ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు.. ఎప్పుడంటే?

స్కిల్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత దాదాపు రెండున్నర నెలల పాటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు స్టాండ్ స్టిల్ కు వచ్చేశాయి. ఆ పార్టీ మొత్తం చంద్రబాబు అక్రమ అరెైస్టునకు నిరసనలు, ఆందోళనలలో నిమగ్నమైపోయింది. మధ్యలో రాజమహేంద్రవరం జైలు వద్ద జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశం తో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించడం, ఆ తరువాత సమన్వయ కమిటీల ఏర్పాటు, వాటి సమావేశాలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు ఇలా వరుస కార్యక్రమాలు జరిగినా క్షేత్రస్థాయిలో, ప్రజా సమస్యలపై ఆ పార్టీ శ్రేణులు, నేతలు కాన్ సన్ ట్రేట్ చేయలేదనే చెప్పాలి. మొత్తం పార్టీ దృష్టంతా చంద్రబాబు న్యాయపోరాటంపైనే కేంద్రీకృతమైపోయింది. ఈ తరుణంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో ఇక ఇప్పుడు తెలుగుదేశం క్షేత్రస్థాయిలో యాక్టివ్ కావడంపై దృష్టిపెట్టింది.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీనికి తోడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా  నిజం గెలవాలి యాత్రను త్వరలోనే ప్రారంభించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి  పేరుతో నారా భువనేశ్వరి యాత్రచేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు విడుదల కావడం, ఆయన నేత్ర చికిత్స, వైద్యపరీక్షలు వంటి కారణాలతో ఆమె యాత్ర కూడా తాత్కాలికంగా ఆగింది.  అయితే ఇప్పుడు ఆమె నిజం గెలవాలి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటన ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించి అందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.  అయితే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు పర్యటనలు ఎప్పుటి నుంచి మొదలౌతాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తీర్పు వెలువడే వరకూ చంద్రబాబు పర్యటనలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.   వాస్తవానికి చంద్రబాబుకు మధ్యంతర బెయిలు సందర్భంగా విధించిన షరతుల గడువు బుధవారం (నవంబర్ 29)తో ముగిసిపోనుంది. ఆ తరువాత నుంచి ఆయన ప్రచారానికి, పర్యటనలకు ఎటువంటి షరతులూ ఉండవు. అయితే సుప్రీం కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై తీర్పు కూడా దాదాపుగా అదే రోజున వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయనిపుణులు మంగళవారం(నవంబర్ 28)న సుప్రీం తీర్పు వెలువరించే అవకాశాలున్నాయని భావించినా... ఆ రోజు సుప్రీంలో చంద్రబాబు క్వాష్ లిస్ట్ కాకపోవడంతో బుధవారం(నవంబర్ 29)  క్వాష్ పై తీర్పు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే గురువారం  పైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంలో విచారణ ఉంది. దాని కంటే ముందుగానే క్వాష్ పై తీర్పు వెలువరిస్తామని సుప్రీం బెంచ్ తెలిపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే క్వాష్ పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన తరువాతనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా ఆయన  మధ్యంతర బెయిలు ఆంక్షలు ముగిసిన అనంతరం గురువారం  (నవంబర్ 30) తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.   సుప్రీంకోర్టులో క్వాష్ పై సానుకూల తీర్పు వచ్చిన తరువాత చంద్రబాబు కార్యాచరణ ప్రారంభమౌతుందని చెబుతున్నాయి.   అందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి భారీ బహిరంగ సభలలో చంద్రబాబు ప్రసంగిస్తారని చెబుతున్నారు.  వాటిలో తొలి సభను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే తెలుగుదేశం సన్నాహాలు చేస్తున్నది. హిందుపురం ఎమ్మెల్యే బాలయ్య సహా  తెలుగుదేశం, జనసేన ముఖ్య నేతలంతా ఈ సభలో పాల్గొని ఇరు పార్టీలూ వచ్చే ఎన్నికలలో సమష్టిగా పని చేస్తున్నాయన్న సంకేతాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నాయి.  ఈ సభా వేదిక నుండే   ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.   

బాబూస్ కు తెలిసిపోయింది.. సర్దేసుకుంటున్నారు!

