ఓటేసిన సినీ రాజకీయ, సినీ ప్రముఖులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలు ముందు బారులు తీరారు. ఓటు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మావోయిస్టు ప్రభావితమైన 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరగనుంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఓటింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, పోలింగ్ మొదలైన తొలి గంటలోనే రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓటు వేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన స్వగ్రామమైన చింతమడకలో ఓటేశారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు భార్య ప్రణతి, తల్లి షాలిని ఓటు  క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఎన్టీఆర్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నది. మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తోపాటు సుమంత్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓటేశారు.  ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్ నందినగర్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఇక అంబర్ పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ కండువాతో ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లు తెలుస్తుంది.

ఎన్నికల వేళ తెలంగాణలో రెండు వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు!

తెలంగాణా ఎన్నికల నేప‌థ్యంలో  మద్యం విక్రయాలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలుసా ?  న‌వంబ‌ర్ నెల మొద‌టి 20 రోజుల్లో 1470 కోట్ల రూపాయల మ‌ద్యం అమ్ముడు పోయింది,  మిగిలిన ప‌ది రోజుల లెక్క కూడా వ‌స్తే... ఒక్క న‌వంబ‌ర్ నెల మ‌ద్యం అమ్మ‌కాలు 2 వేల కోట్ల రూపాయ‌లు దాటుతుందన్నది ఒక  అంచ‌నా. ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేవ‌లం   నెల‌లోనే రెండు వేల కోట్ల రూపాయ‌ల మ‌ద్యం అమ్మకాలు జరిగాయంటే.. మద్యం ఏ స్థాయిలో ఏరులై పారిందో అవగతమౌతుంది.   గ‌త ఏడాది అంటే 2022 నవంబర్ నెల‌లో లిక్కర్ విక్రయాలు  1260 కోట్ల రూపాయలు మాత్రమే.   అప్పట్లో అంత మొత్తం అమ్ముడుపోవటమే చాలా పెద్ద విషయంగా ఎక్సైజ్ వర్గాలు చెప్పుకున్నాయి. అలాంటిది ఇపుడు మొదటి 20 రోజుల్లో అమ్మకాలు రు. 1470 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైందంటే ఇది కచ్చితంగా కొత్త రికార్డుగానే చెప్పాలి.   మొదటి 20 రోజుల్లో అమ్ముడుపోయిన లిక్కర్ ఒక ఎత్తయితే  మిగిలిన పదిరోజులు అంటే 20-30వ తేదీ వరకు అమ్ముడవ్వబోయే లిక్కర్ మరో ఎత్తుగా మారబోతోందని అంటున్నారు. మొత్తంమీద లిక్కర్ అమ్మకాల్లో నవంబర్ మాసం అన్నీ రికార్డులను తిరగరాయటం ఖాయమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  ఇక గ‌త ఏడాది నవంబర్ మొదటి 20 రోజుల్లో 12.5 లక్షల కార్టన్ల బీర్లు అమ్ముడుపోతే..   ఈ ఏడాది న‌వంబ‌ర్‌ మొదటి 20 రోజుల్లో 22 కోట్ల కార్టన్ల బీర్లు అమ్ముడు పోవటమే ఆశ్చర్యంగా ఉంది. దీంతోనే లిక్కర్ అమ్మకాల జోష్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. ఎన్నికల ప్రచారమంటే, ఆ మాత్రం లేక‌పోతే ఎలా అంటున్నారు?  ఏది ఏమైనా  తెలంగాణాలో లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయ‌ట‌. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నదాంతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రం ఏమిటంటే లిక్కర్ అమ్మకాలు ఒకవైపు ఆకాశమంత ఎత్తున పెరిగిపోతుంటే మరోవైపు దాడుల్లో, సోదాల్లో పోలీసులు వందల కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని పట్టుకుంటున్నారు.  తెలంగాణా వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైన దగ్గర నుండి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో డబ్బు, బంగారం, వెండితో పాటు అనేక విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. ఇందులో బాగంగానే వందల కోట్ల రూపాయలు విలువ చేసే లిక్కర్ ను కూడా పట్టుబడటం విశేషం.  105 కోట్ల రూపాయ‌ల విలువైన లిక్కర్ పట్టుబడిందంటేనే తరలిపోయిన లిక్కర్ ఇంకెంత ఉంటుందో అంచనా వేయచ్చు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్ర‌కారం  ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు అంటే మూడు రోజులు లిక్కర్ షాపులు, బార్లను మూసేశారు. దాంతో అభ్యర్ధులు ముందుజాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వందల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ను కొనేసి ఎక్కడెక్కడో  స్టాక్ చేసుకున్నారు.  

తెలంగాణ ఎన్నికలు.. బెట్టింగుల జోరు!

తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా...  బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.   ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో రెగ్యులర్ గా భాగం పంచుకుంటున్నారని అంచనా.  ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక  పేర్కొంది.   టీసీఎఫ్ నివేదిక ప్రకారం  బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించే 75 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్ సైట్లన్నీ ఇండియా యూజర్లనే టార్గెట్ చేసుకుంటున్నాయి.  పాపులర్ బాలీవుడ్ యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారు.   హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బు చేతులు మారుతోంది. క్రికెట్ వరల్డ్ కప్  నేప‌థ్యంలో ప్రారంభ‌మైన‌ ఇల్లీగల్ బెట్టింగ్ దేశంలో ఊపందుకుందనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోకుండా రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు  బెట్టింగ్ చేస్తున్నారట‌.  ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల (100 బిలియన్ డాలర్లు)  దాకా ఉంటుందని  థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.  ఇటీవ‌లే క్రికెట్ పండ‌గ అయిపోయింది. ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా  8 ల‌క్ష‌ల 20 వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయన్నది టీసీఎఫ్ అంచనా. ప్ర‌స్తుతం.... ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్ని సొమ్ము చేసుకోవ‌డంపై దృష్టి పెట్టింది.  వెనుకుండి క‌థ న‌డుపుతోంది.  తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. క‌నిపిస్తోంది.  తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొద‌లైంది. బిజినెస్ పెంచుకోవ‌డం కోస‌మే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్స‌హిస్తోంది ఇల్లీగ‌ల్ బెట్టింగ్ మాఫియా.    గెలిచేది ఎవరు.. కేసీఆర్ సీఎం అవుతారా?  కాంగ్రెస్ గెలుస్తుందా.. రేవంత్ ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చే ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా సాగుతోంది.  ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండటం.  గత ఎన్నికలకు భిన్నంగా పొత్తు ఈక్వేషన్స్ ఉండటంతో.. మరింత ఆసక్తి రేపుతోంది.   ఈ బెట్టింగ్ గొడ‌వ అంతా తెలంగాణాలో కొన‌సాగుతున్నదంటే పెద్ద విష‌యం ఏమీ కాదు కానీ ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగటం విశేషం.  గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై  ఏపీలో బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.  అందుకు కారణం లేకపోలేదు.  కాంగ్రెస్ పార్టీకి,.... టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలవడం ఒక కారణమైతే..  రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం.  ఏపీ తెలుగుదేశం అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు.  తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలోనూ బెట్టింగ్ జోరు మొదలయ్యింది.. బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు..  పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ పెరుగుతోంది.  ఈ బెట్టింగ్ బిజినెస్‌ సుమారుగా 3 వేల కోట్ల రూపాయ‌ల నుండి 5 వేల కోట్ల రూపాయల వరకు  ఉండే అవకాశం ఉందని సమాచారం.. బెట్టింగ్‌లలో  తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది?  నెక్స్ట్ సీఎం ఎవరు..? నియోజకవర్గ స్థాయిలో ఎవరు గెలుస్తారు..?  వివిధ రకాలుగా బెట్టింగులు పెడుతున్నారు నిర్వాహకులi. క్రికెట్ లో బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగినట్లు..  తెలంగాణ పొలిటికల్ ఫీవర్.... ఇప్పుడు బెట్టింగ్స్ లోనూ మంట పుట్టిస్తున్నది. ఎన్నికల ఫలితాలపై పందేలు కొన‌సాగుతున్నాయి..  విచ్చ‌ల‌విడిగా కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎక్కువ ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు పెడుతున్నారు…అరికపూడి గాంధీ గెలుస్తారా? ఒడిపోతారా?.. అని ఎక్కువ స్థాయి లో డబ్బులు పెడుతున్నట్టుగా సమాచారం..  ఇక అనుకూలంగా ఉన్న వ్యక్తులు గెలుస్తారంటూ ఎవరికివారు పందాలకు దిగుతున్నారు. ఈ విధంగా నాయ‌కుల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు… మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.  ఇక జిల్లాల వారిగా కొడంగల్, దుబ్బాక, కామారెడ్డి…ప్రాంతాలపై మరింత బెట్టింగ్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. దీంతో తెలంగాణ పోలింగ్ సమయం దగ్గర పడడంతో కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది.   బెట్టింగ్ వ్యాపారం బుకింగ్ జోరుగానే సాగుతోంది.   మొత్తం స్టేట్ లెవెల్‌లో చూస్తే కాంగ్రెస్ వైపు రూపాయి పెడితే, రూపాయి 40 పైసలు నడుస్తోంది. బీఆర్ఎస్ వైపు మాత్రం రూపాయికి,  కేవ‌లం 60 పైసలు నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది.  ప్ర‌త్యేకించి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం గురించి అయితే ..... ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు.  ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది.  బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది.   ఇదే సమయంలో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు.. ఒకటి గజ్వేల్, ఒకటి కామారెడ్డి.. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా లేక ఒక చోట గెలుస్తారా?. ఒకే స్థానంలో విజయం సాధిస్తే అది గజ్వేలా? కామారెడ్డా? ఓడిపోయే సీటు ఏది?  అన్న అంశంపైనా   బెట్టింగ్స్ జరుగుతున్నాయి.  హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి.   పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుంద‌ట‌. పోలింగ్ ముగిసి  ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత  ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి. ఎ  నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతుండటం,  డిసెంబర్ 3 న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటం తో బెట్టింగ్ రాయుళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. 

జేడీ సంచలన నిర్ణయం..!

నూతన విధి, విధానాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం (నవంబర్ 29) విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయాలు భవిష్యత్తు నిర్ణయిస్తున్నప్పుడు.. భవిష్యత్తు రాజకీయాలను యువత నిర్ణయిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి యువత రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్త విధి, విధానాలు తీసుకు రావడం ముఖ్యమని.. వాటిని వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల ముందుకు తీసుకు రావాలని.. అయితే పార్టీలు గెలవడం ముఖ్యం కాదని.. ప్రజలు గెలవడం ముఖ్యమని  స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ ఫేయిర్‌కు 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని.. అర్హత గల యువతకు అక్కడే కంపెనీలు ఆఫర్ లెటర్  అందజేస్తాయని లక్ష్మీనారాయణ చెప్పారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరు కావచ్చని చెప్పారు.  కొంచె వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.  మరోవైపు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ఆయన పలు వేదికల మీద.. వివిధ సందర్బాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఏ పార్టీ నుంచి అనే అంశంపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ   ఇవ్వ  లేదు. అలాంటి వేళ..   కొత్త పార్టీ స్థాపించి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని  జేడీ ఈ ప్రెస్ మీట్‌‌ ద్వారా చెప్పారని పరిశీలకులు భావిస్తున్నారు.   గత ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన  అభ్యర్థిగా బరిలో దిగి.. వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో ఓట్ల పరంగా ఆయన రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ తర్వాత పలు కారణాలతో ఆయన  జనసేనకు గుడ్ బై చెప్పారు. కానీ ఆయన తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ.. వివిధ సందర్భాల్లో యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ.. ఉత్తేజకర ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కెను కలిసి.. ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా.. యువత రాజకీయాల్లోకి రావాలని  ఆకాంక్షించారు.  1990 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్ర కేడర్ అధికారి అయిన వివి లక్ష్మీనారాయణ.. 2018 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి.. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా వివి లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.  ఆ క్రమంలో ఆయన పేరు.. జేడీ లక్ష్మీ నారాయణగా స్థిరపడిపోయింది.

