బీఆర్ఎస్ లో ముసలం? పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై ప్రతిష్ఠంభన

బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందా? అది పార్టీ అస్థిత్వాన్ని దెబ్బతీసే స్థాయికి చేరిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ను ఇప్పుడు ఆయన పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలే లెక్క చేయని పరిస్థితి కనిపిస్తోంది.   బీఆర్ఎస్.. నిన్న మొన్నటి వరకూ ఆ పార్టీలో కేసీఆర్ మాటే శాసనం. భిన్నాభిప్రాయానికీ, బేధాభిప్రా యానికీ తావే లేదు. అంతే కాదు ఎవరైనా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా, సొంత అభిప్రాయాన్ని వెల్లడించినా వారెంతటి వారైనా సరే పార్టీ బహిష్కరణే ఏకైక పర్యవశానం అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సమష్టి నిర్ణయం, చర్చలు వంటి వాతావరణమే బీఆర్ఎస్ లో గత తొమ్మిదేళ్లుగా కనిపించలేదు. పార్టీ తరఫునైనా, ప్రభుత్వం తరఫునైనా  మీడియా ముందుకు వచ్చి అయితే కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మాట్లాడాలి అన్నట్లుగా పరిస్థితి ఉండేది.   కానీ ఒక్క ఓటమితో పరిస్థతి పూర్తిగా మారిపోయింది. తాజా ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. అంతే పార్టీలో ఇంత కాలం కనిపించిన విధేయత, విశ్వాసం అంతా నేతి బీరకాయలో నేతి చందమేనని తేటతెల్లమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున  తాజా ఎన్నికలలో 39 మంది విజయం సాధించారు. కానీ వారిలో పలువురు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడి మూడు రోజులు కాలేదు.. అప్పుడే పార్టీలో అసమ్మతి గళాల స్వరం గట్టిగా వినిపిస్తున్నది. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే పలువురు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న సంకేతాలు కనిపించాయి.  ఇలా ఫలితాలు వెలువడ్డాయో లేదో అలా భద్రాద్రి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి పక్కన కనిపించారు. ఇక మంగళవారం (డిసెంబర్ 5) నాటికి పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి.. చేయి అందుకోవడానికి రెడీ అయిపోయినట్లుగా జోరుగా ప్రచారమౌతోంది.   బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే, అంతా తానే అన్నట్లుగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు అసమ్మతి సెగలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్ ను పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. కేసీఆర్ లేదా కేటీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. మెజారిటీ ఎమ్మెల్యేలు హరీష్ రావుకే శాసనసభా పక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వాలని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శాసనసభా  పక్ష నేత ఎన్నికలో ప్రతిష్ఠంభన ఏర్పడిందంటున్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల గతంలో ఉన్న విశ్వాసం, నమ్మకం, విధేయత మచ్చుకైనా కనిపించడం లేదనడానికి దీనికి తార్కానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. . ఇందుకు బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేత ఎంపిక విషయంలో ఏర్పడిన గందరగోళమే నిదర్శనం.  ఈ పరిస్థితుల్లో రాజీ యత్నంగా కడియం శ్రీహరి పేరు   తెరపైకి వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీపై కేసీఆర్ పట్టు కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు.  మరో వైపు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలలో కనీసం 12 మంది కారు దిగి చేయందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అలా కారును వీడే వారిలో హైదరాబాద్, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారని కూడా అంటున్నారు. అలాగే ఖమ్మం ఎంపీ నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. గతంలో తాను ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తే.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే శృంఖరాలు తెంచుకుని బీఆర్ఎస్ ను  నిర్వీర్యం చేసేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి ఏర్పడడం కొసమెరుపు.   