రాజకీయ నాయకుల లెక్కలు తప్పవచ్చును. రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారు కావచ్చును. పీకేల సర్వేలు, జ్యోతిష పండితుల లెక్కలూ తపవ్వచ్చును, కానీ, రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో, ఈరోజే పక్కగా చెప్పేయగలిగిన వారు ఎవరంటే వారు  ప్రభుత్వ అధికారులు మాత్రమే. అవును నిజమే.. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు చాలా గుంభనంగా అసలేమీ తెలియనట్లు ఉంటారు  వారు ప్రత్యక్షంగా ప్రజలలోకి రారు. సర్వేలు చేయరు. విశ్లేషణలు చెప్పరు.. కానీ, రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడఏమేం జరుగుతోందో  ఇట్టే పట్టేస్తారు. పసిగట్టేస్తారు.  రాజకీయలతో అసలు ఏమాత్రం సంబంధం లేనట్లుండే వీరు ఆ రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని  కూడా చూసేయగలరు.  అందుకు తగ్గట్టుగా తమ స్ట్రాటజీలు మార్చుకుంటారు. ఇప్పడు ఏపీలో అదే జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు వరసగా క్యూ కట్టి మరీ రహస్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే నిజాన్ని  అధికారులు  ఇప్పటికే.. ఇప్పటికే ఏమిటి ఎప్పుడో  పసిగట్టారు. అందుకే, అలా ఒకరివెంట ఒకరుగా ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదో విధంగా చంద్రబాబును కలుసుకునేందుకు తహతహలాడుతున్నారు.  నిజానికి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో వైఎస్సారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి అధికారులను అడ్డగోలుగా వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బుక్కయ్యారు. జైలు పాలయ్యారు. అలాగే జగన్ రెడ్డి  ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కారు. అవమానాలు ఫేస్ చేశారు. చీవాట్లు తిన్నారు. అయినా తాము చేసిది, చేస్తున్నది తప్పేనని తెలిసినా  కొందరు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఒత్తిళ్ళకు తలొగ్గి పని చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను అనేక విధాల వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు అలాంటి వారంతా, ప్రభుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో నే తాము అడ్డ‌గోలు  నిర్ణ‌యాలు తీసుకోక త‌ప్ప‌డం లేద‌ని  ప్రైవేటు సంభాషణల్లో వాపోతున్నారు.అలాంటి వారు ఇప్పడు గతంలో చంద్ర‌బాబు నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ... త‌మ త‌ప్పుల్ని మ‌న్నించేయాల‌ని ముందుగానే వేడుకోవడానికి రెడీ అయిపోతున్నారు.   మరీ ముఖ్యంగా ఏపీ సీఐడీలో ప‌నిచేస్తున్న వారు చంద్ర‌బాబుని ఎలాగైనా క‌లిసి త‌మ త‌ప్పేమీ లేద‌ని, పై అధికారులు, రాజకీయ పెద్దలు ఆడుతున్న జగన్నాటకంతో తాము పావులమంటూ   చెప్పుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు.   అలాంటి దారులేవీ కనిపించని  అఖిల భారత సర్వీస్ అధికారులు ఇప్పుడు తప్పించుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎలాగోలా రాష్ట్రం వదిలి వెళ్లిపోతే చాలని భావిస్తున్నారు.  ఢిల్లీ సర్వీస్ కు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.  వీరిలో కొందరు జగన్ రెడ్డి సర్కార్ వచ్చాక వివిధ చోట్ల నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి  జగన్ ఏరికోరి తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.   మరికొందరు రాష్ట్ర సర్వీస్ అధికారులు కూడా ఉన్నారు.  వీళ్లందరికీ జరిగిందేమిటో తెలుసు, తమ తప్పిదాలేమిటో కూడా తెలుసు.  ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో తెలుసు. జైలుకు వెళ్లే పరిస్థితి ఎదురౌతుందన్న ఆందోళన వీరిలో ఏర్పడిందని అంటున్నారు. అందుకే  అందుకే ముందుగానే  సర్దేసుకుని రాష్ట్రం వదిలిపోయేందుకు దారులు వెతుక్కుంటున్నారు.  కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.   అలా వెళ్లాలంటే.. ఇక్కడ జగన్ రెడ్డి సర్కార్ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇవ్వాలి. మళ్లీ మనమే వస్తామని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఎంతగా చెబుతున్నా బాబూస్ నమ్మడం లేదు. మళ్లీ జగన్ సర్కార్ వస్తే తిరిగి వస్తాం కానీ ఇప్పుడైతే మమ్మల్ని రిలీవ్ చేసేయండని, ఎన్వోసీ ఇవ్వండనీ బతిమలాడుకుంటున్నారు.  దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ కొందరికి ఎన్వోసీ ఇచ్చేసింది.  ఇలా రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని భావిస్తున్న వారిలో సీఐడీలో పని చేసిన సంజయ్, సునీల్ కుమార్,   స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారి రామకృష్ణ, ప్రవీణ్ ప్రకాష్ సహా.. పది మంది  ఉన్నారు.  కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయినంత మాత్రానా చేసిన తప్పిదాలన్నీ చెరిగిపోయే పరిస్థితి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అంచనాలకు అందనంత భారీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యయం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు మూడూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ అయితే ఈ ఎన్నికలలో డూ ఆర్ డై అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో నే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రికార్డు  ఓటింగ్ శాతంలోనో, మెజారిటీలలోనో, జయాపజయాలలోనో  కాదు..   ఓటరు చైతన్యం విషయంలో  అయితే అసలు కానే కాదు. మరి దేంట్లో అంటే  ఎన్నికల వ్యయంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ తిరగరాస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో పోటీలో ఉన్న అభ్యర్థులే కాదు, సామాన్య జనం కూడా పరిశీలకుల విశ్లేషణలతో ఏకీభవిస్తున్నారు.  మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యయంలోనే రికార్డులు తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసి కొత్త రికార్డును సృష్టిస్తాయనీ, ఈ విషయంలో సందేహాలకు, అనుమానాలకూ ఆస్కారమే లేదని అంటున్నారు. గతంలో ఉప ఎన్నికలలోనే ధన ప్రవాహాన్ని చూసి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఉప ఎన్నిక జరిగితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అప్పట్లో జనం వ్యక్తం చేశారు. ఆమేరకు పలు నియోజకవర్గాలలో డిమాండ్లు కూడా వెల్లువెత్తిన సంగతి విదితమే. తమ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేపై రాజీనామాకు జనం నుంచి ఒత్తిడి పెరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల వ్యయంలో గత రికార్డులు పదిలంగా ఉండే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.  ఎన్నికల ఖర్చు విషయంలో  ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.   తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది.  హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు, కానీ ఒక అంచనా ప్రకారం ఆ ఉప ఎన్నికకు అయిన ఖర్చు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని అప్పట్లో గట్టిగా వినిపించింది.   ప్రభుత్వమైతే హుజారాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని తెలిసిన క్షణం నుంచీ అంటే మూడు నాలుగు నెలల ముందు నుంచీ  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసమంటూ   ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అధికారిక లెక్కలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. అది కాకుండా అధికార పార్టీ హుజూరాబాద్ లో విజయం కోసం చేసిన ఖర్చు అదనం. అలాగే అధికార పార్టీకి దీటుగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థి ఈటల విజయం కోసం వ్యయం చేసింది. ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో గట్టిగా జరిగింది.  హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే,  అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన  కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు  అప్పట్లో తెరాస నాయకులను బహిరంగంగా నిలదీశారు. ధర్నాలు చేశారు. ఆందోళనలకు దిగారు. అదీ  హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో  సృష్టించిన చరిత్ర. వాస్తవానికి  హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత  రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు.  అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.  ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది.  అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో  ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి.   మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది.  అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.  ఈ నేపథ్యంలోనే  అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  మొత్తం మీద తెలంగాణ ఎన్నికలను డబ్బే శాసిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  వాస్తవానికి ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు.  అయితే ఎలా చూసుకున్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ  వంద కోట్లకు పైగా వ్యయం చేశారని అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచీ కోట్లలో పట్టుబడుతున్న నగదే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఆలయాల్లో ప్రమాణాలు.. స్టాంప్ పేపర్ మీద బాండ్లు.. కొత్తపుంతలు తొక్కుతున్న కాంగ్రెస్ ప్రచారం!

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు, విశ్వసనీయత పొందేందుకు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. హామీలు ఇచ్చి విస్మరించే ప్రశక్తే లేదని నమ్మకంగా చెబుతోంది. ఇందు కోసం ఆ పార్టీ అభ్యర్థులు ఆలయాల్లో ప్రమాణాలు చేస్తున్నారు. స్టాంప్ పేపర్ మీద బాండ్లు రాస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని ప్రజలలో నమ్మకం కలిగేందుకు చేయగలిగినంతా చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు అని కాకుండా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా రంగంలో ఉన్న వారంతా ఆరుగ్యారంటీల అమలు పూచీ మాదేనని భరోసా ఇస్తున్నారు. ఇందు కోసం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాలలో ఆలయాలలో ప్రమాణం చేసి, ఆరుగ్యారంటీల అములు పూచీపడతామని బాండ్ పేపర్లపై రాసి సంతకాలు చేశారు. అయితే ఈ బాండ్లు చెల్లడం, చెల్లక పోవడం సంగతి పక్కన పెడితే ప్రజలలో కాంగ్రెస్ హామీలు అమలు చేస్తుందన్న నమ్మకాన్ని కలిగించడాని ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నది.   కాంగ్రెస్ ఆరు గ్యారంటీలూ ప్రజలను ఆకర్షించాయనడంలో సందేహం లేదు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలంగాణలో అధికార బీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా ప్రచారం చేశాయి. కర్నాటకలో కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందంటూ ఆరోపణలు గుప్పించాయి. దీంతో ప్రజలలో లేశమాత్రంగానైనా అనుమానం కలగకూడదన్న భావనతో కాంగ్రెస్ ఈ విధంగా ప్రమాణాలు, బాండ్ పేపర్లపై సంతకాల కార్యక్రమాన్ని చేపట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న కాంగ్రెస్, ఆ సానుకూల పరిస్థితులను మరింత పటిష్టం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్యారంటీలపై చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడానికే ఇలా ఆలయాలలో ప్రమాణాలూ, హామీల అమలుకు పూచి పడుతూ బాండ్ పైపర్లపై సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టిందని చెబుతున్నారు. ప్రచారగడువు ముగిసే చివరి రోజు బీఆర్ఎస్ మరిన్ని ఆరోపణలు, విమర్శలతో హోరెత్తించే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు దీటుగా ఎదురుదాడికి కూడా రెడీ అయ్యిందని అంటున్నారు.   రైతు బంధుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఎన్నికల సంఘం దానిని వెనుకకు తీసుకోవడానికి కారణం హరీష్ రావు కోడ్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా చేసిన ప్రసంగం, ప్రకటనే కారణమైనా, నెపాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్  రెడ్డిపై నెట్టేయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు.  కాంగ్రెస్  ఫిర్యాదు వల్లనే ఈసీ రైతుబంధుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేసిందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఎత్తి చూపుతున్నారు. రైతు బంధు అనుమతుల రద్దుకు ఎన్నికల సంఘం స్పష్టమైన కారణాన్ని తెలిపినా.. కాంగ్రెస్ రైతు ప్రయోజనాలకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారనీ, అందుకే రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుందనీ   కేసీఆర్  సహా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈసీకి రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించింది. అయితే అది ఫేక్ అని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.  ఇలా కాంగ్రెస్ జోష్ కు బ్రేకులు వేయడానికి రానున్న రెండు రోజులలో బీఆర్ఎస్ మరిన్ని ఎత్తులు, వ్యూహాలతో చేయగలిగినన్ని ప్రయత్నాలు చేస్తుందనీ,  అప్రమత్తంగా ఉండాలనీ రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ కు ఈ సారి సానుకూల వాతావరణం ఉండటంతో బీఆర్ఎస్ లో గుబులు మొదలైందని పరిశీలకులు అంటున్నారు. 

