ఘోర రోడ్డు ప్రమాదం.. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్.. 

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర సమీపంలో ఈ తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లిన దుర్ఘటనలో 15 మంది మరణించారు. సూరత్ నగర సమీపంలోని కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్ పాత్ పై 18 మంది వలస కూలీలు నిద్రిస్తున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గత అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కోసంబిలోని ఓ చౌరస్తా నుంచి మాండివైపు లారీ వేగంగా దూసుకు పోతోంది. అదే సమయంలో ఎదురుగా చెరకు లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఆ లారీ ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పైకి లారీని మళ్లించాడు. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 15 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతులంతా రాజస్థాన్‌లోని బాన్స్‌వాడాకు చెందిన కూలీలని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘోర ప్రమాదం నుంచి 9 నెలల చిన్నారి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆమె తల్లిదండ్రులు మాత్రం మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి‌ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే ఇతర కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో తాజాగా నెలకొన్న పరిణామాలపై జగన్‌ అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అమిత్‌షాతో జగన్‌ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే విగ్రహాల ధ్వంసం వెనుక కొందరు బీజేపీ నేతల హస్తం కూడా ఉందని ఏపీ డీజీపీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏపీ బీజేపీ నేతలు డీజీపీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బీజేపీ నేతలు ఆలయాల రక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ సడెన్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకిత్తిస్తోంది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీ! పోర్టులు, రైల్వేలది కూడా అదే దారి? 

