చంద్రబాబు గెలిచారు.. తెలుగుదేశంను గెలిపించారు

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు.   రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబు దార్శినికతను ప్రశంసిస్తూనే ఉంటారు. రాజకీయంగా విభేదించేవారు కూడా ఆయన దూరదృష్టిని ప్రస్తుతిస్తూనే ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రగతి జపం చేసే ఆయన సంకల్పానికి ఎవరైనా సరే అచ్చెరువొందక మానరు. అటువంటి చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని సైతం గెలిపించేశారు. ఔను అసలు పోటీలో దిగకుండానే ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేశారు. తన అక్రమ అరెస్టు కారణంగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడానికి అవకాశం లేని సంక్షోభ పరిస్థితులనే అందరికీ, అన్నిటికీ తానేననే పరిస్థితులను తీసుకువచ్చారు. ఔను ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరికీ చంద్రబాబే కావాలి.. గతంలో ఆయనతో పనిచేసిన వాళ్లకి, అసలు సంబంధమే లేని వాళ్లకి కూడా ఆయనే కావాలి. ఆయనను ప్రత్యర్థిగా భావించి దెబ్బకొట్టాలని చూసిన వారికీ ఆయనే దిక్కయ్యారు. బరిలో నిలిచి గెలవాలంటే ఆయన నామస్మరణ తప్ప మరో మార్గం లేదని అంతా భావించే పరిస్థితిని కల్పించారు.    వీరు వారు అని కాదు.. అన్ని పార్టీలకు చంద్రబాబే కావాలి. ఔను.. తెలంగాణ ఎన్నికలలో  కనిపించిన, కనిపిస్తున్న దృశ్యం  ఇదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని పార్టీల నేతలు చంద్రబాబు జపం చేశారు.   చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన పార్టీ లేదు. నాయకుడు లేరు.  ఉమ్మడి రాష్ట్రంలో అయన చేసిన అభివృద్ధిని కీర్తించిన వాళ్ళు కొందరైతే.. ఆయన అక్రమ అరెస్టు ఖండించి  క్రెడిట్ కోసం ప్రయత్నించిన వారు మరికొందరు. ఏది తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాకీయాలలో చంద్రబాబు పేరు ప్రస్తావన రాని రోజు లేదు. నిజానికి ఇది దేశ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం. ఎందుకంటే అవినీతి ఆరోపణలపై చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే ఆయనను మా వాడంటే మా వాడని చెప్పుకున్నారు. ఇక ఆయన బెయిల్ పై బయటకి వచ్చిన తరువాత ఆయన పార్టీ తెలుగుదేశం  జెండా కోసం తెలంగాణ నేతలు తీవ్రంగా ప్రాకులాడారు.  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో   ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులందరి మెడలో తెలుగుదేశం కండువాలు కనిపించాయి.   దాదాపుగా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు నామస్మరణ చేశారు. తెలుగుదేశం మద్దతు దారులు, చంద్రబాబు అభిమానులు, ఆంధ్రా సెటిలర్ల   ఓట్ల కోసం   రాజకీయాలతో సంబధం లేకుండా అన్ని  పార్టీలూ, అందరు అభ్యర్థులూ ప్రాకులాడటం స్పష్టంగా కనిపించింది.  ఎవరికి వారు తెలుగుదేశం మద్దతు కోసం పసుపు కండువాలు మెడలో వేసుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సైతం చంద్రబాబు నామస్మరణతోనే ప్రచారం సాగించారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది.. గతంలో ఎన్నడూ జరగనిది. చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినన్ని రోజులూ  ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన కనీసం పోటీలో కూడా లేకుండానే గెలిచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు   పోటీలో నిలపకుండానే  తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు.    ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గత తొమ్మిదేళ్లలో తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిశీలిస్తే  తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. అయినా తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు తెలంగాణ వ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.  గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో పార్టీల జయాపజయాలను  ప్రభావితం చేయగలిగిన సత్తా, బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజలలో ఉన్న నమ్మకం, అభిమానమే ఇందుకు కారణం. తెలంగాణ  జనం గుండెల్లో చంద్రబాబు కొలువై ఉన్నారనీ, ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారన్న విషయం ఆయన అక్రమ అరెస్టుతో బయటపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో తేటతెల్లమైంది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనపై తెలంగాణ  మంత్రి కేటీఆర్  అభ్యంతరం వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించకపోయినా.. బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులూ మాత్రం బాబు జపం చేశారు. పరిస్థితిని గమనించిన కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలకు నాలుక కరుచుకుని నష్టనివారణకు చేయగలిగినంతా చేశారు. దీనిని బట్టే  పోటీలో దిగకుండా చంద్రబాబు గెలిచేశారని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో గెలిపించేశారనీ అర్ధం చేసుకోవచ్చు.  తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయదన్న నిర్ణయంతో విబేధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు. పరిశీలకులు పార్టీని పోటీలో నిలపకపోవడం పొరపాటు నిర్ణయం అంటూ విశ్లేషణలు చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆరంభమైన తరువాత చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఆ నిర్ణయం తీసుకున్నారన్నది అందరికీ అవగతమైంది. మొత్తం తెలంగాణ అంతా చంద్రబాబు వెంటే ఉందనీ, ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీ గెలిచిందన్నది ముఖ్యం కాదు. కానీ ఏ పార్టీ గెలిచినా అది తెలుగుదేశం చలవతోనే అని చెప్పుకోవలసిన పరిస్థితి తెలంగాణలో ఏర్నడింది.  అన్ని పార్టీలూ చంద్రబాబును తమవాడిగా చెప్పుకునేందుకు పోటీలు పడ్డాయి. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వారు కూడా ఈ ఎన్నికలలో అయనను  కీర్తించడం విశేషం. దీంతో పోటీలో ఉండగా అందరినీ ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబు ఈ ఎన్నికలలో కనీసం పోటీలో లేకుండానే  ఘన విజయం సాధించేశారు.

