. ఆర్టీసీ ఎన్నికల స్టంటేనన్న ఆయన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి