తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
posted on Nov 30, 2023 @ 4:23PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు.. తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పూర్తైంది. అప్పటికి క్యూలైన్లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా.. 118 చోట్ల కాంగ్రెస్, 111 చోట్ల బీజేపీ పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక స్థానంలో పోటీలో నిలిచింది. ఇక సీపీఎం 19 స్థానాలలోనూ, బీఎస్పీ నుంచి 108 నియోజకవర్గంలోనూ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కొంచం తక్కువే అని చెప్పాలి. అధికారికంగా ఎన్నికల సంఘం పోలింగ్ శాతం ఎంతన్నది ప్రకటించాల్సి ఉండగా, అందుబాటులో ఉన్న సమాచారం మేరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.
కొమురం భీం అసీఫాబాద్ జిల్లాలో 63శాతం, మంచిర్యాలలో 60 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 60, నిర్మాల్ లో 62 శాతం చొప్పున, అలాగే నిజామాబాద్‌లో 57, కామారెడ్డిలో 59, జగిత్యాలలో 59, పెద్దపల్లిలో 60శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక కరీంనగర్ లో 56శాతం, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 57శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఇక సంగారెడ్డిలో 61, మెదక్ లో 70, సిద్దిపేటలో 65, రంగారెడ్డిలో 43, వికారాబాద్ లో 58, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 39 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో అయితే అత్యల్పంగా 32 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఇక పాలమూరు జిల్లాలో 59, నాగర్ కర్నూల్ లో 58, వనపర్తిలో 59, గద్వాల్ లో 65, నల్గొండలో 60శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సూర్యపేటలో 62, యాదాద్రి భువనగిరి జిల్లాలో 64, జనగామలో 63, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వరుసగా 65, 53, 49 శాతం మంది చొప్పున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే ఆ జిల్లాలో 65శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే భద్రాద్రిలో 59, ఖమ్మంలో 64, ములుగులో 68, నారాయణపేటలో 58శాతం మంది చొప్పున ఓటు హక్కు వినియోగించుకున్నారు.