బాబు విజ్ణత, స్థిత ప్రజ్ణతా కేసీఆర్ లో ఎక్కడుంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గురువారం (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా  చేశారు. అయితే ఆయన ఇటు జనానికీ, అటు పార్టీ నేతలకూ కూడా కనిపించకుండా    రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కి పంపి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.   భద్రతను కూడా పక్కనపెట్టేసి తన సొంత వాహనంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈ సమయంలో కేసీఆర్ వాహనం వెంట మరొక వాహనం మాత్రమే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళాక అదే రోజు రాత్రికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడకు వెళ్లగా.. మరుసటి రోజు ఉదయం గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు అక్కడకి వెళ్లారు.   ఇదంతా ఎందుకంటే  ఆయన ఓటమిని అంగీకరించి, హుందాగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపి, పద్ధతి ప్రకారం తన రాజీనామాను స్వయంగా స్పీకర్ కు అందజేసి ఉంటే.. ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం గురించి అసలు చర్చే ఉండేది కాదు. అయితే ఆయన ప్రజలకు, పార్టీ నేతలకు ముఖం చాటేసిన తీరు ఓటమిని అంగీకరించలేక పారిపోయినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే పార్టీ పరాజయం పాలైన వెంటనే  కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడంపై   రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.  ఓడిన వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారని ప్రతిపక్షాలు ఇన్నాళ్లు విమర్శలు చేసాయి. అలాగే ఓడితే రెస్ట్ తీసుకుంటానని సాక్షాత్తు కేసీఆర్  స్వయంగా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రజలకే చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇకపై ఫామ్ హౌస్ కి పరిమితమై రాజకీయాలను నడిపిస్తారా అనే చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఎప్పుడూ ఫామ్ హౌస్ కి వెళ్లినా ఆర్భాటంగానే వెళ్లేవారు.   కానీ  ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా.. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వంత వాహనంలో తన ఫామ్ హౌస్ కు వెళ్లారు.  కేసీఆర్ ఓటమి అనంతరం ఫామ్ హౌస్ కి వెళ్లడంతో ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన వారు ఓడిన సందర్భంలో ఎలా స్పందించారు.  ఇప్పుడు కేసీఆర్ ఓడిన అనంతరం ఎలా ప్రవర్తించారు అన్నది పోల్చి నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో ఏపీలో ఓటమి అనంతరం ఎంత హుందాగా స్పందించారన్న విషయాన్ని నెటిజనులు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో గెలిచినా.. ఓడినా ముందు ప్రజల ముందుకొచ్చి కృతజ్ణతలు చెప్పేవారు. అలాగే ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి.. తమ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల మధ్యకి వస్తామని చెప్పేవారు. ముఖ్యంగా ప్రజల కోసం మరింత కస్టపడి పనిచేస్తామని  హామీ ఇచ్చేవారు. 2019లో  తెలుగుదేశం పరాజయం తరువాత  చంద్రబాబు ఎక్కడా తొణకకుండా మీడియా ముందుకొచ్చి స్పందించారు. ప్రజల కోసం మరింత కసిగా పనిచేస్తామని వెల్లడించారు. అలాగేే చేశారు. ఇప్పుడు ఏపీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.  కానీ  తాజాగా కేసీఆర్ కనీసం పూర్తిస్థాయి ఫలితాలు రాకముందే, తన ఓటమి ఖరారవగానే ఎవరికీ కనిపించకుండా మొహం చాటేశారు. కనీసం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పాలని భావించలేదు.  దీంతో ఇదే   ఆ చంద్రబాబుకు, ఈ చంద్రశేఖరుడికి తేడా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  బాబు విజ్ణత, స్థిత ప్రజ్ణతను నెటిజనులు వేనోళ్ల పొగుడుతున్నారు. అసలు సిసలైన ప్రజా నేతకి ప్రజల తీర్పుపై గౌరవం ఉండాలి..  ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేసి మళ్ళీ ప్రజల మెప్పు పొందాలి.  చంద్రబాబు అటువంటి నేత అని నెటిజనులు ప్రస్తుతిస్తున్నారు. అదే సమయంలో  అధికారమే పరమావధిగా రాజకీయాలను అవసరానికి ఉపయోగించుకొనే కేసీఆర్ లాంటి నేతలు.. అవసరం తీరి అధికారం కోల్పోయాక ప్రజలకు మొహం చాటేయడం పెద్ద వింతేమీ కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా  కేసీఆర్ అధికారం కోసమే పని చేశారని, అందుకే అధికారం పొందాక తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు అడుగులు వేసిన వారందరినీ పక్కకు పెట్టేసి..  తెలంగాణ సాధన క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుని ఆయన ఒక్కరే అధికారాన్ని అనుభవించారని సోదాహరణగా చెబుతున్నారు.  

ఏపీలో తుపాను ప్రభావంతో వర్ష బీభత్సం

ఏపీలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తరువాత  బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. కాగా బాపట్ల తీర ప్రాంతంలో  ఈదురు గాలులతో  భారీ వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి. కాగా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం భారీగా ఉంది.  ఇక తిరుమలలో జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి.  రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమానరాకపోకలను నిలిపివేశారు. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 18 విమానసర్వీసులను రద్దు చేశారు.   అన్నమయ్య జిల్లా రాజంపేట, ఒంటిమిట్ట, సిద్దవటంలో  తుపాను కారణంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది.   

రేవంత్ కే చాన్స్.. సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి   అభ్యర్థి గా అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరునే ఖరారు చేసే చాన్స్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (డిసెంబర్ 6) లోగా తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని, అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.   సోమవారం (డిసెంబర్ 4) నుంచి సీఎం ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. హైదరాబాద్‌లోని ఎల్జా హోటల్‌లో డి. శివకుమార్‌తో పాటు ఇతర పరిశీలకులు ఎమ్యెల్యేలతో   విడివిడిగా కూడా మాట్లాడారు. ఆ తార్వత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకి హస్తినకు అంటే పార్టీ హైకమాండ్ కోర్టుకు చేరింది.  ఎల్జా హోటల్ లో ఎంపిక విషయంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం డీకే శివకుమార్ సహా హైకమాండ్ పంపిన పరిశీలకులంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆ వెంటే సీఎం అభ్యర్థి పదవిని ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తాను తన ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించడానికి హస్తిన వెళ్లినట్లు చెబుతున్నా... ఇప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గేతోనూ, అంతకు ముందు డీకే శివకుమార్ తోనూ కూడా భేటీ అయ్యారు.  అలాగే సీఎం పదవిని ఆశిస్తున్న  మల్లుభట్టి విక్రమార్కకూడా హస్తిన చేరుకుని తన ప్రయత్నాలు తాను సాగిస్తున్నారు. అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్‌ హైకమాండ్ ఇప్పటికే టీపీసీసీ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఇప్పటికే ఖరారు చేసింది.  ఈ నేపథ్యంలోనే  మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. ఆరుసార్లు ఆయన ఎమ్యెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీపీసీసీ చీఫ్ గా కూడా పని చేశారు. అలాగే మల్లుభట్టి విక్రమార్క సిఎల్‌పి నేతగా ఉన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్‌ విజయాన్ని కాంక్షిస్తూ  పాదయాత్ర కూడా చేపట్టారు.  అయితే వారిరువురూ కూడా రేవంత్ రెడ్డిలా ప్రజాకర్షణ ఉన్న నేతలు కారన్న అభిప్రాయంతో కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. అన్నిటికీ మించి రేవంత్‌ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతనే కాంగ్రెస్‌కు తెలంగాణలో  విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగే స్థాయికి ఎదిగింది. అలాగే ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించడంలో రేవంత్ రెడ్డే ప్రధాన, కీలక పాత్ర పోషించారు. పార్టీ ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నిర్వహించారు. అదే విధంగా అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. టీపీసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమాకాన్ని సీనియర్‌ నాయకులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత అధిష్టానం సర్దుబాట్లు, బుజ్జగింపుల తర్వాత అందరూ ఐక్యంగా పనిచేశారు. అంతర్గత విమర్శలకు, పరస్పర విమర్శలకు స్వస్తి చెప్పి పార్టీ విజయానికి కృషి చేశారు. ఏది ఏమైనా తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టడంలో సీనియర్లంతా విఫలమైన తరువాతే రేవంత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ బాధ్యతలను రేవంత్ కు అప్పగించిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రేవంత్ దూకుడు ప్రదర్శించారు. కేసీఆర్ ను ఢీ కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను కూడగట్టడంలో విజయం సాధించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఒక్క సీటు కూడా ఆశించకుండా కాంగ్రెస్ తో కలిసి పని చేయడానికి రేవంత్ రెడ్డే కారణమనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి రేవంత్ రెడ్డికి తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రేవంత్ తెలంగాణ సీఎం అయితే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ అధిష్ఠానం గట్టిగా నమ్ముతోంది. సార్వత్రిక ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటే.. ఇప్పటి లాగే తెలుగుదేశం ఓటు కూడా కలిసి వస్తుందన్న భావనా వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే రేవంత్ ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసిందనీ, అధికారిక ప్రకటనను కూడా ఇంకెంత మాత్రం జాప్యం చేసే అవకాశాలు లేవనీ పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ హై కమాండ్ అధికారిక ప్రకటన విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తే.. జనం కాంగ్రెస్ కల్చరే ఇంత అనే భావనకు వచ్చే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తున్నది. అందుకే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న భట్టి, ఉత్తమ్ లను బుజ్జగించేందుకు మాత్రమే నిన్న అధికారికంగా రేవంత్ ఎంపికను ప్రకటించలేదని అంటున్నారు. 

