పైలట్ నుంచిహో మంత్రి వరకు...

దేశ సేవే పరమావధిగా పైలట్ గా అడుగుపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విలక్షణ శైలి. ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది.  ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించారు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్నా.. రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వర్తించిన ఉత్తమ్ కుమార్  అది ప్రజా సేవే అని భావించేవారు.  ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి  ఆయన అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలి అని ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు హోమ్ మంత్రి వరించేలా చేసింది.   ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటివరకు ప్రజా సేవే ప్రధాన అజెండాగా  ఆయన ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టినున్న సందర్భంగా ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం గురించి  చర్చించుకోవాల్సిన తరుణమిది.  1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తంరెడ్డి- ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్యాపిల్లలు, మనువలు, మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయచ్చు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎంచుకోలేదు. రాజకీయ బాటలో ముళ్లుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అని బలంగా సంకల్పించారు.  దేశ సేవ చాలించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సేవ, రాజకీయాలు అంటే అవమానాలు, విమర్శలు, ఛీత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, పార్టీకి అండగా ఉన్న నాయకులు, సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరఫున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, ఆ సమయంలో ఉత్తమ్ కు ఓటమి తప్పలేదు. కానీ, ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచే పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014, 2018లో కూడ హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో కీలక  బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాల మంత్రిగా సేవలందించారు. 2015 నుంచి 2021 మధ్య తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా  కూడా ఉత్తమ్ కుమార్ పని చేశారు. తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న ఒక సీనియర్ నేతను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్ గా దేశానికి సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు మూడు దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజాసేవకు అంకితమయ్యారు.

పీపుల్స్ మార్చ్ నుంచి డిప్యూటి సీఎం వరకు...

కాంగ్రెస్ పార్టీని తిరిగి విజయతీరాలకు చేర్చిన ముఖ్యుల్లో సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తన మార్కును నిరూపించారు. ఈ కారణంగానే ఆయనకు ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి పదవి వరించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కాంగ్రెస్ ను 2004లో అధికారంలో తీసుకువచ్చిన వైఎస్ రాజశేశరరెడ్డి  అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ  ప్రధాన ప్రతిపక్షమైన సీఎల్పి నేతగా భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువై అధికారంలో తీసుకురాగలిగారు. ఈ సంవత్సరం మార్చి6న ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 108 రోజుల పాటు సాగిన పీపుల్స్ మార్చ్ ద్వారా  వైఎస్ రికార్డును బ్రేక్ చేశారు. పీపుల్స్ మార్చ్ తన స్వంత జిల్లా ఖమ్మంలో జులై 2న  ముగిసింది. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ లో సరికొత్త ఊపు తీసుకు వచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించినప్పటికీ లెక్క చేయకుండా భట్టి పాదయాత్ర చేశారు. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల మీదుగా నిర్విరామంగా 1350 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు.  పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావడానికి దోహదపడటంతో పాటు ఇతర పార్టీల నాయకుల చెయ్యి అందుకోవడానికి సిద్దమయ్యారు. పాదయాత్ర ముగింపు సందర్బంగా ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావ్ వంటి నేతలు కాంగ్రెస్ గూటిలో చేరారు.  మల్లు భట్టి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మధిర శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికలలో మధిర శాసన సభ సభ్యునిగా తిరిగిఎన్నికయ్యారు. 2009 నుండి 2011 వరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా ఉన్నారు. 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. మల్లు భట్టివిక్రమార్క 1961 జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించారు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు. మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యులు. విక్రమార్క హైదరాబాదులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ  నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.విక్రమార్కకు నందినితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు.ఒకరు  సూర్య విక్రమాదిత్య మరొకరు సహేంద్ర విక్రమాదిత్య.  కాంగ్రెస్ లో  తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్ అయ్యారు. 2011, జూన్ 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్​ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క సరికొత్త చరిత్ర  సృష్టించారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియామకమయ్యారు.

ఇలా ప్రమాణ స్వీకారం.. అలా సీఎం రేవంత్ దూకుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణ స్వీకారం చేయగానే అలా పని మొదలెట్టేశారు. విపక్ష నేతగా ఆయన ఎంత దూకుడుగా వ్యవహరించారో, ముఖ్యమంత్రిగానూ అంతే వేగంగా కదులుతున్నారు.  ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే  కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అలాగే ప్రిన్సిపల్ సక్రెటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల మార్పు కూడా  జరిగిపోయింది. అలాగే తన కేబినెట్ సహచరులకు శాఖల కేటాయింపు కూడా జరిపేశారు.  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ,  ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించారు.అలాగే తుమ్మలకు రోడ్లు భవనాల శాఖ, దామోదర రాజనరసింహకు ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ కేటాయించారు. ఇక పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమం, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ కేటాయించగా, పొంగులేని శ్రీనివారరెడ్డికి నీటిపారుదల శాఖ కేటాయించారు.   అంతకు ముందు ప్రమాణ స్వీకారం పూర్తిగాకాగా ఆ కార్యక్రమానికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని చెప్పారు.  ప్రజాప్రభుత్వం ఏర్పడిందనీ,న ఇక సమానాభివృద్ధే లక్ష్యమని ఉద్ఘాటించారు. పోరాటాలు, త్యాగాల పునాదితో ఏర్పడిన తెలంగాణ గత దశాబ్ద కాలంగా నిరంకుశ పాలనలో మగ్గిపోయిందన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా పాలన ఆరంభమైందని ప్రకటించారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించేశామనీ, ప్రగతి భవన్ ఇక నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనీ ప్రకటించారు. ఆ ప్రజా భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహిస్తామన్నారు. మే పాలకులం కామనీ, మీ సేవకులమనీ చెప్పారు.  విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్నారు.    ఇక రేవంత్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అన్న నమ్మకాన్ని ప్రజలలో కలిగేలా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన   ఆరుగ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఇక రెండో సంతకం.. ఆయన రజజనీ అనే దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. గతంలో దివ్యాంగురాలు రజనీకి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశారు. దానిని గుర్తు ఉంచుకుని తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.   దివ్యాంగురాలైన ఆమె  ఉన్నత చదువు పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో ఆమె  గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీని నెరవేర్చుకున్నారు. ఎక్కడా తాత్సారం లేకుండా చకచకా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూసి అధికారులు, సహచర మంత్రులే విస్తుపోతున్న పరిస్థితి. సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని పాలనను పరుగులెత్తిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