టెన్షన్.. టెన్షన్..

తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. గురువారం (నవంబర్ 30) జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో 3.26 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అలాగే వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టింది.    గురువారం ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ కోసం.. 375 ఆర్మ్‌డ్ సెంట్రల ఫోర్స్ కంపెనీ సిబ్బందితోపాటు 50 వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగించనున్నారు. తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను నవంబర్ 28వ తేదీ సాయంత్రం నుంచి పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసి ఉంచుతున్నారు. అదే విధంగా ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాలు... గజ్వేలు, కామారెడ్డి నుంచి బరిలో దిగగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కోడంగల్, కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం హుజూరాబాద్, గజ్వేల్ నుంచి బరిలో నిలిచారు. మొత్తంగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ఓడించేందుకు అటు హస్తం పార్టీ అధ్యక్షుడు, ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల కంకణం కట్టుకున్నారనే  ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఉపందుకొంది.  మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగలేదు. గత ఎన్నికల్లో అంబర్ పేట నుంచి బరిలో దిగిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది.. మోదీ కేబినెట్‌లో మంత్రిగా చోటు సంపాదించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి.. ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంతో..  అసంతృప్తి వ్యక్తం చేసిన రాములమ్మ..   కాషాయం పెద్దల నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తూ.. ఆ పార్టీకి రాం రాం చెప్పి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. ఇక కరీంనగర్ ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. అదే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.     అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. ఆయన సైతం ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.   ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్.. ఆ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి ఆయన గెలుపొందారు. మళ్లీ ఆయన అదే స్థానంతోపాటు కేసీఆర్ బరిలో దిగిన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు.  అలాగే ఐపీఎస్ అధికారి.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి. సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని ఎవరు కైవసం చేసుకొంటారనే ఓ విధమైన టెన్షన్.. ఆ యా పార్టీల అధినేతల్లోనే కాదు.. ఇటు ప్రజల్లో సైతం టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు, రెబల్స్ బెడద అన్ని రాజకీయ పార్టీలను  ఇబ్బంది పెడుతోంది. వీరితో ఓట్లు భారీగా చీలి.. ఓటమి పాలవుతామనే ఓ విధమైన బెంగ.. వివిధ రాజకీయ పార్టీల నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  మరోవైపు... తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీకే ప్రజలు పట్టం కడతారా? లేకుంటే... కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చేతులెత్తి జై కొడతారా? అదీ ఇది కాదు.. కాషాయం పార్టీని ఆదరిస్తారా? అంటే.. అందుకు జవాబు మాత్రం డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా ప్రజా నాడి బహిర్గతం కానుంది.

సైలెన్స్ తెలంగాణ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం మంగళవారం (నవంబర్28) సాయంత్రంలో ముగిసింది.  ఇలా ప్రచార గడువు ముగియడంతోనే రాష్ట్రంలో  144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది.  ప్రచార గడువు ముగిసింది కనుక స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.   పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగిసింది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  నెల రోజులలో సగటున రోజుకు మూడు చొప్పున దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా.. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరో పక్కా బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ సైతం ప్రచారం హోరెత్తించింది. కర్నాటక ఎన్నికల ఫలితాల  తరువాత   గ్రాఫ్ అమాంతం పెరగడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సహంతో ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే, సిద్ధారామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరో పక్క బీజేపీ సైతం   పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.   ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు తెలంగాణను చుట్టేశారు. మూడు పార్టీల నేతల ప్రచారంతో  హోరెత్తిన తెలంగాణ.మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం నుండి మూగబోయింది. గురువారం (నవంబర్ 30) న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరిగగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ తీర్పు ఏ పార్టీకి అనుకూలం అన్నది ఆ రోజు తేలిపోనున్నది. 

చంద్రబాబుకు సరెండర్ అవుతున్న అక్రమార్కులు!