పీకే లా కుట్రలు కాదు.. వాస్తవాల ఆవిష్కరణే సునీల్ కనుగోలు వ్యూహాలు!

ఎట్టకేలకు తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడిన అధికార బీఆర్ఎస్ పార్టీని హస్తం మట్టి కరిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్ అధికారాన్ని అనుభవించగా.. ఇప్పుడు తొలిసారి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ను గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం దక్కించుకోవడంలో కొన్ని బలమైన శక్తులు పనిచేశాయి. అందులో తొలిశక్తి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నామరూపాల్లేని పార్టీని ఒక సైన్యంగా మలచడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. అన్నిటికీ మించి ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెంచారు. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం దక్కించుకునే స్థాయికి ఎదిగింది. ఇది రేవంత్ తోనే సాధ్యమైంది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు.  అయితే, ఇదంతా నడిపించిన మరో శక్తి ఉంది. ఆ మాస్టర్ మైండ్ పేరే సునీల్ కనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర ఎంతో కీలకమని చెప్పాలి. అభ్యర్థుల ప్రకటన నుండి ఎగ్జిట్ పోల్స్ వరకూ ఏది ఎలా చేయాలో.. ఏ లెక్కన చేయాలో.. ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే. నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది. ఇక, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పేరు ఘనంగా వినిపించడం మొదలైంది. అసలు జీరో స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిలాంటి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు దొరకగా.. దానికి సునీల్ వ్యూహాలు తోడవడంతో నామినేషన్ల నుండి ప్రచారం వరకూ.. సభల నుండి స్పీచ్ ల వరకూ ప్రతిదీ కాంగ్రెస్ పార్టీలో కొత్తదనం కనిపించింది. దశాబ్దాలుగా మూసబారిన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు కొత్త పుంతలు తొక్కాయంటే అది సునీల్ తోనే సాధ్యమైంది. తెలుగు ప్రజలకు ఎన్నికల వ్యూహకర్త అనగానే ప్రశాంత్ కిషోర్ ఒక్కడే తెలుసు. ఎందుకంటే మోడీ ప్రధాని అయిన దగ్గర నుండి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యేవరకూ కీలకంగా పనిచేసిన పీకే అంటే అందరికీ నోటెడ్ అయిపొయింది. అందునా ఏపీలో వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్ తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్ తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభం మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. అయితే, సునీల్ అందుకు విరుద్ధం. ఇంకా చెప్పాలంటే సునీల్ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపుకోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి కూడా వెళ్ళలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకొనే ఛాన్స్ ఉన్నా ఆ ఊసేలేదు. ఏపీలో పీకే లాగా కోడికత్తుల్ని దించలేదు.. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే.. నిజాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా ప్రజల ముందుంచాడు. చాపకింద నీరులా పనిచేసుకుపోయే తత్వం ఉన్న సునీల్ కనుగోలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని సరికొత్త పంథాలో తీసుకెళ్లారు. అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ తో ప్రచారం చేయించారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని, బీఆర్ఎస్ చేసిన ప్రతి తప్పును స్పష్టంగా అర్ధమయ్యేలా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి పంపించారు. ఎన్నికల ప్రచార చిత్రాలను వైవిధ్యంగా తెరకెక్కించి ఓటర్లను ఆకర్శించారు. ప్రజలను ఎలా ఓటర్లుగా మార్చుకోవాలో ప్రతి అభ్యర్థికి స్పష్టంగా నేర్పించారు. అంతే, ప్రజల ఉన్న అసంతృప్తి పదింతలైంది.. కాంగ్రెస్ అభ్యర్థులలో నమ్మకం వంద శాతం పెరిగింది. ఫలితంగా కాంగ్రెస్ విజయ తీరాలకు చేరింది. దీంతో ఇప్పుడు ఎక్కడ విన్నా సునీల్ కనుగోలు పేరే వినిపిస్తుంది.

