వైసీపీ సామజిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్!.. కారణమేంటంటే?

ఏపీలో వైసీపీ తలపెట్టిన మరో ప్రచార కార్యక్రమం సామజిక బస్సు యాత్ర. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని ఒకేసారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మొదలు పెట్టారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ.. మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ ఇందులో ఇన్వాల్వ్ కావాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు.  పార్టీలో లుకలుకలు, అంతర్గత కుమ్ములాటలను కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలని   దిశానిర్ధేశం కూడా చేశారు. అక్టోబర్ 26 నుంచి  వైసీపీ సామాజిక  సాధికార బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. మొత్తం అరవై రోజుల పాటు సాగి డిసెంబర్ 31తో పూర్తి అయ్యేలా ఈ యాత్రకు రూపకల్పన చేశారు. అంటే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ ఎక్కడో  ఒక చోట.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతూనే ఉంది. కానీ, ఎక్కడా ఎవరికీ కనిపించడం లేదు. ఏ మీడియా  కూడా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడం లేదు.   వైసీపీ సామజిక సాధికార  బస్సు యాత్ర పేరిట కార్యక్రమాన్ని అయితే డిజైన్ చేశారు. పార్టీ పెద్దలు అలా చేయండి.. ఇలా చేయండని ఆదేశాలైతే ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పినా ఎవరూ కనిపించడం లేదు. తొలి నాలుగు రోజులలో అడపాదడపా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్సు ఎక్కి రోడ్ల మీద ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్నా ఒక్కరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వస్తున్నాడంటే చుట్టూ చేరాల్సిన ద్వితీయ శ్రేణి నేతలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. దీంతో తన నియోజకవర్గంలోకి యాత్ర వచ్చినా ఎమ్మెల్యేలు కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. అక్కడక్కడా చిన్న పాటి సభలు ఏర్పాటు చేసినా జనం లేక ఖాళీ కుర్చీలకే నాయకులు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో జెడ్పీటీసీలు, జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు లాంటి వారు కూడా ఈ యాత్రను పట్టించుకోవడం మానేశారు. దీంతో అసలు ఈ యాత్ర ఎక్కడ సాగుతుందో , అసలు జరుగుతోందా లేదా కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. సహజంగా రాజకీయ పార్టీ ఒక కార్యక్రమాన్ని తలపెడితే.. దానికి ప్రజల స్పందన ఎలా ఉన్నా, పార్టీ  మేనేజ్మెంట్ లో భాగంగా క్యాడర్ ను మోటివేట్ చేస్తుంది. ఎక్కడిక్కడ ఫోన్లు చేసి కదలిక తేవడం, మెసేజీల ద్వారా కార్యక్రమానికి హైప్ తేవడం చేస్తాయి. కానీ, వైసీపీ సామజిక బస్సు యాత్రకు అది కూడా కరువైంది. తొలి వారం తర్వాత దీన్ని ఫెయిల్యూర్ కార్యక్రమం కిందే లెక్కేశారో.. నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యకమాన్ని పక్కన పెట్టేశారో కానీ.. ఈ కార్యక్రమం ఫలానా ప్రాంతంలో జరుగుతుందన్న సమాచారం కూడా కార్యకర్తలకు అందడం లేదు. బస్సు,  అందులో ఉన్న పది ఇరవై మంది  యాత్ర వెళ్లే రూట్ లో ఆయా గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం, వైసీపీ జెండాలను ఆవిష్కరించడం  చేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడో పాడైపోయిన జెండాల స్థానంలో కొత్త జెండా కనిపిస్తే ఆ రూట్ లో వైసీపీ యాత్ర వెళ్లిందని ప్రజలు గుర్తు పడుతున్నారు.  అంతే అంతకు మించి ఈ యాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, అధికారంలో ఉన్న పార్టీ, అందునా 151 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించిన పార్టీ, ఇంకా ఆరు నెలల అధికారం ఉండగానే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇంత ఘోరంగా ఫైలవడం రాజకీయ వర్గాలను కూడా విస్తుపోయేలా చేస్తున్నది. ఒక ప్రభుత్వం మీద ఎంతో కొంత ప్రజలలో అసంతృప్తి ఉండడం సహజం. కానీ, వైసీపీపై సొంత పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉండడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.  సీఎం సభలకు సైతం ప్రభుత్వ శాఖల అన్ని వర్గాలను, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీల విద్యార్థులు సైతం హాజారు కావాలని ఆదేశాలు జారీ చేసి జనసమీకరణ చేసి జరిపిస్తున్నారని లేకపోతే  ఆసభలు కూడా వెలవెలబోయేవనీ విశ్లేషిస్తున్నారు. కాగా, ఇదే సినారియో కంటిన్యూ అయితే రేపు ఎన్నికల సమయంలో వైసీపీ నేతల సభలకు కూడా జనసమీకరణ కష్టమే అవుతుందని, అధికార పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదని అంటున్నారు.  మొత్తం మీద వైసీపీ గ్రాఫ్ పాతాళం కంటే కిందకి వేగంగా దిగజారిపోతున్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అంటున్నారు. 

