బెజవాడలోకి లోకేష్ గ్రాండ్ ఎంట్రీ.. సెగలు రేపుతున్న రాజకీయం!
posted on Aug 20, 2023 4:34AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీ మధ్యలో నారా లోకేష్‌కి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో లోకేష్‌ని సత్కరించారు. ఆశేష జనవాహిని మధ్య లోకేష్ విజయవాడలో అడుగుపెట్టారు. ప్రకాశం బ్యారేజీ రోడ్లన్నీ పసుపు సముద్రంలా మారిపోయాయి. బంతి పూల జనవనం కళ్లకు కట్టింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ జూసినా జనం. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేతను అభిమానులు ముంచెత్తారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో లోకేశ్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా కేశినేని చిన్నికి అప్పగించగా చిన్ని తన స్టామినాను నిరూపించుకొనేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో లోకేష్ పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా.. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ నారా లోకేష్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. అంతే కాదు, ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేశ్ శిలాఫలకం ఏర్పాటు చేశారు. మొత్తంగా గుంటూరు జిల్లాను వీడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన లొకేషన్ కు అపూర్వ స్వాగతం లభించింది.
కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొత్తం ఆరు రోజుల పాటు జరగనుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారు. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర చేయనుండగా.. 22వ తేదీన గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. కాగా ఇదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ నుండి వ్యతిరేకతలపై కూడా ఓ కన్నేసినట్లు కనిపిస్తుంది. యువగళానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందని, లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇప్పటికే ఆరోపించారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లి చర్చించడం ఇందులో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే జగన్ అవినాష్ ఇంటికి వెళ్లారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మరోవైపు గన్నవరంలో తెలుగుదేశం సభ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
ఇప్పటికే యార్లగడ్డ వెంకటరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తాను తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించారు. 22న గన్నవరంలో లోకేశ్ బహిరంగ సభ జరిగే రోజునే యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇంకోవైపు వైసీపీ ఇప్పటికే ఇక్కడ ముగ్గురికి టికెట్లను ఖరారు చేసింది. విజయవాడలోని విజయవాడ తూర్పు దేవినేని అవినాశ్‌కు, విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణుకు ఫిక్స్ చేసింది అధిష్టానం. ఇదే క్రమంలో ఇన్నాళ్లు లేనిది ఇప్పటికిప్పుడు ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే సలహాదారు సజ్జల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు. లోకేష్ యాత్ర జిల్లాలోకి ప్రవేశించకముందే ఇలా ఉంటే.. ఈ యాత్ర ఎలా సాగనుంది.. యాత్ర తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏవిధంగా మారనున్నాయన్నది ఆసక్తిగా కనిపిస్తుంది.