బాబు కోసం బీజేపీ తీర్మానం

స్కిల్ కేసులో  తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సక్రమమేనంటూ  ఏపీలో అధికార జగన్ పార్టీ బల్ల గుద్దీ మరీ చెబుతుంటే.. ఆయన అరెస్ట్ అక్రమమంటూ తెలుగుదేశం ఆధారాలతో సహా గట్టిగా చెబుతోంది. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఆయన హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసే దాకా.. అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చంద్రబాబు అరెస్ట్‌ అంశంపై తారస్థాయిలో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా, ఆయనకు సంఘీభావంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. కోర్టులలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఇక చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు వెంటనే ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని జగన్ సర్కార్ ను నిలదీశారు.  అయితే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మాత్రం చంద్రబాబు అరెస్ట్‌పై పార్టీ పరంగా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.  అలాంటి వేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దాదాపు 70 రోజుల తర్వాత.. ఇప్పుడు బీజేపీ తాపీగా స్పందించింది.  చంద్రబాబు జగన్ సర్కార్  అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కిమ్మనని బీజేపీ,  రాజమహేంద్రవరం జైల్లో ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాట్లాడని బీజేపీ, హస్తిన వేదికగా చంద్రబాబు బెయిల్‌ కోసం ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయవాదులతో వరుస చర్చలు జరుపుతున్నప్పుడు మౌనంగా ఉన్నా బీజేపీ..  ఇప్పడు ఇంత హాఠాత్తుగా అది కూడా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు  రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన మరునాడే.. స్పందించడంపై రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తం కావడమే కాకుండా, విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ  బీజేపీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.   అయితే చంద్రబాబు అరెస్ట్‌పై కమలం పార్టీ తీర్మానం చేయడం వెనుక కేంద్రంలోని పార్టీ పెద్దల  హస్తం ఉందన్న ప్రచారం అయితో జోరుగా సాగుతోంది. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న  ఎన్నికల్లో  తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని పోటీలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు విషయాన్ని  రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ సమక్షంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా  ప్రకటించారు.   అప్పటి నుంచీ ఇరు పార్టీలూ కూడా రాష్ట్రంలో సమన్వయంతో పని చేస్తున్నాయి. అదలా ఉండగా ఏపీలో తాము జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామంటూ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. ఇదే అంశాన్ని ఆ పార్టీ కీలక నేత సునీల్ దియోధర్  మొదటి  నుంచీ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు అరెస్టును ఖండిస్తూ బీజేపీ తీర్మానం చేయడమంటే.. ఏపీ ఎన్నికలలో  ఆ పార్టీలతో జతకట్టేందుకే  బీజేపీ ఈ తీర్మానం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అన్నిటి కంటే ముఖ్యంగా తెలంగాణలో అధికారమే తరువాయి అన్న స్థాయి నుంచి బీజేపీ కిందకు దిగజారింది. దీంతో తెలంగాణలో అధికార రేసులో బీజేపీ వెనుకబడి  అక్కడ పోటీ  అధికార బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ముఖాముఖీ పోరుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో  కనీసం ఒక శాతం ఓటు స్టేకు కూడా లేని బీజేపీ  ఒంటరి పోరుకు సిద్ధపడే పరిస్థితి లేదనీ పరిశీలకులు అంటున్నారు.  ఇక గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేస్తూ బీజేపీ కొద్దో గొప్పో  ప్రజాక్షేత్రంలో కనిపించేది.  అయితే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  సోము వీర్రాజు నియమితులైన తరువాత రాష్ట్రంలో పార్టీ దాదాపు స్తబ్దుగా మారిపోయింది.  జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో  సోము వీర్రాజు ఒక్క మాట మాట్లాడింది లేదు...  అలాంటి వేళ ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ అధిష్ఠనం పగ్గాలు అప్పగించింది. ఆమె  జగన్ పార్టీ  అరాచకాలపై, ప్రభుత్వ అవకతకకలపై   క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు.  ఆ క్రమంలో ఆమెనే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగులు పెడుతున్నారు. అయితే వాటికి  ఏ మాత్రం వెరవక పురందేశ్వరి తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. అలాగే తెలుగుదేశంలో ఏదో ఒక మేరకు పుంజుకోవాలంటే కూడా చంద్రబాబు అరెస్టును ఖండించకతప్పదని బీజేపీ అగ్రనాయకత్వం భావించింది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ బీజేపీ తీర్మానం అటు తెలంగాణలోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పరిచే అవకాశం ఉందని తలపోసింది. అంతే కాకుండా ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తుకు కూడా సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందన్న యోచనతోనే ఒంగోలులో సమావేశం ఏర్పాటు చేసి.. బాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేశారనే ఓ చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.  ఇక ఏపీలో తెలుగుదేశం, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల  2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మరింత మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావనతోనే బీజేపీ ఈ మేరకు తీర్మానం చేసిందని అంటున్నారు.

జగన్ సర్కార్ పారదర్శకత.. డొంకతిరుగుడు జీవోలు.. పచ్చి అబద్దాలు!