బీఆర్ఎస్ కు ఎంపీ నామా రాజీనామా?.. రేవంత్ తో టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

ఒక్క ఓటమి.. తెలంగాణ ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒకే ఒక్క ఓటమితో కకావికలైపోతోందా? ఆ పార్టీ అధినేతే జనాలకు ముఖం చూపకుండా ఓటమి తరువాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తప్పదన్నట్లుగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి మాట్టాడినా, బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించినా.. అధ్యక్షుడు మీడియాకు ముఖం చాటేయడం మాత్రం ఓటమిని జీర్ణించుకోలేని తత్వాన్నే ఎత్తి చూపుతోంది. ఇక ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి? అంటే పరిశీలకులు మాత్రం నేతల వలసలేనని అంటున్నాయి.  నియోజకవర్గ అభివృద్ధి అంటూ ఒక్కరొక్కురుగా కారు దిగిపోవడం ఖాయమనే చెబుతున్నారు. కారు దిగిన వెంటనే ‘చేయి’ అందుకుంటారనీ, అందుకు వారు చెప్పే జవాబు నియోజకవర్గ అభివృద్ధి అని అంటున్నారు. గతంలో ఇదే మాట చెప్పి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇప్పుడు అదే మంత్రం జపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకోవడం ఖాయమని అంటున్నారు.   ఇప్పటికే దాదాపు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  అలా కాంగ్రెస్ కు టచ్ లోకి వచ్చిన వారిలో అత్యధికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని చెబుతున్నారు. అలాగే  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటికే రేవంత్ ను కలిసేశారు. ఇక ఆ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కారు దిగి చేయందుకోవడానికి రెడీ అయిపోయారని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. అదలా ఉంచితే.. ఇప్పటికే  కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చిన 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో  వ్యాపారాలు, కాలేజీలు, భూముల వివాదాలు,  కేసులు, ప్రభుత్వ కాంట్రాక్టులతో  సంబంధాలున్న వారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.   ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం, ఆయన కేబినెట్ కొలువుదీనిక తరువాత వీరి చేరికలు ప్రారంభమయ్యే అవకాశలున్నట్లు చెబుతున్నారు.  ఇక కాంగ్రెస్ కూడా వీరి చేరికలకు సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగంటే నాలుగే స్థానాలు అధికంగా ఉండటం, స్వతహాగా కాంగ్రెస్ లో ఉన్న గ్రూపుల సంస్కృతి, పార్టీలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు అనివార్యంగా మౌనంగా ఉండటం వంటి కారణాలతో భవిష్యత్ లో ఏమైనా సమస్యలు తలెత్తినా ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే చేరికలపై దృష్టి సారించక తప్పని పరిస్థితి ఉందని కాంగ్రెస్ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు.    అంతే కాదు.. ఇలా బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరినా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చే అవకాశం లేని పరిస్థితి. ఎందుకంటే అధికారంలో ఉన్న రెండు దఫాలూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహించడమే కాకుండా అటువంటి వారికి మంత్రిపదవులు ఇచ్చి మరీ గౌరవించారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా అధికార కాంగ్రెస్ గూటికి చేరినా ఆయనకు మాట్లాడడానికి కానీ, విమర్శించడానికి కానీ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి చేరేందుకు క్యూకడుతున్నారని అంటున్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ విజయం తెలుగుదేశం పుణ్యమేనా!

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ కు పట్టం కట్టారు. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీని హస్తం పార్టీకి అందించారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టేందుకు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి.. అన్ని తానై పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యర్థి పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా వచ్చిన విమర్శలను తట్టుకుని నిలబడి కాంగ్రెస్ ను విజయతీరానికి చేర్చారు. ఒకవైపు పార్టీని నడిపించే నాయకుడిగా ఉంటూనే మరోవైపు స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా చుట్టేశారు. ఇక ప్రభుత్వంపై పోరాటం చేసే ప్రతిపక్ష పార్టీ నేతగా నూటికి వెయ్యి శాతం న్యాయం చేశారు. ఒక్కమాటగా చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై  నిలిచి గెలిపించారు. కాంగ్రెస్ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి కావడం వల్ల ఆ పార్టీకి ఎన్నో అంశాలు కలిసి వచ్చాయి. పార్టీ సీనియర్ నేతలలో ఎవరైనా ఈ స్థాయిలో పని చేయడం కష్టమేనని సొంత పార్టీ నేతలే చెప్తారు. అలాగే సీనియర్ నేతలలో ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉంటే మిగతా వాళ్ళు గళం విప్పి సొంత పార్టీలోనే కుమ్ములాటలు జరిగేది. కానీ, రేవంత్  అందరినీ కలుపుకున్నారు.. రేవంత్  వల్లే అందరూ కలిసి వచ్చారు. రేవంత్ వల్లే    సెటిలర్లు కాంగ్రెస్  వైపు మొగ్గు చూపారు.  తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో ఆంధ్రా సెటిలర్లున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలో ఉద్యోగులు, వ్యాపారాలు ఉంటే.. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలలో వ్యవసాయం, ఉపాధితో పాటు వ్యాపార వర్గాలున్నాయి. వీరిలో ఎక్కువ శాతం తెలుగుదేశం సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులే  అనడంలో సందేహం లేదు.  అదే సమయంలో అదే కారణంతో వీరంతా రేవంత్ రెడ్డినీ అభిమానిస్తారు. అందుకే ఈ సెటిలర్లంతా గంపగుత్తాగా కాంగ్రెస్ కి జై కొట్టారు. స్థానికంగా అభ్యర్థి ఎవరన్నది చూడకుండా  రేవంత్ రెడ్డిని చూసే తెలుగుదేశం జెండాను చేతబట్టి అండగా నిలిచారు. రేవంత్ రెడ్డిని చూసే హస్తంకు చేయూత అందించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. దీనికి కారణం చాలా స్థానాలలో ఓటింగ్ శాతం 50కి మించలేదు. గురువారం ఎన్నికలు జరగడం.. శని, ఆదివారాలు వీకెండ్ సెలవులు కాగా.. ఒక్క శుక్రవారం సెలవు పెడితే నాలుగు రోజులు వీకెండ్ కలిసి వస్తుంది. ఇదే ఇక్కడ కొంపముంచింది. సీమాంధ్ర సెటిలర్లు, స్థానికులు ఓట్లేసినా.. మిగతా రాష్ట్రాల సెటిలర్లతో పాటు మరికొన్ని వర్గాలు ఓటింగ్ కి దూరంగా ఉండిపోయాయి. పైగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా టీడీపీ వర్గాలతో మంచి సంబంధాలు ఉండడంతో స్వల్ప అధీక్యంతోనే అయినా ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది. అదే నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో  ఓటింగ్ శాతం భారీగా నమోదవడంతో పాటు తెలుగుదేశం వర్గాలు మద్దతివ్వడంతో కాంగ్రెస్ కు ఇక్కడ బంపర్ మెజార్టీతో అత్యధిక సీట్లు దక్కాయి. ఏపీతో సరిహద్దు పంచుకోవడంతో ఈ జిల్లాలలో సామాజికవర్గాల సమీకరణాలు, తెలుగుదేశం మద్దతు కాంగ్రెస్ కు సంపూర్ణ విజయాన్ని అందించింది. నిజానికి తెలుగుదేశం తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి ఉంటే తెలంగాణ ఫలితాలు కచ్చితంగా తారుమారయ్యేవని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పోటీ చేస్తే పోటీ చేస్తే బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ఉపయోగపడడంతో పాటు.. టీడీపీ అభిమానులు కాంగ్రెస్ కు దూరంగా ఉండాల్సి వచ్చేది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గి బీఆర్ఎస్ కు పెరిగేవి. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానాలు దక్కకపోవడం లేదా   హాంగ్   పరిస్థితి ఉండేది.  ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ చక్రం తిప్పేసే అవకాశాలు ఉండేవి. కాంగ్రెస్ కు ఈ స్థాయి విజయం దక్కిందంటే.. తెలుగుదేశం శ్రేణుల మద్దతుతో పాటు చంద్రబాబుతో రేవంత్ అనుబంధం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ లెక్కలన్నీ గ్రహించే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి దూరంగా ఉంచారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీపై మిచాంగ్ తుపాను పడగ

