వైసీపీ సామజిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్!.. కారణమేంటంటే?
posted on Nov 30, 2023 @ 3:55PM
ఏపీలో వైసీపీ తలపెట్టిన మరో ప్రచార కార్యక్రమం సామజిక బస్సు యాత్ర. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మొదలు పెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ.. మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ ఇందులో ఇన్వాల్వ్ కావాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. పార్టీలో లుకలుకలు, అంతర్గత కుమ్ములాటలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్ధేశం కూడా చేశారు. అక్టోబర్ 26 నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. మొత్తం అరవై రోజుల పాటు సాగి డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా ఈ యాత్రకు రూపకల్పన చేశారు. అంటే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూనే ఉంది. కానీ, ఎక్కడా ఎవరికీ కనిపించడం లేదు. ఏ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం లేదు.
వైసీపీ సామజిక సాధికార బస్సు యాత్ర పేరిట కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారు. పార్టీ పెద్దలు అలా చేయండి.. ఇలా చేయండని ఆదేశాలైతే ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పినా ఎవరూ కనిపించడం లేదు. తొలి నాలుగు రోజులలో అడపాదడపా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సు ఎక్కి రోడ్ల మీద ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వస్తున్నాడంటే చుట్టూ చేరాల్సిన ద్వితీయ శ్రేణి నేతలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో తన నియోజకవర్గంలోకి యాత్ర వచ్చినా ఎమ్మెల్యేలు కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. అక్కడక్కడా చిన్న పాటి సభలు ఏర్పాటు చేసినా జనం లేక ఖాళీ కుర్చీలకే నాయకులు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో జెడ్పీటీసీలు, జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు లాంటి వారు కూడా ఈ యాత్రను పట్టించుకోవడం మానేశారు. దీంతో అసలు ఈ యాత్ర ఎక్కడ సాగుతుందో , అసలు జరుగుతోందా లేదా కూడా ఎవరికీ తెలియకుండా పోయింది.
సహజంగా రాజకీయ పార్టీ ఒక కార్యక్రమాన్ని తలపెడితే.. దానికి ప్రజల స్పందన ఎలా ఉన్నా, పార్టీ మేనేజ్మెంట్ లో భాగంగా క్యాడర్ ను మోటివేట్ చేస్తుంది. ఎక్కడిక్కడ ఫోన్లు చేసి కదలిక తేవడం, మెసేజీల ద్వారా కార్యక్రమానికి హైప్ తేవడం చేస్తాయి. కానీ, వైసీపీ సామజిక బస్సు యాత్రకు అది కూడా కరువైంది. తొలి వారం తర్వాత దీన్ని ఫెయిల్యూర్ కార్యక్రమం కిందే లెక్కేశారో.. నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యకమాన్ని పక్కన పెట్టేశారో కానీ.. ఈ కార్యక్రమం ఫలానా ప్రాంతంలో జరుగుతుందన్న సమాచారం కూడా కార్యకర్తలకు అందడం లేదు. బస్సు, అందులో ఉన్న పది ఇరవై మంది యాత్ర వెళ్లే రూట్ లో ఆయా గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం, వైసీపీ జెండాలను ఆవిష్కరించడం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడో పాడైపోయిన జెండాల స్థానంలో కొత్త జెండా కనిపిస్తే ఆ రూట్ లో వైసీపీ యాత్ర వెళ్లిందని ప్రజలు గుర్తు పడుతున్నారు. అంతే అంతకు మించి ఈ యాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే, అధికారంలో ఉన్న పార్టీ, అందునా 151 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించిన పార్టీ, ఇంకా ఆరు నెలల అధికారం ఉండగానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇంత ఘోరంగా ఫైలవడం రాజకీయ వర్గాలను కూడా విస్తుపోయేలా చేస్తున్నది. ఒక ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజలలో అసంతృప్తి ఉండడం సహజం. కానీ, వైసీపీపై సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉండడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. సీఎం సభలకు సైతం ప్రభుత్వ శాఖల అన్ని వర్గాలను, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీల విద్యార్థులు సైతం హాజారు కావాలని ఆదేశాలు జారీ చేసి జనసమీకరణ చేసి జరిపిస్తున్నారని లేకపోతే ఆసభలు కూడా వెలవెలబోయేవనీ విశ్లేషిస్తున్నారు. కాగా, ఇదే సినారియో కంటిన్యూ అయితే రేపు ఎన్నికల సమయంలో వైసీపీ నేతల సభలకు కూడా జనసమీకరణ కష్టమే అవుతుందని, అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ గ్రాఫ్ పాతాళం కంటే కిందకి వేగంగా దిగజారిపోతున్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అంటున్నారు.