ఒకడే ఒక్కడు మొనగాడు అన్నట్లుగా కాంగ్రెస్ లో రేవంత్ వన్ మేన్ షో!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్  మరో మూడు రోజులలో జరగనుంది.  ప్రచారానికి మంగళవారం (నవంబర్ 28) చివరి రోజు.   ఈ క్రమంలోనే తెలంగాణలో అన్ని పార్టీలుముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. అభ్యర్థులూ క్షణం తీరిక లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలైతే కాళ్ళకు బలపాలు కట్టుకొని తెగ తిరిగేస్తున్నారు. అధికార  బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ రోజుకు ఐదారు సభలలో పాల్గొంటుంన్నారు. ఇదే పార్టీలో ఇతర ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ రావులు రోజుకి ఐదు సభలకు తగ్గకుండా పాల్గొని ప్రసంగాలు చేస్తున్నారు. చివరికి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా   ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ సహా జాతీయ స్థాయి నేతల నుండి ఇతర రాష్ట్రాల నేతలు,  రాష్ట్రంలో ఉన్న బడా నేతలంతా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అంతా రేవంత్ రెడ్డే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని చోట్లా కనిపిస్తున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, మీడియా డిబేట్లు ఇలా ఎక్కడ చూసినా రేవంతే కనిపిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా డిబేట్లలో కూడా రేవంతే పాల్గొంటున్నారు. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలకు కరువు లేదు. జానారెడ్డి, వీహెచ్ నుండి మొదలు పెడితే.. కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి యాక్టివ్ లీడర్లుచాలా చాలా మందే ఉన్నారు. కానీ, వీళ్ళెవరూ ఎక్కడా  పెద్దగా కనిపించడం లేదు. మహా అయితే వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు, సిట్టింగ్ స్థానాలకు  మాత్రమే వీరి ప్రచారం పరిమితమైనట్లు కనిపిస్తోంది. కానీ, రేవంత్ మాత్రం స్వయంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తూ కూడా ఒక్కడే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. పార్టీ ప్రచారాన్ని భుజాలపైకి ఎత్తుకొని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను ఏకిపారేస్తూ, ప్రచారాన్ని హోరెత్తిస్తూ అలుపెరగకుండా పని చేస్తున్నారు. అధిష్టానం రేవంత్ కోసం ప్రత్యేకంగా ఓ హెలికాఫ్టర్ కూడా కేటాయించగా.. రోజుకి అరడజనుకు తగ్గకుండా సభలు, ర్యాలీలలో పాల్గొంటున్నారు. సాయంత్రమైతే ఏదో ఒక మీడియా ఛానెల్లో డిబేట్ పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్‌లో రేవంత్ వన్‌మెన్‌ షో నడుస్తోంది.   నిజానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీ  రూపురేకలు మారడం మొదలైంది.  అలిగిన నేతను బుజ్జగించారు.. ఎదురు తిరిగితే మందలించారు. సొంత పార్టీ నేతలే పరాయి వాడిలా చూసినా సహించారు. ఇంటింటికీ తిరిగి సీనియర్లను బ్రతిమాలి , బామాలి పార్టీలో కలుపుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయంటే అందుకు రేవంత్ ముఖ్య కారణమని చెప్పక తప్పని పరిస్థితి తెచ్చారు. ఎన్నికల సమరానికి షెడ్యూల్‌కు ముందే సమాయత్తమైన రేవంత్.. రైతు, మహిళా, బీసీ అజెండాలను పార్టీ అగ్రనేతలతో విడుదల చేయించారు. సోనియాగాంధీని పిలిపించి ఆరు గ్యారంటీ హామీలు ప్రకటింపచేసి బీఆర్‌ఎస్‌కు ఓ సవాల్‌ విసిరారు. ఇక అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి వ్యవహించారు. కాస్త ఆలస్యమైనా బలమైన అభ్యర్థులనే బరిలో దించారు. చివరికి పొత్తుల సమయంలో కూడా సీనియర్లంతా ఉన్నా కోదండరాం టీజేఎస్, సీపీఐలతో చర్చలు జరిపి ఒప్పించారు. ఇక ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితిని   ఓట్లుగా మార్చేందుకు రేవంత్ ఒక్కడే పార్టీ ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు.  ఆది నుండి ఎలా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందనే అంచనా ఉంది. కనుక గెలిస్తే తామే సీఎం అంటూ ఇలాంటి సమయంలో సీనియర్లు బయటకి రావడం కాంగ్రెస్ పార్టీలో సంప్రదాయం. వారిలో ఛరిస్మా ఉన్నా లేకపోయినా ఈ నాలుగు రోజులు ప్రచారంలో తెగ తిరిగేసి తాము తెగ కష్టపడ్డామని, తమకే పదవులు కావాలని డిమాండ్ చేసేవాళ్ళ సంఖ్య కాంగ్రెస్ లో ఎక్కువగానే ఉంటుంది.  ఇక ఎప్పుడూ అలకపాన్పుపై ఉండే నేతలు, పార్టీకి నేనే సీనియర్, నా వలనే కాంగ్రెస్ ఇంకా బ్రతికి ఉందనే నేతలకు కూడా కొదవ లేదు.  కానీ, హైకమాండ్ ఏం చెప్పిందో.. వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రణాళిక ఏంటో.. రేవంత్ ఎలా ఒప్పించారో కానీ.. తెలంగాణ ఎన్నికలలో రేవంత్ వన్ అండ్ ఓన్లీ హీరో అయిపోయారు. ఆర్ధికంగా కూడా పార్టీ కోసం రేవంత్ భారీగానే ఖర్చు పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రేపు ఫలితం ఎలా ఉన్నా అందుకు తొలి క్రెడిట్ అందుకొనే నేతగా రేవంత్ ఎమర్జ్ అయ్యరనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. 

పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఈసీ మెనూ ఇదే!