అప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ ఇప్పుడు ములుగు సీతక్క 

కాంగ్రెస్ పార్టీలో చెల్లెలు సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో నూతనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. 2004లో చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో అధికారంలో వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.  ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరో తేదిన ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే.   రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో సీతక్క ఆయన  వెంట నడిచారు.  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సుయాత్ర కూడా చెల్లెలు సెంటిమెంట్ తో ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయంలో ప్రారంభమైంది. ములుగు నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ నిర్వహించి, రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ విజయ వంతంగా అధికారంలోకి రాగలిగింది. సబితా ఇంద్రారెడ్డిని సెంటిమెంట్ గా భావించిన రాజశేఖర్ రెడ్డి నాడు సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కృతజ్ఞత చాటారు. మరి రేవంత్ రెడ్డి  సీతక్క కు ఏకంగా డిప్యూటిసీఎం పదవి ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టించారు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అది కూడా కీలక శాఖ బాధ్యతలు అప్పగించడం ఈ చర్చకు దారి తీసింది.   సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఆమె  రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం ఎన్నుకోబడ్డారు. అంతే కాదు ఆమె అఖిల భారత మహిలా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు.  ధనసరి అనసూయ పూర్వాశ్రమంలో నక్సలైట్. 13 ఏళ్ల ప్రాయంలోనే ఆమె నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. సీతక్క 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు  ఏడో తరగతి విద్యార్థి.  ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణతో సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరారు.     నక్సలైట్ గా ఉన్న సమయంలో జననాట్య మండలి కళాకారులు గద్దర్, విమలక్క ఆమె  గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే  నాటకాలతో  ప్రజలను చైతన్యవంతం చేశారు. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపు, అధికవడ్డీలకు వ్యతిరేకంగా ఆమె విరోచితంగా పోరాడారు.  గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు. అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.గిరిజన రైతాంగ పోరాటానికి బాసటగా నిలిచారు.  పెత్తందార్లు గిరిజన అమాయకులపై  కాల్పులు జరిపి చాలా మందిని చంపివేశారు,  స్త్రీలను అవమానించారు. భూస్వాములు చేసిన ఈ హత్యలపై అప్పట్లో పాలకులు కానీ,  పోలీసులు కాని ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో గిరిజన సాయుధపోరాటం అనివార్యమైంది. ఈ పోరాటానికి సీతక్క నాయకత్వం వహించారు.  బెంగాల్ లోని నక్సల్బరీ ఉద్యమం ఆమెకు ప్రేరణగా నిలిచింది. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు.  దీంతో పోరుబాట వదిలి లొంగిపోయారు. ఆరోగ్య కారణాలరీత్యా ఆమె జనజీవన స్రవంతిలో కలిసారు. సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు.  ఈ సమయంలో వరసకు ఆమె బావ అయిన దళకమాండర్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు.  ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి కల్సిన తర్వాత  హైదరాబాద్లో న్యాయవాదిగా మారారు.  సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండటంతో   అప్పటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ములుగు టికెట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం చెందారు. దీంతో ఆమె డిప్రెషన్ కు గురైంది. ఈ సమయంలో చంద్రబాబు రెండోసారి ములుగు టికెట్ ఇచ్చి సీతక్కను గెలిపించుకున్నారు.   2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత  2014లో టీడీపీ అభ్యర్థినిగా బరిలో దిగారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు.తెలంగాణవాదం బలంగా ఉండటంతో  ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై  22,671 ఓట్ల మెజారిటీతో  కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే ములుగు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ నక్సలైట్  నాగజ్యోతిపై గెలిచారు. 

తెలంగాణ కొత్త స్పీకర్ ఎవరంటే?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. గడ్డం ప్రసాద్ కుమార్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అధిష్ఠానం నిర్ణయించడంతో  దళిత సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్పీకర్ పదవి దక్కినట్లైంది.  తెలంగాణ స్పీకర్‌గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో టెక్స్ టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు. తాజాగా కాంగ్రెస్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లయింది. కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెమ్ స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ ను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేయడంతో ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనమే.  

జయంట్ కిల్లర్ యశస్విని రెడ్డి.. ఎవరీమె?