ఎపిలో పొంచి ఉన్న ‘మియాచుంగ్’ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది.  ఆదివారం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని అంచనా వేసింది. గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం  చేస్తున్నారు.అల్పపీడనం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది.  రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉంది.  సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

వాటర్ వార్ లో కొత్త ట్విస్ట్.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిగ్గా ఎన్నికల వేళ సాగర్ జలాల విడుదల విషయంలో ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించింది. సాగర్ డ్యాం నుంచి బలవంతంగా అనే కంటే దౌర్జన్యంగా నీటిని విడుదదల చేసింది. ఇంత కాలం ఊరుకుని ఇప్పుడు హడావుడిగా జగన్ సర్కార్ ఈ తీరులో దూకుడు ప్రదర్శించడం వెనుక  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందన్న  విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.   ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిలించేలా.. రెండు రాష్ట్రాల మధ్యా విభజన నాటి ఉద్రిక్తతలను రేకెత్తించి.. తెలంగాణలో తన మిత్రుడికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. సరే ఇప్పుడు ఆ వ్యూహం ఫలించిందా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే.. ఏపీ పోలీసులు మాత్రం కచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఏపీ పోలీసులు తమ భూభాగంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారంటూ, డ్యామ్‌పై కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు  ఏపీ పోలీసులపై విజయపురి స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 447, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో   ఏ1గా ఏపీ పోలీసులను చేర్చారు.  500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి బలవంతంగా వచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యామ్ 13 గేట్లు ధ్వంసం చేశారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి నీటిని విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  

4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. కొత్త ఆనవాయితీకి శ్రీకారమా?

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలలో రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఎవరిది అన్నది తేలుతుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనూహ్యంగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహుశా గతంలో ఏ ఆపద్ధర్మ ముఖ్యమంత్రీ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండరు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లాడి అంటే డిసెంబర్ 4న కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీ  సోమవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం 2గంటలకు జరగనుంది.  ఈ మేరకు  సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు కేసీఆర్ ఫలితాల విడుదల తరువాత కేబినెట్ భేటీకి పిలుపునివ్వడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఇప్పడు తెలంగాణ రాజకీయాలలో ఈ కేబినెట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అసలా భేటీ ఉద్దేశమేమిటి, అజెండా ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఇలా ఉండగా కేసీఆర్ పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కానీ పార్టీ నేతల వద్ద మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అన్న ధీమా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దనీ, ఆగం ఆగం కావద్దనీ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేసీఆర్.. 3వ తేదీన సంబరాలకు సిద్ధం కావాలని కూడా వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతకం పెట్టే తొలి ఫైలు తదితర అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ను ఉటంకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఈ వ్యాఖ్యలలో విజయం పై విశ్వాసం కంటే.. అనుమానాలే ఎక్కువగా వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్ లో విజయం జోష్ అప్పుడే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ  ఏర్పాటు సంచలనం సృష్టిస్తోంది. ఆనవాయితీకి భిన్నంగా ఫలితాలు వెలువడిన తెల్లారి కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రకటన వెలువడటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 

రాష్ట్రం పరువు గంగ పాలు.. ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు సీ గ్రేడ్!