జగన్ పాలనలో పారదర్శకత అన్నది దేవతావస్త్రంలా తయారైంది. జగన్ చెప్పే మాటల్లో తప్ప పాలనలో ఎక్కడా పారదర్శకత ఉండదు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉత్తుత్తి ఆదేశాలు ఇస్తారు. ఆ సంగతి తెలుసుకనుక అధికారులు వాటిని అమలు చేయరు. ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది. కానీ అవి ఎవరికీ, ఎక్కడా కనిపించవు.  కోర్టులకు మాత్రం తమ ప్రభుత్వం అత్యంత పాదర్శనకంగా పాలన సాగిస్తోందని చెబుతుంది. కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి  విరుద్ధంగా ప్రభుత్వ పాలన ఉంటుంది. సింపుల్ గా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన ఇదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ జగన్ సర్కార్ ఎన్నో రహస్య జీవోలను ఇచ్చింది. ప్రతి జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాలని అన్ని శాఖాలను ప్రభుత్వం ఆదేశిస్తుంది. నాలుగున్నరేళ్లలో నాలుగుసార్లు ఇలాంటి ఆదేశాలిచ్చారు. కానీ  జీవోలు పబ్లిక్ డొమైన్ లోఉండవు. అలాగే ప్రభుత్వ భవనాలకు రంగుల నుండి ఇంగ్లీష్ మీడియం విద్య వరకూ న్యాయస్థానాలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి   మొట్టి కాయలు వేసింది. కానీ కోర్టులు ఏవి వద్దన్నాయో వాటినే జగన్ సర్కార్ చేసింది.   చివరికి రాజధాని అంశంలో కూడా అంతే. అసలు మూడు రాజధానులు వ్యవహారాన్నిజగన్ ప్రభుత్వం మొదటి నుండి ఒక రహస్య అజెండాగానే కొనసాగిస్తోంది.  సీఎం జగన్ లక్ష్యం, విధానం మూడు రాజధానులు. కానీ మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ అప్పట్లో ఇచ్చిన జీవోలలో ఎక్కడా మూడు రాజధానులు అనే ప్రస్తావనే లేదు. పరిపాలన వికేంద్రీకరణ అనే పేరుతో జీవో ఇచ్చారు. అంటే మూడు రాజధానులు అన్నది టెక్నీకల్ గా కుదరని పని అన్న సంగతి   ప్రభుత్వానికి మొదటి నుంచీ తెలుసు. కానీ, అసలు విషయం ఏమిటో ప్రజలకు చెప్పకుండా మూడు రాజధానుల పేరుతో మోసం చేసింది. అది కోర్టులకు చేరడం, కోర్టులలో అసలు విషయం బయట పడడంతో జగన్ సర్కార్ చివరికి ఆ జీవోలను వెనక్కు తీసుకుంది. జీవోలను అయితే వెనక్కు తీసుకుంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకూ వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానుల జపం మానలేదు. చేస్తూనే ఉన్నారు. అయినా మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు కోర్టులలో ఉండగా.. ప్రభుత్వం దాని ప్రస్తావన తేకూడదు.  కానీ, నేతలు మాత్రం మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు, కోర్టులకు అబద్దాలే చెబుతోంది. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉండగానే విశాఖ రుషికొండకు బోడిగుండు చేసి   అక్కడ కార్యాలయాలను కడుతున్నది. కట్టేది రాజధాని భవనాలే అయినా పేరుకి మాత్రం అవి వాటిని పర్యాటక భవనాలుగా పేర్కొంటున్నది. మూడు రాజధానులు అని  చెప్పలేక జగన్ విశాఖ నుండి  పాలన చేస్తారని చెప్తుకుంటోంది. చివరికి ఇప్పుడు విశాఖలో మినిస్టర్ ఆఫీసుల కేటాయింపు  కూడా డొంక తిరుగుడుగానే చూపిస్తున్నారు. విశాఖకు మంత్రుల కార్యాలయాలు తరలించేందుకు మిలీనియం టవర్స్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. వైసీపీ నేతలేమో విశాఖకు రాజధానిని తరలిస్తున్నామని చెప్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్షలు చేయడానికి వెళ్తున్నారని, అందుకోసమే ప్రభుత్వ కార్యాలయాలను మారుస్తున్నారని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే ఇక్కడ కూడా అబద్దాలు..   మోసం.  సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొత్తలో ప్రభుత్వం అంటే పారదర్శకత ఉండాలని.. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు చెప్పిన రేంజిలో డైలాగులు చెప్పారు.  కానీ.. ఆచరణ  మాత్రం   పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించాలి. అప్పుడే ప్రజాభిప్రాయం తెలుస్తుంది.   మూడు రాజధానుల అంశంలో రాజ్యాంగం ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిపోతున్నది.. కోర్టులు వద్దంటున్నాయ్.. మేధావులు నష్టమని చెప్పుడో చెప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు అడుగులు వేస్తోంది. కోర్టులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అహంభావంతో అబద్ధాలతో పబ్బం గడిపేయగలననుకుంటోంది. గతంలో ఇలానే అనాలోచిత నిర్ణయాలు తీసుకొని భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఇప్పుడు కూడా విశాఖలో నిర్మాణాలు, కార్యాలయాల తరలింపునకు ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది.   రేపు కోర్టులలో వ్యతిరేక తీర్పులొస్తే ఇప్పుడు చేసిన ఖర్చంతా  బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది!

నందమూరి వసుంధర ఆధ్వర్యంలో హిందూపురంలో కార్తీక మహోత్సవం

తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అందులోభాగంగా  సోమవారం (నవంబర్ 27)సామూహిక కార్తీక వన భోజనాలు కార్యక్రమం జరగనుంది.  దాని కంటే ముందు అంటే  అదే  రోజు ఉదయం  చిలమత్తూరు మండలం దేమకేతుపల్లిలో  కొలువు తీరిన కనుమ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలోని శివాలయంలో అభిషేకం, బిల్వార్చన, తులసీ దామోదర పూజ  నిర్వహించనున్నారు.   ఇక సాయంత్రం 5.00 గంటలకు లేపాక్షిలోని  లేపాక్షి దేవాలయంలో జరగనున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అంటే రాత్రి 7.00 గంటలకు హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలోని శివాలయంలో సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నందమూరి వసుంధర బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  కార్తీక మహోత్సవ కార్యక్రమంలో మహిళలు, శివ భక్తులు, నియోజకర్గ ప్రజలు పాల్గొని ఆ పరమ శివుని దివ్య ఆశీస్సులు పొందాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు.  నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినీ హీరోగా అభిమానులను అలరిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా   ప్రజా సేవలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో  అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయిలకే మంచి భోజనం అందిస్తున్నారు.  పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య సంజీవని పేరిట.. మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య బాబు.. మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే బాలయ్య ను ఓడించేందుకు జగన్ పార్టీ దీపిక అనే మహిళను హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది.   మరోవైపు బాలయ్య బాబును ఓడించేందుకు 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్‌ను, అలాగే 2019 ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్‌ను జగన్ పార్టీ బరిలో దింపినా... ఆయన విజయాన్ని అడ్డుకోవడం జగన్ పార్టీ వల్ల కలేదు.  దీంతో వచ్చే ఎన్నికల్లో దీపికను బాలయ్య బాబుపై పోటీ చేయించేందుకు జగన్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొంది.. హ్యాట్రిక్ సాధించడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్తీకమాస మహోత్సవాన్ని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో నిర్వహించడం, ఈ కార్యక్రమానికి హిందూపురంలోని బాలకృష్ణ కార్యాలయం తరఫున అందరికీ ఆహ్వానం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

 ప్రియాంకసభలో ‘దేశం’ జెండాలు 

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ రోడ్ షో విజయవంతంగా జరిగింది. అశేష ప్రజానీకం ప్రియాంకకు ఘనస్వాగతం పలికింది. పాలేరు నియోజకవర్గం పెద్ద తండా వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు. ప్రియాంక స్పీచ్ ఇదే... ‘‘మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్  మీకు ఉద్యోగాలు ఇచ్చాడా. కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి. మీకు ఉద్యోగాలు కావాలా?. బీఆర్‌ఎస్‌ను  తప్పించండి మీకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్ర రైతులు, ఆడబిడ్డలు, యువత ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మీ అందరికీ ఒక కల ఉంది ఆ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. 10 సంవత్సరాల నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం  ఉందో అక్కడ ఉద్యోగాలు వచ్చాయి... ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. మీరందరూ ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే అందరికీ ఉద్యోగాలు, ఇళ్ళు, వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే రైతుల రుణాలు మాఫీ అవుతాయి. శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. భారీ మెజారిటీతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని , తుమ్మల నాగేశ్వరరావును, భట్టి విక్రమార్కను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని ప్రజలను ప్రియాంక కోరారు.  ఇదిలా వుండగా కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అదేదో నాలుగైదు జెండాలు కాదు… కాంగ్రెస్ జెండాలను డామినేట్ చేసేలా పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి.   డ్యాన్సులు వేస్తూ టిడిపి శ్రేణులు సందడి  చేశాయి.   ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేసిన రోజు నుంచే బహిరంగంగానే టీడీపీ మద్దతు కోరుతున్నారు. టిడిపి ఆవిర్బావం నుంచి ఉన్న తుమ్మల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరడానికి కెసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు కాకుండా అవకాశవాదులకు బిఆర్ఎస్ టికెట్లు ఇవ్వడంతో ఆయన ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన మద్దత్తుదారులు  తనకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను  అని స్టేట్ మెంట్ ఇస్తున్నారు.  కాగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కానీ టీడీపీ శ్రేణులు మాత్రం పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు టిడిపిలో క్రియాశీలకంగా పని చేసిన తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి, కొడంగల్  నియోజక వర్గాల్లో కూడా టిడిపి శ్రేణులు రేవంత్ కు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాయి. 