డిసెంబర్ 12లోగా బాబు క్వాష్ పై సుప్రీం తీర్పు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు వచ్చే నెల 12లోగా తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబునాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేస్తూ గతంలోనే సుప్రీం ధర్మాసనం ఈ కేసును రిజర్వ్ లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు వెలువరించిన తరువాత టేకప్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ లోగా చంద్రబాబు బెయిలు పిటిషన్ విచారణ గురువారం బెంచ్ ముందుకు వచ్చింది. దీంతో ఈ రోజు ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్ 12కు వాయిదా వేసింది.   జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై డిసెంబర్ 12 వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐడీని ఆదేశించింది. ఈ సందర్భంగా  స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్ లో ఉందని  న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ద బోస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12లోపు స్కిల్ కేసులో  బాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

యెడ్యూరప్పకు జెడ్ కేట‌గిరీ భద్రత

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు జడ్ కేటగరి భద్రత కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  బీఎస్ యెడ్యూర‌ప్ప‌కు జడ్ క్యాటగరి భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యెడ్యూరప్పకు తీవ్రాదుల నుంచి ముప్పు పొంచి ఉంద‌న్న నిఘా వ‌ర్గాలు నివేదిక ఆధారంగా ఆయనకు   జెడ్ కేట‌గిరీ భద్రత  క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్రహోంశాఖ పేర్కొంది. అయితే ఈ జెడ్ కేట‌గిరీ సెక్యూరిటీ కేవ‌లం క‌ర్ణాట‌క రాష్ట్రం వ‌ర‌కే అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది.  యెడ్యూరప్ప  బీజేపీ కీల‌క‌మైన నాయ‌కుడు. గతంలో బీజేపీని కర్నాటకలో అధికారంలోకి తీసుకురావడంతో యెడ్యూరప్పదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  అయితే బీజేపీ హైకమాండ్ కర్నాటక సీఎంగా ఆయనను తొలగించి బస్వరాజ్ బొమ్మైకి పగ్గాలు అప్పగించినప్పటి నుంచీ కర్నాటకలో బీజేపీ డౌన్ ఫాల్ మెదలైంది. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. దాంతో యెడ్యూరప్పను పక్కన పెట్టడం వల్లనే నష్టం జరిగిందన్న భావన పార్టీ హై కమాండ్ లో మొదలైంది. అందుకే పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో యెడ్యూరప్ప పేరు చేర్చింది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది  త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు యెడ్డీ సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కేంద్రం జడ్ క్యాటగరి భద్రతను కల్పించింది. 

మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 36. 68శాతం పోలింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చెదురుమదురు ఘటనలు వినా పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతోందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. మధ్యహ్నం ఒంటి గంట సమయానికి 36.68శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్పంగా 20.79 శాతం పోలింగ్ జరగగా, మెదక్ జిల్లాలో అత్యధికంగా 50.80శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.  అదిలాబాద్ 41.88, భద్రాద్రి 39.29, హనుమకొండ 35.29,  హైద్రాబాద్ 20.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. జగిత్యాలలో 46.14,  జనగాం 44.31, భూపాలపల్లి 49.12,  గద్వాల్ 49.29శాతం చొప్పున పోలింగ్ జరిగింది. అలాగే కామరెడ్డి 40.78, కరీంనగర్ 40.73,  ఖమ్మం 42.93, ఆసిఫాబాద్ 42.77,  మహబూబాబాద్ 46.89,  మహబూబ్ నగర్ 44.93 శాతం పోలింగ్ జరిగింది. ఇక మంచిర్యాలలో 42.74, మెదక్ లో 50.80 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మేడ్చల్ 26.70,  ములుగు 45.69,  నాగర కర్నూల్ 39.58, నల్గొండ 39.20 శాతం పోలింగ్ జరిగింది. ఇక నారాయణ పేటలో నారాయణపేట 42.60శాతం, నిర్మల్ లో 41.74 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. ఇక పోతే నిజామాబాద్ లో 39.66, సిరిసిల్లలో 39.07, పెద్దపల్లి 44.49 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. అలాగే రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17,  సిద్దిపేట 44.35, సూర్యాపేట 44.14 శాతం ఓట్లు నమోదయ్యాయి.  అలాగే వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25,యాదాద్రి 45.07 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. 