సీనియర్ నేత, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి, పాలకుర్తి నుండి పోటీచేసిన ఎర్రబెల్లి దయాకరరావు ఈసారి చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి  అనే 26 ఏళ్ల యువతి యర్రబెల్లిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమికి ముందు ఎర్రబెల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఒకసారి ఎంపీగా గెలిచారు.   ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓటమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న  సమయంలో కూడా తెలుగుదేశం  అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి సునాయాసంగా గెలిచి సత్తా చాటారు. అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను కాంగ్రెస్ అభ్యర్థి,  26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు. అమెరికా నుండి వచ్చిన యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓటమి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం చర్చ అంతా యశస్వినీ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎవరు? రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం నెటిజనులు అంతర్జాలంలో పెద్ద ఎత్తున  సెర్చ్ చేస్తున్నారు. యశస్విని రెడ్డి బిటెక్ పూర్తి చేసి అమెరికాలో  ఉన్నతోద్యోగం చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వరంగల్  వచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఏకంగా మంత్రిపైనే గెలిచి సంచలన విజయం అందుకున్నారు.  ఒక్క ఎర్రబెల్లి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా వరంగల్‌ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ ప్రదీప్ రావును ఓడించారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు.  అది వేరే సంగతి. తన రాజకీయ అనుభవం అంత వయస్సుకూడా లేని యువతి చేతిలో  పరాజయం అంటే  ఎర్రబెల్లికి పరాభవమే అనడంలో సందేహం లేదు. మూడున్నర దశాబ్దాలుగా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా  ఉన్న వ్యక్తికి ప్రత్యర్థిగా పోటీలో దిగడమంటే ఆషామాషీ కాదు.  బాగా పాపులారిటీ, సత్తా ఉన్న నేతలే వెనక్కి జంకుతారు. కానీ అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించి    యశస్విని రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి దయాకర్ ట్రాక్ రికార్డును బద్దలు కొట్టారు.   నిజానికి యశస్వినీ స్థానంలో  ఆమె అత్త ఝాన్సీ రాణి పోటీ చేయాల్సి ఉంది. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె ఎన్నారై కావడం.. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఎదురైంది. ఆమె భారత పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల సమయానికి పౌరసత్వం రాకపోవడంతో.. ఆమె తన స్థానంలో యశస్వినీ రెడ్డిని దింపారు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎర్రబెల్లిపై యశస్విని పోటీకి దిగడంతో.. ఆమె విజయంపై  అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు.. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ ఒక సారి నినాదం చేసి ఇబ్బంది పడ్డారు కూడా.  అయితే ఆరంభంలోని తడబాటును అధిగమించి ప్రచారాన్ని జోరెత్తించారు.  ప్రజాభిమానాన్ని గెలుచుకుని ఎర్రబెల్లి ట్రాక్ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించారు.  సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రిగా ఎర్రబెల్లి ప్రజలకు సుపరిచితుడే అయినప్పటికీ,   యశస్విని రెడ్డి వైపే జనం మొగ్గు చూపారు.  సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తీరుపై నియోజకవర్గ ప్రజలలో అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తాయి. దానికి తోడు కాంగ్రెస్ వేవ్..   అన్నిటికీ మించి కొత్త ముఖం, పిన్న వయస్సు, రాజకీయ అనుభవం లేని ప్రత్యర్థిపై విజయం సునాయాసమన్న అతి విశ్వాసంతో ఎర్రబెల్లి ఆరంభంలో పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితి గమనించి రంగంలోకి దిగేటప్పటికే చేయిదాటిపోయింది.  నియోజకవర్గంలో  అనుచరుల ఆగడాలు దయాకర్ రావుపై ప్రజలలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అదే యశస్వినికి ఓటు బ్యాంకుగా మారింది.  అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డికి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు  ప్లస్ అయ్యింది. ఫలితాలలో యశస్విని మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించగా దయాకర్ రావు ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయారు.  

12 మందితో కొలువుదీరనున్న రేవంత్ కేబినెట్

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్ 7) సరిగ్గా  మధ్యాహ్నం ఒంటిగంటా నాలుగు నిముషాలకు ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు రాజ్ భవన్ కు అందాయి. కాగా రేవంత్ కేబినెట్ లో అత్యధికంగా  ఉమ్మడి ఖమ్మం జిల్లా  నుంచి  ముగ్గురికీ  చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కింది. ఆ తరువాత  నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవకాశం లభించింది.   ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, మెదక్‌ జిల్లా నుంచి దామోదర్‌ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావులు రేవంత్ కేబినెట్ లో ఉంటారు. కాగా తన కేబినెట్ లో ఉన్న వారికి  రేవంతే స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం అందించినట్లు చెబుతున్నారు. 

సీఎం రేవంత్.. కాంగ్రెస్ కు అన్నీ మాంచి శకునములే!