ఏపీపై మిచాంగ్ తుపాను పడగ విప్పింది. దివిసీమ వణికిపోతోంది. నెల్లూరు మునిగిపోతోంది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలలో రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది.  ప్రస్తుతం నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను  కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు  110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని, తుపాను కొంతభాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉందనీ వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం వెంబడి నెమ్మదిగా కదులుతుండటంతో తీరప్రాంతాలకు ఉప్పెన ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   మిచాంగ్  ప్రభావంతో   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.   ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది.  1977 దివిసీమ ఉప్పెన నాటి రోజులు గుర్తుకువస్తున్నాయంటూ దివిసీమ వాసులు వణికి పోతున్నారు.  ఇక తిరుమలలో పాపవినాశనం, గోగర్భం జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో   గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు నేలవాలాయి.   రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా  ఉండటంతో  కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది.  

ఏపీలో తెలుగుదేశం జాతకం చెప్పెసిన జూనియర్ ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. పైగా జూనియర్ కి పాలిటిక్స్ పై మంచి నాలెడ్జ్ ఉందని, ప్రస్తుత రాజకీయాలను ఆయనెంతో శ్రద్ధగా గమనిస్తుంటాడని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అంతే కాదు గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.  తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారట. ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చాలా రోజుల కిందటే జూనియర్ అన్నారట. ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగురవేయడంతో తారక్ సన్నిహితులు షాక్ అయ్యారట. అంతే కాదు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ఈసారి ఏపీలో టీడీపీదే అధికారమని ఇప్పటికే తన వాళ్ళతో ఎన్టీఆర్ ఎంతో నమ్మకంగా చెప్పారట. దీంతో తమిళనాడు, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా జూనియర్ చెప్పిన ఫలితమే వస్తుందని సన్నిహితులు భావిస్తున్నారట. కాగా తారక్ అంచనా వేసినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంతో, ఆ ఆనందంలో ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని వారి స్నేహితులతో పంచుకోగా, ఇది సోషల్ మీడియా ద్వారా బయటకు లీకైంది. జూనియర్ కొంతకాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నాడు. తెలుగుదేశం శ్రేణులు సైతం కొన్ని విషయాల్లో తారక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానం కూడా వ్యక్తమౌతోంది.   జూనియర్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఏపీ విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి తెలుగుదేశమే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా గమనించే ఎన్టీఆర్ వంటి వ్యక్తి ఈమాత్రం అంచనా వేయడం పెద్ద విషయమేమీ కాదు.

తెలంగాణ సీఎం రేవంత్.. తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్

తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తరువాత కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. ముందుగా ఈ రోజు సాయంత్రమే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించినా, హైకమాండ్ నిర్ణయం వెలువడటంతో జాప్యం జరగడంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురువారం (డిసెంబర్ 7)కు వాయిదా పడింది. ఆ రోజు రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎల్ పీ నేతగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఖరారు చేయడంతో ఇక ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారన్నది ఆ తేదీ లోగా నిర్ణయిస్తారుప. మంగళ, బుధవారాలు (డిసెంబర్ 5, 6) మంచి రోజులు కాకపోవడంతో రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం (డిసెంబర్ 7) న జరుగుతుంది. అదే రోజున రేవంత్ కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.     

సీఎం ఎవరు?.. ప్రమాణ స్వీకారం ఇప్పుడు లేనట్టేనా?