బాబు, పవన్ ఉమ్మడి సభలు.. లోకేష్, భువనేశ్వరి యాత్రలు! వైసీపీ ఇక ఉక్కిరిబిక్కిరే

ఏపీలో ప్రతిపక్ష  తెలుగుదేశం యాక్టివ్ అవుతోంది. అలాగే జనసేన కూడా తెలుగుదేశంతో కలిసి సూపర్ యాక్టివ్ మోడ్ లోకి రాబోతోంది. దాదాపు వంద రోజుల పాటు ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రభుత్వంపై దండయాత్రకు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి  ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీలు చర్చించి మినీ మ్యానిఫెస్టోను రెడీ చేయగా.. ఇప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలతో ఉమ్మడి సభలు, యాత్రలకు సిద్ధమవుతున్నాయి. స్కిల్  కేసులో జగన్ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టు కారణంగా  ఆయన మూడు నెలల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  అయితే  ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఈ నెలాఖరు నుండి మళ్ళీ  ప్రజల మధ్యకు రానున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో  తాత్కాలికంగా ఆగిన  యువగళం పాదయాత్రను నారా లోకేష్ మొదలు పెట్టనున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించనున్నారు.   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు వారాహీ యాత్ర చేపడుతూనే మరోవైపు చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలలో వేదిక పంచుకోనున్నారు. మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఈ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఉమ్మడి  బహిరంగ సభతో  చంద్రబాబు  రీఎంట్రీ   ఏపీలో రాజకీయ సంచలన వేదిక  అవుతుందని చెబుతున్నాయి.  టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సహా  తెలుగుదేశం ముఖ్యనేతలు, జనసేన ప్రముఖులు కూడా ఈ సభకు హాజరయ్యేలా.. ఈ సభతో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన వర్గాలు వందకు వంద శాతం కలిసి కట్టుగా పనిచేస్తాయన్న, చేస్తున్నాయన్న సంకేతం ఇవ్వనున్నాయిని  ఇరు పార్టీల శ్రేణులూ బలంగా చెబుతున్నాయి.  ముందుగా దాదాపు పది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభతో మొదలు పెట్టనున్న ఈ ప్రతిపక్షాల ప్రజా పోరులో మొత్తం మూడు సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సభల నుండే ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుండగా.. సూపర్ టెన్ పథకాలతో మేనిఫెస్టో పై విస్తృత ప్రచారానికి రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈనెల 27న ప్రారంభం కానుంది. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కార్తీక సోమవారం పర్వదినాన ఉదయం 10: 27 నిమిషాలకు లోకేష్ యువగళం పాదయాత్రను ఎక్కడ తాత్కాలికంగా ఆగిందో అక్కడి నుంచే   ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరుకు యాత్ర పూర్తి చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసే పనిలో టిడిపి నాయకులు ఉన్నారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా సంఘీభావ యాత్ర పేరుతో డిసెంబర్ మొదటి వారంలో  ప్రజాక్షేత్రంలో కి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తున్నది. నిజం గెలవాలి పేరిట చంద్రబాబు అరెస్టు  కారణంగా మనస్తాపం చెంది మరణించిన అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఇప్పటికే ఆమె పర్యటనలకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారానికి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు  కొనసాగే విధంగా ప్రణాళిక సిద్ధమైందని తెలుస్తోంది. మొత్తంగా  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణకు తోడు టీడీపీ నేతల యాత్రలు కూడా ఆరంభం కానుండటంతో  పార్టీ శ్రేణులలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం అన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టుతొ అది ఇంతింతై వటుడింతై  అన్నట్లుగా పెరిగింది. అధికారపార్టీపై ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహం, అసంతృప్తిని తెలుగుదేశంకు రాజకీయంగా  బ్రహ్మాస్త్రంగా మలుచుకోవడంతో పాటు జగన్ సర్కార్ పాలనను ఎండగట్టడమే పనిగా ఇప్పుడు ప్రతిపక్షాలు  సభలు, యాత్రలతో జనంలోకి రానున్నాయి.  ఇక వైపీపీలో ఇప్పుడు తీవ్ర నిరాశా నిస్ఫృహలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు జనం సంగతి పక్కన పెడితే కార్యకర్తలే మొహం చాటేస్తున్నారు.  ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందన్న సర్వేలతో వైసీపీ పెద్దలలో గాభరా మొదలైంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి గుక్క తిప్పుకోనీయకుండా చేయడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రోడ్లు కావాలంటే పింఛన్ వదిలేయాలా?.. వైసీపీ అదే చెబుతోందా?

ఏపీలో రహదారులపై తిరిగితే వాహనాలు షెడ్డుకి వెళ్లడమే కాదు.. ప్రజలు కూడా ఆసుపత్రుల పాలవుతున్నారు. అసలు రోడ్డు ఏదో కాలువ ఏదో తెలియని చందంగా తయారైన రోడ్లతో నిత్యం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆ రోడ్లపై తిరిగి ఒళ్లు హూనం చేసుకోవడమే కాకుండా, తమ వాహనాలు పాడైపోతూ జేబుకు చిల్లులు పడుతున్నాయనీ,  ఆ రోడ్లపై ప్రయాణం దినదిన గండంగా మారిందనీ ప్రజలంతా కోడై కూస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు.  అద్దంలా మెరిసిపోయే రోడ్లు త్వరలోనే వస్తాయంటూ ప్రకటనలు  మాత్రం గత నాలుగున్నరేళ్లుగా ఇస్తూనే ఉంది. ఆ ప్రకటనలు ప్రకటనలుగానే ఉండిపోతున్నారు. గత  నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ఇదే అంశంపై డజనుకు పైగా సమావేశాలు నిర్వహించారు. సమావేశం నిర్వహించిన ప్రతిసారి రోడ్ల మరమత్తుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలిచ్చేస్తారు.  ఆయన ఇచ్చిన ఆదేశాలు ఉత్తుత్తివేనని అధికారులకు ముందే తెలుసా, లేక జగన్ ఆదేశాలను పట్టించుకోనవసరం లేదని భావిస్తున్నారా తెలియదు కానీ  రోడ్ల పరిస్థితి మాత్రం ఇసుమంతైనా మారలేదు.  ప్రతిపక్షాలు ఇదే అంశంపై గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చెరువులను తలపిస్తున్న రోడ్లపై వరినాట్లు వేసి ప్రజలు నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టలేదు. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు సమయం. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే ఏడాది మార్చి 6న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే వెలువడుతుందంటున్నారు. అంటే నిండా నాలుగు నెలల సమయం కూడా పూర్తిగా లేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి. అలా వెడితే  ఎక్కడికక్కడ ప్రజల నుండి రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తమవుతుంది.  ఇప్పటికే వైసీపీ నిర్వహించిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, సామాజిక సాధికార యాత్ర‌లలో కూడా ప్ర‌జ‌లు ఈ విష‌యంపైనే  అధికార పార్టీ నేతలను నిల‌దీస్తున్నారు. ఎక్క‌డ ఏ మంత్రి క‌నిపించినా, వైసీపీ ఎమ్మెల్యే క‌నిపించినా ప్రజలు అసలు త‌మ‌ రోడ్లను బాగు చేయ‌రెందక‌ని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపైనే ఎదురు దాడి చేస్తున్నారు. అన్నీ కావాలంటే ఎలా.. ఏదో ఒక పథకం పేరుతో మీ ఖాతాలలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది కదా.. మళ్ళీ రోడ్లు కావాలంటే డబ్బులు ఎక్కడ నుండి తేవాలని తిరిగి ప్రజలనే ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా తమ గ్రామానికి రోడ్లు మరమ్మతులు చేయాలని కోరిన ప్రజలకు షాక్ ఇచ్చేలా సమాధానం చెప్పారు. మీకు రోడ్డు కావాలంటే మీ గ్రామానికి వచ్చే పింఛన్ వదిలేయండి.. ఆ డబ్బుతో మరమ్మతులు చేస్తామని ప్రజలు అవాక్కయ్యేలా సమాధానం చెప్పారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తమ నియోజకవర్గ ప్రజలు రోడ్లు మరమ్మతు  చేయాలని అడిగారని ప్ర‌జ‌ల‌పైనే మాటలతో ఎద‌రు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీరు అడిగిన రోడ్లు అలానే వేస్తాం కానీ.. నేను ఒకటి చెప్తా చేస్తారా అంటూ ఆయన  చెప్పిన మాటలు విని గ్రామస్థులు అవాక్కయ్యారు. మన కదిరి నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నాం.. వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. మరి మీరంతా పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేస్తారా? మీరు అడిగినట్లే రోడ్లు వేయిస్తాన‌ని వ్యాఖ్యానించారు. దీంతో రోడ్డు కావాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన గ్రామ‌స్తులు నివ్వెరపోయారు. పింఛన్ కావాలా.. రోడ్లు కావాలా తేల్చుకోవాలని ఎమ్మెల్యే చెప్పడంతో చేసేదేమీ లేక ప్రజలు వెనుదిరిగారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఒక్కరే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఫైర్ అయ్యారు. ప్రజలకు ఓట్లకు డబ్బులిచ్చా..  ఇప్పుడు అది కావాలి ఇది కావాలి అంటే మా పెళ్ళాల పుస్తెల తాడు తాకట్టు పెట్టి మీకు చేయాలా అని ప్రశ్నించారు.  ఎమ్మెల్యేలే కాదు మంత్రులు సైతం ఇదే విధంగా మాట్లాడుతున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలపైనే మా దృష్టంతా అందని.. అందుకే   అభివృద్ధి పనులు ఆలస్యమ వుతున్నాయని కుండబద్దలు కొట్టేశారు. ఇక ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే ఏకంగా అసెంబ్లీలోనే మా ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమం మాత్రమేనని, అభివృద్ధి మా అజెండాలోనే లేదన్న ట్లుగా మాట్లాడారు.   ఈ వ్యాఖ్యలను బట్టిచూస్తే జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కేవలం బటన్ నొక్కుడుకి మాత్రమే పరిమితమైందని.. రోడ్లు, కంపెనీలు, ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి లాంటివి ప్రభుత్వం పట్టించుకోదనీ చెప్పేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఎమ్మెల్యేలు, మంత్రులు  రోడ్లు అడిగిన ప్రజలనే తప్పు బట్టడానికి కారణమదేనని అంటున్నారు. 

