ఊసరవిల్లికి బ్రాండ్ అంబాసిడర్ పీకే
posted on Aug 21, 2023 @ 2:47PM
ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా చిరపరిచితమైన పేరింది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన రాజకీయ పార్టీలకు పని చేశారు. సాధారణంగా ఆయన ఏ పార్టీ తరఫున పని చేస్తే ఆ పార్టీ ఆ ఎన్నికలలో విజయం సాధించడం కద్దు. అలాగని ఆయన ఎప్పుడూ ఒకే పార్టీని పట్టకు వేళాడరు. ఎప్పటికప్పుడు తన కొలువు మార్చేస్తూ ఉంటారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ సర్కార్ కొలువు తీరడం వెనుక ఆయన ఎన్నికల స్ట్రాటజీకి సింహభాగం ఉందనడంలో సందేహం లేదు.
అయితే 2019 ఎన్నికలలో మాత్రం ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారు. అది పక్కన పెడితే 2019 ఎన్నికలలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడం వెనుక నిస్సందేహంగా పీకే వ్యూహాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా జగన్ అంగీకరించారు. 2019 ఎన్నికల పోలింగ్ ముగియగానే పీకే, ఆయన టీమ్ తో జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేకంగా కృతజ్ణతలు కూడా చెప్పారు. ఆ తరువాత కూడా నిన్న మొన్నటి వరకూ పీకే తాను సొంతంగా పార్టీ పెట్టుకుని బీహార్ లో తన రాజకీయాలు తాను చేసుకుంటున్నా కూడా జగన్ ను, జగన్ పార్టీనీ వీడలేదు. ఆయన ఐప్యాక్ బృందం జగన్ కోసం ఏపీలో విస్తృతంగా పని చేస్తున్నది. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం, కుల, మత విద్వేషాలు రగల్చడం, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం వంటి వ్యూహాలన్నీ పీకేవే అని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అటువంటి పీకే బృందం తాజాగా ఒక సర్వేలో వైసీపీ పనైపోయిందన్న నివేదికలు జగన్ కు ఇచ్చింది. ఆ సర్వే లీక్ అయ్యింది. అయితే ఆ సర్వే ఫేక్ అంటూ వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమంలో గగ్గోలు పెడుతున్నా.. జనం మాత్రం ఆ సర్వే అక్షర సత్యమని నమ్ముతున్నారు.
సరిగ్గా ఇక్కడే.. పీకే ప్లేటు మార్చేశారా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సారి ఒక సందర్భంలో పీకే తాను జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడి తప్పు చేశానని రిపెంటెన్స్ వ్యక్తం చేశారు. 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచే దిశగా నడిపించడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బాగా పనిచేశాయనే చెప్పొచ్చు. 2014లో నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేయడంలో, ఆ తర్వాత బీహార్ లో నితిశ్ కుమార్ ను సీఎంను చేయడంలోనూ ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు చాలా వరకూ దోహదం చేశాయనడంలో సందేహం లేదు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి ఏర్పాటయ్యేలా చేసిన ప్రశాంత్ కిశోర్ దాన్ని విజయపథంలో నడిచేలా వ్యూహాలు రచించారు. తర్వాత ఢిల్లీలో ఆప్ సర్కర్, పంజాబ్ లో కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయం సాధించేలా తోడ్పాటు అందించారు.
బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కూడా ప్రశాంతి కిశోర్ పాత్రను ఇసుమంతైనా తగ్గించి చూపలేం. నితీష్ కు బీహార్ లో అధికార పీఠంపై కూర్చునేందుకు తన వ్యూహాలతో దోహదం చేయడం తాను చేసిన అతి పెద్ద తప్పుల్లో ఒకటని ప్రశాంతి కిషోర్ పలు సందర్భాలలో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలన్నీ ఆయా రాష్ట్రాలలో హింసాకాండను ప్రేరేపించడం సెంట్రిక్ గా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. గత ఎన్నికలలో జగన్ పార్టీని విజయం దిశగా నడిపించిన పీకే వ్యూహాలు ఈ సారి అంతగా ఫలించడం లేదని చెప్పాలి. అయినా ప్రశాంత్ కిషార్ తాను ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడానికి అంగీకరించారంటే.. ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని, తన బృందంతో ముందుగానే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని గెలుస్తుందని నమ్మకం కలిగే పార్టీ తరఫునే పని చేస్తారని పరిశీలకులు సోదాహరణంగా వివరించారు. ఇక ఏపీ విషయానికి వస్తే నాలుగేళ్ల పాలన జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దానిని అధిగమించి మరో సారి అధికారంలోకి రావడం కోసం ఆయన పీకే ప్రత్యక్షంగా పర్యవేక్షించకపోయినా ఆయన బృందం వైసీపీ తరఫున పని చేస్తున్నది. అదే సమయంలో ఐప్యక్ లో చీలిక వచ్చి ఒక వర్గం తెలుగుదేశం కు వ్యూహాలు రచిస్తున్నది. రాజకీయాల్లో మార్పు కోసం అంటూ ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరుతో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా నుంచి 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర ఎప్పుడు మొదలైందో ఎలా సాగుతోందో బీహార్ లో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో ఐ ప్యాక్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వే లీక్ అయ్యింది. ఆ సర్వే ప్రకారం వైసీపీ ఇక తట్టాబుట్టా సర్దేసుకోవలసిందే. ఇక్కడే రాజకీయవర్గాలలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓడిపోయే పార్టీ తరఫున పని చేయడం ఇష్టం లేని పీకే ఉద్దేశ పూర్వకంగానే ఈ సర్వేను లీక్ చేశారనీ, ఈ సాకుతో జగన్ ఐపాక్ తో తన సంబంధాలను తెగతెంపులు చేసుకుంటారన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తున్న ఐప్యాక్ చీలిక వర్గానికి తన వంతు సహకారం అందిస్తున్నారన్న అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతున్నాయి.