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌ రెడ్డి  గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే వారెవరు? వారి పేర్లేమిటి, శాఖలేమిటి అన్న విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మంత్రివర్గ కూర్పు విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాగా తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం ఎంపిక చేయడం అదీ  కాంగ్రెస్‌ పార్టీలో ఆయన కన్నా సీనియర్లు, వయస్సులో ఆయన పెద్దవాళ్లు, తొలి నుంచీ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. అయినా హైకమాండ్ రెండో ఇలోచన చేయకుండా  రేవంత్‌ రెడ్డి వైపే   మొగ్గు చూపింది. సిఎల్‌పి నేతగా రేవంత్‌ రెడ్డి ఎంపికైనట్లు ప్రకటన చేసిన సందర్భంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌   రేవంత్‌ రెడ్డిని డైనమిక్‌ లీడర్‌గా అభివర్ణించారు. ఆయన కన్నా పార్టీలో సీనియర్లు, వయస్సులో పెద్దవాళ్లు ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అదే ప్రధాన కారణమని వేణుగోపాల్ చెప్పకనే చెప్పేశారని భావించవచ్చు. వాస్తవానికి తెలంగాణ  ఇచ్చిన పార్టీగా 2014లోనే  కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాల్సి ఉంది.  అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో గ్రుపులు కుమ్ములాటలు, ఆధిపత్యంపై యావే తప్ప రాష్ట్ర నాయకులు పార్టీ పటిష్ఠత, బలోపేతం గురించి పట్టించుకోకపోవడం వంటి కారణాలతోనే నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా అధికారానికి దూరంగా మిగిలిపోవలసి వచ్చిందని పార్టీ అధిష్ఠానం బలంగా  నమ్ముతోంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అత్యంత దయనీయ పరిస్థితిలో మిగిలింది. గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధికులు చేతికి హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు. అటువంటి పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేతపట్టి పార్టీకి అనూహ్యంగా ఒక హైప్ తీసుకువచ్చారు.  క్యాడర్ లో  ఉత్సాహాన్ని నింపారు. నిత్య అసంతృప్తి వాదులుగా ఉండే పార్టీ సీనియర్లను అధిష్ఠానం అండతో ఏకతాటిపైకి తీసుకువచ్చారు. మూడు నాలుగు నెలల కిందటి వరకూ  రాష్ట్రంలో అధికారం అన్న భావన పార్టీలోనే ఎవరిలోనూ కనిపించలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి అధికారాన్ని చేతికి అందించారు. ఈ నేపథ్యంలోనే ఎంత మంది సీనియర్లు రేసులో నిలిచినా, హస్తినలోనే మకాం వేసి ప్రయత్నాలు సాగించినా అధిష్ఠానం రెండో ఆలోచన లేకుండా రేవంత్‌ రెడ్డినే సీఎంగా ప్రకటించింది.  ఇక పార్టీ హైకమాండ్ రేవంత్ నే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వెనుక వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక ముఖ్యకారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ లాంటి పార్టీలో, అదీ నిత్య కుమ్ములాటలతో ఒకరి కాళ్లు ఒకరు లాగేసేందుకు ఇసుమంతైనా వెనుకాడని నేతలున్న తెలంగాణలో కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన రేవంత్ ను సీఎంగా ఎంపిక చేయడం అంటే పార్టీ అధిష్ఠానం అత్యంత సాహసోపేతంగా నిర్ణయం తీసుకుందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరింది 2017లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టింది 2021లో. చేపట్టిన క్షణం నుంచే పార్టీలో సీనియర్ల గోల మొదలైంది. రేవంత్ కు పార్టీ రాష్ట్రపగ్గాలు అప్పగించడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ కు సహాయ నిరాకరణా చేశారు. పార్టీలో అత్యంత జూనియర్ అయిన రేవంత్ కింద మేం పని చేయడమేమిటంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే రేవంత్ అందరినీ కలుపుకుని పోవడానికి యధాశక్తి ప్రయత్నించారు. అధిష్ఠానం అండ కూడా తోడు కావడంతో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తూనే ధిక్కారాన్ని సహించననే స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ దూకుడు ప్రదర్శించారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ పై నిప్పుల వర్షంలా విమర్శలూ కురిపించారు. సైమల్టేనియస్ గా తన పని తీరుతో తొలుత వ్యతిరేకించిన సీనియర్లలో పలువురి ప్రశంసలు సైతం అందుకున్నారు.  ఇక  అధికారం అన్నది ఊహకు కూడా అందని స్థితిలో రేవంత్ ను నమ్మి, రేవంత్ పై విశ్వాసంతో ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్ గూటికి వచ్చారు.  పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి  జూపల్లి హనుమంతరావు బిజెపిలోకి వెళ్లాలని తొలుత భావించినప్పటికీ   రేవంత్‌ రెడ్డి చొరవ కారణంగా వారు కాంగ్రెస్   చేయందుకున్నారు. ముఖ్యంగా పొంగులేటి రాకతో కాంగ్రెస్   పట్ల రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందన్న సంగతి స్పష్టమైంది. పార్టీలో అసమ్మతి, అసమ్మతి వాదులకు కూడా రేవంత్ నాయకత్వ సమర్థతపై విశ్వాసం పెరిగింది. ఇక బీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడంలో రేవంత్ నాయకత్వ సమర్థత ఏమిటన్నది పార్టీలో ఆయన వ్యతిరేకులకు కూడా అర్ధమైంది. మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ కు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేలా పార్టీ హైకమాండ్ ను ఒప్పంచడం ద్వారా, ఇంకా పార్టీలో అక్కడక్కడా ఉన్న అసమ్మతి, అసంతృప్తికి రేవంత్ చెక్ పెట్టారు. పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడి ఏమిటన్నది పార్టీలోని తన వ్యతిరేకులకు ప్రస్ఫుటంగా చూపారు. అందుకే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఎలాంటి పొరపచ్చాలూ, ఇబ్బందులూ, చీకాకులూ లేకుండా సజావుగా సాగింది. స్టార్ క్యాంపెయినర్లుగా ఎందరున్నా.. ప్రచారం మొత్తం రేవంత్ సారథ్యంలోనే సాగింది. సీనియర్లం అంటూ చెప్పుకున్న నేతలంతా తమతమ నియోజకవర్గాలకే పరిమితమైతే, స్వయంగా రెండు స్థానాల నుంచి పోటీకి దిగిన రేవంత్ మాత్రం రాష్ట్రమంతా చుట్టేశారు. అతడే ఒక సైన్యం అన్న తీరులో ఆయన ప్రచారం సాగింది. బీఆర్ఎస్ కు కంచుకోటలనదగ్గ నియోజకవర్గాలలో  రేవంత్ ప్రచారం తర్వాత ఆ కోటలు బీటలువారాయి. ఈ వాస్తవాలన్నీ పరిగణనలోనికి తీసుకున్న అధిష్ఠానం రెండో ఆలోచన లేకండా రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసింది. తామూ రేసులో ఉన్నామంటూ హస్తిన వచ్చి మరీ హడావుడి చేసిన వారికి తత్వం బోధపరిచింది. మంత్రివర్గ కూర్పులో కూడా రేవంత్ కే స్వేచ్ఛ ఇచ్చింది. రేవంత్ ఇదే దూకుడుతో ముందుకు వెళ్లేందుకు అవసరమైన స్థైర్యాన్నిచ్చింది.  

దటీజ్ రేవంత్.. అనుకుంటే సాధించేస్తారంతే!