రైతుబంధుకు ఈసీ ఓకే

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో రైతు బంధు సాయం బంద్ అయ్యింది. ప్రభుత్వం కూడా కోడ్ అడ్డురావడం వల్లే రైతుబంధు సాయం నిలుపుదల చేయాల్సి వచ్చిందని తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం లేకపోయినప్పటికీ రైతుబంధు సాయం ఎగనామం పెట్టడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ప్రతి పక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే అనూహ్యంగా ఎన్నికల కమిషన్ రైతుబంధుకు ఓకే చెప్పింది. ఇది రైతులకు శుభవార్త అయినప్పటికీ పోలింగ్ 30న ఉంది. ఈ నేపథ్యంలో  రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.  రైతుబంధు పథకాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇది పాత పథకం కావడంతో రైతుబంధు సాయం పంపిణీకి అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమ కానుంది. ఈ నెల 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన కెసీఆర్ రైతు బంధు సాయం తప్పించుకోవడానికి కోడ్ అడ్డంకి అని డ్రామా ఆడినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రశాంతంగా రాజస్థాన్ లో పోలింగ్.. గెలుపెవరిదో మరి?

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. అయితే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకోవడం ఏ పార్టీకైనా కష్టమే. దీంతో ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల తరువాత విపక్షానికే పరిమితం కావడం తథ్యమని బీజేపీ చెబుతోంది.   మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో శనివారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం ఎంత? అన్నది పక్కన పెడితే.. వరుసగా రెండో సారి అధికారం చేజిక్కించుకుని రికార్డు సృష్టించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంటే..  గెహ్లాట్  పాలనా తీరే జనం తమపైపు మొగ్గు చూపేలా చేస్తాయని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.  రాజస్థాన్ లో అధికార  కాంగ్రెస్, ప్రతిపక్ష  బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ ఉచితాలపై ఆధారపడింది. అదే సమయంలో  గత ఎన్నికల్లో పరాజయాన్ని మరిచిపోయి ఈ సారి విజయం సాధించేందుకు  బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా సహా కమలం పార్టీ పెద్దలంతా  రాజస్థాన్ లో విస్తృత పర్యటనలు జరిపారు.   అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై విమర్శల బాణాలు సంధించారు.   డబుల్ ఇంజన్ సర్కార్  ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. రాజస్థాన్ ప్రజల సమస్యలు గోహ్లాట్ పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు.  అయితే రాజస్థాన్ లో ఎవరెంతగా ప్రచారం చేసినా గెలుపోటములను నిర్ణయించేది మాత్రం సామాజిక వర్గాల వారీగా ఆయా పార్టీలకు లభించిన మద్దతు మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. రాజస్థాన్ లో కులాల ప్రభావం, ప్రాబల్యం రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. అందుకే పార్టీలన్నీ కూడా ఇక్కడ ఎన్నికలు అనగానే సిద్ధాంత, రాద్ధాంతాలు, ప్రగతి, సంక్షేమం వంటి వాటితో సమానంగా సామాజిక సమీకరణాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తాయి.  టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికల వాగ్దానాల వరకూ కూడా ఈ సమీకరణాలకే పార్టీలు అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి.  ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో వివిధ కుల సంఘాల మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ కుల మహాసభలకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. రాజస్థాన్‌లో  కులాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయాలను ప్రభావితం చేసే సాజామాక వర్గాలు కొన్నే ఉన్నాయి. అవే పార్టీల గెలుపు ఓటములను శాశిస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ సామాజిక వర్గాలలో  ఏ ఒక్క సామాజిక వర్గానికీ రాష్ట్ర రాజకీయాలై తిరుగులేని గుత్తాధిపత్యం అయితే లేదు. ప్రధానంగా రాజస్థాన్ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన బలం ఉన్న సామాజిక వర్గాలలో  జాట్‌, రాజ్‌పుత్‌, మీనా, గుజ్జర్‌, బ్రాహ్మణ వర్గాలు  ముందు వరుసలో ఉంటాయి. అయితే ఆయా సామాజిక వర్గాల ప్రభావం, ప్రాబల్యం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా  ఉంటుంది.   గత ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన జాట్ సామాజిక వర్గం ఈ సారి కూడా ఆ పార్టీకే వత్తాసు పలికే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా అయితే జాట్ ను బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉండాల్సి ఉంది. అయితే బీజేపీ వసుంధరారాజె ను పక్కన పెట్టంతో ఆ వర్గం కమలం పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. ఇక జాట్ ల తరువాత రాష్ట్ర రాజకీయాలలో తనదైన ప్రభావం చూపగలిగిన మరో సామాజిక వర్గం గుజ్జర్ సామాజిక వర్గం. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత అయిన  సచిన్ పైలట్  ఈ వర్గానికి చెందిన వారే.   సచిన్ పైలట్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో 2018 ఎన్నికల్లో గుజ్జర్లు కాంగ్రెస్‌ కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు.. సచిన్ పైలట్‌ కు డెప్యూటీ సీఎం పదవికి పరిమితం చేసింది. ఆ పదవి కూడా ఇచ్చినట్లు ఇచ్చింది. తరువాత ఆ పదవి నుంచీ పైలట్ కు ఉద్వాసన పలికింది. ముఖ్యమంత్రి గెహ్లాట్ తో సచిన్ పైలట్ సంబంధాలు టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉన్నాయి. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఐదేళ్లూ వారి మధ్య సంబంధాలు ఉప్పూనిప్పు చందంగానే సాగాయి. ప్రతి సారీ హైకమాండ్ జోక్యం చేసుకోవడం.. సర్దుబాటు చేయడంతోనే ఈ సమయమంతా గడిచింది.   దీంతో  గుజ్జర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడంలో సందేహం లేదు.  రాష్ట్రంలో రాజ్ పుత్ సామాజిక వర్గానికి కూడా రాజకీయాలను ప్రభావితం చేయగలిగేంత బలం  ఉంది. ఈ సామాజిక వర్గం తొలి నుంచీ కూడా కమలం పార్టీకి దన్నుగా నిలిచారనే చెప్పలి. ఈ సారి కూడా రాజ్ పుత్ లు కమలం పార్టీకే మద్దతుగా నిలిచారన్నది పరిశీలకుల విశ్లేషణ. అయితే సంస్థాగతంలో విపక్ష బీజేపీ పార్టీలో చేసిన మార్పులు ఆ పార్టీని ఆయా సామాజిక వర్గాలకు ఒకింత దూరం చేశాయన్న అబిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో  గెహ్లాట్ సర్కార్ పై ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో కూడా బీజేపీ విఫలమైంది. అలాగే  వసుంధరరాజె వంటి బలమైన నాయకులను పక్కన పెట్టడం కూడా రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడానికి ఒక అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో  రాజస్థాన్ లో   ఏ పార్టీ రెండు సార్లు వరుసగా గెలవదు అన్న సంప్రదాయం కొనసాగుతుందా అంటే అనుమానమే అంటున్నారు. 