జగన్ సర్కార్ పనిగట్టుకొని  రాష్ట్రం గంగలో కలిపేస్తున్నది. కే వలం రూ.14 కోట్లు వడ్డీ కట్టలేక మరో సారి ఏపీ ప్రతిష్టను బజారుకీడ్చింది. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పలా మార్చేసిందని పలు నివేదికలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో హెచ్చరించింది. కానీ జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం వెంపర్లాడుతోంది. అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ, బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేస్తోంది. చివరికి మద్యం మీద వచ్చే ఏళ్లల్లో రానున్న ఆదాయాన్ని చూపి కూడా అప్పులు తెచ్చింది. ఇప్పటికే ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేసేసింది. తెచ్చిన అప్పులను ఏదైనా అభివృద్ధి, ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని గడిస్తున్నదా అంటూ అంటే అదీ కూడా లేదు. బటన్ నొక్కుడు ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచుకుంటూ వెల్లుతున్నది.   అప్పు చేసి తెచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదు.  అసలు ప్రభుత్వమే అప్పుల మీద నడుస్తోంది.  ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అప్పుల విషయంలో రాష్ట్రం డేంజర్ లిస్టులోకి వెళ్ళింది. ఏపీకి కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ లు ఇచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. అంతేకాదు  రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది.  ఇప్పుడు ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు స్టాక్ ఎక్సేంజ్‌ షాక్ ఇచ్చింది. ఏకంగా ఏపీ బాండ్లకు సీ గ్రేడ్ కేటాయించింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు రేటింగ్ సంస్థలు నోట్ పంపాయి. హై రిస్క్‌తో కూడిన బాండ్స్‌గా అక్యూట్ రేటింగ్ సంస్థ ఏపీ క్యాపిటల్ బాండ్లను పేర్కొంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వమేనని ఆ సంస్థ పేర్కొంది. ఈ బాండ్స్‌కు చెల్లించాల్సిన రూ.14 కోట్లు వడ్డీ కూడా నెల రోజులు ఆలస్యంగా చెల్లించారని రేటింగ్ సంస్థ వెల్లడించింది. గతంలో రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో ఉండాల్సిన రూ.525 కోట్ల  మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకోవడంతో క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేయగా.. ఇప్పుడు రూ.14 కోట్లు వడ్డీ కూడా సమయానికి కట్టలేదని స్టాక్ ఎక్సేంజ్‌ సీ గ్రేడ్ కేటాయించింది. క్యాపిటల్ బాండ్స్‌కు సీ కేటగిరీ రేటింగ్ ఇవ్వడంతో బాండ్స్ కొనుగోలు చేసిన మదుపరులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దీంతో ఏపీ పరువు మరోసారి బజారున పడింది. ఇది  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పతనానికి పరాకాష్టగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే రూ.2000 కోట్లకి బాండ్స్ రిలీజ్  చేస్తే అవీ హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ జారీచేస్తే.. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసేసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్‌ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా, దివాళా తీసిన రాష్ట్రంగా రికార్డు  క్రియేట్ చేస్తున్నది.

