రఘురామకృష్ణం రాజు పోటీ ఎక్కడ.. పార్టీ ఏది?
posted on Aug 21, 2023 6:47AM
ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలలో, ఎత్తుగడలతో రెడీ అయిపోతున్నాయి. పొత్తుల విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. పంచాయతీలు, వార్డు సభ్యులకు తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీకి జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పట్టణాలు, నగరాలలో ఏదో కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ.. పల్లెల్లో మాకు తిరుగేలేదని ధీమాతో ఉన్న అధికార వైసీపీకి.. జనం పల్లెలెటలా కదులుతున్నాయో శాంపిల్ చూపించేశారు.
ఒక వైపు రాజకీయ వాతావరణం హీటెక్కి ఉంటే.. కొన్ని స్థానాలలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? పొత్తులు ఉంటే.. ఎవరు ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలా రాష్ట్రం మొత్తం ఆసక్తి కనబరుస్తున్న అంశం వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదే. ట్రిపులార్ అన్నా, రఘురామకృష్ణం రాజు అన్న ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవును వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం వార్తల్లో ఉంటూ జగన్ సర్కార్ తప్పులను మా ప్రభుత్వం, మావాడు అంటూనే ఎండగట్టే నరసాపురం ఎంపీ. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచారు. అలా గెలిచారు.. ఇల అసమ్మతి ఎంపీగా ముద్ర పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి సీఐడీ పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు. నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది.
అది పక్కన పెట్టి ప్రస్తుతంలోకి వస్తే ... ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే, కారాణాలు ఏవైనా, ఆయన బీజేపీలో చేరలేదు. అయితే, బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో కొనసాగేందుకు తెలుగుదేశంలో చేరే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమిలో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన,ఇటీవల చోటి చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా తాను నరసాపురం నుంచే పోటీ చేస్తాననీ, అయితే ఏ పార్టీ అన్నది త్వరలో నిర్ణయించుకుంటాననీ చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడిక తెలుగుదేవం గూటికే చేరాలని నిర్ణయానికి వచ్చేసిన ట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల రెండురోజులపర్యటనకు ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలుగుదేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు. ఆ సందర్భంగానే తాను నరసాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు ఆ సందర్భంగా చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఒక వేళ నరసాపురం కుదరకపోతే.. మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలని కోరినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా రఘురామరాజు విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారని అంగటున్నారు.