తెలంగాణలో పోలింగ్ రోజున విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎన్నికల సంఘం మెనూ రెడీ చేసింది. ఈ నెల 30న తెలంగాణలో పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఎన్నికలలో విధుల కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ లో 15 మంది విధులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులలో ఉండే సిబ్బంది, అధికారులకు ఓకే మోనూను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఒక్కో పోలింగ్ స్టేషన్ లో  నలుగురు పోలింగ్ పర్సన్స్, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక వెబ్ కాస్టింగ్ పర్సన్,  ఒక బీఎల్ఓ, ఇద్దరు వాలంటీర్లు, ఇద్దరు స్వీపర్ /అటెండర్, ఇద్దరు  పోలీసులు మొత్తం 12 మంది  ఉంటారు.  వీరికి అదనంగా మరో ముగ్గురు రిజర్వులో ఉంటారు.  వీరి విధులు నవంబర్ 29న  ప్రారంభం అవుతాయి. నవంబర్ 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, 30న పోలింగ్ సెంటర్ వద్ద వారికి అందించబోయే బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ కోసం ఒక్కో పోలింగ్ స్టేషన్ కు 3,800 రూపాయల చొప్పున వ్యయం చేయనుంది. ఈసీ మేరకు ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద బ్రేక్ ఫాస్ట్ లోకి గోధుమ రవ్వ కిచిడీ, పల్లీల చట్నీ, టమాటా చట్నీ, చాయ్ ఇస్తారు.  ఇక మధ్యాహ్నం లంచ్ కింద రైస్, వెజ్ కర్రీ, ఎగ్ పులుసు, సాంబార్ లేదా రసం, పెరుగు, పాపడ్, చట్నీ అందిస్తారు. సాయంత్రం స్నాక్స్ లో బిస్కెట్, టీ ఇస్తారు. ఇక పోలింగ్ రోజున ఉదయం ఆరు అరున్నర గంటల మధ్య టీ, బిస్కట్, ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ కింద ఉప్మా, టమాటాచట్నీ అందిస్తారు. ఇక లంచ్ కింద రైస్, చపాతీ, వెజ్ కర్రీ, పప్పు, సాంబార్ లేదా రసం, పెరుగు, చట్నీ, బాయిల్డ్ ఎగ్ అందజేస్తారు. ఇక సాయంత్రం స్నాక్స్ గా టీ, బిస్కట్ ఇస్తారు. ఇక పోలింగ్ పూర్తి అయిన తరువాత డిన్నర్ లోకి చికెన్ కర్రీ అందిస్తారు. డిన్నర్ లో వెజిటెబుల్ పులావు, చపాతి, చికెన్ కర్రీ, వంకాయ మసాలా కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు, పాపడ్ అందిస్తారు.  

బీటెక్ రవి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్ ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు. మొదట రవి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి వెనక్కి పంపించారు. ఇవాళ కడప కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం ఘటన జరిగితే ఇంత వరకు ఏం చేశారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. డిసెంబర్ 11 వరకు రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ ను పొడిగించడంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  అయితే రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు టికెట్ బెట్టింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో రవికి 41ఏ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. బెట్టింగ్ కేసును ఇప్పటికిప్పుడు నమోదు చేశారని అటు రవి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవికి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను కడప జైలుకు తరలించారు.  బీటెక్ రవిని నిన్నరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గన్ మెన్లు, డ్రైవర్ ను వదిలేసి రవిని అదుపులోకి తీసుకొని అల్లూరి పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి నేరుగా కడపకు తీసుకెళ్లారు. కడప రిమ్స్ ఆస్పత్రితో వైద్య పరీక్షల అనంతరం రవిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

పరుచూరులో వైసీపీ అరాచకం.. మాట వినని అధికారులపై సస్పెన్షన్ వేటు!

ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం కుట్రపూరితంగా జరుగుతున్నదని ప్రతిపక్ష  తెలుగుదేశం చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా  తెలుగుదేశం సానుభూపతి పరుల ఓట్లను తొలగిస్తున్నదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన ఈసీ ఇద్దరు అధికారులపై కూడా వేటు వేసింది. అయినా.. ఈ ప్రక్రియ ఆగలేదని, ప్రతి నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకోసం అధికారులపై వైసీపీ నేతలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, పలు చోట్ల అధికారులు ఈ ఒత్తిడి తట్టుకోలేక  సెలవు పై వెళ్లిపోతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. కాగా ఈ వ్యవహారంలో అసలు వైసీపీ నేతల మాట వినని అధికారులను సస్పెండ్ చేయించేందుకు కూడా వెనకాడడం లేదట.  వైసీపీ నేతల మాట విని అక్రమంగా వ్యవహరిస్తే రేపు న్యాయస్థానాలలో  చిక్కులు తప్పవనే భయంతో అధికారులు కొందరు అక్రమంగా ఓట్ల తొలగింపునకు, దొంగ ఓట్ల నమోదుకు నిరాకరిస్తున్నారు. దీంతో అలాంటి వారిని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు వారిపై సస్పెన్షన్ వేటు పడేలా చేస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతో  రాష్ట్రంలో అధికారుల పరిస్థితి విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది. ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా ఓట‌ర్ల ముసాయిదా జాబితాల్లో స‌వ‌ర‌ణ‌ల ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. డిసెంబ‌రు 15 నాటికి తుది జాబితా వెలువ‌డ‌నుంది. దీంతో స‌ద‌రు జాబితాలపై అధికార పార్టీ నాయ‌కులు క‌స‌ర‌త్తు ముమ్మరం చేయ‌డం వివాదాల‌కు దారి తీస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలలో భారీగా   ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందనీ,  ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగింపు లక్ష్యంగా ఇది కొనసాగుతోందని. ఇప్పటికే ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడగా.. అధికారులు భయంతో వణికిపోతున్నారనీ అంటున్నారు. కానీ  వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఈ ఓట్ల తొలగింపు ముమ్మరం చేసిందంటున్నారు. ఇందుకోసం ఎక్కడిక్కడ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని ఓ ప్లాన్ ప్రకారం వ్యవహారం నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా వైసీపీ ఓట్ల తొలగింపు ముమ్మరంగా జరుగుతున్న నియోజకవర్గాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం నుండి ఏలూరి సాంబశివరావు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. పరుచూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడంలో సందేహం లేదు. రానున్న ఎన్నికలలో కూడా ఏలూరి ఇక్కడ నల్లేరు మీద నడకేనన్న భావన ఉంది.  గత ఎన్నికల తర్వాత ఏలూరిని వైసీపీలోకి రావాల్సిందిగా అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి చేసింది. అయితే ఏలూరి మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకుని  నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీని వీడలేదు.  మరోవైపు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రిది కూడా ఇదే నియోజకవర్గం. ఆమె ఇక్కడ పోటీ చేయకపోయినా ఆమెకు సొంత బలం ఉంది. ఈ ఇద్దరినీ ఒకేసారి దెబ్బకొట్టాలంటే వైసీపీ ఇక్కడ గెలవాలన్నది టార్గెట్. దీని కోసమే ఇక్కడ వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఇక్కడ వైసీపీ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను రంగంలోకి దింపింది. తెలుగుదేశం టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాంకు చీరాల టికెట్ హామీతో ఆమంచిని అక్కడ నుండి పరుచూరుకు తరలించింది. ఈ క్రమంలోనే ఆమంచి ఏది అడిగినా అధిష్టానం కాదనకుండా  ఇస్తూ స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో భారీగా ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తున్నాయి.  అయితే, ఈ వ్యవహారంలో  ఆమంచి మాట వినడం లేదని కొందరు తహసీల్దార్లపై పలు రకరకాల సాకులుతో సస్పెన్షన్ వేటు పడిందని అంటున్నారు.  మరో మండలంలో ఓ అధికారి ముందే బదిలీపై వెళ్లిపోగా..  ఇప్పుడు ఇక్కడకు కొత్తగా బదిలీపై వచ్చేందుకు అధికారులు ససేమీరా అంటున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులను అధికార పార్టీ ఏరి కోరి తెచ్చుకుందని తెలుగుదేశం ఆరోపిస్తోంది.  దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నది. 

ముసుగు తీసేసిన బీజేపీ!