మంత్రి కాకుండానే రేవంత్ ముఖ్యమంత్రి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఓటర్ల తీర్పు   ఈవీఎంలలో చేరి స్ట్రాంగ్ రూంలో భద్రంగా  ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. మూడు ప్రధాన పార్టీలలో విజయం ఎవరిది? ప్రధాన ప్రతిపక్షం కాబోతున్నదెవరన్నచర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెైస్ దే అధికారం అని చెబుతున్నాయి.  దాదాపుగా పాతికకి పైగా ఎగ్జిట్ పోల్స్ లో రెండు మూడు మినహాయించి మిగిలిన అన్ని సర్వేలూ అధికారం ‘హస్త’గతం కావడం తథ్యమని పేర్కొంటున్నాయి.   పోలింగ్ తరువాత కాంగ్రెస్ నేతలలో జోష్ కనిపిస్తుంటే బీఆర్ఎస్ నేతలలో అది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే అసలు మీడియా ముందుకే రాలేదు.  ఎన్నికల అనంతరం కేటీఆర్ మినహా బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. తప్పదన్నట్లు వచ్చిన కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.  అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంయమనం పాటిస్తూ.. ఇకపై పరుష వ్యాఖ్యలకు దూరంగా హుందాతనంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ తీరును చూస్తుంటే కాంగ్రెస్  విజయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అంగీకరించేసినట్లు కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కనుంది అనగానే తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న రెండవ సీఎం ఎవరన్నచర్చకు తెరలేచింది.  కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ  తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.  సీఎం పేరు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమే  అయినా  తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా అన్నీ తానై చక్రం తిప్పిన రేవంత్ రెడ్డిపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.  అయితే కాంగ్రెస్ లో సీఎం రేసులో నలుగురు ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు.  వారిలో ముందు పీఠిన ఉన్నది మాత్రం టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి మాత్రమే. పార్టీ హైకమాండ్ మొగ్గు కూడా ఆయనవైపే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ చేపట్టిన తరువాత కింది స్థాయి నుంచీ పార్టీలో జోష్ పెరిగింది. విజయంపై నమ్మకం కలిగిందని పార్టీలో ఆయనను వ్యతిరేకించే వారు కూడా అంగీకరించక తప్పని వాస్తవం.  ఎన్నికలకు ముందే రేవంత్ సీఎం అభ్యర్థిత్వం ఖరారైందనీన, అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించ లేదనీ పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది.  అందుకే రేవంత్ కు ఎన్నికలలో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి  లీడర్లు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. భట్టి విక్రమార్క అయితే రాష్ట్రంలో సగభాగం పాదయాత్ర కూడా చేపట్టారు. ఎస్సీ నేత కావడం భట్టికి కలిసి వస్తుంది. అయితే, సామజిక సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అన్నిటికీ మించి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి తన శక్తికి మించి పోరాడారు. స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నడిపించారు.  ప్రజల్లో బాగా పలచ  పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి ఇప్పుడు ఓట్లుగా మార్చడంలో రేవంత్  అతడే ఒక సైన్యం అన్నట్లుగా  కనిపించారు. దీంతో  అధిష్ఠానం కూడా రేవంత్ ను కాకుండా మరొకరిని సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశాలు ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.  నిజానికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ కనీసం మంత్రి పదవి కూడా చేపట్టలేదు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేశారు. దీంతో ఇప్పటికే దీనిపై మీడియా నుండి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే మీడియా ఇంటర్వ్యూలలో మంత్రిగా కూడా పరిపాలన అనుభవం లేని రేవంతును సీఎం చేసేందుకు మిగతా కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి రేవంత్ కూడా చాకచక్యంగానే సమాధానాలు చెప్పారు. ఇందిరాగాంధీ ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే దేశ ఆర్ధిక వ్యవస్థ స్థితి గతిని మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించి, బంగ్లాదేశ్ విముక్తికి సహకరించి అద్భుతమైన పాలన అందించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారనీ, అలాగే  ఎలాంటి పాలనా అనుభవం లేని  సీఎంగా ఎన్టీఆర్ సుభిక్ష పాలన అందించారనీ,  ఇప్పటికీ వారి పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నామని అటువంటప్పుడు తన సామర్ధ్యాన్ని ఎలా తక్కువ అంచనా వేస్తారని రేవంత్ సమాధానంతోనే ఎదురు ప్రశ్నలు సంధించారు. దీనిని బట్టి చూస్తే రేవంత్ మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ వైపే తెలంగాణ మొగ్గు!

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.  అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ప్రచార పర్వం ముగిసి ఓటింగ్ పూర్తై ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడిన తరువాత. కాంగ్రెస్ కు ఈ సారి జనం మొగ్గు చూపారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  దాదాపు అన్నివర్గాల ప్రజలూ ఈ సారి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచినట్లుగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ఓటింగ్ వైపు పెద్దగా దృష్టి సారించని హైదరాబాద్.. ఈ సారి కూడా  అలాగే వ్యవహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే గులాబీ పార్టీకి పరువు నిలిచే సంఖ్యలో స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం కూడా ఈ సారి గతానికి భిన్నంగా కాంగ్రెస్ కు ఓటెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు.  కుటుంబపాలన, రెండుసార్లు అధికారంలో   ఉండటం వల్ల వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణమాఫీ.. ఇలా ఈ సారి కేసీఆర్ ప్రభుత్వం వద్దనుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అన్నిటికీ మించి  యువతలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం కనిపించింది. కొలువుల పేరుతో మోసం చేశారన్న భావన వ్యక్తం అయ్యింది.   ఆరా-రేస్-సీపాక్-రాజనీతి స్ట్రాటజీస్-పొలిటికల్ లెబోరేటరీ-సీఎన్‌ఎన్‌న్యూస్ వంటి ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  ఇక ప్రివర్ మీడియా సోల్యూషన్స్, సునీల్‌వీర్, థర్డ్ విజన్ రీసెర్చి- పల్సు టుడే వంటి సంస్థల పోల్స్ ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉందని పేర్కొన్నాయి.   ఎన్డీటీవీ అయితే హంగ్ ప్రిడిక్ట్ చేసింది.  అయితే మొత్తంగా గురువారం (నవంబర్ 30) జరిగిన పోలింగ్ సరళిని, ఆ తరువాత ఆయా పార్టీల నేతల స్పందనను నిశితంగా గమనిస్తే.. కాంగ్రెస్ లో కనిపిస్తున్న ధీమా మరే  ఇతర పార్టీలోనూ కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిలో కనిపించని ధీమా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపించింది. అలాగే విశ్లేషకులు సైతం రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తొలి సారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయనే చెప్పారు. జనం కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక చాన్స్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, పరిశీలకుల విశ్లేషణలూ అన్నీ పక్కన పెడితే వాస్తవంగా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదన్నది డిసెంబర్ 3న తేలిపోతుంది. 