పోటీ తత్వం పెరిగితే  నిర్వహణ  బాగుంటుంది.. సమర్థత మెరుగుపడుతుంది.. వినియోగదారులకు ప్రయోజనం కల్గుతుంది. ఇదే ఇక్కడైనా ఉండే మార్కెట్  మౌలిక సూత్రం. అందుకే ప్రైవేట్ రంగంలో వివిధ సంస్థలు నిత్యం పోటీ పడుతూ.. తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటాయి. అదే సమయంలో తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ వారి ఆదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు మనదేశంలోనూ ప్రైవేటైజేషన్ పెరిగిపోతోంది. నరేంద్ర మోడీ సర్కారే స్వయంగా ప్రైవేట్ రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలకు వాటికి అప్పగిస్తోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ పని చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటోంది బీజేపీ సర్కార్. కాని ఆచరణలో మాత్రం మోడీ సర్కార్  కనీస మౌలిక సూత్రాన్ని మర్చిపోయింది. ఒకే సంస్థకు ఎయిర్ పోర్టులు, పోర్టులు కట్టెబెడుతోంది. ఇప్పటికే  అతి పెద్ద రెండు అంతర్జాతీయ  విమానాశ్రాయల నిర్వహణ చూస్తున్న అదానీ గ్రూప్ కే మరో ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాలను అప్పగించింది. నీతి అయోగ్‌, ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెప్పినా...అదానీకే విమానాశ్రయాలను కేంద్రం ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వంగా  విమర్శలు ఎదుర్కొంటున్న  మోడీ సర్కార్‌ బడా వ్యాపారుల జేబులు నింపేందుకే పాటుపడుతోందని విమానాశ్రయాల లీజు ఘటనతో మరోసారి రుజువైందనే ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ, నీతి అయోగ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికి 2019 ఫిబ్రవరిలో ప్రముఖ వ్యాపార సంస్థ ఆదానీ గ్రూప్‌ ఆరు విమానాశ్రయల కోసం బిడ్‌లు సొంతం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. అహ్మదాబాద్‌, లక్నో, జైపూర్‌, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల నిర్వహణను 50 ఏళ్ల పాటు లీజుకు ఒప్పందం చేసుకుంది అదానీ గ్రుపు. ఈ సంవత్సరం జనవరి 12న ఈ ఆరు విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతను అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అదానీ గ్రూప్  స్వాధీనం చేసుకుంది. 2020 ఆగస్టు 31న ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో  74 శాతం వాటాను  సొంతం చేసుకుంది అదానీ. ముంబై ఎయిర్‌పోర్టులో మిగిలిన 26 శాతం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. న‌వీ ముంబైలో కొత్త‌గా నిర్మించ‌త‌ల‌పెట్టిన విమానాశ్ర‌యం కూడా అదానీ గ్రూప్ చేతిలోకే వెళ్లింది.  దీంతో ప్రస్తుతం దేశంలోని ఎనిమిది అంతర్జాతీయ విమానాశ్రయాలు అదానీ గ్రూపులోకి వెళ్లాయి.  తమ స్నేహితుడు ఆదానీకి విమానాశ్రయాల వ్యాపారంలో అడుగుపెట్టుందుకు అనుగుణంగానే   మోడీ సర్కార్‌ పాత  నిబంధనలకు పాతర వేసిందని తెలుస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ కోసం  పౌర విమానయాన శాఖ ప్రతిపాదనపై 2018, డిసెంబర్‌ 11న పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ అప్రైజల్‌ కమిటీ (పిపిఎసి) చర్చించింది. అనంతరం ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఓ ప్రతిపాదన చేసింది. ఈ ఆరు విమానాశ్రయాలు పెద్ద మొత్తంలో మూలధనం వ్యయంతో కూడుకున్నవని, అందువల్ల ఒకే బిడ్డర్‌కు రెండు, అంతకంటే ఎక్కువ విమానాశ్రయాల నిర్వహణను ఇవ్వలేమన్న నిబంధనలను చేర్చాలని సూచించింది. వేర్వేరు సంస్థలకు ఇవ్వడం కూడా పోటీ ప్రాతిపదికకు దోహదపడుతుందని పేర్కొంది. ఉదాహరణగా ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలను చూపిస్తూ..  జిఎంఆర్‌ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఈ రెండు విమానాశ్రయాల నిర్వహణకు ఇవ్వలేదని తెలిపింది. డిఇఎ మాదిరిగానే నీతి అయోగ్‌ తన అభ్యంతరాలను లేవనెత్తింది. తగినంత సాంకేతిక సామర్థ్యం లేని బిడ్డర్‌కు అప్పగిస్తే ప్రాజెక్టు దెబ్బతినే అవకాశాలున్నాయని, సేవల నాణ్యతలో రాజీ పడే అవకాశం ఉంటుందని పేర్కొంది.  