కెసీఆర్ కు ఈసీ నోటీసులు  

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు సీరియస్ నోటీసులు  ఇచ్చింది.  అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. స్టార్ కాంపెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం ఎలాంటి చర్యలు  తీసుకోవట్లేదని పేర్కొంది.  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నోటీసులు ఇచ్చింది.

 బర్రెలక్కకు గన్ మెన్ ... ఈసీకి  హైకోర్టు ఆదేశం

తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని బర్రెలక్క హైకోర్టులో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. 2ప్లస్ 2భద్రత కోరిన బర్రెలక్కకు ఒక గన్ మెన్ ని ఏర్పాటు చేయాలని ఈసీ, పోలీసులను ఆదేశించింది. స్వతంత్ర్య అభ్యర్దిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అంటూ తీర్పిచ్చింది. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని బర్రెలక్క హైకోర్టులో వేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. స్వతంత్ర్య అభ్యర్దిగా పోటీ చేస్తున్న బర్రెలక్క  ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే అంటూ తీర్పిచ్చింది. అలాగే బర్రెలక్క పబ్లిక్ మీటింగ్ లకు కూడా భద్రత కల్పించాలని కోర్టు తెలిపింది. ఆమెతో పాటు ఆమె కుటుంబానికి భద్రత కల్పించే అంశంపై ఈసీ, డీజీపీ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత కల్పిస్తే సరిపోదని..భద్రత కోరిన ప్రతి అభ్యర్ధికి సెక్యురిటీ కల్పించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని కోర్టు గుర్తు చేసింది.తనిఖీల పేరుతో కార్లు చెక్ చేస్తే సరిపోదని న్యాయస్థానం అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా పాపులర్ అయిన కర్నె శిరీష కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తోంది.సామాన్యుడికి సైతం ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అర్హత ఉంటుందని నిరూపించింది బర్రెలక్క. నిరుద్యోగుల గొంతుకగా కొల్లాపూర్ నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన బర్రెలక్కపై దాడి జరిగింది.సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ తో పాటు దాడి తర్వాత ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీంతో స్వతంత్ర్య అభ్యర్ధిగా ఉన్న కర్నె శిరీష పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే ఫాలోయింగ్ పెరిగింది.హంగూ ఆర్బాటం లేకుండా  నామినేషన్ వేసిన బర్రెలక్కకు ఊహించని విధంగా ప్రజల్లో స్పందన వచ్చింది. దీంతో  ఆమె ప్రత్యర్ధుల నుంచి బెదిరింపులు, దాడులు ఎదుర్కోవల్సి వచ్చింది. ఈక్రమంలోనే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.ఎవరెంత బెదిరించినా , ఎంత ప్రలోభపెట్టినా తాను పోటీ నుంచి వైదొలగనని బరిలో ఉంటానని స్పష్టంగా చెబుతోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బర్రెలక్కకు న్యాయస్థానం ఆదేశంతో ఇక నుంచి సెక్యురిటీ కల్పించనున్నారు పోలీసులు.బర్రెలక్క నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామవాసి.  దళిత,నిరుపేద కుటుంబానికి చెందిన బర్రెలక్కకు సోషల్ మీడియా మంచి గుర్తింపు ఉంది.ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు కూడా వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు జీవనం సాగించింది. అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలన్న ఉద్దేశ్యంతో బర్రెలను అమ్మేసింది. ప్రస్తుతం టిఫిన్ సెంటర్ నడుపుతోంది. తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్ స్టా యూజర్లకు ఆమె పరిచయం అయ్యింది. అప్పటినుంచి కర్నె శిరీషను బర్రెలక్కగా మారిపోయింది.నిరుద్యోగులకు న్యాయం చేయడానికి చట్ట సభలో వెళ్లాలని డిసైడ్ అయి ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఈల గుర్తుపై పోటీ చేస్తోంది. కొల్ఫాపూర్లో  ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సైతం బర్రెలక్కకు వస్తున్న ప్రచారం చూసి గుబులు రేకెత్తిస్తుంది.    ప్రస్తుతం శిరీషకు ఇన్ స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

సోషల్ మీడియా ద్వారానే వైసీపీ ఎన్నికల ప్రచారం?