జగన్ సర్కారుకు హైకోర్టు మళ్లీ నోటీసులు!.. ఎందుకంటే?

న్యాస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. సాక్షాత్తు సీఎంకు నోటీసులు ఇచ్చినా  ఖాతరు లేదు. ఉన్నతాధికారులను బోనులలో నిలబెట్టి చీవాట్లు పెట్టినా మమ్మల్ని కాదన్నట్లు దులిపేసుకుంటున్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని ఎంత చెప్పినా.. మా రాజ్యాంగం వేరే ఉందనేలా ఉన్న జగన్ సర్కార్   తీరు మారడం లేదు.  ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు వద్దని ప్రభుత్వానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పోనీ  జగన్ తొలి సారి సీఎం అయ్యారు.. ఆయనకు తెలియదేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే  తనకు తిలియదు కనుకనే నెలకు కోట్లాది రూపాయల జీతాలిచ్చి  మరీ  పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు.  మరి వారికి కూడా  ఈ ఇంగితం లేదా?  మమ్మల్ని ఎవరేం చేస్తార్లే అనుకున్నారేమో అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను పంపించి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయాలని ప్రచారం సాగించారు. దీంతో మళ్ళీ న్యాయస్థానాలు కల్పించుకోవాల్సి వచ్చింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుండి గ్రామ వాలంటీర్ వరకూ అన్ని శాఖల అధికారులను నోటీసులు ఇచ్చింది. వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 25   ప్రశ్నలతో కూడిన ఒక బుక్ లెట్ రూపొందించి.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అమోఘం అని ప్రచారం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు పాలనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. చివరికి వైసీపీ జెండాలు పంచి పెట్టి ప్రతి ఇంటి మీదా  వైసీపీ జెండా ఎగిరేలా బెదిరింపులకు దిగుతున్నారు.  వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పక్కా వైసీపీ పార్టీ కార్యకమం. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావేలేదు. అధికారం ఉంది కదా అని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. ఆ అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారితో బలవంతంగా జగనే కావాలని చెప్పిస్తున్నారు. ఈ పథకం మొదలైనప్పటి నుండే విమర్శలొచ్చాయి. ఇక ఇప్పుడు కోర్టులు నోటీసులు ఇచ్చింది. రాజకీయపరమైన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్లు లాయర్లు ఉమేశ్‌ చంద్ర, నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయడం, ప్రజా ధనాన్ని వినియోగిస్తుండటం సహా తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఏపీ సీఎస్, పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.   సీఎస్, ముఖ్య సలహాదారు సజ్జలతో పాటు పంచాయతీరాజ్‌, పురపాలక, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శులకు, వాలంటీర్లను కూడా ప్రతివాదులు చేసి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.   విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. కార్యక్రమానికి హాజరు కాలేదని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగికి మెమో జారీ చేసిన అంశాన్ని పిటిషనర్ లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో వైపు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ మేరకు విడుదల చేసిన జీవో నెంబర్ 7ను కూడా కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల ఆదేశాలిచ్చారని కోర్టుకు వివరించారు. ఒక వైపు దాదాపు రూ.20 కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం, వ్యతిరేకించిన ఉద్యోగులను బెదిరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినే తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసులలో అధికారులు జైలు పాలవుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అడ్డగోలు జీవోలతో ప్రభుత్వ అధికారుల బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

కర్నాటకకు కాంగ్రెస్ అభ్యర్థులు?

