జగన్ సర్కారుకు హైకోర్టు మళ్లీ నోటీసులు!.. ఎందుకంటే?
posted on Dec 1, 2023 @ 9:59AM
న్యాస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. సాక్షాత్తు సీఎంకు నోటీసులు ఇచ్చినా ఖాతరు లేదు. ఉన్నతాధికారులను బోనులలో నిలబెట్టి చీవాట్లు పెట్టినా మమ్మల్ని కాదన్నట్లు దులిపేసుకుంటున్నారు. రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని ఎంత చెప్పినా.. మా రాజ్యాంగం వేరే ఉందనేలా ఉన్న జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ప్రజల సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు వద్దని ప్రభుత్వానికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పోనీ జగన్ తొలి సారి సీఎం అయ్యారు.. ఆయనకు తెలియదేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే తనకు తిలియదు కనుకనే నెలకు కోట్లాది రూపాయల జీతాలిచ్చి మరీ పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించుకున్నారు. మరి వారికి కూడా ఈ ఇంగితం లేదా? మమ్మల్ని ఎవరేం చేస్తార్లే అనుకున్నారేమో అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను పంపించి జగన్ మోహన్ రెడ్డికి ఓట్లేయాలని ప్రచారం సాగించారు. దీంతో మళ్ళీ న్యాయస్థానాలు కల్పించుకోవాల్సి వచ్చింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు నుండి గ్రామ వాలంటీర్ వరకూ అన్ని శాఖల అధికారులను నోటీసులు ఇచ్చింది.
వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 25 ప్రశ్నలతో కూడిన ఒక బుక్ లెట్ రూపొందించి.. జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు అమోఘం అని ప్రచారం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు పాలనపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. చివరికి వైసీపీ జెండాలు పంచి పెట్టి ప్రతి ఇంటి మీదా వైసీపీ జెండా ఎగిరేలా బెదిరింపులకు దిగుతున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పక్కా వైసీపీ పార్టీ కార్యకమం. ఇందులో ఎలాంటి అనుమానాలకూ తావేలేదు. అధికారం ఉంది కదా అని పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో నిర్వహిస్తున్నారు. ఆ అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారితో బలవంతంగా జగనే కావాలని చెప్పిస్తున్నారు. ఈ పథకం మొదలైనప్పటి నుండే విమర్శలొచ్చాయి. ఇక ఇప్పుడు కోర్టులు నోటీసులు ఇచ్చింది.
రాజకీయపరమైన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్లు లాయర్లు ఉమేశ్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయడం, ప్రజా ధనాన్ని వినియోగిస్తుండటం సహా తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఏపీ సీఎస్, పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎస్, ముఖ్య సలహాదారు సజ్జలతో పాటు పంచాయతీరాజ్, పురపాలక, గ్రామ-వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శులకు, వాలంటీర్లను కూడా ప్రతివాదులు చేసి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు అనేందుకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. కార్యక్రమానికి హాజరు కాలేదని గుత్తి మున్సిపాలిటీకి చెందిన ఉద్యోగికి మెమో జారీ చేసిన అంశాన్ని పిటిషనర్ లాయర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో వైపు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ మేరకు విడుదల చేసిన జీవో నెంబర్ 7ను కూడా కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల ఆదేశాలిచ్చారని కోర్టుకు వివరించారు. ఒక వైపు దాదాపు రూ.20 కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం, వ్యతిరేకించిన ఉద్యోగులను బెదిరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినే తత్వం ఈ ప్రభుత్వానికి లేదు. ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసులలో అధికారులు జైలు పాలవుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అడ్డగోలు జీవోలతో ప్రభుత్వ అధికారుల బలి చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.