ఏపీలో ఎన్నికలు ఇక నాలుగు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పార్టీ కార్యక్రమాలకు క్యాడరే ముఖం చాటేస్తున్న తీరు వెరసి.. వైసీపీలో వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవ్వడమెలా అన్న భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్ అయితే పరదాలు లేకుండా తాడేపల్లి ప్యాలస్ దాటి అడుగు బయటపెట్టరు. ఇక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లినా ఛీత్కారాలు, నిరసనలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం జనంలోకి ఎలా వెళ్లడం అని అధికార వైసీపీ మధనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ చూపు సామాజిక మాధ్యమంపై పడింది.  సోషల్ మీడియాలో పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులకు తోడు కొన్ని  డిజిటల్ మీడియా చానెళ్లు సైతం ఇప్పటికే జై జగన్ అంటూ స్లోగన్లు ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే  గత నాలుగున్నరేళ్లుగా ఇదే పని చేస్తున్న అటువంటి సామాజిక మాధ్యమ అక్కౌంట్లను జనం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే   ఇప్పుడు సరికొత్తగా డిజిటల్ మీడియాను వాడుకునేందుకు వైసీపీ రెడీ అవుతోంది. అందు కోసం దాదాపుగా  మూడు వందలకు పైగా యూట్యూబ్ ఛానెళ్లతో   ప్రభుత్వ సంక్షేమం  ప్రచారం  భారీ సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న ఇండివిడ్యువల్ చానెళ్లు, వివిధ జిల్లాలలో నడుస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.  ఇప్పటి వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తిగత ఛానెళ్లతో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య సంక్షేమంలో వ్యత్యాసాలను వివరించేలా వీడియోలతో ప్రమోట్ చేసేందుకు వారితో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుందనీ, ఇవీ గాక పలు యూట్యూబ్ చానెళ్లను  గంపగుత్తగా కోనేసిందని అంటున్నారు.గత కొన్ని రోజులుగా అప్పటి వరకూ న్యూట్రల్ గా ఉన్న పలు యూట్యూబ్ చానెళ్లు  ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా భజన చేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇలా దాదాపు మూడు వందలకు పైగా చానెళ్లు ఇప్పడు వైసీపీకి అనుకూలంగా పని చేయడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు.   గత ఎన్నికల హయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన చానెళ్లు, వైసీపీని ప్రమోట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయాయి. ఇవన్నీ వైసీపీ సానుభూతిపరులతోనే నిండిపోయాయి. వాటితో సామాన్య ప్రజలకు చేరువ అయ్యే పరిస్థితి లేదన్న నిర్ధారణకు వైసీపీ పెద్దలు వచ్చేశారు.  అందుకే కొద్దిరోజులుగా వైసీపీ డిజిటల్ వింగ్ పాత వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చింది.  కానీ అవి సరిపోవన్నట్లు ఇంకా ఇంకా వ్యక్తిగత చానెళ్లు, మీడియా ఛానెళ్లను అరువు తెచ్చుకుంటున్నారు.  ఈ ప్రచారం కోసం వైసీపీ కోట్లాది రూపాయలను వెదజల్లుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో జనం వద్దకు నేరుగా వెళ్లే పరిస్థితి కానరాకపోవడంతో వైసీపీ పూర్తిగా సోషల్ మీడియా ప్రచారానికి పరిమితమౌతుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. 

ఎన్నికల తాయిలాలు పెంచేసిన కేసీఆర్! దళితుల ఓట్ల కోసం కొత్త వ్యూహాలు

దళితబంధు  వంటి సంక్షేమ పథకాలు తమ పార్టీని తెలంగాణలో ముచ్చటగా మూడో సారి గెలిపిస్తాయన్న నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా రిజర్వుడు స్థానాలలో పాగా వేయగలిగితే మరో సారి అధికార అందలాన్ని అందుకోవడం ఏమంత కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే దళిత బంధు విషయంలో ఆయన తన హామీ రేంజ్ ను పెంచేశారు. ఇప్పటి వరకూ  విడతల వారీగా నియోజకవర్గానికి వంద మందికి చొప్పును అందిస్తున్న  సంగతి తెలిసిందే. మరో సారి అధికారాన్ని అందుకోవడానికి దళిత బంధునే గట్టిగా నమ్ముకున్న కేసీఆర్  మరో సారి అధికారం అప్పగిస్తే ఈ పథకాన్ని నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తింప చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ సారి ఎన్నికలలో ప్రభుత్వంపై దళితులు వ్యతిరేకంగా ఉన్నారన్న ఉద్దేశంతోనే.. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నియోజకవర్గంలో దళితులందరికీ వర్తింప చేస్తానన్న హామీతో వారి అభిమానాన్ని తిరిగి పొందాలన్న వ్యూహంతోనే ఈ హామీ ఇచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.  ఏది ఏమైనా దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ అందేలా కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తొలి విడతలో  నియోజకవర్గానికి వంద మందికి అనీ, రెండు విడతలో నియోజకవర్గానికి 11 వందల మందికీ అని గతంలో ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, రెండు విడత హామీని బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదు.  పథకం అమలుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది.  దీంతో దళితులు  కేసీఆర్ హామీ ఇచ్చి తరువాత దానిని విస్మరించడం అలవాటుగా మార్చుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు హామీలను ఆయన పబ్బం గడిచిన తరువాత ఏలా వదిలేశారో గుర్తు చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే దళితుల ఆగ్రహాన్ని చల్లార్చి వారిని బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకే  రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు అంటూ కొత్త నినాదాన్ని బయటకు తీశారని అంటున్నారు.  దీంతో ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకు వస్తారా? అని కేటీఆర్ పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే   కేసీఆర్ ఎన్నికల ముంగిట చేసిన ఈ వాగ్దానాన్ని వారు విశ్వసించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కలిపి 31 ఉండగా వాటిలో  మూడు మినహా మిగిలిన నియోజకవర్గాలలో ఉన్న సిట్టింగులంతా బీఆర్ఎస్ ఎమ్యెల్యేలే.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు మూడూ కూడా ఖమ్మం జిల్లాలోనే ఉండటం గమనార్హం. అయితే  సిట్టింగులు ఉన్న 28 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలలోనూ బీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తున్నదని సర్వేలు చెబుతున్నాయి. ఇక గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఖాతాలో పడని మధిర, ములుగు, భద్రాచలం నియోజకవర్గాలలో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఆ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులంటూ హామీ ఇస్తున్నారు. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో పాగా కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు, పన్నుతున్న వ్యూహాలు, ఇస్తున్న వాగ్దానాలు ఏమేరకు ఫలిస్తాయన్నది ఫలితాల తరువాతే తేలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఏపీ ఎన్నికలు మార్చి 6న?!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తున్నది. ఆ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ఆరంభించేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి కార్యాచరణను ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేసింది. ఈవీఎంలను జిల్లాలకు తరలిచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశాలున్నాయి.  అలాగే ఏపీలో మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 6న ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.   ఇక ఏపీలో ఓటర్ల జాబితాను సవరించి ముసాయిదాను ప్రకటించడం కూడా పూర్తయిపోయింది. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ నాటికల్లా వాటిని పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అసలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిందని అప్పట్లో రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అసలు ఏడాదిన్నర కిందటి నుంచే ఏపీలోని జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికల ముచ్చటను తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల స్వయంగా ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించారు. అయితే తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ముచ్చట మరుగున పడింది.  వాస్తవానికి జగన్ కూడా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం ఫ్లాగ్ షిప్ గా భావిస్తున్న సంక్షేమ పథకాలకు కూడా నిధులు సమకూరు అవకాశం లేని పరిస్థితులు నెలకొనడంతో ఫథకాలు నిలిపివేసి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచుకునే కంటే.. అవి కొనసాగుతుండగానే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని జగన్ భావించినట్లు అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ప్రభుత్వ అడుగులు కూడా ముందస్తు దిశగానే పడుతున్నాయని అప్పట్లో రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ముందస్తుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ముందస్తు మాట వెనుకకు వెళ్లి పోయింది. ఈ నేపథ్యంలోనే మూడు నెలల కిందట జగన్ స్వయంగా  వచ్చే ఏడాది మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించి, అందుకు సన్నద్ధం కావాల్సిందిగా పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాటు చేస్తున్నది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగానే ఏపీలో ఎన్నికల ఏర్పాటుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటోంది.   ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దిశగా ఇప్పటికే ఈసీ వేగంగా అడుగులేస్తోంది. ముందు జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న ఈసీ.. అనంతరం కేంద్రం మందుకు రాకపోవడంతో అసెంబ్లీ గడువు ముగిశాక ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించింది. డిసెంబర్ నెలలో  వాటిలో అభ్యంతరాల్ని డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనుంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించబోతోంది. దీని ఆధారంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తాజాగా సంకేతం ఇచ్చారు. ఈ లెక్కన మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేవలం షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ షెడ్యూల్ ప్రకటన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

బీఆర్‌ఎస్‌లో ఓటమి భయం?.. కాంగ్రెస్ లో గెలుపు ధీమా!

తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారం గడువు కూడా మరో నాలుగురోజులలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  అభ్యర్థుల మాటల పదును ఎప్పుడో పెరిగింది.. విమర్శల వేడీ పెరిగింది.  రంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుంది.  ఒకపక్క ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల అంచనాలు ఉత్కంఠ పెంచుతుంటే.. మరో  ఏ పార్టీకి ఆ పార్టీ  విజయం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ విజయంపై ధీమాతో ఉండగా.. కేసీఆర్ ను గద్దె దించుతామన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అయితే  ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ఫలితాలు, సభలకు జనసమీకరణ,  మౌత్ టాక్, ప్రచారంలో పద్దతులను చూస్తే కాంగ్రెస్ ఒకింత ముందంజలో ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  సాక్షాత్తు బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ కు అనుకూలం అనే టాక్ నిజమే అని ఒప్పుకుంటూనే  అయితే అది కాంగ్రెస్ పార్టీ  స్ప్రెడ్ చేస్తున్న  టాక్ అంటూ కొట్టిపారేశారు. మరి అసలు కనీసం పోటీకి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే అనుకున్న పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా పుంజుకోవడం ఎలా సాధ్యమైంది? ఆరు నెలల ముందు కూడా  పోటీ  బీఆర్ఎస్, బీజేపీల మధ్యే అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితి ఎలా మారిపోయింది. ఇప్పుడు బీజేపీని పక్కకి నెట్టేసి అధికారం దక్కించుకునే స్థాయికి కాంగ్రెస్ ఎలా ఎదిగింది? ఇది బీఆర్ఎస్ తప్పిదమా.. కాంగ్రెస్ నేతల ఛరిస్మానా?  లేక వ్యూహకర్తల ప్రణాళికలా?. పనిగట్టుకొని దెబ్బతీసినా మళ్ళీ ఈ స్థాయికి కాంగ్రెస్ ఎలా చేరుకోగలిగింది? తొమ్మిదేళ్లు అధికారాన్ని అనుభవించి సకల వనరులను కూడగట్టుకున్న కేసీఆర్ ను.. చితికిపోయింది, ఇక పుంజుకోవడం కష్టం అనే పరిస్థితికి పడిపోయిన కాంగ్రెస్ పడి లేచిన కెరటంలో మారి ఇలా   ఎలా ఢీ కొడుతోంది?  గత ఎన్నికలలో 46 శాతం ఓటింగ్ దక్కించుకున్న బీఆర్ఎస్ ను, 28 శాతం ఓటింగ్ మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎలా టెన్షన్ పెడుతోంది?  కనీసం సీఎం ఎవరో కూడా చెప్పలేని కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ఓటమి భయం ఎలా పరిచయం చేసింది?  ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తెలంగాణలో ఈ స్థాయికి రావడం వెనక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటూ దూసుకొచ్చింది. కర్ణాటక గెలుపు ఇచ్చిన జోష్ తో తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టిన కాంగ్రెస్ ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.  అధికారం కాంగ్రెస్‌దే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయింది. చెల్లాచెదురైన పాత నేతలను మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి భేషజాలకు పోకుండా  మెట్టు ఎదిగారు. అలాగే ముందు నుండి వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు గెలుపుపైన ధీమా ఉంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్‌ చేసి.. బీఆర్ఎస్ లో ఎక్కువ శాతం సిట్టింగులకే సీట్లు దక్కలే చేశారు. ఆ తర్వాత సిట్టింగులపై ప్రజలలో అసంతృప్తిని రెచ్చగొట్టారు. అన్నిటికీ మించి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ పాత ముతక ప్రచారాన్ని పక్కనపెట్టి కొత్త కొత్త పద్దతులతో, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలుగా కనిపిస్తున్నది. ఇక కాంగ్రెస్ ఈ స్థాయికి రావడం వెనక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కృషి పట్టుదలా కూడా ఒక కారణం. అలాగే బీఆర్ఎస్ తప్పిదాలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. సరిగ్గా అభ్యర్థుల జాబితా విడుదల చేసే సమయానికి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కీలకమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు వరకూ కూడా కేసీఆర్‌ అందబాటులో లేరు. దీంతో పార్టీలో చాలా వెలితి కనిపించింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ రాష్ట్ర మూలమూలాలకి వెళ్లి ప్రణాళికలు అమలు చేసింది. తీరా కేసీఆర్ వచ్చేసరికి కాంగ్రెస్ పై పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఉద్యోగుల డీఏ, రైతుబంధు బ్యాలెన్స్ వంటివి బీఆర్ఎస్ విడుదల చేయలేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ నుండి సెప్టెంబర్ లో విద్యార్థిని ఆత్మహత్య వరకూ వివిధ సందర్భాలలో బీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. ఈ విషయం  ప్రజలలోకి  బలంగా వెళ్లింది. చివరిగా చెప్పుకుంటున్నా ప్రధాన కారణం మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ కేసీఆర్ మౌనం,   కేటీఆర్  వ్యాఖ్యలు కూడా సీమాంధ్ర ఓటర్లలో బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో వ్యతిరేకతను పెంచాయి. ఒక్క సీమాంధ్రులలో అనే కాదు.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలూ కూడా  కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుప్టాయి. అటువంటి వారందరినీ కాంగ్రెస్ కు చేరువ చేశాయి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో బీఆర్ఎస్ ను  డిఫెన్స్ లోకి నెట్టేసిందో అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.   

బిఆర్ఎస్ కు షాక్ ...ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ గూటికి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.  బిఆర్ఎస్ తొలి విడత జాబితాలో టిక్కెట్ సంపాదించిన ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఇవ్వాళ బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిట్టింగ్ అభ్యర్థుల్లో ఒక్క ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంకు మాత్రమ్ బీ ఫాం ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ వీడారు. పోలింగ్ కు కేవలం ఆరు రోజుల సమయం ఉన్నప్పుడు ఆయన పార్టీ మారడం చర్చనీయాంశమైంది.    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అబ్రహంను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను తొలుత ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయనను మార్చి ఆ స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఇచ్చారు. దీంతో, తీవ్ర అసంతృప్తికి గురైన అబ్రహం పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు.  2009లో కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి ప్రసన్న కుమార్ పై అబ్రహం గెలిచారు. 2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు.

టీచర్ల మెడపై ఛార్జ్ మెమోల కత్తి.. ఎన్నికల విధుల నుండి తప్పించేందుకేనా?