సిద్ధాంతాలకు బద్ధమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసి అధికారపార్టీని అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతున్నా పట్టించుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకూ రెచ్చిపోయి మరీ అధికార పార్టీ కుటుంబపాలన, అవినీతిపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు ఎలాంటి బేషజాలూ లేకుండా పొగడ్తలు గుప్పిస్తోంది. తానెటూ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.. కనీసం జాతీయ స్థాయిలో తనతో పోటీ పడే కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంచితే చాలన్న చందంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్   అన్న బీజేపీ నినాదం జాతీయ స్థాయిలో నీరుగారిపోవడాన్ని గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రాలలో అధికారం కోల్పోయినా ఫరవాలేదు.. కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచితే చాలన్న వ్యూహాన్ని అముల చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.  తెలంగాణలో మొదటి నుంచీ బీఆర్ఎస్, బీజేపీలు పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసమే పని చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ గా ప్రతిపక్ష పార్టీలే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణించారు.  వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన తీరుతో ఆ ఆరోపణలు, విమర్శలూ అన్నీ వాస్తవమేనని తేల్చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న ప్రచారం క్షేత్రస్థాయిలో  ఉంది. అందుకు బలం చేకూర్చే విధంగా బీజేపీ తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తీరు ఒక్క బీజేపీనే కాదు.. అధికార బీఆర్ఎస్ ను కూడా  డ్యామేజి చేస్తోందని అంటున్నారు. వీటన్నిటికీ పరాకాష్ట అన్నట్లుగా ఇంత కాలం బీజేపీలో ఉండి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన  దళిత నేత జి.వివేక్, ఆయన సోదరుడు వినోద్, ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై జరిగిన ఐటీ, ఈడీ దాడులను పరిశీలకులు చూపుతున్నారు. ఈ దాడులు  బీజేపీ, బీఆర్‌ఎస్ బంధాన్ని మరింత బలపరిచేలా ఉన్నాయంటున్నారు. నిన్నటి వరకూ ఉన్న ముసుగును బీజేపీ, బీఆర్ఎస్ లు తొలగించేశాయనీ, కాంగ్రెస్ కు అధికారం నుంచి దూరం చేయడానికే ఇంత కాలం ప్రత్యర్థులుగా రాజకీయం చేశామనీ చెప్పకనే చెప్పినట్లైందని అంటున్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థులు లక్ష్యంగా  జరుగుతున్న దాడులు బీజేపీ, బీఆర్ఎస్ రహస్యమైత్రిని బట్టబయలు చేస్తున్నాయనీ, అలాగే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా ఉన్న సంబంధాలను సందేహాలకు అతీతంగా బయటపెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మంత్రి అంబటి నో టికెట్.. పక్కన పెట్టేసిన వైసీపీ?!

ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబును వైసీపీ పెద్దలు ఇంటికి పంపించేస్తారా? రానున్న ఎన్నికలలో ఆయనకు టికెట్ లేనట్లేనా? మాజీ మంత్రిగానే కాకుండా మాజీ ఎమ్మెల్యేను కూడా చేసేస్తారా? ఈసారి సీటు కేటాయించడం కష్టమేనని వైసీపీ అధిష్టానం అంబటికి తేల్చి చెప్పేసిందా? నెక్స్ట్ అంబటి రాజకీయ ప్రయాణం ఎటు? అసలు మంత్రి కాగలిగిన అంబటి ఈసారి కనీసం సీటు కూడా దక్కించుకోలేనంతగా ఎందుకు దిగజారిపోయారు? ఇదే  చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో, అలాగే వైసీపీ వర్గాలలో జోరుగా సాగుతోంది.  మంత్రి అంబటి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నిత్యం ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడమే ఆయన ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలు, విధులను  ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం తెలుగుదేశం, జనసేనల మీద విమర్శలు చేడడమే మంత్రులుగా తమ బాధ్యత, విధి, విద్యుక్తధర్మం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరందరిలోనూ అంబటిది ఒక ప్రత్యేక స్టైల్  ప్రతిపక్ష నేతలు ఎవరు ఏం మాట్లాడినా స్పందించడానికి ఆయన ఎవర్ రెడీ బ్యాటరీలా రెఢీ అంటారు.  పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏమైందంటే మాత్రం నీళ్లు నములుతారు.  ప్రజలకు ఏది అవసరం? అసలు ప్రజలు, ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారన్నది ఎప్పుడో మర్చిపోయిన అంబటి తనను మంత్రిని చేసిన జగన్ మోహన్ రెడ్డిపై ఈగ వాలకుండా చూసుకోవడమే తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే  జగన్ ను ఎవరు ఏమన్నా.. వారిపై నోరు పారేసుకుంటూ, మాటల దాడి, విమర్శల యుద్ధం చేయడమే పనిగా పెట్టుకు్నారు.  ఈ విమర్శల దాడి కొన్నిసార్లు రాజకీయాలను దాటి వ్యక్తిగతంగా కూడా మారిపోతుంటుంది. అందుకే విపక్షాలు ఆయన అంబటి అని కాకుండా ఆంబోతు అని అంటుంటాయి.  అయితే   అధినేత మెప్పు కోసం ఇంత చేసిన అంబటికి ఈసారి టికెట్ దక్కడం కూడా కష్టమే అన్నది ఇప్పుడు వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న మాట. సత్తెనపల్లి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే  అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఈ సీటు నుంచి దిగ్గజ నేతలు ఎందరో పోటీ చేసి గెలిచారు. మాజీ స్పీకర్, మాజీ మంత్రి, దివంగత నేత కోడెల శివప్రసాదరావు   ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మంత్రి అంబటి ఇక్కడ వైసీపీ తరఫున గెలిచారు. అయితే  2024లో కూడా సత్తెనపల్లి సీటు తనకే కేటాయించాలని అంబటి కోరుతున్నా.. అధిష్టానం అందుకు సుముఖంగా లేదని చెప్తున్నారు. అంతేకాదు, ఇక్కడ నుండి అంబటి బదులు మరో అభ్యర్థిని పరిశీలిస్తున్నారట. నిజానికి అంబటి సత్తెనపల్లికి నాన్ లోకల్. గత ఎన్నికలలో ఇక్కడ కాపు నాయకుడికి కేటాయించాలనే  ఏకైక కారణంతో అంబటి ఈ సీటు దక్కించుకోగలిగారు. అయితే, ఎమ్మెల్యేగా, మంత్రిగా  అంబటిపై తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే అంబటిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఆయన సొంత సామాజికవర్గంలో కూడా అంబటికి ఏమాత్రం సానుకూలత లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ కు అందిన నివేదికలు కూడా అదే తేల్చేశాయి.  సత్తెనపల్లి తెలుగుదేశంఇన్ చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో  ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా రంగంలో ఉంటారన్నది కూడా దాదాపు ఖరారైపోయింది.  అసలే అంబటిపై ఉన్న వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ రిస్క్ చేసేందుకు ఇష్టపడడం లేదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అందుకే వైసీపీ అధినేత ఈ సారి టికెట్లు నిరాకరించేవారి జాబితాలో అంబటి ఫేరే ఫస్ట్ న ఉందని పార్టీ వర్గాలే బాహాటంగా ఇసుమంతైనా సంకోచం లేకుండా చెబుతున్నాయి.  సత్తెనపల్లి నుండి అంబటిని పక్కన పెట్టి,  మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డిని వైసీపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎర్రం.. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా వెనకబడిపోయారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఎర్రంకు కేవలం పది వేల ఓట్లే వచ్చాయి. వ్యక్తిత్వంగా మృదు స్వభావి అనే పేరున్న ఎర్రంను ఇప్పుడు వైసీపీ రంగంలోకి దించాలని భావిస్తున్నదని చెబుతున్నారు.   ఇక్కడ టీడీపీ నుండి కన్నా పోటీ చేయనుండగా కాపు సామాజికవర్గం ఆయనను సాలిడ్ గా బలపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక మిగతా సామాజికవర్గాలపై ఫోకస్ పెట్టేందుకు ఎర్రం అయితేనే  బెటరని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అదే జరిగితే ఇక అంబటి మాజీ మంత్రేకాదు మాజీ ఎమ్మెల్యే అవడం కూడా గ్యారంటీ అంటున్నారు  పరిశీలకులు.

