4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. కొత్త ఆనవాయితీకి శ్రీకారమా?
posted on Dec 1, 2023 @ 2:45PM
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలలో రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఎవరిది అన్నది తేలుతుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనూహ్యంగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహుశా గతంలో ఏ ఆపద్ధర్మ ముఖ్యమంత్రీ ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండరు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లాడి అంటే డిసెంబర్ 4న కేబినెట్ భేటీ నిర్వహించారు.
ఈ భేటీ సోమవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం 2గంటలకు జరగనుంది. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. అసలు కేసీఆర్ ఫలితాల విడుదల తరువాత కేబినెట్ భేటీకి పిలుపునివ్వడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఇప్పడు తెలంగాణ రాజకీయాలలో ఈ కేబినెట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. అసలా భేటీ ఉద్దేశమేమిటి, అజెండా ఏమిటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా ఉండగా కేసీఆర్ పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు కానీ పార్టీ నేతల వద్ద మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అన్న ధీమా వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దనీ, ఆగం ఆగం కావద్దనీ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేసీఆర్.. 3వ తేదీన సంబరాలకు సిద్ధం కావాలని కూడా వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం, సంతకం పెట్టే తొలి ఫైలు తదితర అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ను ఉటంకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఈ వ్యాఖ్యలలో విజయం పై విశ్వాసం కంటే.. అనుమానాలే ఎక్కువగా వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ లో విజయం జోష్ అప్పుడే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు సంచలనం సృష్టిస్తోంది. ఆనవాయితీకి భిన్నంగా ఫలితాలు వెలువడిన తెల్లారి కేసీఆర్ కేబినెట్ భేటీ ప్రకటన వెలువడటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.