కర్నాటకకు కాంగ్రెస్ అభ్యర్థులు?
posted on Dec 1, 2023 @ 9:35AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. కాంగ్రెస్ లో కూడా అధికారం చే జిక్కించుకుంటామన్న ధీమా వ్యక్తం అవుతోంది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదనీ, 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎగ్జిట్ పోల్స్ తాము అధికారానికి దూరం అవుతాయనే చెప్పాయనీ, కానీ తాము అధికారం చేజిక్కించుకున్నామనీ బీఆర్ఎస్ చెబుతోంది.
ఈ సారీ అదే జరుగుతుందనీ, తాము వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామనీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనీ ధీమాగా చెబుతోంది. అంతే కాదు ముచ్చటగా మూడో సారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసే స్థలాన్ని కూడా ఇప్పటికే ఖరారు చేసేసింది. కొత్త సెక్రటేరియెట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారనీ, ఆయన తొలి సంతకం ఏ ఫైలు మీద చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారనీ బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ వాదనను కొట్టిపారేస్తోంది. ఏదో రకంగా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ ప్రజా తీర్పును లెక్క చేయకుండా దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయనీ అనుమానిస్తోంది. ఈ సారి 70కు పైగా స్థానాలలో విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్.. తమ పార్టీ తరఫున గెలుస్తారన్న అభ్యర్థులందరినీ కర్నాటకకు తరలించే యోచన చేస్తున్నది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఈ మేరకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి అధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేసి తమ దరికి చేసుకోవడానికి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అందులో భాగంగానే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనీ, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభాలకు దూరంగా ఉంచేందుకు కర్నాటకకు తరలించే విధంగా వ్యూహరచన చేస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో పోలింగ్ పూర్తయిపోయినా రాజకీయ వేడి మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలలో బిజీగా ఉన్నాయి.