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. కాంగ్రెస్ లో కూడా అధికారం చే జిక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదనీ, 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎగ్జిట్ పోల్స్ తాము అధికారానికి దూరం అవుతాయనే చెప్పాయనీ, కానీ తాము అధికారం చేజిక్కించుకున్నామనీ బీఆర్ఎస్ చెబుతోంది. ఈ సారీ అదే జరుగుతుందనీ, తాము వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనీ ధీమాగా చెబుతోంది. అంతే కాదు ముచ్చటగా మూడో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే స్థలాన్ని కూడా ఇప్పటికే ఖరారు చేసేసింది. కొత్త సెక్రటేరియెట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారనీ, ఆయన తొలి సంతకం ఏ ఫైలు మీద చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారనీ బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ వాదనను కొట్టిపారేస్తోంది. ఏదో రకంగా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రజా తీర్పును లెక్క చేయకుండా దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయనీ అనుమానిస్తోంది. ఈ సారి 70కు పైగా స్థానాలలో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. తమ పార్టీ తరఫున గెలుస్తారన్న అభ్యర్థులందరినీ కర్నాటకకు తరలించే యోచన చేస్తున్నది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  ఆధ్వర్యంలో ఈ మేరకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి తమ దరికి చేసుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పటికే  ప్రయత్నాలు ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అందులో భాగంగానే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనీ, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు దూరంగా ఉంచేందుకు కర్నాటకకు తరలించే విధంగా వ్యూహరచన చేస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ పూర్తయిపోయినా రాజకీయ వేడి మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీగా ఉన్నాయి.  

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్రిప్రమాదాల పట్ల తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో 40 బోట్లు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే   మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో రూ.20లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద  ఇటీవల అగ్నిప్రమాదం జరిగి బోట్లు కాలి బూడదైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన రోజుల వ్యవధిలోనే  మరో అగ్నిప్రమాదం జరగడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.   .ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. షార్ట్ సార్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు 'ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే  వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో వరుస అగ్నిప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా దాదాపు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 

హ్యాట్రిక్ కొడతాం.. కేటీఆర్ ధీమా

ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ సారి 70కి పైగా స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత మీడియాతో  మాట్లాడిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడం ఇదే మొదటి సారి కాదని అన్నారు. 2018లో కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) ఓడిపోతుందని పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయనీ, కానీ జరిగిందేమిటో తెలుసు కదా అని అన్నారు ఎగ్జిట్‌ పోల్స్‌కు  శాస్త్రీయత ఉందని తాను భావించడం లేదన్నారు. అనుకోవట్లేదన్నారు. పోలింగ్‌ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. 

ప్రజా తీర్పుకు అద్దంపట్టిన ఎగ్జిట్ పోల్స్.. రేవంత్

ప్రజా తీర్పునకు ఎగ్జిట్ పోల్స్ అద్దం పట్టాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో వచ్చే నెల 3న ప్రజాపాలన ఆరంభమౌతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతా చారి మరణించిన డిసెంబర్ 3నే రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడం యాధృచ్ఛికమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ నిస్సందేహంగా విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతున్నదనీ, ప్రజా చైతన్యం, కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం ద్వారానే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పార్టీ విజయం కోసం అహర్నిశలూ కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యర్తలకు కృతజ్ణతలు తెలిపిన రేవంత్ రెడ్డి.. ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  

హంగ్ అన్న సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్

తెలంగాణలో ఈ సారి హంగ్ తప్పదని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ 48 స్థానాలలోనూ, కాంగ్రెస్ 56 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ పది స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఎంఐఎం 5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.  జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 48 నుంచి 64 స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా, అధికార బీఆర్ఎస్ 40 నుంచి 55 స్థానాలలో గెలుపొందే అవకాశాలున్నాయి. బీజేపీకి  7 నుంచి 13 స్థానాలలో విజయావకాశాలున్నాయి. అలాగే ఎంఐఎంకు 4 నుంచి 7 స్థానాలలో గెలుపు సాధించే అవకాశాలు ఉన్నాయి.  లు

