చంద్రబాబు పెన్నా టూ వంశధార.. జగన్ ఎక్కడ నుంచి ఎక్కడికి?
posted on Aug 4, 2023 @ 9:57AM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. జగన్ సర్కార్ ఎక్కడ ఫెయిలైందో చంద్రబాబు అక్కడే ప్రజల నాడి పట్టుకుంటున్నారు. అందులో భాగమే పెన్నా టూ వంశధార టూర్. ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలైంది. ఇది రాజకీయ విశ్లేషకులు, సాగునీటి రంగ నిపుణులు చెప్తున్న మాటే. అయితే, ఇప్పుడు అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని చంద్రబాబు బయల్దేరారు. 'పెన్నా టు వంశధార' పేరుతో చంద్రబాబు ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలైన ఈ కార్యక్రమంలో తొలి రోజు మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు.
ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు.. గురువారం (ఆగస్టు 3) ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శించారు. ఇక, శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కెనాల్ సందర్శించనున్నారు. కాగా, ఒకవైపు ప్రాజెక్టుల సందర్శిస్తూనే మరోవైపు ఎక్కడిక్కడే సభలు కూడా ఏర్పాటు చేసి.. నాలుగేళ్ళలో జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు రావడంతో.. జగన్ పులివెందులలో నాకు జనాలు ఎలా వచ్చారో ఒక్కసారి చూడు అంటూ చూపించారు. పులివెందులలో టీడీపీ సభ జరగడం, పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నిజంగా విశేషమే.
చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన మొదలై మూడు రోజులే అయ్యింది. ఆయన పర్యటన మరో వారం రోజులు కొనసాగుతుంది. ఈ వారం రోజులలో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజలోకి చేరస్తాయి. కాగా ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ విఫలమవడానికి కారణం నిధులను కేటాయించకపోవడమే. ఎంతసేపూ పప్పు బెల్లాల మాదిరి తలకి ఇంత లెక్కేసి పంచడం, రాష్ట్రంలో అభివృద్ధి లేక ఆదాయానికి గండిపడడంతో తీవమైన నిధుల కొరత ఏర్పడింది. దీంతో జగన్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడమే మానేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు గత వారమే లెక్కలతో సహా ఎన్టీఆర్ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏకి పారేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇదే విషయంపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కమాన్.. మీరేం చేశారో చర్చకు రండి.. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.
ఇంత జరుగుతున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు. టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. చంద్రబాబు చేసే ఆరోపణలను ఖండించలేకపోతోంది. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతోంది. జగన్ తన తాడేపల్లి ప్యాలస్ లోఏవో వ్యూహాలు రచిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు తప్ప ఆయన బయటకి రావడం లేదు. వైసీపీపై నలువైపులా వ్యతిరేకత పెంచే చర్యలను టీడీపీ వేగవంతం చేస్తోంది. ఎ టీడీపీ దూకుడు మీద ఉంది. కానీ, వైసీపీలో ఎలాంటి జోష్ కనిపించడం లేదు. చంద్రబాబు చేసే ఆరోపణలకు వైసీపీ నుండి ఎక్కడా ఎలాంటి సమాధానం రావడం లేదు.
సాగునీటి రంగానికి వచ్చే సరికి.. లెక్కలతో సహా వివరించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం పెట్టింది పెద్దగా లేదు. ఏవో కాకి లెక్కలు తెచ్చి బురిడీ కొట్టించే తెలివితేటలు గల నేతలు వైసీపీ కేబినెట్‌లోనూ, సలహాదారుల్లోనూ కనిపించడం లేదు. అందుకే వ్యక్తిగత దూషణకి దిగుతున్నట్లున్నారు. కానీ, ఇలాంటి ప్రజా ప్రయోజన ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతే వైసీపీ కొంప మునగడం ఖాయం. మరి తాయిలాలే తనకి ఓట్లు తెస్తాయని ఇంకా జగన్ భ్రమలోనే ఉంటారా? లేక తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకొచ్చి చంద్రబాబు ఆరోపణలకు లెక్కలు చెప్తారా అన్నది చూడాల్సి ఉంది.