భయాన్ని వదిలి దండయాత్ర మొదలు పెట్టిన ప్రజలు!
posted on Aug 21, 2023 5:42AM
సంక్షేమమే మా ఎజెండా.. పేదల పాలిట పెన్నిధి మా ప్రభుత్వం.. మా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి పేద ప్రజల కోసమే. ఈ నాలుగేళ్ళలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న మాటలు ఇవే. అయితే, ప్రజలలో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రభుత్వంపై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నారు. అభివృద్ధి అనే మాట ఎక్కడా కనిపించడం లేదన్నది ఇక్కడి ప్రజల ప్రధాన ఆరోపణ. అయితే, పల్లె జనంలో కూడా ఈ వ్యతరేకత వ్యక్తమవుతోందనడానికి నిలువెత్తు నిదర్శనం తాజాగా జరిగిన పంచాయతీ, వార్డు ఎన్నికలు. ఈ ఎన్నికలలో వైసీపీకి కంచుకోటల్లాంటి పంచాయతీలు కొట్టుకుపోగా.. ఇంటింటికీ తిరిగినా వార్డు అభ్యర్థులకు ప్రజలు మొహం చాటేశారు. మీకు అంత ఇచ్చాం.. ఇంత ఇచ్చాం.. అది చేశాం.. ఇది చేశామని ప్రజల చెవులలో జోరీగలుగా ప్రచారం చేసినా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు తిప్పికొట్టారు.
నిజానికి ఇవి గ్రామ స్థాయి ఎన్నికలు.. ఈ ఎన్నికలలో ఎక్కడా పార్టీల గుర్తులు ఉండవు. కానీ, పార్టీ తరపున వారు బలపరిచిన వారే బరిలో దిగుతారు. మరోవైపు ప్రజలు కూడా స్థానిక గ్రామ రాజకీయాల్ని మాత్రమే ఎజెండాగా తీసుకుని ఓట్లు వేస్తారు. గ్రామాలలో అధికార పార్టీ ఏం చేసింది? గ్రామాలలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? గ్రామ స్థాయి అధికార పార్టీ లీడర్లు ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారు? గ్రామ స్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థి తత్వం ఏంటి? తనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాయకుడు తమకు అండగా ఉంటారా? ఇలాంటి ఎన్నో అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సహజంగా ఇలాంటి స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ హవా కనిపిస్తుంది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారేమో.. ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రోత్సాహకాలను తమకు అందకుండా చేస్తారేమో, స్థానిక నాయకుల నుండి తమకి వేధింపులు ఉంటాయేమో అనే భయాందోళన ఉంటుంది.
నిజానికి అధికార వైసీపీ ఈ స్థానిక ఎన్నికలలో విజయం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్నీ చేసింది. తమకు ఓటెయ్యకపోతే పెన్షలు, విద్యాదీవెన, అమ్మ ఒడి లాంటి పథకాలను ఆపేస్తామని కూడా బెదిరించారు. పలు చోట్ల వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ఓటేస్తారా? లేక అన్ని పథకాలను కత్తిరించాలా అని తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రజలు చాలా చోట్ల అన్ని భయాలను వదిలి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. ఎలాగు గుర్తు లేని ఎన్నికలు కనుక గెలిచిన వారంతా తమ పార్టీ నేతలే అని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. అయితే, స్థానికంగా ఎక్కడిక్కడ తిరుగుబాటు పరిస్థితి కనిపిస్తున్నది. నాలుగేళ్లుగా ఎన్నో బెదిరింపులు చూశాం.. మహా అయితే మరో ఎనిమిది తొమ్మిది నెలలే కదా అనే ధోరణి ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్నది.
ఉదాహరణకి ప్రకాశం జిలా సింగరాయకొండకి చేరువలో ఉండే పాకల అనే గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఇప్పటి వరకూ గెలిచిన దాఖలాలు లేవు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. వైసీపీ ఆవిర్భావం తర్వాత వాళ్ళే గెలుస్తూ వచ్చారు. కానీ, తొలిసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసింది. సముద్రాన్ని అనుకోని ఉండే ఈ గ్రామంలో ఎక్కువ శాతం మత్స్యకారులే ఉంటారు. వీరి ప్రధాన జీవనాధారం చేపలవేట. అయితే, మత్య్సకారులకు ఎన్నో చేశామని ప్రభుత్వం గొప్పలు పోతున్న సంగతి తెలిసిందే. అయినా ఈ గ్రామ ప్రజలు చరిత్రను తిరగ రాస్తూ తీర్పునిచ్చారు. గోదావరి జిల్లాల్లో కూడా పలు చోట్ల ఇదే ప్రభంజనం కనిపించింది. గత ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలలో కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన అభర్ధులు విజయకేతనం ఎగరేశారు. ఇప్పటికే ఈ మధ్యనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే నిద్ర పట్టని పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ నేతలకు ఈ ఎన్నికల ఫలితాలతో ఫుల్ పిక్చర్ క్లారిటీ వచ్చినట్లే భావించాలి.