వైసీపీ ధనయజ్ణం.. జల భగ్నం.. అదే తెలుగుదేశం ఆయుధం
posted on Aug 3, 2023 @ 5:42PM
మాట తప్పం.. మడమ తిప్పం.. ఒక్కసారి మాట ఇస్తే దానికే కట్టుబడి ఉంటా.. మాట ఇస్తే చేస్తా అంతే. ఇదీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి చెప్పిన మాట. కానీ, ఒక్కసారి అధికారం దక్కించుకొని కుర్చీ ఎక్కాక ఆయన రివర్స్ విధానాలలాగే ఆయన నినాదాలు, హామీలూ కూడా రివర్స్ గేర్ లోనే అమలౌతున్నాయి. అందుకే మద్యపాన నిషేధం, శాసన మండలి రద్దు వంటి వాటిలో నిర్మొహమాటంగా యూ టర్న్ తీసుకున్నారు. ఇక జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న నవరత్నాలలో మూడు నాలుగు రత్నాలు ఎప్పుడో కంకరరాళ్లుగా మారిపోయాయి. జగన్ నవరత్నాలలో ఫీజ్ రీఎంబర్స్ మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, మద్యపాన నిషేధం, రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, రూ.3 వేల పెన్షన్, అమ్మఒడి, ఆసరా చేయూత ఉండగా.. ఇందులో ఇప్పటికి ఏదీ పూర్తిగా అమలు కాలేదు. కావడం లేదు.
పెన్షన్లు ఇప్పటికీ రూ.3 వేలు కాలేదు. రైతు భరోసాలో కేంద్ర వాటా కలుపేసుకుని ఏదో గొప్పగా చేసేస్తున్నామంటూ సొంత జబ్బలు చరిచేసుకుంటున్నారు జగన్. అమ్మ ఒడికి ఇంటికి ఒకరికే అనే వంకలు పెట్టారు. లబ్ధి దారుల విషయంలోనూ భారీగా కోతపెట్టారు. ఇక ఆరోగ్య శ్రీ సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మేడు. బిల్లులు ఇవ్వడం లేదని ఆసుపత్రులలో సేవలు నిలిపేస్తున్నారు. ఫీజ్ రీఎంబర్స్ మెంట్ చెల్లించడం లేదని సంస్థలు విద్యార్థులతో ఫీజులు కట్టించుకొని ప్రభుత్వం ఇచ్చినపుడు తిరిగి చెల్లిస్తామని చెప్తున్నాయి. ఇక మధ్య నిషేధం ఊసే లేదు. ఇక జల యజ్ఞం కాస్తా జల భగ్నంగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ నవరత్నాల్లో 4వ రత్నం జలయజ్ఞం గత 4 ఏళ్లలో నవ్వులపాలైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తిచేస్తామని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని ఇచ్చిన హామీకి జగన్ తిలోదకాలిచ్చేశారు. ఫలితంగా ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీనినే ఇప్పుడు తెలుగుదేశం ఆయుధంగా మలచుకుంటున్నది.
జగన్ గత ఎన్నికలలో ఏ హామీలైతే ఇచ్చి అమలు చేయలేదో.. ఆ హామీలనే ఇప్పుడు తెలుగుదేశం ఆయుధాలుగా మార్చుకుని జగన్ సర్కార్ పై ఎక్కుపెడుతున్నది. అలా ఇప్పుడు చంద్రబాబు మొదలు పెట్టిందే ప్రాజెక్టుల సందర్శన. దానికి పెట్టుకున్న పేర్లే 'జలభగ్నమైన జలయజ్ఞం', 'భగీరథుడు చంద్రబాబు.. భస్మాసురుడు జగన్'. జగన్ అంటే చెప్పింది చేయడని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులెలా పరుగులు పెట్టించిందీ, ఈ 4ఏళ్లలో ప్రాజెక్టులెలా పడకేసిందీ ఇంకా జనం కళ్లముందే ఉంది. సోమవారం పోలవరం వంటి నినాదాలు ఇంకా ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. తాను కూడా ఒక ఇంజనీర్ గా, ఒక మేస్త్రీగా, ఒక కూలీగా సోమవారం సోమవారం పోలవరంలో అడుగుపెట్టి కాంట్రాక్టర్లను, అధికారులను పరుగులు పెట్టించిన దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. నీటి పారుదల శాఖను నోటి పారుదల శాఖగా మార్చి వైసీపీ మంత్రులు చెప్పిన వాయిదాల గడువులు సోషల్ మీడియాలో మారుమ్రోగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు నడుం బిగించారు. ఇంకేముందు ఈ వ్యవహారం ప్రజల మధ్యకి వెడితే జగన్ సర్కార్ ను జనం ఛీకొట్టడం ఖాయమని భావించిన వైసీపీ శిబిరంలో కల్లోలం మొదలైంది. పోలవరానికి పట్టిన శని జగన్, రాయలసీమ ద్రోహి జగన్ అంటూ చంద్రబాబు నిప్పులు చెరుగుతుంటే వైసీపీ నేతల కళ్ళలో నెత్తుటి ధార కనిపిస్తుంది. ఆధునిక దేవాలయాల్లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను పాడుబెడితే సమాజానికే అరిష్టం అంటూ టీడీపీ నేతలు గొంతెత్తి స్లొగన్స్ ఇస్తుంటే వైసీపీ కార్యకర్తలకు ఊపిరి అందడం లేదు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమాజాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులపై శీతకన్ను వేయడం లేదని టీడీపీ ప్రచారం మొదలు పెడితే వైసీపీ సమాధానం చెప్పుకోలేక హ్యాండ్సప్ అనేస్తున్నది.