ఆర్ధిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి అయోగ్‌  లేవనెత్తిన  అభ్యంతరాలను తిరస్కరించింది పిపిఎసి. బిడ్డింగ్‌ కోసం ఇదే రంగంలో ముందస్తు అనుభవం అవసరం లేదంటూ నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూపుకు బిడ్లు దక్కాలనే ఉద్దేశంతోనే.. ఆ బడా వ్యాపారికి అనుగుణంగా పిపిఎసి నిబంధనలను తొక్కి పెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు బిడ్లను గెలుచుకున్న సంవత్సరం తర్వాత అదానీ గ్రూప్‌ అహ్మదాబాద్‌, లక్నో, మంగళూరు విమానాశ్రయాలపై రాయితీ ఒప్పందాలపై సంతకం చేసింది. కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపుతూ ఆ విమానాశ్రయాలు తీసుకునేందుకు ఈ ఫిబ్రవరి వరకు అవకాశం ఇవ్వాల్సిందిగా అనుమతి తీసుకుంది.   కేంద్రం కూడా అదానీ గ్రూప్ చెప్పినట్లే అన్ని అనుమతులు ఇచ్చేసింది. విమానాశ్రయాలే కాదు పోర్టులను కూడా ప్రైవేటైజైషన్ లో భాగంగా అదానీ గ్రూపుకే కట్టబెడుతోంది మోడీ సర్కార్. ప్రస్తుతం దేశంలోని 10 పోర్టులు అదానీ గ్రూప్ చేతిలోనే ఉన్నాయి. ఇందులో ఏపీలోని విశాఖ పోర్టు కూడా ఉంది. అంటే దేశంలో అత్యంత కీలకమైన 8 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 పోర్టులు అదానీ చేతిలో ఉన్నాయంటే.. మోడీ సర్కార్ ఒక్క బడా వ్యాపారి కోసం ఎంతగా పరితపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.   ఎయిర్‌క్రాఫ్ట్ స‌వ‌ర‌ణ బిల్లును గత సెప్టెంబర్ లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. అప్పుడే విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విమానాశ్ర‌యాల ప్రైవేటీక‌ర‌ణ‌ను తప్పుపట్టాయి. కేవ‌లం అదానీ గ్రూపుకు ఆరు బిడ్లు ఎలా ద‌క్కాయ‌ని కాంగ్రెస్ ఎంపీలు ప్ర‌శ్నించారు.  అదానీకి అనుకూలించే విధంగా ష‌ర‌తుల‌ను మార్చేశారని ఆరోపించారు. డీఈఏ, నీతిఆయోగ్ ఇచ్చిన‌ ప్ర‌తిపాద‌న‌ల‌నే కేంద్ర ప్ర‌భుత్వం విస్మ‌రించిందని మండిపడ్డారు.  భార‌తీయ విమానాశ్ర‌యాల‌ను గుత్తాధీప‌త్యంలోకి తీసుకువెళ్తున్న‌ట్లు విమ‌ర్శించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రానున్న రోజుల్లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీగా మారుతుంద‌ని కాంగ్రెస్ ఎంపీలు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరోపించినట్లుగానే ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా .. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ అదానీగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 2017లో 0.004 శాతం ఎయిర్ ట్రాఫిక్ గా ఉన్న అదానీ గ్రూప్.. కేవలం రెండేళ్లలోనే 23.6 శాతానికి చేరుకుంది. మోడీ సర్కార్ అండతో త్వరలోనే భారత విమానయాన సంస్థ మొత్తం అదానీ చేతుల్లోకి వెళుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.              విమానాశ్రయాలు, పోర్టులే కాదు రైల్వేలోనూ కొంత భాగం అదానీ గ్రూపుకు దక్కింది. ఇప్పటికే అదానీ పేరుతో ఉన్న రైలు బోగీలు పట్టాలపై తిరుగుతున్నాయి. త్వరలో మరిన్ని రైళ్లు అదానీ గ్రూప్ కు దక్కబోతున్నాయి. ప్రైవేటైజేషన్ పేరుతో అదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ కట్టబెట్టడం దేశానికి  ప్రమాదకరమంటున్నారు నిపుణులు. దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న రైతులు.. పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే దేశ వ్యవసాయ రంగంమంతా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని... మోడీ స్నేహితులైన అదానీకే కట్టబెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే దేశ ప్రజలు తినే ఆహారం, పంటల ధరలు, నియంత్రణ మొత్తం  అదానీ చెప్పినట్లే జరగాల్సిన పరిస్థితి వస్తుందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర సర్కార్ తెచ్చిన కొత్త సాగు చట్టాలు కూడా అదానీ లాంటి బడా వ్యాపారులకే ప్రయోజనం కలిగేలా ఉన్నాయంటున్నారు అన్నదాతలు.  

