కాంగ్రెస్ వైపే తెలంగాణ మొగ్గు!
posted on Dec 1, 2023 @ 10:32AM
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ప్రచార పర్వం ముగిసి ఓటింగ్ పూర్తై ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడిన తరువాత. కాంగ్రెస్ కు ఈ సారి జనం మొగ్గు చూపారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దాదాపు అన్నివర్గాల ప్రజలూ ఈ సారి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచినట్లుగా పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ఓటింగ్ వైపు పెద్దగా దృష్టి సారించని హైదరాబాద్.. ఈ సారి కూడా అలాగే వ్యవహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రమే గులాబీ పార్టీకి పరువు నిలిచే సంఖ్యలో స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం కూడా ఈ సారి గతానికి భిన్నంగా కాంగ్రెస్ కు ఓటెత్తిందని పరిశీలకులు చెబుతున్నారు.
కుటుంబపాలన, రెండుసార్లు అధికారంలో ఉండటం వల్ల వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణమాఫీ.. ఇలా ఈ సారి కేసీఆర్ ప్రభుత్వం వద్దనుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అన్నిటికీ మించి యువతలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం కనిపించింది. కొలువుల పేరుతో మోసం చేశారన్న భావన వ్యక్తం అయ్యింది. ఆరా-రేస్-సీపాక్-రాజనీతి స్ట్రాటజీస్-పొలిటికల్ లెబోరేటరీ-సీఎన్‌ఎన్‌న్యూస్ వంటి ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. ఇక ప్రివర్ మీడియా సోల్యూషన్స్, సునీల్‌వీర్, థర్డ్ విజన్ రీసెర్చి- పల్సు టుడే వంటి సంస్థల పోల్స్ ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపే ఉందని పేర్కొన్నాయి.
ఎన్డీటీవీ అయితే హంగ్ ప్రిడిక్ట్ చేసింది. అయితే మొత్తంగా గురువారం (నవంబర్ 30) జరిగిన పోలింగ్ సరళిని, ఆ తరువాత ఆయా పార్టీల నేతల స్పందనను నిశితంగా గమనిస్తే.. కాంగ్రెస్ లో కనిపిస్తున్న ధీమా మరే ఇతర పార్టీలోనూ కనిపించలేదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిలో కనిపించని ధీమా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలో ప్రస్ఫుటంగా కనిపించింది. అలాగే విశ్లేషకులు సైతం రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తొలి సారిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయనే చెప్పారు. జనం కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక చాన్స్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, పరిశీలకుల విశ్లేషణలూ అన్నీ పక్కన పెడితే వాస్తవంగా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదన్నది డిసెంబర్ 3న తేలిపోతుంది.