జయసుధకు సికింద్రాబాద్ దక్కేనా?
posted on Aug 4, 2023 @ 2:38PM
రాజకీయాల్లో సినీ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ అనే విషయం చాలా కాలంగా ఉంది. అంతకుముందు ప్రజా జీవితంలో లేని సినీ తారలను ఆయా రాజకీయ పార్టీలు చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చి చట్ట సభల్లోకి పంపిన దృష్టాంతాలు అనేకం. ఈ కోవలోనే సహజ నటి జయసుధ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.300 కి పైగా చిత్రాల్లో నటించిన జయసుధ రాజకీయాల్లో రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానకారణం. ఆమెను కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానించి ప్రోత్సహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి సారి టికెట్ సంపాదించి 2014లో ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం గెలుపొందారు. 45,063 వోట్లు ఆమె కైవసం చేసుకున్నారు. 36.32 శాతం వోట్ల శాతం తేడాతో ఆమె గెలుపొందారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన తలసానిని ఆమె చిత్తుచిత్తుగా ఓడించారు. తలసాని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పరాజయం చెందారు. సికింద్రాబాద్ నియోజక వర్గంలో 30 శాతం క్రిస్టియన్లు ఉండటంతో ఆమె ఎన్నిక సులభతరమైంది. ఆ ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో జయసుధ ఎక్కువ వోట్లతో గెలిచినట్టు రికార్డ్ లో కెక్కారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి రైతులకు ఉచిత విద్యుత్ , రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలే. టిడిపి అభ్యర్థి తలసానితో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి కత్తి పద్మారావ్ జయసుధకు పోటీ ఇచ్చారు.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత టిడిపిలో చేరారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. వై ఎస్ తనయుడు వైఎస్ జగన్ పార్టీలో చేరినప్పటికీ ఆ పార్టీలో ఆమె ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయారు. జయసుధ ఇటీవలె బిజెపిలో చేరారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి నియామకం అయిన తర్వాత చేరికలు ప్రోత్సహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. బండి సంజయ్ వీడిన తర్వాత పార్టీ కేడర్ దూరమౌతున్న నేపథ్యంలో జయసుధ లాంటి సెలబ్రిటీ చేరడం బిజెపికి సానుకూలాంశం.
ఆమె కాషాయ కండువా కప్పుకోగానే జయసుధ వల్ల బీజేపీకి ఏమిటి ఉపయోగమనే చర్చ మొదలైంది. ఏదోరోజు విజయశాంతి పార్టీని వదిలేస్తారని అగ్రనేతల కు అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే ముందుజాగ్రత్తగా జయసుధను పార్టీలో చేర్చుకున్నారు
జయసుధ బిజెపిలో చేరడానికి ఓ కండిషన్ పెట్టినట్టు సమాచారం. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆశించే ఆమె బిజెపిలో చేరినట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ లో తనకు సంబంధించిన అభ్యర్థికే టికెట్ ఇప్పించడానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కూతురుకి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.