కాంగ్రెస్ కు 75 నుంచి 80 సీట్లు.. సునీల్ కనుగోలు తాజా నివేదిక

పోలింగ్ కు రెండు రోజుల ముందు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తారస్థాయికి చేరింది.ఇదుకు కాంగ్రెస్ వ్యూహకర్త ఎన్నికలలో కాంగ్రెస్ విజయంపై ఇచ్చిన తాజా నివేదికే కారణం. అంతకు ముందు  నాలుగు రోజులుగా తెలంగాణలో తన వ్యూహాలు సరిగా అమలు కావడం లేదనీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ సునీల్ కనుగోలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, తెలంగాణలో విజయం కోసం తానిక పని చేయబోననీ, తన బృందంతో సహా బెంగళూరుకు వెళ్లిపోతున్నాననీ పార్టీ హైకమాండ్ కు లేఖ రాశారనీ, ఇదే విషయాన్ని ఆయన తెలంగాణ సీనియర్లతో కూడా పంచుకున్నారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సరిగ్గా ఎన్నికల వేళ, కాంగ్రెస్ లో ఇదేం ట్విస్ట్ అని పరిశీలకులు సైతం విస్మయం చెందారు. సునీల్ కనుగోలు అసంతృప్తిపై సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో కాంగ్రెస్ శిబిరంలోనూ ఒకింత గాభరా కనిపించింది. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ సునీల్ కనుగోలు కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపే నివేదికను వెల్లడించారు.  సునీల్ కనుగోలు నివేదిక మేరకు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని జేజిక్కించుకోవడం ఖాయం. ఆయన అంచనా ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ 75 నుంచి 80 స్థానాలలో విజయం సాధిస్తుంది.  తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్యతో కూడా సునీల్ కనుగోలు ఇదే విషయాన్ని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  కాగా ఆదివారం (నవంబర్ 28) రాష్ట్రంలో పర్యటించిన సిద్దరామయ్యతో సునీల్ కనుగోలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికలు, ఫలితాలపై తన తాజా  రిపోర్టులతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంశాలు, ఆరుగ్యారంటీలపై ప్రజలలో ఏర్పడిన విశ్వాసం తదితర అంశాలకు కూడా వివరించినట్లు పార్టీ వర్గాులు చెబుతున్నాయి.   ఈ సందర్భంగా వారిరువురి మధ్యా సెగ్మంట్ ల వారీగా జయాపజయాలు, ఓట్ల శాతం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందుగానే సిద్దరామయ్య పార్టీ క్యాడర్ కు, నాయకులకు గ్రీటింగ్స్  చెప్పారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ఆయన పేర్కొన్నారు.  తెలంగాణ ఎన్నికల తరువాత కాంగ్రెస్ టాస్క్  దేశంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమేనని ఆయన వ్యాఖ్యనించారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగుతోందన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు  జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ విజయభేరి మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన సిదర్ధరామయ్య ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనీ, కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

రైతు బంధుకు ఈసీ బ్రేక్.. హరీష్ రావు అత్యుత్సాహమే కారణం!

క్రికెట్ లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. అలాగే ఎన్నికల రణరంగంలో కూడా  మాటలే ఒక్కోసారి పార్టలకు గెలుపుబాట చూపుతాయి. క్రికెట్ లో ఎలాగైతే ఓ క్యాచ్ మిస్ చేస్తే ఫలితం తారుమారైపోతుందో.. ఎన్నికలలో కూడా ఒక తొందరపాటు మాట, ఒక అనుచిత వ్యాఖ్య, ఒక పొల్లు మాట గెలుపును దూరం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ అయాచితంగా ఇచ్చిన ఒక అవకాశాన్ని తన తొందరపాటు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ చేజార్జుకుని, కీలకమైన క్యాచ్ వదిలేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఎన్నికలో కోడ్ ఉన్న సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రచారం హడావుడిలో మాట తూలినా, తొందరపాటు ప్రదర్శించినా నష్టం తప్పదు.  రైతు బంధుకు కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల కిందట అనుమతి ఇవ్వడం నిస్సందేహంగా బీఆర్ఎస్ కు జీవన్ టోన్ టానిక్ లా పని చేసింది. అప్పటి వరకూ హోరాహోరీ పోరులో వెనకబడతామేమో అన్న సందేహం బయటకు చెప్పకపోయినా, బీఆర్ఎస్ కీలక నేతలు సహా శ్రేణులలోనూ వ్యక్తం అవుతూనే ఉంది. అటువంటి వేళ.. రైతు బంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చి బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసింది. ఎన్నికల సంఘం అనుమతిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అసమ్మతి వ్యక్తం చేశాయి. విమర్శలు గుప్పించాయి. అయినా పాత పథకమే, అమలులో ఉన్న పథకమే అంటూ ఎన్నికల సంఘం రైతు బంధు లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు జమ చేయడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కొండంత బలం వచ్చినట్లైంది. అయితే అనుమతి ఇచ్చిన రెండు రోజులలోనే ఆ ఆనందం, ఆ బలం ఆవిరైపోయేలా ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. అయితే ఇందుకు కారణం విపక్షాల విమర్శలో, అభ్యంతరాలో కాదు. బీఆర్ఎస్ నేతల తొందరపాటు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం. అదే ఇప్పుడు ఆ పార్టీ తలలు కొట్టుకునేలా చేసింది. అరెరె.. మంచి చాన్స్ చేజేతులా వదులుకున్నామే అని మధన పడేలా చేసింది.  ఇంతకూ జరిగిందేమిటంటే.. కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు లబ్ధిదారులకు నిధుల పంపిణీకి అనుమతి ఇస్తూ ఆ పంపిణీని మంగళవారం(నవంబర్ 28) లోగా ముగిచేయాలని ఆదేశించింది. అయితే సోమవారం (నవంబర్ 27) కార్తీకపౌర్ణమి సందర్భంగా సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో రైతు బంధు సొమ్ముల పంపిణీకి మంగళవారం ఒక్క రోజే గడువు ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ రైతు బంధు పంపిణీపై ఎన్నికల నియమాళిని ఉల్లంఘించే విధంగా మాట్లాడారు. ఔను ఈ పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతున్న విషయాన్ని ఆయన గొప్పగా, ఘనంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో చాటుకున్నారు. ఎన్నికల ముంగిట ఓటర్లు ప్రలోభాలకు లోనయ్యే విధంగా ఫలానా తేదీన, ఫలానా సమయానికి ఖాతాలలో సొమ్ములు జమ చేస్తున్నామనీ, లబ్ధిదారుల ఫోన్లకు అందుకు సంబంధించి మెసేజీలు టంగు టంగు మంటూ వస్తాయనీ చాటారు. దీనినే కేంద్ర ఎన్నికల సంఘం తప్పపట్టింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. రైతు బంధు నిధుల పంపిణీని ఆపేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటూ రైతు బంధుపథకం నిధుల పంపిణీపై ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ రైతు బంధు నిధుల పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.   రైతు రుణమాఫీ, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు అనుమతి వంటి అంశాలలో బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. ఎన్నికల కోడ్ కారణంగా అమలులో ఉన్న పథకాలను నిలిపివేయాలనడం సరికాదని ఆ లేఖలలో పేర్కొంది. అయితే ఆ లేఖలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం  రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డీఏల విడుదలకు ససేమిరా అంటూ..   రైతుబంధు పథకం అమలుకు ఓకే చెబుతూ, ఆ పథకం అమలును మంగళవారం(నవంబర్ 28 ) లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.  ఈ తరుణంలో హరీష్ రావు కోడ్ ను ఉల్లంఘించేలా రైతు బంధు నిధులపై చేసిన వ్యాఖ్యలతో మొదటికే మోసం వచ్చినట్లైంది. దీనిపై  బీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. అయితే బీఆర్ఎస్ లో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీవ్ర నిరాశను నింపిందన్నది మాత్రం వాస్తవం. 