వైసీపీ ఇంటికి.. తెలుగుదేశంకు అధికారం. మరోసారి సీఎం కుర్చీ చంద్రబాబుదే. రానున్న  ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం అధికారం దక్కించుకోవడం గ్యారంటీ. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో  విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న అభిప్రాయం. అయితే., ఈ మాట సర్వే సంస్థలు, పరిశీలకులు, విశ్లేషకులు మాత్రమే  కాదు. రాజకీయాలను అవపోసన పట్టిన మేధావులు,  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, బడా వ్యాపార వేత్తలు కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న మాట.  అందుకే ఇప్పుడు ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్, ఉన్నతాధికారులు చంద్రబాబుకు జగన్ హయాంలో తాము నిస్సహాయులుగా మారి ప్రభుత్వం చెప్పినట్లల్లా చేయాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే..  బడా బడా వ్యాపార వేత్తలు, జగన్ హయాంలో పెద్దపెద్ద కాంట్రాక్టులను చేజిక్కించుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వాళ్లూ కూడా  చంద్రబాబుతో భేటీకి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా.. వ్యాపార వేత్తల ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో  అక్రమార్జనతో కోటికి పడగలెత్తిన వారు కూడా ఇప్పుడు చంద్రబాబు ఇంటి బాట పడుతున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ అవినీతిపై  తెలుగుదేశం నేతలు, పలువురు మేధావులు కోర్టులలో పిటిషన్లు వేయడం, దర్యాప్తు సంస్థలకు సమాచారం అందిస్తుండడంతో ఈ దోపిడీ దారులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఒకవేళ  అధికారం మారిపోయి, చంద్రబాబు గద్దె ఎక్కడం జరిగితే ఈ కేసులు తమ మెడకు యమపాశాలుగా మారతాయన్న ఆందోళనతో ముందుగానే  చంద్రబాబు శరణు కోరుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పు ఖాయమన్న అభిప్రాయం  ఇటు రాజకీయవర్గాలనూ పరిశీలకులలోనే కాదు, అటు అధికారులు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడిన బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లలో కూడా బలంగా వ్యక్తం అవుతోంది.  జగన్‌ నాలుగున్నరేళ్ల పాలనలో  కొద్ది మంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారన్నది కాదనలేని వాస్తవం. ఈ దోపిడీ పర్వాల మీద ఇప్పుడు తెలుగుదేశం నేతలు  న్యాయస్థానాలలో కేసులు వేస్తున్నారు. నిఘా, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నారు.  స్పష్టమైన ఆధారాలతో,  న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.  ఈ తీరు చూసిన అక్రమార్కులలో వణుకు మొదలైంది.  జగన్ ప్రభుత్వం పతనమై.. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరగబోయేది  ఊహించుకుని వణికిపోతున్నారు. అందుకే చంద్రబాబు ఇంటికి దారి వెతుక్కుంటున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుతో  సయోధ్య కుదుర్చుకొంటే సేఫ్ అని భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా ఓ ఎలక్ట్రికల్‌ కంపెనీ అధినేత చంద్రబాబును కలిసినట్లు తెలుస్తున్నది. అది కూడా జగన్ కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్న ఆ వ్యాపారవేత్త వైసీపీ ఎంపీకి బినామీ అనే ప్రచారం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఓ ఐఏఎస్ అధికారి మధ్యవర్తిత్వంతో చంద్రబాబుతో భేటీ కాగలిగారు. ఇక ఇదే వరసలో రెండు తెలుగు రాష్ట్రాలను శాసించే మరో ఇద్దరు బడా ఇంజనీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీల యజమానులు, ఓ ఫార్మా కంపెనీ యజమాని కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ ముగ్గురూ కూడా గత ఎన్నికల సమయంలో కేంద్రం మెప్పు కోసం చంద్రబాబుతో విభేదించారు. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా అడ్డగోలుగా లబ్ధి పొందేలా కాంట్రాక్టులూ, పనులూ పొందారు. అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారవ్వడంతో  చంద్రబాబు ఆశీస్సుల కోసం  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  ఏదో వ్యాపారవేత్తలు, అధికారులే చంద్రబాబు శరణం గచ్ఛామీ అనడం కాదు.. ఏకంగా వ్యాపారాలతో సంబంధాలున్న రాజకీయ నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు అండకోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం అనడానికి ఇంత కంటే ఆధారాలేం కావాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీలో ఉంటూ చంద్రబాబుపైనే దాడికి ప్రయత్నించిన నేత తనయుడు కూడా బాబుతో సయోధ్యకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం సాగిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో మద్యం అక్రమాలలో ఈ నేత తనయుడిదే మేజర్ వాటా కాగా.. రాయలసీమలో గ్రానైట్‌, కంకర దందా.. ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటివి అదనంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతి అంశంపై ఫిర్యాదు ఉండగా ఏ క్షణమైనా దర్యాప్తు ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగానే తండ్రిని కూడా కాదని ఈ తనయుడు చంద్రబాబు శరణు కోరినట్లు తెలుస్తుంది. ఇక, కృష్ణ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా ఇదే తరహాలో చంద్రబాబు ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నట్లు చెప్తున్నారు. ఇలా జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడి , ఆయాచిత లబ్ధి పొందిన వారంతా  ఇప్పుడు చంద్రబాబును శరణుజోచ్చుతున్నారు.  అయితే చంద్రబాబు ఎలా స్పందిస్తారు, వీరి ద్వారా జగన్ అక్రమాలు , అవినీతిని ప్రజల ముందు ఉంచుతారా అన్నది చూడాల్సి ఉంది.  

ఎన్నికల వేళ మంత్రి సోదరుడి బూతు పురాణం

ఎన్నికల ఓటమి భయమే, విజయం కష్టమన్న ఫ్రస్ట్రేషనో కానీ అభ్యర్థుల, వారి బంధువుల నోట అనుచిత వ్యాఖ్యలు వస్తున్నాయి. ప్రత్యర్థులను కాదు ఏకంగా ప్రజలనే దూషిస్తున్నారు.  సభ్య సమాజం ఆమోదించని పదజాలంతో ఆ దూషణలు ఉంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్   అభ్యర్థి,  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   ప్రశాంత్ రెడ్డి సోదరుడు, బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో మాట్లాడిన   ఫోన్ సంభాషణ లీకై, సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ప్రజలు డబ్బులను ఏ తరహాలో డిమాండ్ చేస్తున్నారో తెలిపేలా ఉన్న ఆ ఆడియోలో మంత్రి సోదరుడు ఓటర్లను బండబూతులు తిట్టిపోశారు.   ప్రజలు డబ్బులు పిండుతున్నారని, ఓట్లు కొనేందుకు రూ.18.5 కోట్లు ఖర్చు అయిందని అజయ్ రెడ్డి చెబుతున్నట్లుగా ఆ ఫోన్ సంభాషణ ఉంది. ప్రస్తుతం అజయ్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు ప్రజలను ఇంత చులకనగా మాట్లాడడంపై బాల్కోండ నియోజకవర్గంలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మంత్రి అనుచరులు మాత్రం అది అజయ్ రెడ్డి గొంతు కాదని చెప్పి తప్పించు కోవాలని చూసతున్నారు. జిల్లాలో వైరల్‌గా మారిన ఈ ఆడియోలో మాట్లాడింది ఎవరనేది క్లారిటీ లేనప్పటికీ మంత్రి సోదరుడి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఎన్నికల వేళ బయటకు వచ్చిన ఈ ఫోన్ సంభాషణ అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

విశాఖకు తరలడానికి ఐఏఎస్ లు ససేమిరా!?

