సాదా సీదాగా జూపల్లి కాంగ్రెస్ రీ ఎంట్రీ !
posted on Aug 3, 2023 @ 12:47PM
మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మరి కొందరు జూపల్లి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆరేడు నెలలుగా సాగుతున్న జూపల్లి, పొంగులేటి రాజకీయ ప్రహసనానికి తెర పడింది. నిజానికి, జూపల్లి పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు.మంత్రి కూడా అయ్యారు. సో ... జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఒక విధంగా స్వగృహ ప్రవేశమే అని చెప్పాలి.
అయితే అదేమిటో కానీ జూపల్లి స్వగృహ ప్రవేశం ఆయన అనుకున్నట్లుగా జరగలేదు. జూపల్లితో పాటుగా బీఆర్ఎస్ బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కోరుకున్న విధంగా, కోరుకున్న ముహూర్తానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూలై 2 న, ఖమ్మం జిల్లాలో సొంత గడ్డపై, లక్షల మంది ప్రజలు పాల్గొన్న బ్రహ్మాండమైన జనగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతే కాదు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభతో జన గర్జన సభ తోడవడంతో పొంగులేటి ఎంట్రీకి మీడియాలో మంచి మైలేజి వచ్చింది. మీడియా చర్చల్లో ప్రముఖంగా నిలచింది
నిజానికి అదే సభలో జూపల్లి కుడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా జూపల్లి, పొంగులేటి సభను తలదన్నేవిధంగా కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవాలని భావించారు. అయితే కారణాలు ఏవైనా కొల్లాపూర్ సభ రెండు మార్లు వాయిదా పడింది.
ఈ నేపధ్యంలోనే జూపల్లి కృష్ణా రావు ఢిల్లీ వెళ్లి చేరిక క్రతువును కానిచ్చుకున్నారు. అయితే అదేమిటో కానీ వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా ఢిల్లీ వెళ్ళినా జుపల్లికి నిరీక్షణ తప్పలేదు.అనుకున్న విధంగా చేరిక క్రతువు జరగ లేదు. కనీసం, ఢిల్లీలో అయినా రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి ఆశించారు. అయితే, చివరకు ఆ కోరిక తీరలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంక్షలో జూపల్లి, అయన అనుచరులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా జూపల్లికి ముహూర్తం కలిసి రాలేదు. నిజానికి బుధవారమే (ఆగస్టు 2) జూపల్లి,కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తదితరుల పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరడానికి వారు ఢిల్లీ చేరుకున్నారు.
అయితే తర్వాత కర్ణాటక కాంగ్రెస్ నేతలతో సమావేశాలతో ఖర్గే బిజీబిజీగా గడిపారు. దాంతో జూపల్లి చేరిక గురువారానికి వాయిదా వేశామని మల్లు రవి వెల్లడించారు. చివరకు, ఈరోజు, ఖర్గే, సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, , ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. అంజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.