ఆర్వోల నియామకం ముందస్తు నగారాకు సంకేతమా?
posted on Aug 4, 2023 @ 12:28PM
ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు జరగాలి. రాజకీయ పార్టీలన్నీ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయాయి. రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలు రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల దాడులు మర్యాద మార్క్ ను దాటేస్తున్నాయి. పర్యటనలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు యమా స్పీడ్ గా జరిగిపోతున్నాయి.
రాజకీయ పార్టీలు పొత్తులు, ఎత్తులపై మంతనాలు, మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీలో మొత్తంగా పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. సరిగ్గా ఈ సమయంలో ఎన్నికలకు ఇంత ముందుగానే రాష్ట్రంలో రాజకీయ హీట్ ఎందుకు పెరిగిపోయిందా అన్న ప్రశ్నకు ఈసీ చూచాయిగానైనా సరే జవాబిచ్చేసింది. ఏపీలో ముందస్తుకు అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలను ఇస్తూ ఏర్పాట్లు మొదలెట్టేసింది. ఎన్నడూ లేని విధంగా షెడ్యూల్ కు తొమ్మది నెలలకు పైగా సమయం ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని 175 నియోజకవర్గాలకూ రిటర్నింగ్ అధికారులను నియమించేసింది.
అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ కే కాదు.. 2024లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సిన 12 రాష్ట్రాలలోనూ ఈసీ ఈ నియమకాలు చేపట్టింది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా ముందస్తు ముచ్చటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మణిపూర్, హర్యానా హింసాకాండ సహా పలు సమస్యలతో కేంద్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. విపక్షాల ప్రశ్నలకు పార్లమెంటులో సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడింది. ముఖ్యంగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాల పర్వంతో కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం కూడా హడావుడిగా కీలక బిల్లులన్నిటినీ ప్రతిష్ఠంభణ కొనసాగుతుండగానే ప్రవేశ పెట్టి బుల్ డోజ్ పద్ధతిలో ఆమోదింప చేసుకోవాలన్న తొందర ప్రదర్శిస్తోంది. అటు ఈసీ రిటర్నింగ్ అధికారుల నియామకాలను.. ఇటు కేంద్రం బిల్లుల ఆమెదంలో చూపుతున్న తొందరను క్రోడీకరించి చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను రెండు మూడు నెలల ముందుగానే నిర్వహించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లుగా కనిపిస్తున్నది. పనిలో పనిగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను కూడా ముందస్తుకు ఒప్పించి.. మినీ జమిలికి కేంద్రం తెరతీస్తున్నదా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే సారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు అసాధ్యమన్న భావనకు కేంద్రం వచ్చేసిందని ఇటీవల పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో అవగతమైపోయింది.
ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ మినీ జమిలి యోచన చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే జగన్ ముందస్తుకు తొందరపడుతున్నారనీ, ఈ విషయాన్ని ఇటీవల హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మరీ కోరారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సాధ్యమైనంత వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగితో ఒకింత ప్రయోజనం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. జగన్ ముందస్తు యోచన చేస్తున్నారంటూ ఒక సందర్భంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా మీడియా ముఖంగా బయటపడ్డారు.
అయితే కేంద్రం అప్పట్లో అంతగా సుముఖత చూపకపోవడంతో.. తెలంగాణతో పాటుగా ఏపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కేంద్రం కూడా ముందస్తు యోచన చేస్తుండటంతో ఉభయ తారకంగా ఏపీతో సహా 12 రాష్ట్రాలలో కూడా ముందస్తు నగారా మోగించేస్తే మేలని కేంద్రం భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈసీ రిటర్నింగ్ అధికారుల నియామకంతో ఎన్నికల సన్నాహాలను మొదలు పెట్టేసిందని చెబుతున్నారు.