ఎన్నికల ముందు కలిసికట్టుగా కనిపించిన కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతి నివురుగప్పిన నిప్పేనని మరో సారి ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ లో ఐక్యత నీటిమీద రాతేనని అర్ధమైపోయింది. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఆ పార్టీలో సాగుతున్న మల్లగుల్లాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సీఎల్పీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. సీఎంను నిర్ణయించే అంటే ఎంపిక చేసే బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేశారు.  ఆ తరువాత ఎన్నికైన అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించారు. ఆ రెంటినీ హై కమాండ్ కు పంపారు. అక్కడ నుంచీ హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ లో హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురుచూపులు ప్రారంభమయ్యాయి. గంటలు గడిచినా ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడలేదు. ఈ లోగా ఏం జరిగిందో ఏమో ఎల్లా హోటల్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, సుధీర్ బాబు, కోమటిరెడ్డి వెళ్లి పోయారు. అంతలోనే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయ్యింది. ఆ భేటీ తరువాత సీఎం ఎవరన్నది తేలుతుందని భావిస్తున్నారు. అంతకు ముందు తెలంగాణ  సీఎల్పీ భేటీ తరువాత సీఎల్పీ నేతగా, అంటే సీఎంగా రేవంత్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, రేవంత్ సీఎంగా   సోమవారం (డిసెంబర్ 4) సాయంత్రం 8.15 గంటలకు ప్రమాణం స్వీకారం చేస్తారనీ, భట్టి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి.   తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా  పదేళ్లు ప్రతిపక్షానికే  పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్ర అవతరణ తరువాత తొలి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ విజయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ అత్యంత కీలక పాత్ర వహించినప్పటికీ.. ముఖ్యమంత్రి రేసులో  ఆయనతో  పాటు  మల్లు భట్టి విక్రమార్క కూడా నిలిచారు. ఆయన కూడా తన స్థాయిలో రాష్ట్రంలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేయడమే కాకుండా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు కూడా ఉన్నప్పటికీ  రేసులో మాత్రం రేవంత్, భట్టిలు మాత్రమే మిగిలారు. చివరికి ఇరువురిలో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపిందని వార్తలు వినిపించాయి.  సీఎల్పీ సమావేశానికి ముందు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు కాకుండా తాను ఒక్కడిని మాత్రమే డిప్యూటీ సీఎం గా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. అయితే వాటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ.. సీఎం ఎవరన్న ప్రకటన ఎంతకూ వెలువడకపోవడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎల్లా హోటల్ నుంచి ముగ్గురు నేతలు వెళ్లిపోవడం, ఆ తరువాత మరి కొద్ది సేపటికే హైకమాండ్ పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్ కూడా ఎల్లా హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. హైకమాండ్ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లనున్నారని అంటున్నారు. దీంతో ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందా? లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మరో వైపు కాంగ్రెస్ తొలి నుంచీ చెబుతున్నట్లు కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుందనీ, అందుకే హై కమాండ్ నిర్ణయం వెలువడలేదనీ కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రేవంత్ కూడా ఎన్నికల ప్రచారంలో పదే పదే డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం  కొలువుదీరుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉండే అవకాశాలు లేవనే అభిప్రాయమే పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.