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి  గురువారం (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఇందు కోసం ఇప్పటికే  ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలతో పాటు తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులూ కూడా హాజరౌతున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులు కూడా హాజరుకానున్నారు. అదలా ఉంచితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనీ, అదీ ఈ సారి ఎన్నికలలోనే సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందనీ, మూడు నాలుగు నెలల ముందు ఎవరూ కనీసం ఊహించనైనా ఊహించి ఉండరు.   కానీ అసాధ్యం అనుకున్న దానిని అనితర సాధ్యుడిగా రేవంత్ సాధ్యం చేశారు. చేసి చూపించారు.  ఇందు కోసం కలిసి వచ్చిన అంశాలు ఎన్నైనా ఉండనీ కానీ.. అసలు సూత్రధారి మాత్రం రేవంత్ రెడ్డే  అనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు.  అయితే, మనసు పెట్టి నిబద్దతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్నే ఉదాహరణగా  చెప్పుకోవచ్చు. రేవంత్ రెడి  అసలు రాజకీయాలలోకి వచ్చిందే ముఖ్యమంత్రి కావాలని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నిజం అదే . అసలు రాజకీయాలలో ఓనమాలు నేర్చుకొనే సమయంలోనే రేవంత్ ఈ విషయాన్నీ సహచరులకు చెప్పారట. తాను ఏ రోజుకైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అప్పట్లోనే ధీమాగా చెప్పేవారట. అప్పటి   ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రేవంత్ రెడ్డి లాంటి ఒక నూతన రాజకీయ నేత సీఎం కావాలనుకోవడం అత్యాశే అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్దండులైన నేతలెందరో అప్పుడు రాజకీయాలలో ఉన్నారు. అసలు సహజంగా కొత్తగా రాజకీయాలలోకి వచ్చి ఎమ్మెల్సీ అయిన నేత మహా అయితే   తాను మంత్రి కావాలని ఆశిస్తారు. కానీ, రేవంత్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సమయంలోనే తాను ముఖ్యమంత్రి కావాలని బలంగా నిర్ణయించుకొని రాజకీయాలలో అడుగు పెట్టారు.  రేవంత్ తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో పొలిటికల్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్ రావు కూడా ఎమ్మెల్సీగా అసెంబ్లీలో ఉన్నారు. రేవంత్, నాగేశ్వర్ ఇద్దరూ అసెంబ్లీలో ఒకే బెంచ్ లో కూర్చొనేవారు. ఆ సమయంలోనే రేవంత్ నాగేశ్వర్ తో తానెప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతాను సార్ అని చెప్పారట. తాజాగా ఎన్నికలకు ముందు రేవంత్ తో నాగేశ్వర్ ఇంటర్వ్యూలోనే ఈ విషయం పంచుకున్నారు. అంటే రేవంత్ ఎంత కాన్ఫిడెన్స్ తో, ఎంత ఆత్మవిశ్వాసంతో  రాజకీయాలలో అడుగు పెట్టారో  అర్ధమౌతుంది. ఆయన ఎదిగిన తీరు చూసినా ఆయన ఏ స్థాయిలో హార్డ్ వర్క్ చేశారన్న విషయం అవగతమౌతుంది.   1969 నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి.. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ బరిలో గెలిచి..  ఆ తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కలిసి తెలుగుదేశం గూటికి చేరారు. అక్కడ నుండే మొదలైంది రేవంత్ రెడ్డి అసలు సిసలైన రాజకీయ ప్రయాణం. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అతి కొద్ది కాలంలోనే చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. 2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజా సమూహాలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడంలో తర్ఫీదు ఇచ్చారు.  2014-17 మధ్య కాలంలో  తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ చంద్రబాబును కలిసి తన పరిస్థితిని వివరించి సామరస్యపూర్వకంగానే 2017 అక్టోబరులో  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడాదికే అంటే 2018లో  ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎదిగారు.   కేసీఆర్ సర్కార్  కంట్లో నలుసై పోరాటం చేశారు. అందుకే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఏకంగా ముగ్గురు మంత్రులు ఒక్క కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, అక్కడే మకాం వేసి ప్రచారం చేసి  రేవంత్ ను ఓడించారు.  కానీ అనూహ్యంగా 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. అక్కడే రేవంత్ పొలిటికల్ కెరీర్ మరో మలుపు తిరిగింది. అక్కడ కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు పెరిగాయి. రేవంత్ క్యాలిబర్ ఏంటో తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు 2021  జూన్ 26న ఆయనను టీపీసీసీ అధ్యక్ష్యుడిగా ప్రమోట్ చేశారు. 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్.. సరిగ్గా రెండేళ్లలోనే పార్టీని గాడినపెట్టడమే కాదు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  దటీజ్ రేవంత్.

ఇక ఇప్పుడు ఏపీ వంతు? ఓటరు ఎదురు చూపు ఎన్నికల వైపే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తొమ్మిదేళ్ల అహంకారపూరిత పాలనకు ముగింపు పలికారు. పాలకుల అహంకారాన్ని ఎదిరిస్తూ ఆందోళనలు చేయలేదు. రోడ్లెక్కలేదు. మౌనంగా ఎన్నికలు వచ్చే వరకూ ఎదురు చూశారు. ఓటు పవర్ ఏమిటో చూపించారు. అంతే తొమ్మిదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగిపోయింది. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో అస్సలేమీ చేయలేదని అనడానికి వీల్లేదు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, సంక్షేమ పథకాలను కొనసాగించడంలోనూ బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా వెనుకబడలేదు. అయితే జనం   అభివృద్ధి, సంక్షేమాలతో పాటు గౌరవం కూడా కావాలనుకున్నారు. తమ మాట వినని, తమ ముఖం చూడని ముఖ్యమంత్రి అవసరం లేదని భావించారు. దొరల కోటల్లాంటి నివాసంలో ఉంటూ తనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలకు ముఖం చూపించి, ఆ తరువాత నిర్లక్ష్యం చేసే సీఎం వద్దని తిరస్కరించారు. స్థూలంగా, సూక్షంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ పాలన, అహంకార పూరిత ధోరణి  బీఆర్ఎస్ ఓటమికి కారణం. మరి ఎంతో  కొంత రాష్ట్రాభివృద్ధికి పాటుపడి, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించిన కేసీఆర్ నే జనం తిరస్కరించారంటే.. అసలు అభవృద్ధి ఆనవాలే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాళా స్థితికి చేర్చిన జగన్ కు ఏపీ జనం ఎలాంటి ఓటమిని అందిస్తారన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే చాలా చాలా కాలంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నోరెత్తితే కేసు,అడుగు బయటపెడితే జైలు అన్నట్లు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నీ జగన్ రెడ్డి సర్కార్ ఒక జైలుగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా, స్వయంగా ముఖ్యమంత్రి సభలకే జనం మొహం చాటేస్తున్నా, పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలే దూరంగా ఉంటున్నా జగన్ తన తీరు, వైఖరీ మార్చుకోవడం లేదు. నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా జగన్ వ్యవహారం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి ప్రజలు, మధ్య తరగతి మేధావులే కాదు, గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసేపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా, ఎన్నికలు  సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులనూ  వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలాచాలా  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.   చట్టాని చుట్టేసి,  రాజ్యంగ విరుద్ధ పరిపాలనను ఇష్టారాజ్యంగా  సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు ఇప్పుడు  ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.  ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేసిన ప్రకటనలు  జనంలో జగన్ సర్కార్ పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకతకు కారణమయ్యాయి. శిశుపాలుడి నూటొక్కో తప్పులా జగన్ చంద్రబాబును అరెస్టు చేసి తన చివరి తప్పు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఇప్పుడు జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా ప్రజాభిమానాన్ని తిరిగి పొందగలిగే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు, స్వయంగా జగన్ కు ఇంటెలిజెన్స వర్గాలు అందించిన నివేదికలు, చివరాఖరికి జగన్ తన పార్టీ నేతలు, కార్యకర్తల కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న ఐ ప్యాక్ కూడా ఇక సర్దేసుకోవడం మేలు, మరో చాన్స్ లేదనే చెప్పాయని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలను జోడు గుర్రాల్లా పరుగులెత్తించినా, పాలకుడిలో అహంకారాన్ని సహించని జనం ఆయనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అలాంటిది అభివృద్ధీ, సంక్షేమాలను పట్టించుకోకుండా, కేవలం అహంకారంతో, అహంభావంతో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ ను ఏ స్థాయిలో ఓడిస్తారోనన్న చర్చ ఏపీలో యమా జోరుగా సాగుతోంది. 