షాకింగ్.. వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన జనసేన కార్యకర్త ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. రెండ్రోజుల కింద పారిశుధ్య సమస్యలపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును బండ్ల వెంగయ్యనాయుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా?.. నా వద్దకు వస్తూ మెడలో ఆ కండువా ఏంటి?’’ అంటూ అందరి ఎదుట అతనిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన వెంగయ్య నాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.   జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవలసిందేనా అని ప్రశ్నించారు. వైసీపీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. గ్రామంలో పారశుద్ధ్య సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించడం తప్పా?.. కనీసం సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే  రాంబాబు ఉన్నారా?.. అని నిలదీశారు. 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడతారా? అని విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన యువకుణ్ణి  ప్రజల మధ్యనే ఎమ్మెల్యే బెదిరించారు, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందిందన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని పవన్ డిమాండ్ చేశారు. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని జనసేనాని భరోసా ఇచ్చారు.

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ రేసులో అల్లు అర్జున్ మామ?

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా  మారింది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ బైపోల్ లో పరాజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో కుదేలైన కారు పార్టీకి.. సిట్టింగ్ సీటు అయిన  నాగార్జున సాగర్ లో గెలవడం అత్యంత కీలకం. ఇక్కడ కూడా వ్యతిరేక ఫలితం వస్తే పార్టీ భవిష్యత్ కు ప్రమాదమనే ఆందోళన అధికార పార్టీలో ఉంది. వరుస విజయాలతో ఇప్పటికే దూకుడు మీద ఉంది బీజేపీ. సాగర్ లో సత్తా చాటి పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. దీంతో నాగార్జున సాగర్ ను ప్రతిష్టాత్మకంగా  తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపికలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అన్ని విధాలా సమీక్ష చేస్తున్నారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం. గతంలో చలకుర్తిగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్ గా మారింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు విజయం సాధించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఆయన  ఓడిపోయారు. నోముల అనారోగ్యంతో చనిపోవడంతో సాగర్ సీటు ఇప్పుడు ఖాళీ అయింది. ఇక్కడ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు జానారెడ్డి. గతంలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసిగా ఉన్న జానారెడ్డి.. నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత, ఇక్కడ గట్టి పట్టున్న జానారెడ్డి ఖరారు కావడంతో క్యాండిడేట్ ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార పార్టీ.  దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకే నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్ పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తోంది. నర్సింహయ్య తనయుడు, హైకోర్టు అడ్వకేట్ గా ఉన్న నోముల భగత్.... తనకు అవకాశం ఇవ్వాలని  పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపడంతో ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయింది. దుబ్బాకలో పార్టీకి అభ్యర్థే మైనస్ అయ్యారని టీఆర్ఎస్ నేతలు నిర్దారణకు వచ్చారు. దీంతో సాగర్ లో నోముల ఫ్యామిలీని బరిలోకి దింపే విషయంలో కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి లాంటి ఉద్దండ నేత పోటీ చేస్తున్నందున.. అతనికి భగత్ సరితూగలేరనే చర్చ పార్టీ నేతల నుంచే వస్తోందని తెలుస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా, స్థానికంగా  బలవంతుడైన జానారెడ్డిని ఎదుర్కోవడం నోముల కుటుంబానికి సాధ్యం కాదనే అభిప్రాయానికి గులాబీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డికి ధీటైన అభ్యర్థిని పోటీలో పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్.. సినీ హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చాలా కాలంగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ పరిసర ప్రాంతానికి చెందిన వారు. ఆర్థికంగా జానారెడ్డి సరితూగే వ్యక్తి. అంతేకాదు మెగాస్టార్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం ఆయనకు అదనపు అర్హత. నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆదిపత్యం. ఈ లెక్కన సాగర్ లో పోటీకి చంద్రశేఖర్ రెడ్డి సరైన వ్యక్తని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లు ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ మామను బరిలోకి దింపితే ఈ ఓట్లు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారని చెబుతున్నారు.  దుబ్బాక  ఓటమి, జానారెడ్డిని ఎదుర్కోవడం వంటి అంశాల ఆధారంగా నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపిక సమీక్ష చేస్తున్న సీఎం కేసీఆర్.. కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలతో పాటు పార్టీ ముఖ్యలతో చర్చించినట్లు తెలుస్తోంది. కంజర్ల పోటీపై పార్టీలోని అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తుందని చెబుతున్నారు.  పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల ప్రకారం నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ నుంచి కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని ఖరారు చేయవచ్చనే ప్రచారం తెలంగాణ భవన్ లోనూ జోరుగా సాగుతోంది. అదే సమయంలో నోముల కుటుంబంలో ఒకరిని మండలికి పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు.   

బోరున విలపించిన ఫైర్ బ్రాండ్ రోజా!!

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తనని పిలవడం లేదని, ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రోజా కన్నీటి వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలే ఆమె ఆవేదనకు కారణమని చర్చ జరుగుతోంది. సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా.. రోజాకు సమాచారం అందించలేదు. దీంతో ఆమె నొచ్చుకుని.. ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తిరుపతిలో జరిగిన కమిటీ మీటింగ్ లో తన సమస్యలను రోజా వివరించే ప్రయత్నం చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తనకి ఆహ్వానం అందలేదని తెలిపారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు. ఉద్దేశ పూర్వకంగానే తనను పిలవడం లేదని పిర్యాదు చేశారు. తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు. రోజా ఫిర్యాదు పై స్పందించిన గోవర్ధన్ రెడ్డి అన్ని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ నిచ్చారు.

అఖిల ప్రియకు మరో షాక్!

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసుని నమోదు చేశారు. దీంతో జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావంటూ సికింద్రాబాద్ కోర్టు బెయిల్ పిటిషన్ రిటర్న్ చేసింది. సికింద్రాబాద్ కోర్టు తోసిపుచ్చడంతో నాంపల్లి కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ వేయనున్నారు.    కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇవాళ విచారణ చేపట్టారు. ఇప్పటికే అఖిలప్రియను కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, అఖిలప్రియ ఈ కేసులో ప్రధాన నిందితురాలని, ఆమెను విడుదల చేస్తే పరారీలో ఉన్న ఆమె భర్త, ఇతరులు దొరక్కపోవచ్చని, కేసు దర్యాప్తుపై ప్రభావం పడొచ్చని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన సికింద్రాబాద్ కోర్టు.. ఈ కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసినందున తాము బెయిల్ ఇవ్వలేమని, పై కోర్టుకు వెళ్లాలంటూ అఖిలప్రియకు సూచించింది. ఈ నేపథ్యంలో, నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది నిర్ణయించుకున్నారని సమాచారం.

బహిరంగసభలో ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్!!

నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ‌పై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పింది చేయలేదనే ఆగ్రహంతో.. బహిరంగసభలోనే ఎస్పీని ఇష్టమొచ్చినట్లు తిట్టిపోశారు. నాతో పెట్టుకోకు ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్.. ఉన్న కొన్ని రోజులైనా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. మా ఖర్మ కొద్దీ ఎస్పీగా వచ్చావంటూ తలకొట్టుకున్నారు. రెండునెలలు వుంటావో.. మూడు నెలలు ఉంటావో తెలియదు కానీ ఉన్నన్ని రోజులూ మంచిగా ఉండు అని హెచ్చరించారు.    ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టొద్దని చెప్పడమేనని తెలుస్తోంది. నల్లపురెడ్డి కొంత మంది టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమన్నారు. అయితే ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో.. తప్పుడు కేసులు పెట్టవద్దని ఆయన పోలీసులకు చెప్పారట. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టలేదు. దీంతో తాను చెప్పినా కేసులు పెద్దలేదంటూ నల్లపురెడ్డి అలా ఫైరయ్యారట. టీడీపీకి చెందిన మాజీ మంత్రి సూచనతో.. ఎస్పీ కేసు నమోదు చేయలేదని నల్లపురెడ్డి ఆరోపించారు. నువ్వు నెల్లూరు జిల్లాకు ఎస్పీవా లేదంటే టీడీపీ ఏజెంట్‌వా అంటూ ఎస్పీపై విరుచుకుపడ్డారు. ఎస్పీ అనుమతి లేనిదే ఎస్టీ, ఎస్సీ కేసులు పెట్టకూడదా? 13 జిల్లాల్లో ఇలాగే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రెండు రోజులు ఉంటావు పోతావు.. అధికారంలో వున్న మామాట వినవా?.. తమాషాలు వద్దు.. డీజీపీ నిన్ను కాపాడతారని అనుకుంటున్నావా..? బాగుండదు చెబుతున్నాను అంటూ బహిరంగసభలోనే ఎస్పీపై నల్లపురెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతరు! బీజేపీతో కేసీఆర్ రాజీపడ్డారన్న కోమటిరెడ్డి 

రైతులను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసుల కోసం కేంద్రంతో సీఎం కేసీఆర్ రాజీ పడ్డారని చెప్పారు. రైతుల ప్రయోజనాలపై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే.. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త సాగు  చట్టాలకు వ్యతిరేకంగా కేరళ  ప్రభుత్వ తరహా అసెంబ్లీ లో తీర్మానం చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ఐకెపి సెంటర్ లు బంద్ పెడితే  టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలను రైతులు ఉరికించి కొడతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ అవినీతి పై బీజేపీ  రాజీపడ్డా.. తాము వదిలిపెట్టి ప్రసక్తే లేదని చెప్పారు.   నాగార్జున సాగర్  అసెంబ్లీ ఉప ఎన్నికలో  కాంగ్రెస్ గెలవకపోతే రాజకీయాలు గురించి మాట్లాడనని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉపఎన్నికలు వస్తున్నాయనే నియోజకవర్గానికి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ఏడు సంవత్సరాలుగా సాగర్ ను పట్టించుకోని అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు శంకుస్థాపనల పేరుతో హడావుడి చేస్తున్నారని భువనగిరి ఎంపీ మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లో  మత  రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు వచ్చాయని.. సాగర్ లో అలాంటి పరిస్థితి ఉండదని జానారెడ్డి గెలుపు ఖాయమని  కోమటిరెడ్డి స్పష్టం చేశారు.    యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలకు సంఘీభావం తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా  ఆయన కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సొంతూరు చింతమడకకు చెందిన  వారు అమెరికాలో ఉన్నా  వారికి డబ్బులు ఇచ్చిన కేసీఆర్.. యాదగిరిగుట్ట  రోడ్డు విస్తరణలో షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  యాదగిరిగుట్ట లో సీఎం  ఫామ్ హౌస్ రోడ్డు కోసం ఇండ్లు కోల్పోయిన బాధితులకు కూడా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.  భువనగిరి జిల్లాను మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో భువనగిరి లోక్ సభ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే.. కేసీఆర్ సర్కార్ నియంత పాలనపై పోరాడుతున్నామని తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

వ్యాక్సిన్ తీసుకున్న మరునాడే హెల్త్ వర్కర్ మృతి.. 

ప్రజలంతా ఎపుడెపుడా అని ఎదురు చూసిన కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొన్న శనివారం మొదలై.. దేశ వ్యాప్తంగా స‌జావుగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వ‌ర్క‌ర్స్ అందరు సేఫ్ అని అధికారులు ప్ర‌క‌టిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్తుండ‌గా… కొంత మంది మాత్రం క‌ళ్లు తిర‌గ‌టం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు.   ఇది ఇలా ఉండగా తొలిరోజు వ్యాక్సిన్ తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వార్డు బాయ్ ఆ మరుసటి రోజు మృతి చెందాడు. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ "కోవిషీల్డ్" వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఛాతీనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. దీనిపై హాస్పిటల్ చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ.. మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, అయితే ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అతను నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌ తో అతను మరణించినట్టు తాము అనుకోవడం లేదని అయన చెప్పారు. మహిపాల్ సింగ్ మృతికి గల కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అయన తెలిపారు.   మరోపక్క అతనికి ఎలాంటి ఆరోగ్య స‌మస్య‌లు లేవ‌ని మహిపాల్ కుటుంబ స‌భ్యులు చెపుతుండగా… వ్యాక్సిన్ వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు చెపుతున్నారు. మృతుడి బాడీని పోస్ట్ మార్టం కోసం పంపామ‌ని… త్వ‌ర‌లో మ‌ర‌ణానికి కార‌ణం తెలుస్తుందని అధికారులు తెలియ చేస్తున్నారు.