జగన్ విశాఖ నుంచి పాలన అని ఏ ముహూర్తాన అన్నారో కానీ.. అందుకు పెట్టిన ప్రతి ముహూర్తం వాయిదా పడుతూనే ఉంది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించైనా సరే ఏదో విధంగా విశాఖ నుంచి పాలన ఆరంభించి పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న జగన్ కు అడుగడుగునా అవాంతరాలే ఎదురౌతున్నాయి. చివరకు అన్నీ అధిగమించి ఇక విశాఖకు తరలిపోవడమే ఖాయమని భావించిన జగన్ కు కేంద్ర సర్వీసు అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు. విశాఖకు తరలిరావడానికి విముఖత వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ కు అది విరుద్ధమంటూ కుండబద్దలు కొట్టేశారు. ఫలానా తేదీన విశాఖకు రావాలని అని చెబితే వస్తాం.. అక్కడ పని అయిపోగానే తిరిగి అమరావతికి తిరిగి వచ్చేస్తాం. అంతే కానీ పర్మనెంట్ గా విశాఖలో మకాం అంటే మాత్రం మేం ఒప్పం అని తెగేసి చెప్పారు. ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది చాలా ముఖ్యమైన అంశమనీ, దానికి సంబంధించి విస్పష్టమైన ఉత్తర్వులు లేకుండా విశాఖలో క్యాంప్ ఆపీస్ ఏర్పాటు చేసుకోవడం కుదరని పని అని తేల్చేశారు.  దీంతో విశాఖకు రాజధానిని తరలించి అక్కడే మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇందు కోసం అక్కడ భవనాలను కూడా కేటాయించిన ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైనట్లైంది. విశాఖలో ఐటీ  కంపెనీలకు నెలవు అయిన మిలీనియం టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించి, ఆ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను వేరే రాష్ట్రాలకు తరలించుకునేలా చేసిన జగన్ సర్కార్ కు ఇప్పుడు వ్రంతం చెడ్డా ఫలం దక్కకుండా పోయింది.  విశాఖకు తరలే విషయంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ కు తమ అభ్యంతరాలు, సందేహాలను ఏకరవు పెట్టడమే కాదు, విశాఖకు రావడం కుదరదని ముఖం మీదే చెప్పేశారని విశ్వసనీయంగా తెలిసింది. కాకపోతే.. మీరు ఫలానా తేదీన విశాఖలో సమావేశం ఉందనో, మరో పని ఉందనో చెబితే ఆ రోజుకు విశాఖకు వస్తామే తప్ప అక్కడే మకాం అంటే అది కుదిరేపని కాదని విస్పష్టంగా చెప్పేశారని అంటున్నారు.   ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు వైసీపీ సర్కార్ హడావుడి చేస్తుంటే అధికారులు మాత్రం అది సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. దీంతో  జగన్ విశాఖ పాలనపై మళ్లీ అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.  వచ్చే నెల   8 నుంచి విశాఖ కేంద్రంగా ఇని ఇప్పటికే ప్రకటించేసిన జగన్ ఆ తేదీ నాటికి ప్రభుత్వ కార్యాలయాలను అక్కడికి తరలించేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే బాబూస్ మాత్రం బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా విశాఖకు తరలి వచ్చే ప్రశక్తేలేని భీష్మించడంతో డిసెంబర్ 8 ముహూర్తం ప్రకారం విశాఖ నుంచి పాలన ఆరంభమయ్యే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్‌ నోటిఫై చేయకుండా శాఖల్ని తరలించడం సాధ్యం కాదని ఐఏఎస్ అధికారులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, ఈ విషయంలో సీఎస్ కు నిలదీయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెబుతున్నారు.   అమరావతి నుంచి విశాఖకు శాఖల కార్యాలయాలను తరలించాలని వైసీపీ ప్రభుత్వం హడావుడి చేస్తుంటే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు.  ప్లేస్ ఆఫ్ వర్క్‌ను మార్చేందుకు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తేనే తాము కదులుతామని విస్పష్టంగా చెబుతున్నారు.  నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది కీలకమైన అంశమనీ, దీనిని ఇష్టారీతిగా మార్చేయడానికీ ఎంతమాత్రం వీలుండదని చెబుతున్నారు.    ఈ నేపథ్యంలోనే   సీనియర్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు నివేదిక ఇవ్వడాన్నే తప్పుపడుతున్నారు.    