 రేవంత్ కు సోనియా, రాహుల్ కంగ్రాట్స్ 

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం గురువారం జరగనుంది. దీంతో ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి అధినాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతను స్వయంగా ఆయనే భుజాన వేసుకున్నారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో ఆయన భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారిద్దరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో కూడా రేవంత్ భేటీ అయ్యారు. రేపు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారందర్నీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి తొలుత పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్బంగా ఎంపీ స్థానానికి రేవంత్ రాజీ నామా చేశారు. అలాగే పార్లమెంటులో కొందరు ఎంపీలను రేవంత్ రెడ్డి కలిసారు. రూమ్ నెంబర్ 66లో పలు పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వాళ్లు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.  రేవంత్ సీఎం అవుతున్నారు. మరి డిప్యూటీ సీఎం ఇతర కీలక శాఖలు ఎవరెవరికి ఇవ్వాలి. సీఎం సీటుపై ఆశ పెట్టుకున్న సీనియర్లను ఎలా సంతృప్తి పరచాలి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. సీనియర్లను బుజ్జగిస్తూనే పార్టీకోసం కష్టపడినవారికి, మహిళలకు, యువతకు మంత్రివర్గంలో పెద్దపీట వేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అదే సమయంలో సామాజిక సమీకరణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవం రోజు మంత్రి వర్గంపై కూడా స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది.

ఇక ప్రజాభవన్ గా ప్రగతి భవన్.. ప్రతి రోజూ ప్రజాదర్భార్!

ప్రగతి భవన్ అదో దుర్భేధ్యమైన కోట. ఇంత కాలం కేసీఆర్ క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ ను కేసీఆర్ మాజీ కాగానే ఖాళీ చేసేశారు. గత తొమ్మిదేళ్లుగా ప్రగతి భవన్ ప్రజలకు ప్రవేశించడానికి కూడా అవకాశం లేని నిషేధిత భవన్. ప్రజల దాకా ఎందుకు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, చివరాఖరికి మంత్రులకు కూడా అనుమతి లేనిదే ప్రగతి భవన్ గడీలు దాటి లోపలకు అడుగుపెట్టే అవకాశం లేదు. అదో దొరల కోట.   కేసీఆర్ తొలిసారిగా విజయం సాధించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే ప్రగతి భవన్ ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రగతి భవనే సీఎం అధికారిక నివాసం. అప్పుడు ప్రతి రోజూ ప్రజా దర్బార్ లు జరిగేవి. సీఎం రోజూ వేల మందితో  ములాఖత్ అయ్యేవారు. కానీ రాష్ట్ర విభజన తరువాత, కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రజలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ప్రజలా వైపుకు చూసేందుకు కూడా భయపడేలా రోడ్డును ఆక్రమించి మరీ ఐరెన్ ఫెన్సింగ్ నిర్మించేశారు.  జనాలకు అది ఎవరికీ ప్రవేశం లేని ఓ కోటలా మార్చేశారు. యాక్చువల్ ప్రగతి భవన్ కువెళ్లడానికి మూడు వందల మీటర్ల ముందు నుంచే పోలీసు బందోబస్తు.  కేసీఆర్ ప్రగతి భవన్ పాలనపై గత తొమ్మిదేళ్లలోనూ పలు విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ కోటలాంటి ఏర్పాట్లు చూసిన వారెవరికైనా మనం ఉన్నది ప్రజా స్వామ్యంలోనా, రాజరిక వ్యవస్థలోనా అన్న అనుమాలు వ్యక్తం అయ్యేవంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ప్రయాణం అతి తరచుగా ఉండేది. అది కూడా రద్దీ పెద్దగా లేని సమయంలో కాకుండా సరిగ్గా అత్యంత బిజీగా ఉండే సమయాన్ని ఎంచుకుని ఆయన తన ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగించే వారు. దీంతో పంజాగుట్ట నుంచి ప్యాట్నీ వరకూ, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అల్వాల్ రైతు బజారు వరకూ ట్రాఫిక్ ను నిలిపివేసి పోలీసులు నానా హడావుడీ చేసే వారు. ఇకపై అలాంటి సమస్యలకు తావే ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు  ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్నికల ప్రచారంలోనే ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పింది. అలాగే  ఆ ప్రజా భవన్ లో నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గురువారం (డిసెంబర్ 7) రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చే క్రమంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇరెన్ ఫెన్సింగ్ ను తొలగించడం తో పాటు.. ప్రగతి భవన్ ముందున్న గడీలను కూడా కూల్చివేయనున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ప్రజాభవన్ ను సులువుగా యాక్సెస్ చేయడంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   

ఇండియా కూటమిలో మళ్లీ లుకలుకలు?