కవిత, రేవంత్ లపై ఎఫ్ఐఆర్ 

పోలింగ్ బూత్ వెలుపల ప్రచారం చేయడంతో ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు నివేదించామని ఎఫ్ఐఆర్  కూడా నమోదైనట్లు చెప్పారు. మరిన్ని చోట్ల ఫిర్యాదులు అందాయని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు వస్తే ఎఫ్ఐఆర్ నమోదయిందన్నారు. ఆయన పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రేవంత్ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు బిఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని, ఆయా డీఈవోలకు పంపించామని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని.. రెండు, మూడు చోట్ల ఈవీఎంలు మార్చామని చెప్పారు. ఓటరు కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ కార్డులకు గుర్తింపు ఉందన్నారు.  తెలంగాణలో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ... సమస్య రావడంతో ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మార్చడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరగవలసి ఉందన్నారు. ఎపిక్ కార్డు లేకపోతే 12 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఉన్నాయని, వాటిని గుర్తింపు కార్డులుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని సూచించారు.

ఓటు వేయండి డెమోక్ర‌సీని ర‌క్షించండి.. గవర్నర్ తమిళిసై

 తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని  రాష్ట్ర గ‌వ‌ర్నర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ పిలుపు ఇచ్చారు.  ప్ర‌లోభాల‌కు లొంగ కుండా   భార‌త రాజ్యాంగం ఇచ్చిన ఓటు హ‌క్కును సద్వినియోం చేసుకోవాలని పేర్కొన్నారు.   పోలింగ్ డే న సెలవు ప్రకటించింది ఇంటి వద్ద కూర్చోవడానికి కాదనీ  విలువైన ఓటును ఉప‌యోగించుకోవడానికేననీ పేర్కొన్న తమిళిసై జనం పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేష‌న్ల‌కు పోటెత్తాల‌న్నారు.  పార్టీలు ముఖ్యం కాద‌ని, కావాల్సింద‌ల్లా చైత‌న్య‌వంతంతో కూడిన ఓటు అని గుర్తించాల‌ని  పేర్కొన్న గవర్నర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. క‌నీసం 100 శాతం పొలింగ్ జరిగేలా జనం ముందుకు రావాలని ఆకాంక్షించారు. 

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

పార్లమెంట్  శీతాకాల సమావేశాలు డిసెంబర్  4  ప్రారంభమై  22వ తేదీ వరకూ సాగుతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాటి నుంచీ పార్లమెంటు సీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ బులిటిన్ విడుదల చేసింది. ఈ సమావేశాలలో కేంద్రం  18 బిల్లులను ప్రవేశ పెట్టాలని  నిర్ణయించింది. ఈ 18 బిల్లులలో రెండు జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లు, ఐపీసీ సవరణ బిల్లులు ఉన్నాయి.  అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లను 107 నుంచి 114 కు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఈ సమావేశాలలోనే సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  వీటితో పాటు  2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై  చర్చ, ఓటింగ్  జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే  సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్  2న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్  జోషి తెలిపారు..