రానున్న ఎన్నికలలో ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఓటమి ఖరారైపోయిందని  రాజకీయ వర్గాలు, సర్వేలూ బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.  వైసీపీ ఓటమి తథ్యమన్న విషయం ఏపీలో ప్రజలకే కాదు.. వైసీపీ నేతలకు, పెద్దలకు కూడా అర్దమైపోయింది. సర్వేల ఫలితాలు, వైసీపీ అంతర్గత సర్వేలు, రహస్యంగా తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ సర్వే, ప్రజలలో కనిపిస్తున్న అసంతృప్తితో తన ఓటమిని నిర్ధారించుకున్న వైపీసీ పెద్దలు ఇప్పుడు మాయ చేసి, కుట్రలు పన్నైనా గెలవాలని చూస్తోంది. అందుకోసం అవకాశాలను వెతుక్కుంటోంది. ఏపీలో పెద్ద ఎత్తున దోంగ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు అంశంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని  తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దొంగ నోట్ల నమోదు, అసలు ఓట్ల నమోదు వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏపీలో ఇద్దరు అధికారులను  సస్పెండ్  కూడా  చేసింది. అదలా ఉండగా, ఏపీలో అధికార వైసీపీ మరో కుట్రకు తెరలేపింది.  అదే ఎన్నికల విధులలో తమకు అనుకూలంగా ఉండే   అధికారుల నియామకం. నిజానికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీచర్లే కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్న సంగతి విదితమే.   అయితే ఈసారి ఏపీలో టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వైసీపీ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. 2022 నవంబరు 29న విద్యా హక్కు చట్టంలోని నిబంధనలకు సవరణలు చేసి.. టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదని జీవో తెచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకునే ఉద్యోగుల వివరాలను చెప్పాలని ఈసీ కోరగా.. వైసీపీ ప్రభుత్వం టీచర్ల మినహా.. ఇతర రంగాల ఉద్యోగులు, తాను నియమించుకున్న సచివాలయ ఉద్యోగులను కూడా ఎన్నికల ప్రక్రియలో పాలు పంచుకునేలా ప్రయత్నాలు చేసింది. దీంతో ఈసీ మరోసారి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేసింది. ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.   దీంతో వైసీపీ సర్కార్ టీచర్లను ఎన్నికల విధుల నుండి తప్పించేలా మరో కుట్రకి తెరతీసినట్లు కనిపిస్తున్నది. ఇందుకోసం ఏకంగా టీచర్లను బలి చేసేలా ఛార్జ్ మెమోలను జారీ చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంద మందికిపైగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వంద మందికిపైగా ఈ మెమోలు అందజేసినట్లు తెలుస్తుండగా.. నేడో రేపో నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున టీచర్లకు ఛార్జ్ మెమోలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలలో ఉంటూ ప్రభుత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్న టీచర్లను ఏరి కోరి కుంటి సాకులతో వారికి ఛార్జ్ మెమోలు జారీచేస్తున్నట్లు తెలుస్తున్నది. లెసన్ ప్లాన్ సరిగా లేదని,  బైజూస్ కంటెంట్ సరిగా అప్ లోడ్ చేయడం లేదని, నోట్ బుక్స్ సరిగా కరెక్షన్ చేయడం లేదని ఇలా వివిధ కారణాలను చూపుతూ మెమోలు జారీ చేస్తున్నారు. కనీసం షోకాజ్ నోటీలు కూడా ఇవ్వకుండానే ఏకంగా ఛార్జ్ మెమోలు జారీ చేస్తూ మేజర్ పనిస్మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ మెమోలు జారీ అయితే వాళ్లపై నెగటివ్ మార్క్ పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ మెమో జారీ అయితే పోలింగ్‌ అధికారులుగా విధులు అప్పగించేందుకు సిద్దమవుతున్న జాబితాలో వారికి చోటు దక్కదు. ఇందు కోసమే ప్రభుత్వం ఇలా అడ్డదారిన మెమోలు జారీచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రెండు ఉమ్మడి జిల్లాలలో టీచర్లకు మెమోలు ఇవ్వగా.. ఇప్పుడు మరో జిల్లా ఉపాధ్యాయులకు కూడా మెమోలు సిద్ధమవుతున్నాయి. ఇక త్వరలోనే మిగతా జిల్లాల్లోనూ టీచర్లకు ఛార్జ్ మెమోలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే టీచర్లకు మాత్రమే ఎన్నికల విధులు అప్పగించేలా  కుట్రపూరితంగా ప్రభుత్వం చార్జి మెమోలు దాఖలు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న వారు, అసంతృప్తితో ఉన్న వారిని  ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టేందుకు కుట్ర పన్నినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ మెమోలకు వ్యతిరేకంగా  నిరసనలకు ఉద్యమిస్తామని, ఎన్నికల విధులకు వెళ్లకుండా అసలు ఎలా ఆపుతారో చూస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు సవాల్ విసురుతున్నారు.   ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో.. ఎలాంటి మలుపులు తిరుగుతుందో నన్న ఆసక్తి ఏపీ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.

బెయిల్ రద్దుపై విచారణ.. జగన్ మళ్ళీ జైలుకేనా?

అసలే పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు కోర్టులు ఇస్తున్న షాకులు మరింత గాభరాపెడుతున్నాయి.  తాజాగా గురువారం (నవంబర్ 23)  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం  పాలనలో ఆర్ధిక అవకతవకలపై సీఎం జగన్ సహా క్యాబినెట్ మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే శుక్రవారం  (నవంబర్ 24)  సుప్రీంకోర్టు మరో భారీ షాక్  ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైల్లో గడిపిన జగన్ ఇప్పుడు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ బెయిలు రద్దు చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మొదలు పెట్టింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ మొదటి వారంలోనే విచారణకు స్వీకరించగా.. పిటిషనర్ కోరినట్లుగా ఈ కేసును మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని సీబీఐ, సీబీఐ కోర్టును సుప్రీం ఆదేశించింది.   ఇప్పుడు రెగ్యులర్ విచారణ మొదలు పెట్టిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ, జగన్ సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. అంతే కాకుండా జగన్ అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ ను కూడా బెయిలు రద్దు పిటిషన్ తో కలిపాలని ఆదేశించింది.  ఈ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ రఘురామ లాయర్ ను ఉద్దేశించి ధర్మాసనం.. బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని కూడా ప్రశ్నించింది. దీనికి రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీంతో కోర్టు నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్‌లో కోరగా.. ఆ పిటిషన్‌కు ఈ బెయిల్ రద్దు పిటిషన్ కూడా జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.  తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.   జనవరిలో ఈ కేసులో ఎలాంటి కదలిక వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీరని నష్టమే మిగల నుంది. ఈ కేసు విచారణలో సీబీఐ వేగం పెంచినా.. లేక జనవరిలో సుప్రీం ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. సీబీఐ వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని భావించినా జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూలమే అవుతుంది.  వచ్చే ఏడాది జనవరి అంటే సరిగ్గా ఎన్నికల సమయం. మహా అయితే ఎన్నికలకు రెండు మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు వస్తే వైసీపీ పరిస్థితి దారుణంగా మారుతుంది. జగన్ కేసులు విచారణకు వస్తే జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి అంశాలపై జనంలో చర్చ జరగడం ఖాయం. జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు విఘాతమే అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. ఎన్నికల వేళ సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది జగన్ కు శరాఘాతం కాక మానదు. అలాగే  జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కుంటి సాకులతో విచారణకు హాజరు కాకపొతే అరెస్ట్ తప్పదన్న హెచ్చరిక కోర్టునుంచి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.  అసలు ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ అయి బెయిల్ రద్దు అయితే జగన్ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే ఈసారి వైసీపీని కాపాడేందుకు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ తో లేరు. నిజానికి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారంటే.. బీజేపీతో ఉన్న సఖ్యత కారణంగానే అన్నది రాజకీయ వర్గాలలో అందరికీ తెలిసిన నిజమే. కేంద్రం అండదండలతోనే జగన్ ఈ కేసును విచారణ పరంగా ముందుకెళ్ళకుండా మ్యానేజ్ చేయగలుగుతున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే ఎన్నికల ముందు బీజేపీ జగన్ ను ఇలా కాపాడుతుందా.. అప్పుడు కూడా ఈ మైత్రి ఇలాగే  ఉంటుందా అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇప్పటికే సంవత్సరాల తరబడి ఈ కేసు సాగుతున్న నేపథ్యంలో  విచారణ వేగవంతం చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సీబీఐ అసలు ఈ కేసును ఇంత కాలం పాటు ఎందుకు విచారణ చేయడం లేదన్న విషయంపై కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో జగన్ బెయిల్ రద్దవుతుందా? సరిగ్గా ఎన్నికలకు ముందు మళ్ళీ జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఒకవిధంగా వైసీపీకి ఇది అసలు సిసలైన సంక్షోభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.