జగన్ కు పరాభవం.. మోడీ వెంట తిరుమలకు నో పర్మిషన్?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఘోర పరాభవం ఎదురైందా? ప్రధాని నరేంద్రమోడీయే జగన్ ను అవమానించారా? అంటూ పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్రమోడీ తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో తన వెంట ఏపీ సీఎం జగన్ ను అనుమతించలేదు. సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రధాని ఎవరైనా.. ప్రధాన మంత్రి హోదాలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం పలికి, కొండపైకి తీసుకు వెడతారు. అలాగే ప్రధానితో కలిసి తిరమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు. తాజా తిరుమల పర్యటేనలో ఏపీ సీఎం జగన్ ను తనతో పాటు కొండపైకి వచ్చేందుకు అంగీకరించలేదు. ఆయన ఒక్కరే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.  దీనిపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆయన  తిరుపతి కూడా వచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుపతి వచ్చిన ప్రధాని మోడీకి సీఎం జగన్ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు బొకే ఇచ్చి, శాలువ కప్పి సన్మానించారు. వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా బహూకరించారు. అంతే.. ఆ తరువాత జగన్  ప్రధానితో కలిసి జగన్ తిరుమల వెళ్లకపోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ వెంట తిరుమలకు వెళ్లే వారి జాబితాలో జగన్ పేరు లేకపోవడానికి పీఎంవో నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. నేరుగా పీఎంవో నుంచే ఈ మేరకు ఆదేశాలు అందాయని చెబుతున్నారు.    ఇందుకు కారణాలేమైనా తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, అలాగే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరగనున్న తరుణంలో మోడీ ఇలా జగన్ ను దూరం పెట్టడంపై రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పరిశీలకులైతే చంద్రబాబు అక్రమ అరెస్టుకు మోడీ జగన్ ను దూరం పెట్టడానికీ ముడిపెడుతున్నారు.  ఇప్పటికే జగన్ చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేయించడం, ఆ  అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఖండించకపోవడం, దానికి తోడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో నిరసనలను కేసీఆర్ సర్కార్ అణచివేయడానికి ప్రయత్నించడం, అలాగే చంద్రబాబు అరెస్టునకు  బీజేపీ సహకారం, అనుమతి ఉందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో మోడీ జగన్ ను దూరం పెట్టి ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి ప్రయత్నించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో బీజేపీ ఏపీ కార్యవర్గ సమావేశం చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.  మొత్తంగా చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రభావంతో బీజేపీ తెలంగాణలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుండటంతోనే మోడీ జగన్ ను దూరం పెట్టారని అంటున్నారు.  అలా చేయడం ద్వారా  తెలంగాణలో సెటిలర్లకు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కేంద్రం పాత్ర లేదన్న సంకేతం ఇచ్చారని అంటున్నారు. 

రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఉపసంహరించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుని బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం పాతదే, అమలులో ఉన్నదే అంటూ ఆ పథకం కింద నిధుల మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ అనుమతిని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రైతు బంధు నిధుల పంపిణీకి అవకాశం లేకుండా పోవడంతో బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి.. అమలులో ఉన్న పాత పథకానికి నిధుల విడుదలకు అనుమతి నిరాకరించడం సరికాదనీ, రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇవ్వాలనీ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేస్తూ మంగళవారం (నవంబర్ 28) లోగా నిధులు విడుదల చేయాలని షరతు విధించింది. అయితే ఉన్నట్లుండి ఆ అనుమతిని ఉపసంహరించుకోవడంతో బీఆర్ ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లైంది. అనుమతించిన రెండు రోజులలోనే నిధుల విడుదలకు బ్రేక్ వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పుడు నిధుల విడుదల ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది.   రెండు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడంతో రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా 70లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 7వేల కోట్ల రూపాయలను జమ చేయడానికి బీఆర్ఎస్ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసింది. గత రెండు రోజులుగా నేతలు తమ ప్రచార సభలలో ఇదే చెప్పారు. రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు మంగళవారం (నవంబర్ 28)  నాటికి  జమ అవుతాయని చాటారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆ అనుమతిని ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటనతో అది నిలిచిపోయింది.  సోమవారం గురు పౌర్ణమి కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో నిధుల పింపిణీ మంగళవారం చేపట్టి పూర్తి చేయాలని తెలంగాణలోని ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆ అనుమతిని ఉపసంహరించుకోవడంతో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.   తెలంగాణ ఎన్నికలకు   పోలింగ్‌ గురువారం (నవంబర్  30) న జరగనుండగా,  ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర ఎన్నికల సంఘంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో  ఎన్నికల కమిషన్‌ అనుమతిని ఉపసంహరించుకుని ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో అధికారులకు ఇదేం ఖర్మ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారులు, ఉద్యోగులతో తమ పార్టీ ఎన్నికల ప్రచారం చేపడుతున్నది. వై జ‌గ‌న్ నీడ్స్ ఏపీ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) అనే కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన వైసీపీ,  ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో జరిపిస్తున్నది. నవంబర్ 9 నుండి ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లో మొదలైంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒక్కరూ కనిపించడం లేదు. ఎక్కడిక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి జగనే మళ్ళీ ఎందుకు కావాలో వివరిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి వివరించి..  ఈ పథకాలన్నీ ఉండాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలని చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఒక్కో తలకి ఎంత సంక్షేమం అందించారో ప్రజలకు తెలియజేసి వారి ఇంటిపై వైసీపీ జెండా ఎగరేయాలని.. ఇంటికో జెండా కూడా పంచిపెడుతున్నారు. అయితే  ఇలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్ ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకొనే నిర్ణయం తీసుకోవడాన్ని మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారి లేదా అధికారిణిని సీఎం జగన్ చివరికి ఒక పార్టీ కార్యకర్తగా మార్చేశారంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం అంటే ప్రజల సొమ్ము సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేయడమే అవుతుందని అంటున్నారు. కలెక్టర్ నుండి వాలంటీర్ వరకూ అందరికీ జీతాలుగా అందేది  ప్రజల సొమ్మే. కానీ వారితో ఇలా పార్టీ ప్రచారం చేయించడం అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ అధికారులంటే కేవలం ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి. పౌరుడు ఏ పార్టీ కార్యకర్త అయినా, ఏ పార్టీ సానుభూతిపరుడైనా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అమలు చేయాలి. అలాగే ఏ పార్టీకీ ప్రచారం చేయకూడదు. అధికార పార్టీకి  అయినా  సరే లబ్ది చేకూరేలా ప్రవర్తించకూడదన్నది రాజ్యాంగం విస్పష్టంగా చెబుతోంది. కానీ, ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఉద్యోగులను సొంత పార్టీ ప్రయోజనాలను  అడ్డగోలుగా వాడేసుకుంటోంది.  ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రజల వద్దకు వెళ్లిన వైసీపీ నేతలను ప్రశ్నించిన ప్రజలు.. ఇప్పుడు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ?, సబ్సీడీలు ఎందుకు ఆపేశారు? ఉపాధి ఏమైంది? అంటూ ప్రశ్రిస్తున్నారు. నిలదీస్తున్నారు. అసలు మీరెందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.  కానీ, అధికారులు తమకేమీ తెలియదని.. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు. అయితే, అసలు పార్టీ ప్రచారానికి అధికారులను వాడుకోవాల్సిన దుస్థితి వైసీపీకి ఎందుకొచ్చింది? చట్టాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఇంత గుడ్డిగా అమలు చేయాల్సిన అవసరం ఏముందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు నేతల మొహం మీదనే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో వైసీపీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కాదని అధికారుల పార్టీ ప్రచారం కోసం ప్రజల వద్దకు పంపిస్తోంది. అయితే ఈ విధానాన్ని  వ్యతిరేకించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ప్రభుత్వం చెప్పినట్లు ఆడడం, ప్రభుత్వ సేవలో తరించేందుకు సిద్ధపడిపోవడం విస్తుగొల్పుతోంది.   సంఘాలు, కమిటీలతో దేన్నైనా వ్యతిరేకించే ఉద్యోగులు ఇలా అధికార పార్టీ ప్రచారం కోసం నిస్సహాయంగా ప్రజల చీదరింపులను భరించడానికి కూడా వెరవకపోవడం వారి దైన్యస్థితికి అద్దం పడుతోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దానికి తోడు ఇప్పుడు ఇలా తమతో బలవంతంగా పార్టీ ప్రచారం చేయడాన్ని వారు  ర్ణించుకోలేకపోతున్నారు. పంటిబిగువన అసంతృప్తిని, ఆగ్రహాన్ని దాచుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్  ఆడమన్నట్లల్లా ఆడుతున్నామని వారు ప్రైవేటు సంభాషణల్లో దాపరికం లేకుండా చెబుతున్నారు. 