నాడు జర్నలిస్టు.. నేడు సీఎం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అయినా దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు దశాబ్దం తరువాత అధికారంలోకి వచ్చింది.  సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, విశ్లేషకులు పేర్కొన్నట్లే, తొలి నుండి అనుకున్నట్లే హాంగ్ కు ఆస్కారమే లేకుండా కాంగ్రెస్ 64 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం అవుతామని ఆశపడిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక బీఆర్ఎస్‌లో దాదాపు ఆరుగురు మంత్రులతో పాటు మహామహులు కూడా ఓటమి పాలయ్యారు.   తెలంగాణ మూలాల నుండి పుట్టుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఓడించడం అంటే సామాన్య విషయం కాదు.  రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన ట్లుగా కనిపించిన కాంగ్రెస్  బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి తీసుకురావడంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాంగ్రెస్ పార్టీ కురువృద్దులే ఈ విషయాన్నీ తేల్చి చెప్పేశారు.   కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం.. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎవరు అనేదానిపై కాంగ్రెస్ లో కసరత్తు జరుగుతుంది. టీపీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం వెనుక రేవంత్ రెడ్డి పాత్ర కీలకం కాబట్టే రేవంత్ రెడ్డే సీఎం అని కాంగ్రెస్ శ్రేణులూ, పార్టీ తరఫున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయానికి వదిలేసినా, సమావేశంలో రేవంత్ రెడ్డే సీఎల్పీ నేత అన్న విషయాన్ని దాదాపుగా ఖరారు చేసినట్లే చెబుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రేవంత్ వ్యక్తిగత జీవితం నుండి రాజకీయ అరంగేట్రం, ఆయన ఫైర్ బ్రాండ్ గా మారిన తీరు, తెలుగుదేశం పార్టీలో ఆయన పోషించిన పాత్ర, ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రేవంత్ ను ప్రోత్సహించిన తీరు, కాంగ్రెస్ లో చేరిన నాటి నుండి నేడు అధికారం దక్కించుకునే స్థాయికి పార్టీని చేర్చిన వైనం ఇలా ఎన్నోరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు సీఎం కాబోతున్న రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్ట్‌గా  పనిచేశారు. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ‘జాగృతి’అనే వార పత్రికలో రేవంత్ జర్నలిస్టుగా పని చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాకే ఆ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. రేవంత్ తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాతే ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. స్వతహాగా దూకుడు స్వభావం కలిగిన రేవంత్ మాటల తూటాలు సూటిగా కేసీఆర్ గడీలను తాకాయి.   అదే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అందుకే రేవంత్ పార్టీలోకి వచ్చాడనగానే కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది.  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక  రేవంత్ జోరు ఇంకాస్త పెరిగింది. అయితే  తనను ఆక్షేపించేలా సీనియర్లంతా ముప్పేట దాడి చేస్తున్నా  రేవంత్ ఏమాత్రం తగ్గలేదు. ముందుగా యూత్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసి చైతన్యవంతం చేసి ముందుండి నడిపించారు. నిరుద్యోగుల్లో ఆశలను రగిలించారు. అలకబూనిన నేతల ఇళ్లకి తానే స్వయంగా  వెళ్లి మాట్లాడి తన పట్ల వ్యతిరేకత లేకుండా చేసుకున్నారు. గాడినపడుతున్న పార్టీని చూసి మెల్లగా ఒక్కొక్క  సీనియర్లు కలిసి వచ్చారు. ఎన్నికలకు ముందే మొత్తం రాష్ట్ర పార్టీని రేవంత్ తన చేతుల్లోకి తీసుకున్న రేవంత్ ఎక్కడా, ఎన్నడూ హద్దు మీరతేదు. సీనియర్లను నొప్పించలేదు. సరికదా వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయి క్రమశిక్షణ కనిపించడం  ఇదే తొలిసారని ఆ పార్టీ సీనియర్లే అంగీకరించారు.  గతంలో మహానేతని చెప్పుకున్న వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే వ్యతిరేకించిన వారుండగా.. ఈసారి ఎన్నికల సమయం వచ్చేసరికి ఏ కాంగ్రెస్ నేతా ఎక్కడా ధిక్కార స్వరం వినిపించలేదంటే.. పార్టీ రాష్ట్రనాయుడిగా రేవంత్ ఏ స్థాయి క్రమశిక్షణను తీసుకువచ్చారో ఇట్టే చేప్పేయవచ్చు.   రెండు చోట్ల పోటీచేసిన రెండు నియోజకవర్గాల బాధ్యతను తన సోదరులకు అప్పగించి.. రేవంత్ మాత్రం రాష్ట్రాన్ని చుట్టేసి తన అధ్యక్ష పదవికి పూర్తి స్థాయి న్యాయం చేశారు. ప్రచార భారాన్ని ఒంటి చేత్తో మేశారు. రాష్ట్ర పార్టీలో  అతిరథ మహారథులుగా గుర్తింపు పొందిన సీనియర్ నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం చేస్తే, చేసుకుంటే.. టీపీసీసీ చీఫ్ గా, నిజమైన నేతగా రాష్ట్ర ప్రచార సారథ్యాన్ని ఆయన చేపట్టి పూర్తి న్యాయం చేశారు.  మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే దానికి రేవంతే కారణమనడంలో సందేహం లేదు. అందుకే ఫలితాల తర్వాత కూడా ఏ ఒక్కరూ కూడా రేవంత్ సీఎం అంటే అభ్యంతరం చెప్పడం లేదు.  వీహెచ్ వంటి నేతలు ఒక వైపు ఫలితాలు వెలువడుతుండగానే తెలంగాణ కాబో యే సీఎం రేవంత్ రెడ్డే అని ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ అధికారంలోకి తీసుకురావడం గురించి చెప్పాలంటే ఓ మనుభావుడి కవితను గుర్తు చేసుకోవాలి. చుట్టూ కారు చీకట్లు.. చేతిలో దీపం లేదు.. వెళ్లాల్సిందేమో దూరం.. దారంతా గోతులు.. కానీ, మనసు నిండా ధైర్యం. ఆయన ధైర్యమే ఓ మహాద్భుత కవచంగా పని చేసింది. ఆయన లక్ష్యమే ఓ కాంతిపుంజమై మిరుమిట్లు గొలిపేలా ‘కారు ’మబ్బులను  పంటాపంచలు చేసింది.  ఫలితం.. తెలంగాణ గడ్డ మీద సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. మహోజ్వల చరిత్ర సృష్టించి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేశారు రేవంత్.  ఒక్కడిగా మొదలైన రేవంత్ ప్రయాణం మహా శక్తిగా మారి దొరల గడీలను బద్దలు కొట్టింది. ఫలితంగా ఇప్పుడు ఆ ఒక్కడే జనంతో జయహో అనిపించుకున్నాడు. శత్రువు ఎంతటి బలవంతుడైనా మనో ధైర్యమనే ఆయుధంతో కదనరంగంలో దిగి విజేతగా నిలిచారు రేవంత్ రెడ్డి. 

హైకమాండ్ కే సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయం

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎవరన్నది తేలలేదు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ హైకమాండ్ కే వదిలేస్తే సీఎల్పీ సమావేశం ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా, తుమ్మల బలపరిచారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు.  సమావేశం ముగిసిన తరువాత కర్నాక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ పంపిన పరిశీలకులందరూ కూడా పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం వివరాలు డీకే శివకుమార్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ణతలు తెలియజేస్తా ఒక తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. ఆ తరువాత సీఎల్పీ నేత ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలూ తీసుకున్న అనంతరంఆ ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్లు డీకే మీడియాకు తెలిపారు. సమావేశ తీర్మానాన్ని హై కమాండ్ కు పంపామనీ, అక్కడ నుంచి వర్తమానం రాగానే ముఖ్యమంత్రి ఎవరన్నది ప్రకటిస్తామనీ వివరించారు. కాగా మీడియా సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు చేరుకుని ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను తెలియజేశారు. ఈ సాయంత్రం 6 గంటలలోగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో దాదాపు 300 మంది సమక్షంలో ఈ ప్రమీణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.   

ఎపికి  పొంచి ఉన్న మిచౌంగ్ తుపాను ముప్పు

మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో వాతావరణం  ఒక్కసారిగా మారిపోయింది. కాకినాడలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను నిలిపివేయాలని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. వరి కోతలు మానుకోవాలని రైతులకూ సూచించారు. మరోవైపు, ఆఫ్‌లైన్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన 16 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఉప్పాడ జడ్పీ హైస్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటూ హోప్‌ ఐలాండ్ మత్స్యకారులను తరలించారు.  కాగా, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నారు.   ఇదిలావుంచితే, నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షనూ వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లాలో నేడు, రేపు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తెలంగాణలో... తమిళనాడును వణికిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రెండు రోజులకు సంబంధించి పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని  వెల్లడించింది. మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమలో... ఇదిలా వుండగా మిచౌన్ తుపాను ప్రభావం రాయలసీమలో కూడా ఉంది. తిరుపతి వెళ్లే వారిని ఎపి ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  ఇక్కడి నదులు, కాలువలు భారీ వర్షాల కారణంగా  పొంగిపొర్లనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరుపతి జిల్లా వరదయ్య పాళ్యం మండలంలోని గోవర్ధనపురం వద్ద ఉన్న పాముల కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం  నీటి ప్రవాహం పెరగడంతో శ్రీకాళహస్తి -చెన్నె మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచించారు. సురక్షిత ప్రాంతాలకు  తరలి వెళ్లాలని అధికారులు  సూచించారు.భారీ వర్షాలకు పాముల కాలువ పొంగిపొర్లుతోంది. దాంతో శ్రీకాళహస్తి చెన్నై మధ్య నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 15 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.దీంతో పలు మార్గాల్లో వాహనాలను అధికారులు దారి మళ్లించారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద నిలిపేశారు. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచిస్తున్నారు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. కేసీఆర్ కు ఆపరేషన్ వికర్ష్!