2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా.. పరిస్థితి ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది.  ఎన్నికలలో (బీజేపీ) ఎన్డీఎను ఓడించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దె దింపడమే  అజెండా  గా ఏర్పడిన  ఇండియా కూటమి లెక్కలు తప్పుతున్నాయా? తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ తెలంగాణ వినా మరెక్కడా విజయం సాధించకపోవడంతో... కూటమి ఏకతాటిపైకి రావడానికి కారణమైన రాహుల్ జోడో  యాత్ర జోష్ మసకబారిందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. అసలు కూటమి ఏర్పాటు పట్టాలెక్కడానికి ముందు నుంచీ కూడా అవరోధాలు, అనుమానాలు, అడ్డంకులే. ఏదో    నితీష్ పట్టుదలతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చాణక్యంతో  జాతీయ స్థాయిలో బీజేపీ ఏతర  పార్టీలు కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి ముందుకు వచ్చాయి. అయితే అలా ముందుకు వచ్చిన ప్రతి సారీ ఏదో ఒక పార్టీ కూటమి ఏర్పాటును వెనక్కు లాగుతూనే ఉంది. తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ తరువాత ఇప్పుడు మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కూటమి ప్రయోజనాలను ఐక్యతను దెబ్బకొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో  సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం  పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన  రెండవ సమావేశంలో  ఇండియాగా పేరు పెట్టుకుంది. ఆ పేరును రాహుల్ గాంధీయే సూచించారని చెబుతారు. ఆ వెంటనే ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది. కానీ ఈ సమావేశం తరువాత నుంచీ నతీష్ కుమార్ ఒకింత అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణం కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే  నితీష్ ఆకాంక్షకు విరుద్ధంగా  రాహుల్ జోడో యాత్ర జోష్ తో కూటమి పార్టీలన్నీ కాంగ్రెస్ వెనుక ర్యాలీకి కావడానికి సిద్ధపడటమే.  దీతోనే తాను అనుసంధానకర్తగా ఆవిర్భవించిన ఇండియా కూటమి లక్ష్యలకు విరుద్ధంగా ఆయన అడుగులు వేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు కారణం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన జీ20 విందు సమావేశానికి నితీష్ హాజరు కావడమే. అంతే కాదు ఆ విందు సమావేశంలో ఆయన మోడీతో ముచ్చటించారు. దీంతో నితీష్ తిరిగి బీజేపీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరే అదలా ఉంచితే..   తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెైస్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇండియా కూటమి అడుగులు ముందుకు పడేందుకు మరో అవరోధంగా మారింది. బుధవారం జరగాల్సిన ఈ కూటమి భేటీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరు కాలేమనడంతో భేటీ వాయిదా పడింది. ఈ నెల మూడో వారంలో ఇండియా కూటమి భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే నేటి భేటీ వాయిదాకు కారణం మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు మమత, అఖిలేష్ వంటి వారి నిరాసక్తతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాజకీయాలనుంచి కేసీఆర్ రిటైర్మెంట్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల నుంచి తప్పుకునే యోచన చేస్తున్నారా?  కనీసం బీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడిని కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయలేనంతగా పార్టీలో తన పట్ల అవిధేయత పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను గెలిచిన గజ్వేల్ స్థానానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోనున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు తార్కానంగా గజ్వేల్ లో ఉప ఎన్నికకు సిద్ధం కమ్మంటూ  ఒంటేరుకు కేసీఆర్ సూచన చేసినట్లుగా సమాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న పోస్టును చూపుతున్నారు.   కేసీఆర్ మనస్తత్వం, వైఖరి తెలిసిన వారంతా ఇది నిజమేనని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ అధినేతగా పార్టీని తన క నుసన్నలలో నడిపారు. ధిక్కారం, అవిధేయతను ఇసుమంతైనా సహించేవారు కాదు. అటువంటి వైఖరి కనిపించిన నేత ఎంతటి వారైనా నిర్దాక్ష్యిణ్యంగా  వేటు వేసేవారు. ఈటల ఉదంతం అందుకు తిరుగులేని నిదర్శనం. ఇక ఉద్యమంలో ఒక్కరొక్కరుగా తనతో పాటు అడుగు వేసిన వారిని పార్టీకి దూరం పెట్టడం, చివరాఖరికి ఉద్యమంలో అడుగడుగునా చేదోడు వాదోడుగా ఉన్న కోదండ రాం లాంటి వారిని కూడా కోదండరామా కోదండమా అంటూ ఎగతాళిగా మాట్లాడిన ఉదంతాలను పరిశీలకులు ఉదహరిస్తున్నారు. అసలు టీఆర్ఎస్, బీఆర్ఎస్’గా పేరు మార్చుకున్న తర్వాత ఒక్కటొక్కటిగా కేసీఆర్ కు అన్నీ ప్రతికూలతలే కనిపించాయి.  జాతీయ రాజకీయాలలో తనతో కలిసి వచ్చే వారు కానీ, తనను కలుపుకుని పోయే వారు కానీ కనిపించక ఏకాకిగా మారిపోయారు. అదే సమయంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలపైనే కాదు, పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో అనివార్యంగా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలలో ఆయన కుమారుడు కేటీఆర్ అంతా తానై అన్నట్లుగా  వ్యవహరించారు.  అయితే జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పారించి దేశమంతా కలియదిరుగుతున్న సందర్భంలో ఒక సారి కేసీఆర్ స్వయంగా తనకు రాష్ట్ర రాజకీయాలపై  ఆసక్తి తగ్గిపోయిందనీ, బోర్ కొడుతోందని చెప్పారు. 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చింది మొదలు, పార్టీ, ప్రభుత్వ పగ్గాలు వారసుడు  కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అయితే, వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్నట్లుగా కేటీఆర్ పట్టాభిషేక ముహూర్తం వాయిదాలు పడింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలలో కేసీఆర్ ఒక అడుగు కూడా వేయకుండానే అదో విఫలయత్నంగా మారిపోయింది.   ఈ నేపద్యంలోనే  ఇప్పుడు తెలంగాణలో పార్టీ పరాజయం పాలు కావడం, గతంలోలా తన నాయకత్వంపై పార్టీలో సంపూర్ణ సమ్మతి లేకపోవడంతో రాజకీయాల నుంచి వైదొలిగే యోచనలో కేసీఆర్ ఉన్నారనీ, అందుకే గజ్వేల్ ఉప ఎన్నిక గురించి ఎన్నికలు పూర్తయిన రోజుల వ్యవధిలోనే ప్రస్తావించారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అందరికీ థ్యాంక్స్.. సీఎంగా ఎంపికయ్యాక రేవంత్ తొలి ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రిగా అధిష్ఠానం తన పేరు ప్రకటించిన తరువాత  రేవంత్ రెడ్డి తొలిసారి Xవేదికగా  స్పందించారు. తనను సీఎంగా ఎంపిక చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  , ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి స్థానాలు కట్టబెట్టారు. అనంతరం సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ హైకమాండ్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. శుక్రవారం (డిసెంబర్ 7) రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించిన క్షణం నుంచీ రేవంత్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడాన్ని తొలుత గట్టిగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంగా రేవంత్ ఎంపికను స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.మీడియాతో మాట్లాడిన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు రేవంత్ కు శుభాకాంక్షలు అని చెప్పారు.  ఇలా ఉండగా..   తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలూ వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  రేవంత్ రెడ్డిని అభినందించారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నేరవేర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. పరిపాలనలో ప్రత్యేకమైన ముద్ర వేసి తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని కోరారు.  ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.  2017, అక్టోబర్ లో  కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ సల్వ కాలంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,పార్టీ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అయ్యారు.  ఆ తర్వాత 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఆ తర్వాత 2019 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో   మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్నప్పటికీ   ప్రశ్నించే గొంతుక ను గెలిపించుకోండంటూ ప్రజల మన్ననలు పొంది విజయం సాధించారు.   టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రజా సమస్యలపై అధికార బీఆర్ఎస్ అక్రమాలు, అవినీతిపై నిరంతర పోరాటం చేశారు. అలాగే తెలంగాణ ఆవిర్భావం నుంచీ వరుస పరాజయాలతో ఉనికి మాత్రంగా మిగిలిన రాష్ట్ర కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపి  పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చారు. పార్టీ విజయం సాధించిన తరువాత ఎటువంటి ప్రతిష్ఠంభనకూ తావు లేకుండా రేవంత్ సీఎంగా ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఎన్నుకుంటారనే అంతా భావించారు. అయితే అయితే పార్టీ విజయం సాధించిన తరువాత అగ్రపీఠం కోసం సీనియర్ల మంటూ కొందరు పట్టుబట్టడంతో రెండు రోజుల పాటు సీఎం ప్రకటనపై అధిష్ఠానం తాత్సారం చేసింది. తాత్సారం అయితే చేసింది కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అన్న స్పష్టమైన సంతాకేలను మాత్రం ఇచ్చింది. సీఎం పీఠం కోసం పట్టుబడుతున్న నేతలను హస్తిన పిలిపించుకుని క్లాస్ పీకింది. పరిస్థితిని విడమరచి చెప్పి వారిని ఒప్పించింది. చివరికి వారిద్దరినీ పక్కన పెట్టుకునే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హస్తినలోనే తెలంగాణ సీఎం రేవంత్ అంటూ విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో గురువారం ఉదయం 10.15 గంటలకు రేవంత్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 