ఉదయం 11 గంటల వరకూ 20.64శాతం పోలింగ్.. ఓటేసేందుకు కదలని హైదరాబాద్ వాసులు

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ మెల్లిమెల్లిగా పుంజుకుంటోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహంగా కదులుతున్నా.. పట్టణ ప్రాంతాలలో మాత్రం ఓటర్ల నిర్లిప్తత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఉద్యం 11 గంటలకు కేవలం 12.39 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి 20.64శాతం ఓట్లు పోలయ్యాయి.  ఖమ్మం జిల్లాలో తొలి నాలుగు గంటలలో 21 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సరళిపై తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పందిస్తూ పట్టణ ఓటర్లు పోలింగ్ బూతులకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరగాల్సి ఉందని అన్నారు.  ఇప్పటి వరకూ సిద్ధిపేటలో అత్యధికంగా 30శాతంవ  ఓట్లు పోలయ్యాయి. అలాగే దుబ్బాకలో 29శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం నిరాశాజనకంగా ఉందని పలువురు అభిప్రాయపనడుతున్నారు.  నగరవాసుల తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. ఇప్పటికైనా నగర వాసులు కదిలి వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.  

పోస్టల్ బ్యాలెట్ పై విచారణ ముగించిన హైకోర్టు

ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం  హైకోర్టుకు నివేదించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల  విధుల్లో భాగస్వాములుగా ఉన్న ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్లు అంద జేసినట్లు తెలిపారు. ఈ నెల 28 నాటికి 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.  ఈ వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు  అవసరం లేదంటూ గురువారం విచారణ ముగించింది.  ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులతో పాటు ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎఫ్‌సిఐ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.అయితే చాలా మంది టీచర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఓటు అనేది ప్రాథమిక హక్కు అని.. అందరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పించే తామే ఓటు వేయకపోవటం దారుణమన్నారు. ఫారం 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్‌ అవకాశం కల్పించలేదని హైకోర్టును ఆశ్రయించారు.

అర్ధరాత్రి సాగర్ వద్ద హైడ్రామా.. ఎన్నికల వేళ ఎందుకిలా?

రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్ద రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు, వందల మంది పోలీసులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక రాష్ట్రం పోలీసులు గేటు వేసి అడ్డుకుంటే.. మరో రాష్ట్రం పోలీసులు ఫెన్సింగ్ వేసి అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తతతలు ఘర్షణకు దారి తీయడంతో  డ్యామ్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారి మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒకవైపు తెల్లవారితే తెలంగాణలో ఎన్నికలు, అలాంటి వేళ సరిగ్గా అర్ధరాత్రి వేళ హైడ్రామా నెలకొనడంతో అసలేం జరుగుతోందన్న అయోమయం ఏర్పడింది.  ఇరు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి కావడంతో వందల మంది పోలీసులు మోహరించడంతో  ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్నికలలో లబ్ది కోసమే కేసీఆర్ అర్ధరాత్రి సమయంలో హైడ్రామాకి తెర తీసారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. ఆ ఆరోపణలు అలా ఉంచితే ఇంతకూ అసలేం జరిగిందంటే. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు ఏపీ పరిధిలో ఉండగా మిగతా సగభాగం తెలంగాణలో ఉంది. కాగా  ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఇదే సమయంలో డ్యామ్‌ ఆపరేషన్ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటంతో సాగు, తాగు నీటికి కృష్ణా డెల్టాలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు, తాగు నీరు అందడం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తాగు, సాగు నీరు అందక గుంటూరు, పల్నాడు రైతాంగం కొద్ది రోజులుగా ఆందోళన   చేస్తోంది. అసలు రెండు రాష్ట్రాలకు వాటాలు ఉన్న ప్రాజెక్టును ఒకే రాష్ట్రానికి యాజమాన్య బాధ్యతలను అప్పగించడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ అధికారులు భారీ ఎత్తున పోలీసులను వెంటపెట్టుకొని నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్దకు చేరుకొని ముళ్లకంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్ వరకు తమ పరిధిలోకి వస్తుందని, అక్కడ వరకు కంచె వేశారు. ఏపీ అధికారులు పోలీసులను డ్యామ్ సిబ్బంది గేట్ వేసి అడ్డుకోగా.. డ్యామ్ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా డ్యామ్ సిబ్బంది మొబైల్ ఫోన్లతోపాటు అక్కడి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మిర్యాలగూడ డీఎస్పీ ఏపీ పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినా వినలేదు. డ్యామ్ నిర్వహణ విషయం నీటిపారుదల అధికారులకు సంబంధించిన విషయమని, ముళ్లకంచెను తీసేయాలని కోరారు. ఏపీ పోలీసుల నుండి స్పందన లేకపోవడంతో తెలంగాణ పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఘటనా స్థలంలో మీడియా కవరేజీకి ప్రయత్నించగా పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా లాక్కున్నారు.  అయితే, అర్ధరాత్రి వేళ ఏపీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ముందే ప్రక్కా ప్రణాళికతో 600 నుండి 700 మంది పోలీసులు ప్రాజెక్టుపైకి వెళ్లారు. నిజానికి ఈ ప్రాజెక్టు, అందులో నీటి వాటాలు, ప్రాజెక్టు నిర్వహణ ఇవన్నీ కేంద్ర పరిధిలోని అంశాలు. మహా అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అంశాలు. కానీ, వందల మంది పోలీసులతో వెళ్లి ప్రాజెక్టు వద్ద బీభత్సం సృష్టించడం వలన ఒరిగేది ఏమీ లేదు. పైగా సిబ్బందిపై దాడి, సీసీ కెమెరాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజల సొమ్మే నష్టపోయింది. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తే.. ఇది కావాలని పక్కా ప్రణాళికతో చేసిన చర్యగానే కనిపిస్తుంది. దౌర్జన్యకాండతో ఫలితం లేదని తెలిసినా.. పోలీసులే పనిగట్టుకొని వెళ్లి అల్లర్లు జరిగేలా ప్రేరేపించడం వెనక  పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ప్రభావం చేయాలన్న దురుద్దేశమేదో ఉందన్న అనుమానాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ఊరుకుని సరిగ్గా తెలంగాణ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ రకమైన దూకుడు ప్రదర్శించడం పొరుగు రాష్ట్రంలో తన మిత్రుడికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికేనని అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఏపీ సర్కార్ చేసిన ఈ చర్య వల్ల ఇటు ఏపీలో జగన్ సర్కార్ రైతాంగం సమస్యల పట్ల పొరుగు రాష్ట్రంతో గొడవకు సైతం వెనుకాడటం లేదన్న  భావన ప్రజలలో కలిగేలా చేయడంతో పాటు.. పొరుగు రాష్ట్రంలో  సెంటిమెంట్ ను రగిల్చి అక్కడి తన మిత్రుడికి లబ్ధి చేకూర్చాలన్న కుట్ర కూడా దాగి ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ సాగర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడేలా జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు రాజకీయ కుట్రేనని అంటున్నారు. 