పాకిస్థాన్ లో నరేంద్ర మోడీ ఫ్లకార్డులు ! ప్రత్యేక సింధ్ దేశం కోరుతూ ర్యాలీలు

పాకిస్థాన్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లకార్జులతో ర్యాలీలు.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా...  భారత్ అంటేనే భగ్గునమండే దాయాది దేశంలో మన ప్రధాని ఫోటోలు ప్రదర్శించడం ఏంటనీ షాకవుతున్నారు.. అయితే ఇది అక్షరాల నిజం. ఎన్నో దశాబ్దాలుగా ప్రత్యేక సింధ్ దేశం కోసం పోరాడుతున్న సింధ్ ప్రావిన్స్ ప్రజలు సాన్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు పాకిస్థాన్ నుంచి విముక్తిని కల్పించి సింధ్ పేరిట ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింధీ నేషనలిజం వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎం సయ్యద్ 117వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు సింధ్ ప్రజలు. నరేంద్ర మోడీతో పాటు పలువురు ఇతర దేశాల నేతలను ఉద్దేశిస్తూ..  పాక్ అరాచకాల నుంచి తమను కాపాడాలని నిరసనకారులు నినాదాలు చేశారు.  ప్రస్తుతం పాకిస్థాన్ దేశం పరిధిలో ఉన్న  సింధూలోయలో శతాబ్దాల క్రితమే నాగరికత వెల్లివిరిసింది. ఈ ప్రాంతాన్ని తొలుత బ్రిటీషర్లు ఆక్రమించారు. అప్పటి నుంచి సింధ్ ప్రాంత ప్రజలపై వివక్ష మొదలైంది. ప్రత్యేక సింధ్ దేశం కోసం రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమై, తమకు అవకాశం వచ్చినప్పుడల్లా, పాక్ పాలకుల దురాగతాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి తమను వేరు చేయాలంటూ 1967లో ఈ ఉద్యమం ప్రారంభం కాగా, ఎప్పటికప్పుడు పాక్ ప్రభుత్వం వారిని అణచివేస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది జాతీయవాద నేతలు, విద్యార్థులు, సింధ్ ప్రాంత రాజకీయ పార్టీల కార్యకర్తలు కనిపించకుండా పోయారు. వీరందరినీ పాకిస్థాన్  సైన్యమే అపహరించి, చిత్ర హింసలు పెట్టి చంపేసిందని సింధ్ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్నారు. పాకిస్థాన్  పాలకులకు ఇప్పటికే బెలూచిస్థాన్ ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ప్రత్యేక బెలూచిస్థాన్ డిమాండ్ తో చాలా కాలంగా పోరాడుతున్నారు అక్కడి ప్రజలు. తాజాగా  సింధూ దేశ్ డిమాండ్ మళ్లీ తెరపైకి రావడంతో పాకిస్థాన్ పాలకులు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. సింధ్ దేశ డిమాండ్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుండటం వారిని మరింత కలవరపెడుతోంది. బెలూచిస్థాన్ లానే సింధ్ ప్రావిన్స్ లోనూ నిరసనలు జరగకుండా కఠిన ఆంక్షలకు పాకిస్థాన్ సర్కార్ సిద్ధమవుతుందని సమాచారం. 

బీజేపీ ఎత్తుతో జనసేనకు భారీ నష్టం!!

తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్నట్టుగా.. బీజేపీతో పొత్తుతో భవిష్యత్ లో ఎప్పటికైనా అధికారం చేపట్టవచ్చని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి.. బీజేపీ ఎత్తుతో ఊహించని షాక్ తగిలే అవకాశముందనిపిస్తోంది. ఏపీలో కొద్ది రోజులుగా బీజేపీ వ్యవహారశైలిని చూస్తే.. కాపు పార్టీగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఉన్నారు. సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి.. కాపు వర్గాన్ని పార్టీకి దగ్గర చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతల్ని పోటీలో చేర్చుకోగా, ఇప్పుడు మరికొంతమందిని చేర్చుకుని వారికి కీలకమైన పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన పార్టీలో చేరితే కాపు వర్గం మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. అందులో భాగంగానే సోము వీర్రాజు స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీలో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ముద్రగడతో పాటు మరికొందరు కాపు నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అయితే కాపు సామాజిక వర్గానికి దగ్గరవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం జనసేనకు భారీ నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   2019 ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకున్నప్పటికీ.. మొత్తంగా దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అందులో మెజారిటీ ఓట్లు.. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే వచ్చాయి. దీనినిబట్టే అర్థంచేసుకోవచ్చు.. ఎంతో కొంత కాపు ఓటు బ్యాంక్ జనసేన పక్షాన ఉందని. అయితే, ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని ఆ ఓటు బ్యాంకుకు కూడా గండి పడే అవకాశముంది. అసలే బీజేపీతో దోస్తీ మూలంగా జనసేన తన సొంత స్వరాన్ని బలంగా వినిపించలేకపోతుంది. దానికితోడు ఏవైనా ఉపఎన్నికలు వచ్చినా బీజేపీ జనసేనకి పోటీ చేసే అవకాశం ఇచ్చేలా కనిపించడంలేదు. మరి ఈ పరిస్థితుల్లో కాపు సామజిక వర్గానికి దగ్గరవ్వాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం.. జనసేనను మరింత దెబ్బకొట్టే అవకాశముంది. మరి జనసేనాని ఇప్పటికైనా మేలుకుంటారో లేదో అని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగునాట రామరాజ్యాన్ని నెలకొల్పుదాం! ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి 

దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నేతలు ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద టీడీపీ అధినేత‌ చంద్రబాబు, ఆ పార్టీ నేత‌లు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌ను కొనియాడారు చంద్రబాబు.  రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. పేదలకు ఆహారభద్రత, నివాస భద్రత, కట్టుకోడానికి మంచి వస్త్రం అందించిన సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన స్వర్గీయ నందమూరి తారకరామారావు మనకు దూరమై 25 సంవత్సరాలు అయినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్ల‌ముందే కదలాడుతున్నట్టు ఉంది.. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళి' అంటూ చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా  మహానేత ఎన్టీఆర్ ను  గుర్తు చేసుకున్నారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించారని చెప్పారు. ‘‘సామాన్య రైతుబిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగి మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపించారు. అరవై ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారు.. దటీజ్ ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిహక్కు కల్పించినా, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించినా  సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ గారి లక్ష్యం. ఆయన కీర్తిశేషులై 25 ఏళ్ళు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మానవతావాది ఆశయసాధనకు పునరంకితమవుదాం’’అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

తిరుమాడ వీధుల్లో  పందుల సంచారం ! టీటీడీ తీరుపై భక్తుల ఆగ్రహం 

తిరుమల అంటే ఓ పవిత్ర పుణ్య క్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే వెంకన్న కొలువుదీరిన దివ్య స్థలం. నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా నిత్యం కళకళలాడుతుంటుంది తిరుమల తిరుపతి దేవ స్థానం. ఎప్పుడూ గోవింద నామ స్మరణతో ఏడుకొండల సన్నిధి మార్మోగుతూ ఉంటుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ, ప్రశాంత వాతావరణంతో భక్తులను పులకింపజేస్తుంది. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇటీవలి కాలంలో అడవి పందుల సంచారం పెరిగిపోయింది. అడవి నుంచి ఓ పందుల గుంపు ఆలయ పరిసరాల్లో సంచరిస్తోంది.  తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ మాడ వీధుల్లో పందుల గుంపు దర్జాగా సంచరిస్తూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 11 పందులు గొల్ల మండపం నుంచి మాఢ వీధుల్లోకి ప్రవేశించాయి. ఆపై తమ కిష్టం వచ్చినట్టుగా తిరుగాడాయి. తిరుమాడ వీధుల్లో పందులు  స్వేచ్చగా తిరుగుతున్నా పట్టించుకున్న నాథులే కరువయ్యారు. చాలా సేపటి తర్వాత పందులను గమనించిన విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమేసేందుకు అవస్థలు పడ్డారు.  టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిశుభ్రతకు, పవిత్రతకు మారుపేరైన తిరుమలలో..వరాహాలు సంచరిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం స్వామివారి వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో పందులు ప్రవేశించడమేంటని ప్రశ్నిస్తున్నారు.  దీనిపై స్పందించిన అధికారులు.. ఇకపై శ్రీవారి ఆలయం వద్దకు పందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాడ వీధుల్లోకి పందులు వస్తున్న మార్గాన్ని గుర్తించి, అక్కడ ఇనుప కంచెలను వేశారు. స్వామి ఆలయం అటవీ ప్రాంతం కావడంతో ఇలా పందులు రావడం సహజమేనని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం భక్తుల మనోభావాలను కాపాడటంలో టీటీడీ బోర్డు విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు.  