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా తయారైంది కేసీఆర్ పరిస్థితి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా తన పార్టీలో చేర్చుకుని విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆయన అప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం, ఇప్పుడు రివర్స్ లో ఆయనకు ఆపరేషన్ వికర్ష్ గా మారి ఆయన పార్టీ నిర్వీర్యం అయ్యేలా చేస్తున్నది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ   ఎన్నికల్లో ఊహించని ఓటమి పాలైన బీఆర్ఎస్‌ను వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ చర్చేమీ ఊహాగాన సభ కాదనడానికి తార్కానంగా    ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రేవంత్ కు కలిశారు. ఔను భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్‌లో ఉన్నారని, ఫలితాలు వచ్చాక కాంగ్రెస్‌లో చేరతామని చెబుతున్నారనీ పేర్కొన్న సంగతి  తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు  భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ మాత్రమే కాదు మరో నలుగురైదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా   కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. 

పవన్ తొందరపాటు నిర్ణయం.. జనసేనకు తీవ్ర నష్టం!

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో  తెలిసినోడే గొప్పోడు అంటూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దరేది సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అయితే జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ మాత్రం.. ఆ డైలాగ్ సారాన్ని వంటపట్టించుకోలేదని అనిపిస్తుంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేనను పోటీకి దింపి ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.  ఒక్కోసారి ఎన్నికల్లో పోటీ కూడా పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు బరిలో నిలవాలి? ఎప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి? అనేది రాజకీయ పార్టీలకు, ఆ పార్టీల అధినేతలకు తెలిసుండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. తాజాగా జనసేన పార్టీకి అలాంటి అనుభవమే ఎదురైంది. రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకొని మరీ గెలుపోటములను నిర్ణయించేలా ప్రభావం చూపి శభాష్ అనిపించుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన మాత్రం, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. పొత్తులో భాగంగా 119 సీట్లకు గాను ఎనిమిది సీట్లు మాత్రమే కేటాయించింది బీజేపీ. ఆ ఎనిమిదిలో కూడా బీజేపీ నుంచి వచ్చిన వారు, కొత్తగా పార్టీలో చేరినవారు ఉన్నారు. ఇక ఫలితాలు వచ్చాక తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పెద్ద తప్పిదం చేశారని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 8 స్థానాల్లో ఒక్క కూకట్ పల్లిలో మినహా మిగిలిన ఏడు చోట్లా జనసేన నోటాతో పోటీ పడింది.  డిపాజిట్లు కోల్పోయింది. అది అక్కడితో ఆగిపోదు.. తెలంగాణ ఫలితాలు ఏపీలో  కూడా జనసేనకి తీవ్ర నష్టం కలిగించే అవకాశముంది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం ఒక్క సీటే గెలిచింది జనసేన. తర్వాత ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ గూటికి చేరాడు. దాంతో వైసీపీ నేతలు జనసేనని సింగిల్ సీట్ అని, పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడని పదే పదే ఎద్దేవా చేస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు తెలంగాణ ఫలితాలను పట్టుకొని మరింత హేళన చేస్తారనడంలో సందేహం లేదు. మరోవైపు త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  తెలుగుదేశంతో  కలిసి ఆ ఎన్నికలకు వెళ్తున్న జనసేన.. తెలంగాణ ఫలితం కారణంగా సీట్ల విషయంలో పట్టుబట్టలేదు. టీడీపీ చెప్పిన సంఖ్యకు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలనే పవన్ కళ్యాణ్ నిర్ణయం జనసేనకు నష్టం కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇద్దరు సీఎంలను ఓడించిన వైఎస్ అభిమాని!

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన   కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో  అందరి నోటా ఆయన పేరే వినిపిస్తోంది. ఒకే సారి ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించిన వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వ్యక్తే. గతంలో ఆయన జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. చదువు ఇంటర్మీడియేట్.  బీఆర్ఎస్ ను వీడి బీజేపీ గూటికి చేరి కామారెడ్డి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన వెంకటరమణారెడ్డి ఆ సందర్భంగా ఒక టీవీ చానల్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో తాను  కేసీఆర్‌ను ఎదుర్కోవడం లేదని, కేసీఆరే  తనను ఎదుర్కుంటున్నారని చెప్పారు.  వెంకటరమణారెడ్డి స్థానికుడు. కామారెడ్డిలోనే పుట్టారు. అక్కడే పెరిగారు. అ విషయాన్నే ఆయన తన ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే మరణిస్తాను అని చెబుతూ రంగంలో ఉన్న ఇద్దరు జెయింట్స్ స్థానికేతరులన్న విషయం జనం మనస్సుల్లో బలంగా హత్తుకునేలా చేశారు.  స్థానికుడనే కాకుండా.. ప్రజా సేవలో కూడా ముందుండటం వల్లే ఆయన ఇద్దరు దిగ్గజ నేతలను ఓడించి విజయం సాధించగలిగారు.   ఔను వెంకటరమణారెడ్డి తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా పాఠశాల భవనాలకు భూములు ఇచ్చారు.అంతే కాకుండా  కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఏమి కావాలో గుర్తించి, తాను వాటిని తీరుస్తానని తన ప్రచారంలో హామీ ఇచ్చారు. అందుకే ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని కూడా కాదని జనం ఆయనకు ఓటెత్తారు.