కాంగ్రెస్ దే ఆధిక్యం అన్న ఆరా ఎగ్జిట్ పోల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన వివిధ సంస్థలు కొన్ని స్థానాలు తేడా వినా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నదనే పేర్కొన్నాయి. ఆరా సర్వే సంస్థ అయితే కాంగ్రెస్ ఈ సారి  58-67 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఇక అధికార బీఆర్ఎస్ 41 నుంచి 41 స్థానాలలో విజయం సాధించి అధికారానికి దూరం అవుతుందని పేర్కొంది. బీజేపీ అయితే 5 నుంచి 7 స్థానాలకు పరిమితమౌతే ఇతరులు 7 నుంచి 9 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.   సీప్యాక్  సీప్యాక్ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టింది. సీప్యాక్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ 65 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది. బీఆర్ఎస్ 41 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరంగా నిలుస్తుంది. బీజేపీ నాలుగు స్థానాలలోనూ, ఇతరులు 9 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని సీప్యాక్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

కాంగ్రెస్ కే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందో అంచనావేసే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇప్పటికే  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. తెలంగాణలో పోలింగ్ ముగియగానే  పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ తెలంగాణలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేల్చేశాయి.   అయితే ఒక్క పల్స్ టుడే సర్వే  మాత్రంబీఆర్ఎస్ ఈ సారి కూడా సంపూర్ణ ఆధిక్యత సాధించి ముచ్చటగా మూడో సారి అధికారం చేజిక్కించుకోనుందని పేర్కొంది.   పల్స్ టుడే సర్వే   పల్స్ టుడే సర్వే ప్రకారం బీఆర్ఎస్ 69 నుంచి 71 స్థానాలలో గెలవనున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ 37 నుంచి 38 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పల్స్ టుడే పేర్కొంది. బీజేపీ అయితే మూడు నుంచి ఐదు స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఎంఐఎం 6 స్థానాలలోనూ ఇతరులు  ఒక స్థానంలోనూ గెలుపు సాధించే అవకాశం ఉందని పల్స్ టుడే సర్వే పేర్కొంది.   చాణుక్య స్ట్రాటజీస్ సర్వే... ఇక చాణుక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యత సాధించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 22 నుంచి 30 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయితే 67 నుంచి 78 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఆరు నుంచి తొమ్మిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ సర్వే  పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఆ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్ 65 నుంచి 58 స్ధానాలలో విజయకేతనం ఎగురవేస్తుంది. బిఆర్ఎస్ 35 నుంచి 40 స్థానాలకే పరిమితమౌతుంది. బీజేపీ 7 నుంచి 10 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులు 5 నుంచి 9 స్థానాలలో విజయం సాధిస్తారు.   

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.   ఓటర్లు.. తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పూర్తైంది. అప్పటికి  క్యూలైన్​లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.   మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.   బీఆర్​ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా.. 118 చోట్ల కాంగ్రెస్,  111 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక స్థానంలో పోటీలో నిలిచింది. ఇక సీపీఎం 19 స్థానాలలోనూ, బీఎస్పీ నుంచి 108 నియోజకవర్గంలోనూ అభ్యర్థులను బరిలోకి దింపాయి.   ఇక 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కొంచం తక్కువే అని చెప్పాలి. అధికారికంగా ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ఎంతన్నది ప్రకటించాల్సి ఉండగా, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. కొమురం భీం అసీఫాబాద్ జిల్లాలో 63శాతం, మంచిర్యాలలో    60 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 60, నిర్మాల్ లో 62  శాతం చొప్పున, అలాగే  నిజామాబాద్‌లో 57, కామారెడ్డిలో 59, జగిత్యాలలో 59, పెద్దపల్లిలో  60శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక కరీంనగర్ లో 56శాతం, రాజన్నసిరిసిల్ల జిల్లాలో  57శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక సంగారెడ్డిలో 61, మెదక్ లో 70, సిద్దిపేటలో 65, రంగారెడ్డిలో 43, వికారాబాద్ లో 58, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 39 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో అయితే అత్యల్పంగా 32 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఇక పాలమూరు జిల్లాలో 59, నాగర్ కర్నూల్ లో 58, వనపర్తిలో 59, గద్వాల్ లో 65, నల్గొండలో 60శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సూర్యపేటలో 62, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64, జనగామలో 63, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వరుసగా 65, 53, 49 శాతం మంది చొప్పున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే ఆ జిల్లాలో 65శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే భద్రాద్రిలో 59, ఖమ్మంలో 64, ములుగులో 68, నారాయణపేటలో 58శాతం మంది చొప్పున ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

వైసీపీ సామజిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్!.. కారణమేంటంటే?