చంద్రబాబు హస్తిన పర్యటనపై వైసీపీ స్పెషల్ ఫోకస్?

స్కిల్ కేసులో హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయడంతో   దాదాపు మూడు నెలల తర్వాత మళ్ళీ చంద్రబాబు  ప్రజల మధ్యకి రాబోతున్నారు. డిసెంబర్ లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు తెలుగుదేశం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.   ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా తేలిపోతుంది.  అయితే, ఈలోగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండడం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఈ నెలాఖరునే చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. దీంతో అధికార పక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. సరిగ్గా కండిషన్ బెయిల్  ముగిసి రెగ్యులర్ బెయిల్ అమల్లోకి వచ్చే సమయం, సుప్రీంలో క్వాష్ పిటిషన్ తీర్పు వస్తుందనుకుంటున్న సమయానికి చంద్రబాబు ఢిల్లీలో ఉండటం వైసీపీని కంగారు పెడుతోంది. వాస్తవానికి  చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుంది రాజకీయ సమావేశాల కోసం కాదు. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి రిసెప్షన్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబుపై బనాయించిన కేసులను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సిద్ధార్థ లూధ్రా   కుమారుడి వివాహం ఈ నెల 26న జరగనుంది. అలాగే 27న ఢిల్లీలోనే రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కి చంద్రబాబు  హాజరు అవుతున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు.  అలాగే చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజులు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చాలాకాలం అవుతున్నది. ఆ మధ్య ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లలేదు.  అన్నిటికీ మించి   అక్రమ అరెస్టు, బెయిల్ తర్వాత చంద్రబాబు హస్తిన  పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి.  ఇప్పటికే నారా లోకేష్  చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తిగా మారింది.  అలాగే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న రెండు రోజులలో రాజకీయ ప్రముఖులను ఎవరినైనా కలుస్తారా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరున జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.  ఈ క్రమంలోనే చంద్రబాబు ముందుగానే ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలపై కదలిక తెచ్చే అవకాశం ఉందా అని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనపై వైసీపీ వర్గాలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది. చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడంతో జాతీయ స్థాయి నేతలు కూడా జగన్ సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. జాతీయ మీడియా కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టడంతో  అప్పట్లో సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్, సీఏజీ పొన్నవోలు సుధాకర్ అప్పట్లో హడావుడిగా ఢిల్లీ వెళ్లి  మీడియా మీటింగ్ కు పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక చంద్రబాబుకు జాతీయ మీడియాతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఏం మాట్లాడనున్నారన్నటెన్షన్ వైసీపీలో కనిపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు మళ్ళీ విచారణ మొదలైంది. ఇప్పటికే నోటీసులు కూడా అందగా జనవరిలో ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ కావడం, జగన్ బెయిల్ రద్దు కావడం వంటి కీలక పరిణామాలకు అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ బీజేపీతో రహస్య బంధం కొనసాగిస్తుంది. అయితే, రాష్ట్రంలో బీజేపీని తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైతే పరిణామాలేంటి అన్న అనుమానాలు వైసీపీకి ఉండడంలో ఆశ్చర్యం లేదు. దీంతో వైసీపీ పెద్దలు ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆందోళనకు లోనౌతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు.. బీటీమ్ విమర్శను నిజం చేస్తున్న నేతలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి.   28తో ప్రచారం కూడా   ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల దాడి పెంచి విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఒక్కోసారి విమర్శల వేడి పెరిగి నేతల నోట బూతులు కూడా వస్తున్నాయి. ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేస్తున్నది. మరోవైపు విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నేతలంతా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన కేసీఆర్‌ కాంగ్రెస్ టార్గెట్ గా తీవ్ర విమర్శలకు దిగారు. వెళ్లిన ప్రతి చోటా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న గులాబీ నేతలు.. ఎలక్ట్రినిక్ మీడియా, సోషల్ మీడియాలో కూడా అదే తరహా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణకు ఓటేసినట్లేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్తుందని ఆరోపిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనా వైఫల్యాలపై ఫోకస్ పెట్టింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను లెక్కలతో సహా బయటపెడుతూ విమర్శలకు దిగి ప్రజలలో చర్చకు వచ్చేలా చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారం యువతను ఆకట్టుకొనేలా ఉంటుంది. పనిలో పనిగా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, కాళేశ్వరం మునక వంటి వాటిని హైలైట్ చేస్తూ తెలంగాణ ఏర్పాటుకు ముందు కేసీఆర్ కుటుంబం, రాష్ట్రం తర్వాత కేసీఆర్ కుటుంబం తేడాను వివరిస్తూ కాంగ్రెస్ నేతలు దూసుకెళ్తున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ పాలనలో పెరిగిన ధరలను వివరిస్తూ కేంద్రంలో ప్రభుత్వం మార్పుకు తెలంగాణనే తొలిమెట్టు కావాలని కోరుతున్నారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలలోకి తీసుకెళుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..   మూడు నెలల క్రితం వరకూ బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో ఇక్కడి నేతల విమర్శలు ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి అసలు పోటీలో లేదన్నట్లు బీజేపీ సైడ్ అయిపోయినట్లే కనిపిస్తున్నది. ఓ నలుగురైదుగురు బడా నేతల స్థానాలు తప్ప   రాష్ట్రంలో మరెక్కడా ఎక్కడా బీజేపీ ట్రయాంగిల్ పోటీలో కనిపించడం లేదు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే తెలంగాణ ఎన్నికలలో పోరు కనిపిస్తుంది. అయితే, సరిగ్గా ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ విమర్శలను నిజం చేసేలా మాట్లాడుతున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అంటూ కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలకు తగ్గట్లే తెలంగాణ బీజేపీ నేతలు వేస్తే తమకి ఓటేయండి లేదంటే బీఆర్ఎస్ కి ఓటేయండి కానీ కాంగ్రెస్ కు మాత్రం ఓటు వేయకండి అనేలా మాట్లాడుతున్నారు. ఇదేదో ఆషామాషీగా ఎవరో ఊహించుకున్న మాటలు కాదు.. అచ్చంగా తెలంగాణ బీజేపీ నేతలు పబ్లిక్ గా చేసిన వ్యాఖ్యలే. బీజేపీ నిజామాబాద్ ఎంపీ, ప్ర‌స్తుతం ఎన్నిక‌ల బ‌రిలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్ పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన  అర్వింద్.. కాంగ్రెస్ నేతలపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే, ఎన్నికల వేళ అస్సలు ఎవరూ ఊహించలేని వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే ముఖ్యమంత్రి  కేసీఆర్ బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అర్వింద్ ఈ  వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కోట్లాడేటప్పుడు రేవంత్ తెలుగుదేశంలో ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. అప్ప‌ట్లో సంచులు మోశాడ‌ని విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు కూడా చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే ఆడుతున్నాడ‌ని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది తెలంగాణ‌ను వారి చేతిలో పెట్టిన‌ట్టే అని అన్నారు. బీజేపీ అభ్యర్థి కేసీఆర్‌పై అనుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం.. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం ఇప్పుడు తెలంగాణలో రాజ‌కీయంగా విస్తృత చర్చకు తెరలేచింది. జనబాహుల్యంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటేనా అన్న చర్చ మొదలైంది..