క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే?

ఫైబర్ నెట్ కేసులు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ గురువారం (నవంబర్ 30) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే గతంలో ఇదే ధర్మాసనం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. ఆ సందర్భంగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరం ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారిస్తామని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ గురువారం (నవంబర్ 30)  లిస్ట్ కాలేదు. కానీ ఫెబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్  లిస్ట్ అయ్యింది. దీంతో క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించక ముందే సుప్రీం ధర్మాసనం ఫెబర్ నెట్ కేసులో బాబు ముందస్తు పిటిషన్ పై విచారణ జరపనున్నదని భావించాల్సి  ఉంటుంది.  అయితే గతంలో ఫైబర్ నెట్  కేసు విచారణ ధర్మాసనం ముందుకు వచ్చిన ప్రతిసారీ న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్దబోస్ లు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించిన అనంతరమే ఈ పిటిషన్ విచారణ చేపడతామని చెబుతూ వచ్చారు. అలాగే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే వరకూ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐీని ఆదేశించారు.   అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడకుండానే ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు రావడంతో.. ఇప్పుడు కూడా ఈ కేసు విచారణకు సుప్రీం వాయిదే వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని న్యాయనిపుణుులు అంటున్నారు. క్వాష్ పై తీర్పు వెలువడకుండా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలుపై నిర్ణయం వెలువడే అవకాశం లేదని అంటున్నారు.  ఇదిలా ఉంటే చంద్రబాబుపై జగన్ సర్కార్ బనాయించిన అన్ని కేసుల విచారణ కూడా క్వాష్ పిటిషన్ తీర్పు కోసమే వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి విదితమే.   చివరాఖరికి ఏపీ సర్కార్   దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ కూడా ఈ కారణంతోనే వాయిదా పడిన సంగతి విదితమే.  17ఏ చంద్రబాబుకు వర్తించకపోతే ఆయనను ఎన్నికల్లో కట్టడి చేయడానికి ఎన్ని కేసులైనా పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది. అదే చంద్రబాబుకు 17ఏ చంద్రబాబుకు వర్తిస్తే జగన్ సర్కర్ పెట్టిన కూసులన్నీ దూది పింజెలుగా ఎగిరిపోవడం తథ్యం. 

ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. ప్రధాని, ప్రియాంక పిలుపు

తెలంగాణ ఎన్నికల పోలింగ్  జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా x వేదికగా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపారు.   తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.    ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.   యువత,  ముఖ్యంగా తొలి సారి  ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ప్రత్యేకంగా కోరారు. అలాగే ప్రియాంక గాంధీ కూడా ఓటు హక్కును వినియోగించుకుని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అయితే బంగారు తెలంగాణ కలలను సాకారం చేసుకునేందుకు తప్పని సరిగా ఓటేయాలని కోరారు.  

నాగార్జున సాగర్ గొడవపై నేతలు మాట్లాడొద్దు.. సీఈవో వికాస్ రాజ్

నాగార్జున సాగర్ వద్ద గోడవపై రాజకీయ నేతలెవరూ మాట్లాడొద్దని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. ఆ విషయం పూర్తిగా పోలీసులు చూసుకుంటారనీ, ఆ విషయంపై రాజకీయ నేతల ప్రకటనలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయనీ హెచ్చరించారు. ఇలా ఉండగా ఆయన ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం పెరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలలో ఉదయం నుంచే ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ కట్టారనీ, పట్టణ ప్రాంతాలలో మాత్రం మందకొడిగా పోలింగ్ జరుగుతోందనీ చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు. 

విజయవాడ, హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ, హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే, వచ్చే ప్రయాణీకులతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.  అదలా ఉంటే నాగర్ కర్నూల్ మన్ననూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాటకు దారి తీయడంతో పోలీసులు ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. గద్వాల జిల్లా ఐజ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.   అదే విధంగా జనగామలో కూడా ఓ పోలీసు స్టేషన్ వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలనూ చెదరగొట్టారు.  భద్రాద్రి జిల్లా నల్లబండపోడులో గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామానికి తారు రోడ్డు లేదని వారు ఓటు వేయడానికి నిరాకరించారు.  

బంగారు తెలంగాణ కోసం ఓటేయండి.. రాహుల్

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ జరుగుతున్ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలనుద్దేసించి  x వేదిక ద్వారా ఓ సందేశం ఇచ్చారు.  నా తెలంగాణ సోదర సోదరీమణులారా అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఉదయం 7  గంటల నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా 7.78 శాతం పోలింగ్ జరిగింది. చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం పోలింగ్ మందకొడిగా  సాగుతోందని, క్రమంగా పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఉండగా కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వెలవెలబోతున్నది. ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటి వరకూ కేవలం 12 మంది మాత్రమే ఈ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇలా ఉండగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇక  ఇబ్రహీంపట్నం ఖానాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల మధ్యా మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలనూ చెదరగొట్టారు.  

ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడి అరెస్టు

ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ కుమారుడు జయసింహ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదైంది. ఆయన తనపై దాడి చేశారంటూ ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7.78శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

కల్వకుంట్ల కవితపై ఈసీకి కాంగ్రెైస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకల్వకుంట్ల కవితపై కాంగ్రెైస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆమె ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనీ, ప్రజలకు పోలింగ్ బూత్ వద్ద తమ పార్టీకే ఓటేయాల్సిందిగా విజ్ణప్తి చేశారనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. కాంగ్రెస్ రాష్ట్ర  ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కవిత ఓటర్లకు విజ్ణప్తి చేయడం కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ఆయన అన్నారు. అందుకే ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.  ఇదిలా ఉండగా తెలంగాణ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  పలు చోట్ల ఈవీఎంలు మెరాయించాయి.   సిద్దిపేటలోని అంబి టస్ స్కూల్లో మోడల్ పోలింగ్ బూత్ నెం.118 లో ఈవీఎం మొరాయించింది. మాక్ పోలింగ్ సజావుగా సాగినా, పోలింగ్ ప్రారంభమయ్యాక సమస్య తలెత్తిందని చెబుతున్నారు. అలాగే నిజామాబాద్ లోని నందిపేట మండల కేంద్రంలో, సూర్యాపేట విద్యానగర్ లో,  నాగార్జునసాగర్  లో ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.