రేవంతే తెలంగాణ ముఖ్యమంత్రి.. వెలువడిన అధికారిక ప్రకటన

ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. కొద్ది సేపటి కిందట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని ప్రకటించారు. అంతకు ముందు రోజంగా తెలంగాణ సీఎం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హస్తినలో హై డ్రామా నడిచింది. సీఎం పదవి రేసులో ఉన్న మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. మధ్యలో ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ సీఎం విషయమై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ అని ఒక్క ముక్కలో తేల్చేసినట్లు సమాచారం. ఆ సమావేశం పూర్తయిన తరువాత డీకే శివకుమార్ సీల్డ్ కవర్ లో సీఎం అభ్యర్థి పేరుతో హైదరాబాద్ బయలుదేరనున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగా సీన్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నివాసానికి మారింది. ఆయన నివాసంలో డీకే, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 40 నిముషాల సేపు చర్చ జరిగింది. ఆ సమావేశం ముగియగానే బయటకు వచ్చిన మల్లు, ఉత్తమ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కొద్ది సేపటికే వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎంగా రేవంత్ ను అధిష్ఠానం ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కాగా ఉదయం నుంచీ ఎల్లా హోటల్ లోనే మకాం వేసి ప్రభుత్వ ఏర్పాటు, తరువాత తీసుకోవలసిన చర్యలపై నేతలతో చర్చిస్తూ ఉన్న రేవంత్  హైకమాండ్ పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. ఉదయ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ పేరు ఖరారు చేసినట్లు పలు మీడియా సంస్థలు చెబుతూ వస్తున్నాయి. అలాగే హస్తినలో జరుగుతున్న చర్చ అంతా మంత్రివర్గ కూర్పుగురించేనని పేర్కొన్నాయి. చివరకు హైకమాండ్ మంగళవారం (డిసెంబర్ 5) సాయంత్రం ఆరున్నర గంటల తరువాత రేవంత్ పేరును ప్రకటించడంతో ఉదయం నుంచీ కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ శ్రేణులలో సంబరాలు అంబరాన్నంటాయి. హస్తినలో హై కమాండ్ రేవంత్ తో మంత్రివర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు  ముందు ఏఐసీసీ సమావేశం ముగిసిన తరువాత అధిష్టానం నిర్ణయానికి కట్లుబడి ఉంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు. సీఎం రేసులో తాను ఉన్నాననీ, అయినా అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తాననీ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెైస్ విజయంలో  కీలక పాత్ర పోషించిన రేవంత్ నే పార్టీ అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉందని తొలి నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది.   మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (డిసెంబర్ 6) లోగా తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే అందరూ ఊహించినట్లుగానే రేవంత్ నే కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం గా ప్రకటించింది. దీంతో  సోమవారం (డిసెంబర్ 4) నుంచి  కొనసాగుతున్న సీఎం ఎంపిక ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌లోని ఎల్జా హోటల్‌లో డి. శివకుమార్‌తో పాటు ఇతర పరిశీలకులు సోమవారం (డిసెంబర్ 4) ఎమ్యెల్యేలతో   విడివిడిగా కూడా మాట్లాడారు. ఆ తార్వత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకి హస్తినకు అంటే పార్టీ హైకమాండ్ కోర్టుకు చేరింది. హస్తినలో కూడా సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ సీఎంగా రేవంత్ ను ఖరారు చేస్తూ ప్రకటన వెలువడింది.