ఏపీలో వైసీపీ తలపెట్టిన మరో ప్రచార కార్యక్రమం సామజిక బస్సు యాత్ర. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మొదలు పెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ.. మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ ఇందులో ఇన్వాల్వ్ కావాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు.  పార్టీలో లుకలుకలు, అంతర్గత కుమ్ములాటలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని   దిశానిర్ధేశం కూడా చేశారు. అక్టోబర్ 26 నుంచి  వైసీపీ సామాజిక  సాధికార బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. మొత్తం అరవై రోజుల పాటు సాగి డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా ఈ యాత్రకు రూపకల్పన చేశారు. అంటే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ ఎక్కడో  ఒక చోట.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూనే ఉంది. కానీ, ఎక్కడా ఎవరికీ కనిపించడం లేదు. ఏ మీడియా  కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం లేదు.   వైసీపీ సామజిక సాధికార  బస్సు యాత్ర పేరిట కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారు. పార్టీ పెద్దలు అలా చేయండి.. ఇలా చేయండని ఆదేశాలైతే ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పినా ఎవరూ కనిపించడం లేదు. తొలి నాలుగు రోజులలో అడపాదడపా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సు ఎక్కి రోడ్ల మీద ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వస్తున్నాడంటే చుట్టూ చేరాల్సిన ద్వితీయ శ్రేణి నేతలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో తన నియోజకవర్గంలోకి యాత్ర వచ్చినా ఎమ్మెల్యేలు కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. అక్కడక్కడా చిన్న పాటి సభలు ఏర్పాటు చేసినా జనం లేక ఖాళీ కుర్చీలకే నాయకులు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో జెడ్పీటీసీలు, జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు లాంటి వారు కూడా ఈ యాత్రను పట్టించుకోవడం మానేశారు. దీంతో అసలు ఈ యాత్ర ఎక్కడ సాగుతుందో , అసలు జరుగుతోందా లేదా కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. సహజంగా రాజకీయ పార్టీ ఒక కార్యక్రమాన్ని తలపెడితే.. దానికి ప్రజల స్పందన ఎలా ఉన్నా, పార్టీ  మేనేజ్మెంట్ లో భాగంగా క్యాడర్ ను మోటివేట్ చేస్తుంది. ఎక్కడిక్కడ ఫోన్లు చేసి కదలిక తేవడం, మెసేజీల ద్వారా కార్యక్రమానికి హైప్ తేవడం చేస్తాయి. కానీ, వైసీపీ సామజిక బస్సు యాత్రకు అది కూడా కరువైంది. తొలి వారం తర్వాత దీన్ని ఫెయిల్యూర్ కార్యక్రమం కిందే లెక్కేశారో.. నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యకమాన్ని పక్కన పెట్టేశారో కానీ.. ఈ కార్యక్రమం ఫలానా ప్రాంతంలో జరుగుతుందన్న సమాచారం కూడా కార్యకర్తలకు అందడం లేదు. బస్సు,  అందులో ఉన్న పది ఇరవై మంది  యాత్ర వెళ్లే రూట్ లో ఆయా గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం, వైసీపీ జెండాలను ఆవిష్కరించడం  చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడో పాడైపోయిన జెండాల స్థానంలో కొత్త జెండా కనిపిస్తే ఆ రూట్ లో వైసీపీ యాత్ర వెళ్లిందని ప్రజలు గుర్తు పడుతున్నారు.  అంతే అంతకు మించి ఈ యాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్న పార్టీ, అందునా 151 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించిన పార్టీ, ఇంకా ఆరు నెలల అధికారం ఉండగానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇంత ఘోరంగా ఫైలవడం రాజకీయ వర్గాలను కూడా విస్తుపోయేలా చేస్తున్నది. ఒక ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజలలో అసంతృప్తి ఉండడం సహజం. కానీ, వైసీపీపై సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉండడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.  సీఎం సభలకు సైతం ప్రభుత్వ శాఖల అన్ని వర్గాలను, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీల విద్యార్థులు సైతం హాజారు కావాలని ఆదేశాలు జారీ చేసి జనసమీకరణ చేసి జరిపిస్తున్నారని లేకపోతే  ఆసభలు కూడా వెలవెలబోయేవనీ విశ్లేషిస్తున్నారు. కాగా, ఇదే సినారియో కంటిన్యూ అయితే రేపు ఎన్నికల సమయంలో వైసీపీ నేతల సభలకు కూడా జనసమీకరణ కష్టమే అవుతుందని, అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదని అంటున్నారు.  మొత్తం మీద వైసీపీ గ్రాఫ్ పాతాళం కంటే కిందకి వేగంగా దిగజారిపోతున్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అంటున్నారు.