మునుగోడు మైత్రి ముక్కలైందా.. వామపక్షాలు కూరలో కరివేపాకు చందమేనా?
posted on Aug 22, 2023 8:01AM
తెలుగురాష్ట్రాలలో ఒక్క తెలుగు రాష్ట్రాలనేమిటి? దేశంలో వామపక్షాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏ పార్టీ పంచన చేరి ఒకటి రెండు స్థానాలలోనైనా విజయం సాధిస్తే చాలన్న పరిస్థితికి ఉభయ కమ్మూనిస్టు పార్టీలూ వచ్చేశాయి. ఇక మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వామపక్షాలను కూరలో కరివేపాకులా ఉపయోగించుకుకునేందుకు మాత్రమే వాడుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎంఐఎంతో తమ మైత్రి కొనసాగుతుందని ఆ సందర్భంగా చెప్పారు. కానీ అదే సమయంలో వామపక్షాల ఊసే ఎత్తలేదు.
ఒక రాజకీయ పార్టీ మరో పార్టీని పట్టించుకోకపోవడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో నిన్న మొన్నటి వరకూ మిత్రపక్షాలుగా ఉన్నా.. పైగా తనంత తానుగా వెళ్లి మద్దతు కోరిన ఉభయ కమ్మూనిస్టు పార్టీలనూ అలా వదిలేయడమేమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు. అందుకే వామపక్షాలను బీఆర్ఎస్ కూరలో కరివేపాకులా వాడేసుకుని వదిలేసిందని చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయానికి వామపక్షాల మద్దతే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో బీఆర్ఎస్ స్వయంగా వామపక్షాల మద్దతు కోరింది. బీజేపీని ఓడించేందుకు ఒక్క మునుగోడు ఉప ఎన్నిక కోసమే కాదు.. జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొని, ఢిల్లీ గద్దె దించే విషయంలో కూడా వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసి నడవాల్సి ఉంటుందని జట్టు కట్టింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత మునుగోడు విజయం వామపక్షాల చలవేనని బీఆర్ఎస్ బహిరంగంగా ప్రకటించింది. వామపక్షాల సహకారం లేకుంటే మునుగోడులో బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) గెలిచే అవకాశమే లేదని స్వయంగా ప్రకటించింది.
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వామపక్షాల చలవే అని టీఆర్ఎస్ అంగీకరించింది. కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిని బట్టే మునుగోడు విజయం బలుపు కాదన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ అంగీకరించినట్లైంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించినందుకు వామపక్షాలకు కృతజ్ణతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా వారి కార్యాలయానికి వెళ్లి మరీ ధన్యవాదాలు చెప్పి వచ్చారు. మునుగోడు విజయం క్రెడిట్ మొత్తం వామపక్షాలకు ఇచ్చేసింది.
అప్పటి వరకూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు అంటూ చెబుతూ వచ్చారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయం వెన్నాడటంతో వామపక్షాలను శరణు జొచ్చారు. గతంలో కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మాత్రం వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే మునుగోడులో వామపక్షాల ఓటు పది వేల వరకూ ఉంటుంది. అప్పట్లో ఆ ఓట్లే కనుక బీఆర్ఎస్ కు రాకుంటే మునుగోడులో కేసీఆర్ పార్టీకి విజయం అందని ద్రాక్షగానే మిగిలేది. అన్నిటికీ మించి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా వామపక్షాల మీదే ఆధారపడ్డారు. బీజేపీ వ్యతిరేక విధానాలకు ఒక సిద్ధాంతం పునాదిగా వామపక్షాలను తోడు తెచ్చుకున్నారు. అదంతా పాత కథ.. ఇప్పుడు ఆ వామపక్షాలను పూర్తిగా విస్మరించేశారు. వామపక్షాలా అవెక్కడున్నాయి అని ఆయన గతంలో అన్న మాటను మళ్లీ ఇప్పుడు తన చేతల ద్వారా తిరిగి తెరపైకి తెచ్చారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని భావించిన వామపక్షాలకు కారులో చోటు లేదని తన చేతల ద్వారా చెప్పేశారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ తో కుదిరిన మైత్రి బంధానికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీ ఆర్ తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో చెల్లు చీటీ పాడేశారు. అయితే వామపక్షాలను దూరం పెడుతున్నానన్న సంకేతాలను కేసీఆర్ గత కొంత కాలంగా ఇస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై చర్చిద్దామని సీఎం కేసీఆర్ కు లెఫ్ట్ పార్టీల నేతలు ప్రతిపాదించినప్పటికీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అభ్యర్థుల జాబితా ప్రకటనతో వామపక్షాలను కేసీఆర్ కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోవడం లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పుడు వామపక్షాలు సీఎం కేసీఆర్ మునుగోడు పొత్తు ధర్మం విస్మరించారనీ, పొత్తు కోసం. ఇంతకాలం ఓపికగా ఎదురుచూస్తే అభ్యర్ధుల ప్రకటనతో దానిని విస్మరించారని విమర్శలు గుప్పిస్తున్నాయి. తాము బలంగా ఉన్న స్థానాలలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నాయి.