వాటర్ వార్ లో కొత్త ట్విస్ట్.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు
posted on Dec 1, 2023 @ 3:02PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సరిగ్గా ఎన్నికల వేళ సాగర్ జలాల విడుదల విషయంలో ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరించింది. సాగర్ డ్యాం నుంచి బలవంతంగా అనే కంటే దౌర్జన్యంగా నీటిని విడుదదల చేసింది. ఇంత కాలం ఊరుకుని ఇప్పుడు హడావుడిగా జగన్ సర్కార్ ఈ తీరులో దూకుడు ప్రదర్శించడం వెనుక తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రాజకీయ లబ్ధి చేకూర్చే ప్రయత్నం ఉందన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిలించేలా.. రెండు రాష్ట్రాల మధ్యా విభజన నాటి ఉద్రిక్తతలను రేకెత్తించి.. తెలంగాణలో తన మిత్రుడికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. సరే ఇప్పుడు ఆ వ్యూహం ఫలించిందా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే.. ఏపీ పోలీసులు మాత్రం కచ్చితంగా చిక్కుల్లో పడ్డారు. ఏపీ పోలీసులు తమ భూభాగంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారంటూ, డ్యామ్‌పై కాపలాగా ఉన్న ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులపై విజయపురి స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 447, 427 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో ఏ1గా ఏపీ పోలీసులను చేర్చారు. 500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి బలవంతంగా వచ్చారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. డ్యామ్ 13 గేట్లు ధ్వంసం చేశారని.. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి నీటిని విడుదల చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.