బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్పేనా?
posted on Aug 22, 2023 @ 10:10AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అద్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ స్నేహ సంబంధాలు చాలా చిత్రంగా ఉంటాయి. అ రెండు పార్టీలు మిత్ర పక్షాలు కాదు. అలాగని శతృ పక్షాలు ఏ మాత్రం కాదు. బీజేపీ సారధ్యంలోని అధికార ఎన్డీఎ కూటమిలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాదు. అయినా, బీజేపీ సహా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీల నాయకులకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కు ఎక్కువ గౌరవం ఇస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు. ఎందుకు ఏమిటీ, అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మెడ మీద వెళ్ళాడుతున్న అక్రమాస్తుల కేసులే అందుకు కారణం అన్నది బహిరంగ రహస్యం.
అందుకే ఆ రెండు పార్టీల శత్రు మిత్ర సంబంధాల విషయంలో అప్పుడప్పుదు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఎవరి రాజకీయం వారిది అయినా, పరస్పరం ఇచ్చి పుచ్చుకునే విషయంలో మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా నువ్వొకందుకు పోస్తే, నేనొకందుకు తాగుతున్నా అన్న చందంగా రెండు పార్టీలు ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాగా కలిసే ప్రయాణం చేస్తున్నాయి. అందుకే, రెండు పార్టీలను రాజకీయ విశ్లేషకులు రహస్య ప్రేమికులుగా అభివర్ణిస్తుంటారు.
వైస్సీపీ ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ కాదు కానీ కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ రాజును మించిన రాజభక్తితో అంగీకరించేస్తుంటుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించిన ఉత్సాహంతో జై కొడుతుంటుంది. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజు వైదొలిగిన తరువాత.. నిజానికి ఆయన వైదొలగలేదు.. బీజేపీ అధిష్ఠానమే ఓ ఫోన్ కాల్ తో ఆయనకు సమాచారం ఇచ్చి ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో పార్టీ రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరికి అప్పగించింది. ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. వైసీపీ, బీజేపీల లవ్ బ్రేకప్ అయ్యిందా అన్న అనుమానం కలగక మానదు.
పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, అడ్డగోలు అప్పులపై ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ అప్పుల చిట్టాతో హస్తిన వెళ్లి మరీ కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేసి వచ్చారు. సోము వీర్రాజు హయాంలో ఏపీ బీజేపీ తీరు జగన్ సర్కార్ కు వంత పాడుతున్నట్లుగానే ఉండేది. పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేశారు. 30 మందితో ఏపీ బీజేపీ కమిటీని నియమించారు.
రాష్ట్ర పార్టీపై ఉన్న వైసీపీ ముద్రను పూర్తిగా తుడిచేసే విధంగా ఆమె నియమించిన కొత్త కార్యవర్గం ఉందని పరిశీలకులు సైతం ఈ నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ శాఖ నిప్పులు కురిపిస్తోంది. విమర్శల దాడి తీవ్రత పెంచింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, వైసీపీ లవ్ బ్రేకప్ అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక ముందు ముందు కేంద్రం నుంచి ఏపీలోని వైసీపీ సర్కార్ కు సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. బేవరేజస్ బాండ్ల ద్వారా రుణం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం విఫలం కావడం వంటి సంఘటనలను బట్టి చూస్తుంటే రానున్న రోజలు వైసీపీ సర్కార్ కు గడ్డుగానే ఉంటాయన్న భావన కలుగుతోందని అంటున్నారు.