వైసీపీకి కార్యకర్తలు ఏరీ.. ఎక్కడ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి  ఇప్పుడు కార్యకర్తలు కూడా దూరం అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పలుమార్లు నేతల చేత పలికించినా.. ఏపీకి జగనే మళ్ళీ ఎందుకు కావాలని ఊదర గొట్టినా ప్రజల నుండి స్పందన కరువైంది.  వైసీపీ సభలు, సమావేశాలలో ఖాళీ కుర్చీలను చూస్తేనే ఇది అర్ధమైపోతున్నది. నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు ఎన్ని ప్రణాళికలు వేసి మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా ఏదో తూతూ మంత్రంగానే మb అనిపిస్తున్నారు తప్ప పార్టీలో ఉత్సాహం నింపేలా ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మన సంక్షేమం అందింది.. ఆ విషయాన్ని మీరే వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ పెద్దలు ద్వితీయ శ్రేణి నాయకులకు ఎన్నిసార్లు హితబోధ చేసినా వారు అడుగు ముందుకు వేయడానికి సుముఖంగా లేరు.  ఎన్నికలేమో దగ్గరకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సొంత సర్వేల నుండి వివిధ మీడియా సంస్థల సర్వేల వరకూ ఎక్కువ శాతం వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావేనని తేల్చిసిన పరిస్థితి.  మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగానైనా తేల్చేసింది.   నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం అంటు బటన్ నొక్కుడం వినా మరో పని చేసిన పాపాన పోలేదు.  అదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచే పరిస్థితి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కాక సమయం గడిచే కొద్దీ ఒక్కో వర్గంలో అసంతృప్తి మొదలై పెరుగుతూ వచ్చింది. ఆయన హయాంలో రాష్ట్రంలో దాదాపు అన్ని రంగాలూ నిర్వీర్యం అయిపోయాయి. ఇదిగో మా ప్రభుత్వంలో ఈ రంగాన్ని మెరుగు పరిచాం..   సాధించిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.  అసలు రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే నిర్మాణ, రియల్ ఎస్టేట్, తయారీ , ఫార్మా రంగాలు పూర్తిగా కుదేలైపోయాయి. రోడ్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, త్రాగు సాగు నీటి ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలను అంతో ఇంతో మెరుగు పరచాల్సి ఉన్నా అసలు వాటిని పట్టించుకోకపోవడంతో అవీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిపై ప్రజల నుండి ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం అన్నిటికీ బటన్ నొక్కుడే సమాధానంగా చూపించింది. మంత్రులూ, నేతలూ ప్రజలను బటన్ నొక్కి సొమ్ములిస్తున్నారుగా.. ఇక మాట్లాడకండి అంటూ ప్రజలను గదమాయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పెన్షన్ వదులు కుంటే రోడ్లు వేయిస్తామని కూడా చెప్పారంటే జగన్ హయాంలో పాలన ఎంతగా పడకేసిందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం వంటివి భూతద్దం పెట్టి వెతికినా కానరాని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన పన్నులతో ప్రజల జేబులు గుల్లయ్యాయి.    సంక్షేమం అంటూ పందేరం చేసిన సొమ్ములన్నీ ఏదో రూపేనా ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేసింది. మళ్ళీ ఆ సొమ్ములనే  బటన్ నొక్కి పందేరం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ జగన్ సర్కార్ ఇప్పటి వరకూ పబ్బం గడిపింది. పైగా దొరికిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టేసి చేసిన అప్పు, అప్పనంగా అమ్మేసి సొమ్ము చేసుకున్న నిధులు ఏమయ్యాయి.. వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కని అంశంగా మారిపోయింది.  ఫలితంగా ఇప్పుడు ప్రజలలో వైసీపీపై అసంతృప్తి పెరిగిపోయింది. ఎంతటి కరుడుగట్టిన పార్టీ కార్యకర్తకైనా ఒక క్షణంలో తన భవిష్యత్తుపై ఆలోచన వస్తుంది. ఆ క్షణాన తడిమి చూసుకుంటే తన పార్టీ వలన ప్రయోజనం శూన్యం అన్నప్పుడు తనకు తెలియకుండానే జెండా కింద పడేస్తాడు. సరిగ్గా వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నది. అందుకే గత ఎన్నికలలో పార్టీ విజయం కోసం జెండా మోసిన కార్యకర్తలే ఇప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు.  మహా మహులైన నాయకులు అనుకున్న వారు, మంత్రులుగా చక్రం తిప్పిన వారికి సైతం ప్రభుత్వ అసంతృప్తి సెగ తాకుతున్నది. సొంత అడ్డా పులివెందులలో జగన్ కూడా నిరసనలను ఎదుర్కొన్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం అవుతున్నది. అందుకే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కూడా వైసీపీకి కార్యకర్తలు అనేవారు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఓటమి భయాన్ని పరిచయం చేస్తున్నది.  

గెలిస్తే విజయయాత్ర.. ఓడితే నా శవయాత్ర.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ అభ్యర్థులలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రచారం చివరి అంకానికి వచ్చిన తరువాత వారి ప్రచార శైలిలో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు తాజాగా చూపుతున్న ఉదాహరణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్  బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి బేలతనం ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా.. తనలోని ఓటమి భయాన్ని కూడా బయటపెట్టేసుకున్నారు. నన్న సంపుకున్నా.. సాదుకున్నా మీరేనని చేతులెత్తేశారు. బతిమాలుకుంటున్నా, మీ కాళ్లు మొక్కుతా ఒక్క సారి అవకాశమివ్వండంటూ వేడుకున్నారు. అక్కడితో ఆగకుండా ఓటమి పాలైతే భార్యా, బిడ్డతో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనీ, గెలిస్తే జైత్ర యాత్ర చేస్తాననీ, ఓడితే కనుక ఆ మరుసటి రోజు తన శవయాత్ర జరుగుతుందనీ కౌశిక్ రెడ్డి ప్రచార సభలో చెప్పారు. ఆ మాటలు, ఆఉద్వేగం, ఆ  టెన్షన్  కౌశిక్ రెడ్డిలోని ఓటమి భయాన్ని దాపరికం లేకుండా బయటపెట్టేశాయి. ఆత్మహత్య పేరు చెప్పి సెంటిమెంట్ ను రగల్చాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది డిసెంబర్ 3న తెలిసిపోతుంది. కానీ ఈ విధమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం, ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన చేయడం చూస్తుంటే.. ఆయనకు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తున్నదని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్య గతంలో ఇదే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఈటల అన్న మాటలను స్ఫురింప చేస్తున్నాయనీ, అయితే నాటి ఉప ఎన్నికకూ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికకూ చాలా తేడా ఉందనీ అంటున్నారు. అప్పట్లో ఈటల బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) వేధింపులకు గురయ్యారు. పార్టీలో పెత్తనాన్ని ధిక్కరించినందుకు పార్టీ నుంచి బహిష్కృతడయ్యారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరుతూ జనం ముందు నిలబడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితి అది కాదు. కౌశిక్ రెడ్డి పార్టీలో ఎలాంటి ఇబ్బందులకూ గురి కాలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారు. ఆయనకు తన  విజయంపై అనుమానాలు లేకుంటే ఈ స్థాయిలో బేలగా ప్రచారం చేసుకోరు.  పైగా తన ప్రత్యర్థి  ఈటలను అనుకరిస్తూ, ఆయన గెలుపు ఫార్ములాగా భావిస్తున్న అదే ఫార్ములాను  ఆయనపైనే ప్రయోగించడాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.   

