కాంగ్రెస్ కే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
posted on Nov 30, 2023 @ 5:06PM
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందో అంచనావేసే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో పోలింగ్ ముగియగా.. తెలంగాణలో నవంబర్-30న పోలింగ్ జరిగింది. తెలంగాణలో పోలింగ్ ముగియగానే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ తెలంగాణలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేల్చేశాయి.
అయితే ఒక్క పల్స్ టుడే సర్వే మాత్రంబీఆర్ఎస్ ఈ సారి కూడా సంపూర్ణ ఆధిక్యత సాధించి ముచ్చటగా మూడో సారి అధికారం చేజిక్కించుకోనుందని పేర్కొంది.
పల్స్ టుడే సర్వే
పల్స్ టుడే సర్వే ప్రకారం బీఆర్ఎస్ 69 నుంచి 71 స్థానాలలో గెలవనున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ 37 నుంచి 38 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని పల్స్ టుడే పేర్కొంది. బీజేపీ అయితే మూడు నుంచి ఐదు స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఎంఐఎం 6 స్థానాలలోనూ ఇతరులు ఒక స్థానంలోనూ గెలుపు సాధించే అవకాశం ఉందని పల్స్ టుడే సర్వే పేర్కొంది.
చాణుక్య స్ట్రాటజీస్ సర్వే...
ఇక చాణుక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యత సాధించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 22 నుంచి 30 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయితే 67 నుంచి 78 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఆరు నుంచి తొమ్మిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలలో విజయం సాధిస్తుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది.
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ సర్వే
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. ఆ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్ 65 నుంచి 58 స్ధానాలలో విజయకేతనం ఎగురవేస్తుంది. బిఆర్ఎస్ 35 నుంచి 40 స్థానాలకే పరిమితమౌతుంది. బీజేపీ 7 నుంచి 10 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులు 5 నుంచి 9 స్థానాలలో విజయం సాధిస్తారు.