చంద్రబాబు గెలిచారు.. తెలుగుదేశంను గెలిపించారు
posted on Dec 2, 2023 6:03AM
ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ చంద్రబాబు దార్శినికతను ప్రశంసిస్తూనే ఉంటారు. రాజకీయంగా విభేదించేవారు కూడా ఆయన దూరదృష్టిని ప్రస్తుతిస్తూనే ఉంటారు.
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రగతి జపం చేసే ఆయన సంకల్పానికి ఎవరైనా సరే అచ్చెరువొందక మానరు. అటువంటి చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలవడమే కాకుండా తెలుగుదేశం పార్టీని సైతం గెలిపించేశారు. ఔను అసలు పోటీలో దిగకుండానే ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేశారు. తన అక్రమ అరెస్టు కారణంగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించడానికి అవకాశం లేని సంక్షోభ పరిస్థితులనే అందరికీ, అన్నిటికీ తానేననే పరిస్థితులను తీసుకువచ్చారు. ఔను ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరికీ చంద్రబాబే కావాలి.. గతంలో ఆయనతో పనిచేసిన వాళ్లకి, అసలు సంబంధమే లేని వాళ్లకి కూడా ఆయనే కావాలి. ఆయనను ప్రత్యర్థిగా భావించి దెబ్బకొట్టాలని చూసిన వారికీ ఆయనే దిక్కయ్యారు. బరిలో నిలిచి గెలవాలంటే ఆయన నామస్మరణ తప్ప మరో మార్గం లేదని అంతా భావించే పరిస్థితిని కల్పించారు. వీరు వారు అని కాదు.. అన్ని పార్టీలకు చంద్రబాబే కావాలి. ఔను.. తెలంగాణ ఎన్నికలలో కనిపించిన, కనిపిస్తున్న దృశ్యం ఇదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని పార్టీల నేతలు చంద్రబాబు జపం చేశారు. చంద్రబాబు పేరు లేకుండా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేసిన పార్టీ లేదు. నాయకుడు లేరు. ఉమ్మడి రాష్ట్రంలో అయన చేసిన అభివృద్ధిని కీర్తించిన వాళ్ళు కొందరైతే.. ఆయన అక్రమ అరెస్టు ఖండించి క్రెడిట్ కోసం ప్రయత్నించిన వారు మరికొందరు. ఏది తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ రాకీయాలలో చంద్రబాబు పేరు ప్రస్తావన రాని రోజు లేదు. నిజానికి ఇది దేశ రాజకీయాలలో సరికొత్త అధ్యాయం. ఎందుకంటే అవినీతి ఆరోపణలపై చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే ఆయనను మా వాడంటే మా వాడని చెప్పుకున్నారు. ఇక ఆయన బెయిల్ పై బయటకి వచ్చిన తరువాత ఆయన పార్టీ తెలుగుదేశం జెండా కోసం తెలంగాణ నేతలు తీవ్రంగా ప్రాకులాడారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన మూడు పార్టీల అభ్యర్థులందరి మెడలో తెలుగుదేశం కండువాలు కనిపించాయి. దాదాపుగా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు నామస్మరణ చేశారు. తెలుగుదేశం మద్దతు దారులు, చంద్రబాబు అభిమానులు, ఆంధ్రా సెటిలర్ల ఓట్ల కోసం రాజకీయాలతో సంబధం లేకుండా అన్ని పార్టీలూ, అందరు అభ్యర్థులూ ప్రాకులాడటం స్పష్టంగా కనిపించింది. ఎవరికి వారు తెలుగుదేశం మద్దతు కోసం పసుపు కండువాలు మెడలో వేసుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సైతం చంద్రబాబు నామస్మరణతోనే ప్రచారం సాగించారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది.. గతంలో ఎన్నడూ జరగనిది. చంద్రబాబు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినన్ని రోజులూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన కనీసం పోటీలో కూడా లేకుండానే గెలిచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీలో నిలపకుండానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. గత తొమ్మిదేళ్లలో తెలుగుదేశం ప్రస్థానాన్ని పరిశీలిస్తే తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదనే చెప్పాలి. అయినా తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు తెలంగాణ వ్యాప్తంగా అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. పార్టీకి బలమైన క్యాడర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయగలిగిన సత్తా, బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రజలలో ఉన్న నమ్మకం, అభిమానమే ఇందుకు కారణం. తెలంగాణ జనం గుండెల్లో చంద్రబాబు కొలువై ఉన్నారనీ, ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారన్న విషయం ఆయన అక్రమ అరెస్టుతో బయటపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో తేటతెల్లమైంది. ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ఆందోళనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించకపోయినా.. బీఆర్ఎస్ నేతలూ, శ్రేణులూ మాత్రం బాబు జపం చేశారు. పరిస్థితిని గమనించిన కేటీఆర్ కూడా తన వ్యాఖ్యలకు నాలుక కరుచుకుని నష్టనివారణకు చేయగలిగినంతా చేశారు. దీనిని బట్టే పోటీలో దిగకుండా చంద్రబాబు గెలిచేశారని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో గెలిపించేశారనీ అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయదన్న నిర్ణయంతో విబేధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేశారు. పరిశీలకులు పార్టీని పోటీలో నిలపకపోవడం పొరపాటు నిర్ణయం అంటూ విశ్లేషణలు చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆరంభమైన తరువాత చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఆ నిర్ణయం తీసుకున్నారన్నది అందరికీ అవగతమైంది. మొత్తం తెలంగాణ అంతా చంద్రబాబు వెంటే ఉందనీ, ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీ గెలిచిందన్నది ముఖ్యం కాదు. కానీ ఏ పార్టీ గెలిచినా అది తెలుగుదేశం చలవతోనే అని చెప్పుకోవలసిన పరిస్థితి తెలంగాణలో ఏర్నడింది. అన్ని పార్టీలూ చంద్రబాబును తమవాడిగా చెప్పుకునేందుకు పోటీలు పడ్డాయి. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వారు కూడా ఈ ఎన్నికలలో అయనను కీర్తించడం విశేషం. దీంతో పోటీలో ఉండగా అందరినీ ముప్పతిప్పలు పెట్టిన చంద్రబాబు ఈ ఎన్నికలలో కనీసం పోటీలో లేకుండానే ఘన విజయం సాధించేశారు.