యథా భర్త.. తథా భార్య ఏపీపై మంత్రి హరీష్ సతీమణి అవమానకర వ్యాఖ్యలు!

అదేంటో ఏపీ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడం లేదు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రస్తావన వచ్చినా.. అప్పుడు మరో రకంగా ప్రభావం కనిపించేది. ఆంధ్రా పాలకుల పేరిట తెలంగాణ పార్టీలు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసేవారు. కానీ, ఈసారి రాష్ట్రంలో అసమర్దులకు పట్టం కడితే ఎలా ఉంటుందో  చెప్పడానికి తెలంగాణ పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటీ రెండుసార్లు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఎన్నికల సమయం వచ్చాక  ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డయితే ఆంధ్రా, ఏపీ రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చనే వ్యాఖ్యలు చేశారు. అలాగే వెలుగులు ఉంటే తెలంగాణ.. అంధకారం కనిపిస్తే ఆంధ్ర అని కూడా ఏపీలో విద్యుత్ కోతలను ఎగతాళి చేశారు.  పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారని.. తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైందని, ఆంధ్రా వాళ్లే ఇప్పుడు తెలంగాణ వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ పలుమార్లు సెటైర్లు వేశారు.  ఇక మంత్రి కేటీఆర్ అయితే.. ఆంధ్రా వాళ్ళు పరిశ్రమలను పొమ్మంటే మేము వారిని ఆహ్వానించామని, పండగకో, శుభకార్యానికో ఏపీకి వెళ్లినా ఉండలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. మరో మంత్రి హరీష్ రావు అయితే ఏపీలో పనితనం లేదు కానీ పగతనం ఉందని మనకి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాగా, భర్తకు తగ్గ భార్యగా మంత్రి హరీష్ రావు సతీమణి కూడా ఇప్పుడు ఏపీపై సెటైర్లు వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం అంటూ ఏపీ ప్రజలపై సానుభూతి చూపిస్తూనే జగన్ మోహన్ రెడ్డి పాలనపై సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితిని పోలుస్తూ తెలంగాణలో అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించిందో చెప్పేందుకు ఏపీలో వైసీపీ పాలనను వేలెత్తి చూపించారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనే స్థాయికి ఎదిగితే , జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పరిస్థితి దిగాజారిపోయిందని హరీష్ సతీమణి శ్రీనిత వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం(నవంబర్ 28)తో  ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి తరపున ఇంటిల్లిపాది అందరూ ప్రజల మధ్యకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా భర్త తరపున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనిత.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా అక్కడ అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను  బేరీజు వేసుకొని చూడాలని ప్రజలను కోరారు. అన్నీ ఉన్నా అక్కడ అభివృద్ధి లేదంటే.. మనం గొప్పనా? వాళ్లు గొప్పనా? మీరే నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందనే దానికి ఏపీలో పరిస్థితులే నిదర్శనమనేలా ఆమె మాట్లాడారు. దీంతో సహజంగానే మరోసారి రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీనిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీపై ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా   వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు. దాన్నే అలుసుగా తీసుకుని జగన్ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్క మాట మాట్లాడినా కట్టకట్టుకుని ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు.. పొరుగు రాష్ట్రం నేతలు ఇలా ప్రతిసారి ఎగతాళిగా మాట్లాడినా నోరు మెదపడం లేదు. ఏపీ ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తున్నది. సీఎం జగన్ ను నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా వారిపై విరుచుకుపడే నేతలు.. పరాయి రాష్ట్రంలో జగన్ పాలనపై హేళన చేస్తున్నా కుక్కిన పెనులాగా కిక్కిరుమనకుండా ఉన్నారంటే వారి వైఫల్యాన్ని వారే  అంగీకరించినట్లు భావించాల్సి వస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిసున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. రెండో భార్య, కొడుకు సాక్షులు!

ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వివాహం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం (నవంబర్ 27) వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాత అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీరి వివాహం  నిరాడంబరంగా జరిగింది. అయితే  ఈ వివాహం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  దీనికి కారణం ఆయనకు ఇది మూడవ వివాహం కావడం.. ముందు ఇద్దరు భార్యలకు ముగ్గురు పిల్లలు ఉండడం. అంతేకాదు, ఎమ్మెల్సీ చేసుకున్న ఈ మూడవ వివాహానికి రెండో భార్య, కుమారుడు సాక్షులుగా సంతకాలు చేయడం మరో విశేషం. ఇన్ని ట్విస్టులు ఉండడం వలనే ఈ పెళ్లిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.  జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశంలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో కైకలూరు జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో తెలుగుదేశం నుండి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ ఎన్నికల అనంతరం  వైసీపీ గూటికి చేరిపోయారు. వైసీపీ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది.  దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో   వైసీపీ నుండి ఆయనే కైకలూరు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను వెంకటరమణ వివాహం చేసుకోగా.. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రెండో భార్యతో మనస్పర్థలు రాగా.. కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీంతో రెండో భార్య సునీత అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీగా వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాగా. వెంకట రమణ రెండో భార్య సునీత, ఆమె కుమారుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం పెట్టడం గమనార్హం. ఇక, వధువు సుజాతకు ఇది రెండో వివాహం కాగా ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుండి విడిపోగా ఇప్పుడు ఎమ్మెల్సీని వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించనున్నారు. కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ మూడవ పెళ్లిపై ఇంతగా చర్చకు కారణం సొంత పార్టీ నేతలే కావడం గమనార్హం. గతంలో వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసే సమయంలో ఆయన మూడు వివాహాల అంశాన్ని సందర్భం ఉన్నా లేకున్నా లేవనెత్తేవారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ, చివరాఖరికి ముఖ్యమంత్రి తో సహా అందరూ ఇదే అంశంపై దారుణంమైన  విమర్శలు చేశారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే అమ్మ ఒడి నిధులు విడుదల చేస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభం శుభం తెలియని చిన్నారుల ముందే పవన్ కళ్యాణ్ వివాహాలపై మాట్లాడారు. ఈ అంశంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. అప్పటి నుండి సీఎం జగన్ సందర్భం వచ్చినా, రాకున్నా ప్రతిసారీ పవన్ పై ఇవే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక మంత్రులు అంబటి లాంటి వాళ్ళైతే సోషల్ మీడియాలో కూడా దారుణ వ్యాఖ్యలు చేశారు.  కాగా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ మూడవ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు వైసీపీ నేతలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతల విమర్శలే ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరమణ పాలిట శాపంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

విశాఖ జూపార్క్ లో ఎలుగుబంటి దాడి... ఒకరు మృతి

ఎలుగుబంటి దాడిలో విశాఖ జూపార్క్ కీపర్ బానవరపు నగేశ్ (23) మృతి చెందడం కలకలం రేపింది. పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న యువకుడిపై నిన్న ఉదయం ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడిచేస్తుండడాన్ని చూసి సందర్శకులు హడలిపోయారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నగేశ్‌ది విజయనగరం జిల్లాలోని గజపతినగరం. విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రెండేళ్లుగా విశాఖ జూలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నగేశ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించినట్టు జూ క్యురేటర్ నందిని సలేరియా తెలిపారు. నగేశ్‌పై దాడిచేసిన ఎలుగుబంటి ‘జిహ్వాన్’ను మిజోరం నుంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. బోనులో ఉండాల్సిన ఎలుగుబంటి బయటకు ఎలా వచ్చిందన్నది అంతుబట్టడం లేదు. బోను తలుపులు ఎవరైనా తీశారా? లేదంటే, సరిగా వేయకపోవడంతో వాటంతట అవే తెరుచుకున్నాయా? అన్నదానిపై జూ అధికారులు  ఆరా తీస్తున్నారు.ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి నగేష్     వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు.సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

తెలంగాణ తీర్పు ఎవరి వైపు?

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం (నవంబర్ 30)న జరగనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న  నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ, డిసెంబర్ 30న ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత రంగంలో  2,290 అభ్యర్థులు  మిగిలారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కోసం ఎన్నికల సంఘం  36,655 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఒక ఓటర్ల విషయానికి వస్తే 1,58,71,493 పురుషులు 1,58,43,339 స్త్రీలు మరియు 2,557 ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   రాష్ట్రం లోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను, 18 నియోజకవర్గాలు ఎస్సీ   9 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు ఉన్నాయి.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మొత్తం 119 నియోజకవర్గాలలో తన అభ్యర్థులను బరిలో నిలపగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. అలాగే విపక్ష కాంగ్రెస్  రాష్ట్రంలోని 118నియోజకవర్గాలలో  అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలిచారు.  కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సీపీఐ ఒక స్థానం నుంచి బరిలో నిలిచింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే  జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. బీజేపీ, జనసేన కూటమి మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక మరో జాతీయ పార్టీ బహాజన సమాజ్ పార్టీ 106 మంది అభ్యర్థులను, సీపీఎం 19 మంది అభ్యర్థులనుఎంఐఎం 9 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి.  ఈ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని, ప్రభావాన్ని నిలువరించేందుకు జరిపిన తనిఖీలు, దాడులలో ఎన్నికల సంఘం  659.20 కోట్ల  నగదు  జప్తు చేసింది.  2023 శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ లను ప్రకటించగా,  బీజేపీ  సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది.   బిసి వ్యక్తిని   ముఖ్యమంత్రిని చేస్తామని వాగ్దానం చేసింది.  మరో వైపు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  తొమ్మిదేళ్ల పనితీరునే నమ్ముకుంది.  మూడు ప్రధాన పార్టీలూ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సర్వేలు, అంచనాలను పక్కన పెడితే.. తెలంగాణ తీర్పు ఎవరివైపు అన్న ఉత్కంఠ మాత్రం వచ్చే నెల 3 వరకూ కొనసాగుతుంది.  

తెలుగు రాష్ట్రాల్లో  నాలుగు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో  నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఉన్న మలక్కా జలసంధి ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వెల్లడించింది. బుధవారం నుంచి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ తుపానుగా బలపడుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరింది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు గాలి 25 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని పేర్కొంది. డిసెంబర్ 1న గాలి వేగం 60 నుంచి 80 కిలోమీటర్లుగా ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతపవనాలు, తూర్పుగాలుల ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జనగాం, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పింది.