మన వాళ్లకే ఓట్లుండాలి.. వైసీపీ భారీ కుట్ర!?
posted on Aug 21, 2023 @ 12:03PM
రాష్ట్రం నలుచెరగులా జగన్ సర్కార్ పై వ్యతిరేకత, ఆగ్రహం పెల్లుబుకుతున్నా.. అధికార పార్టీ, ముఖ్యమంత్రి వైనాట్ 175 అని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా గట్టిగా వ్యక్తం అవుతోంది. అయితే జగన్ రెడ్డి ధీమాకు కారణమేమిటో ఇటీవల ప్రస్ఫుటంగా బయటపడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి, గుప్పెట్లో పెట్టుకు ఎన్నికల రణరంగంలో సునాయాసంగా గెలిచేయవచ్చన్న ధైర్యమే ఆ ధీమాకు కారణమని సోదాహరణంగా పరిశీలకలు చెబుతున్నారు.
గత ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం ను 23 స్థానాలకే పరిమితం చేసి ఘన విజయం సాధించిన అధికారం చేజిక్కించుకున్న జగన్.. నాలుగేళ్లు అధికారంలో ఉండి.. మరో సారి ఎన్నికలకు సమాయత్తమౌతున్న వేళ.. సహజంగానే ఈ నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ సాధించిన విజయాలేమిటి? వైఫల్యాలేమిటి? అన్న చర్చ జరుగుతుంది. ఈ చర్చలో జగన్ వైఫల్యాలు వినా సాధించిన విజయాలేవీ చెప్పుకోవడానికి కూడా కనిపించడం లేదు. అయితే జగన్ సర్కర్ మాత్రం తమ ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా బటన్ నొక్కుతూ సంక్షేమ నిథులను పందేరం చేస్తున్నారనీ, ఆ సంక్షేమమే మరో సారి తమకు అధికారాన్ని కట్టబెడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఆ నమ్మకం కేవలం చెప్పడానికే తప్ప నిజంగా ఆ పథకాల లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్న నమ్మకం వైసీపీ శ్రేణులు, నాయకులలోనే కనిపించడం లేదు.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడపగడపలో ఎదురైన పరాభవాలే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మరి ప్రజల నుంచి ఈ స్థాయిలో ఛీత్కారాలు ఎదురౌతున్నా, పరాభవాలను చవిచూస్తున్నా జగన్ కు వైనాట్ 175 ధీమా ఎక్కడిది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధిస్తామన్న ధీమాను ఎలా వ్యక్తం చేస్తున్నారు. తమ గుప్పెట్లోని సంస్థల ద్వారా పాతికకు పాతిక పార్లమెంటు స్థానాలలోనూ గెలిచేస్తామని ఎలా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇంత కాలం జగన్ ధీమా వెనుక ఉన్నదేమిటి? ఎవరు? అన్న ప్రశ్నలకు ఇటీవలి కాలంలో కచ్చితమైన జవాబులు లభిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఓట్ల తొలగింపు, బూటకపు ఓట్ల నమోదుతో మొత్తం ఏపీలో ఎన్నికల ప్రక్రియనే తమకు కావలసిన విధంగా మార్చేసుకోగలమన్న ధీమాతోనే జగన్ వైనాట్ 175 అంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఆశీస్సులు, రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా టాంపరింగ్ యథేచ్ఛగా చేపట్టడం వల్లనే.. తమకు ఓట్లేసే వారి పేర్లు మాత్రమే జాబితాలో ఉంటాయి.. వ్యతిరేకులు, ప్రత్యర్థులకు అసలు రాష్ట్రంలో ఓటు హక్కే ఉండదు అన్న స్థాయిలో ఈ టాంపరింగ్ జరుగుతోందని చెబుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఉరవకొండ రిటర్నింగ్ ఆఫీసర్‌పై వేటు ను చెబుతున్నారు. ఉరవ కొండలో ఏకంగా తెలుగుదేశం సానుభూతి పరులకు చెందిన ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడం, అలాగే ఆరువేల దొంగ ఓట్లను చేరడంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు పరిశీలన జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్క ఉరవకొండ అనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బోగస్ ఓట్ల నమోదు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు సంబంధించి భారీ కుట్ర జరిగిందని వరసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల ద్వారా తెలుస్తోంది. మంత్రి సీదిరి అప్పలరాజు.. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం ఓట్లు అయితే తొలగించాలని తమ వారికి ఆదేశాలిస్తూ అడ్డంగా దొరికిపోయారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై నయానా, భయానా ఒత్తిడి తీసుకువచ్చి ఈ మేరకు ఓటర్ల జాబితాలో తమను వ్యతిరేకించే వారి ఓట్లు లేకుండా, తమకు అనుకూలంగా ఉండేలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు ద్వారా సునాయాసంగా విజయం సాధించేయాలన్నది వైసీపీ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓట్ల తొలగింపు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ పని చేస్తున్నారని అంటున్నారు. వరుసగా వెలుగులోనికి వస్తున్న ఈ ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.