పార్లమెంటుకు రాహుల్.. అనర్హతపై సుప్రీం స్టే
posted on Aug 4, 2023 @ 2:20PM
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మోడీ ఇంటిపేరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు విధించిన అనర్హతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందినా, అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో రాహుల్ పాల్గొనే అవకాశం ఉంది.
రాహుల్ పై అనర్హత వేటుపై సుప్రీం స్టే పార్లమెంటులో కాంగ్రెస్ గళం మరింత బలంగా వినిపించేందుకు వీలుకల్పించిందనే చెప్పాలి. వాస్తవానికి రాహుల్ గాంధీ మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విషయంలో సూరత్ కోర్టు తీర్పుపై అప్పట్లోనే భిన్న వాదనలు వినిపించాయి. కోర్టు అనర్హత వేటు నిర్ణయం తీవ్రమైనదని న్యాయనిపుణులు సైతం పేర్కొన్నారు. అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రాహుల్ ఇప్పటికే ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి సోనియాగాంధీ అధికారిక నివాసానికి మకాం మార్చేశారు. పలువురు మాజీ మంత్రులు ఇప్పటికీ ఎంపీలకు కేటాయించిన భవనాలలోనే కొనసాగుతున్నా.. కోర్టు తీర్పును గౌరవించి పార్లమెంటు సభ్వత్వాన్ని కోల్పోగానే నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్.. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరణకు లైన్ క్లియర్ కావడంతో లోక్ సభలో తన గళాన్ని గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
అదే సమయంలో అనర్హత వేటుపై స్టే కారణంగా బీజేపీ కూడా డిఫెన్స్ లో పడినట్లేనని అంటున్నారు. ముఖ్యంగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించి న్యాయపోరాటం చేసి తిరిగి పార్లమెంటులో అడుగుపెడుతున్న రాహుల్ కు కచ్చితంగా ఇది నైతిక విజయమనే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అదలా ఉంచితే ఎన్నికల అక్రమాల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లోనే ఉన్నా.. రాహుల్ విషయంలో మాత్రం కోర్టుల్లో విచారణ వేగంగా ముగిసి తీర్పు వెలువడటం వెనుక కేంద్రం హస్తం ఉందన్న అనుమానాలు నాడే వ్యక్తమయ్యాయి. ఇలా కోర్టు తీర్పు రాగానే అలా ఆయనను లోక్ సభ సభ్యుడిగా అనర్హుడు అంటూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసేసుకుంది. తెలంగాణలో 2018లో ఎన్నికల అఫిడవిట్ తో తప్పుడు వివరాలు సమర్పించారంటూ దాఖలైన దాదాపు డజన్ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.
అటువంటిది.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ పూర్తై తీర్పు కూడా వెలువరించడం ఏమిటని సూరత్ కోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును రాహుల్ సుప్రీంలో సవాల్ చేసి స్టే పొందారు.