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై పెద్ద పులి !

హైదరాబాద్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్ద పులి.. ఏకంగా శంషాబాద్ విమానాశ్రయంలోకి దూరింది.  శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై  ఆదివారం అర్థరాత్రి పెద్ద పులి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు పది నిమిషాల పాటు రన్ వేపై పెద్దపులి తిరిగింది. ఆ సమయంలో టేకాఫ్, ల్యాండింగ్ కావాల్సిన విమానాలకు అనుమతి నిరాకరించిన అధికారులు  పులిని తరిమేందుకు పరుగులు పెట్టారు.   10 నిమిషాల పాటు రన్ వే పైనే ఉన్న పెద్ద పులి.. తర్వాత గోడ దూకి రషీద్ గూడ వైపు వెళ్లిపోయింది. పులి సంచారంపై ఎయిర్ పోర్టు అధికారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి జాడను కనిపెట్టేందుకు గాలిస్తున్నారు. పులి ఎటువైపు వెళ్లిందన్న విషయాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్టు విమానాశ్రయ భద్రతా దళాలు వెల్లడించాయి. మరోవైపు ఎయిర్ పోర్టు నుంచి తమ ప్రాంతానికి పెద్ద పులి వచ్చిందని తెలుసుకున్న రషీద్ గూడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి పై పులి పంజా విసురుతుందోనన్న భయంతో ఇండ్ల నుంచి బయటికి రావటానికి జంకుతున్నారు జనాలు. 

కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్న వైసీపీలోని రెండు గ్రూపులు.. 

కర్నూలు జిల్లా డోన్‌ లోని పాతపేటలో వైసీపీకి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో.. కత్తులు, రాడ్లు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపేటలో వైసీపీలోని రెండు గ్రూపుల మధ్య గత కొంత కాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. గడచిన రెండు నెలల్లో ఈ రెండు వర్గాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రెండు వర్గాల వారు డోన్‌ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.   ఈ నేపథ్యంలో పాతపేటలోని చౌక్‌లో నాగరాజు, ఫరీద్‌ మధ్య ఆదివారం మాటామాటా పెరిగింది. విషయం తెలిసిన నాగరాజు, అతడి అనుచరులు కత్తులు, రాడ్లతో ఫరీద్‌పై దాడికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న ఫరీద్‌ వర్గీయులు ఎదురు దాడికి దిగారు. రెండు వర్గాల మధ్య అరగంట పాటు జరిగిన దాడులతో ఆ ప్రాంతం మొత్తం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, కిషోర్‌, కిరణ్‌ను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   వైసీపీ పార్టీకి చెందిన నాగరాజు, ఫరీద్‌లు కొంత కాలం క్రితం రెండు వర్గాలుగా విడిపోయారు. స్థానికంగా నడుస్తున్న మట్కా, మద్యంపై ఆధిపత్యం కోసం వీరిద్దరూ గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలలో పలుమార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి. నిన్న సాయంత్రం ఘర్షణ కూడా ఇందులోనే భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ వర్కర్లకు అస్వస్థత 

ప్రధాని మోడీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్ తో సైడ్ ఎఫెక్ట్ లు త‌ప్ప‌వని అందరు భావించినప్పటికీ అది అబ‌ద్ధ‌మ‌ని రుజువు అయ్యింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా క్షేమంగానే ఉన్నారు. ఏపీలోని విజ‌య‌వాడ‌లో వ్యాక్సిన్ తీసుకున్న రాధ అనే హెల్త్ వ‌ర్క‌ర్ స్వల్ప అస్వ‌స్థ‌కు గురైన‌ప్ప‌టికీ.. ఆమె ఈరోజు ఉద‌యం నుండి ఏమీ తిన‌క‌పోవ‌టంతో పాటు వ్యాక్సిన్ అంటే ఉన్న భ‌యంతోనే ఆమెకు క‌ళ్లు తిరిగిన‌ట్లు వైద్యులు తేల్చారు. ఆమె ప్రస్తుతం సుర‌క్షితంగా ఉన్నారు.   మరోపక్క తెలంగాణాలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సజావుగా సాగుతోంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఇందిరానగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఏఎన్‌ఎం సంగీతకు స్వల్ప అస్వస్థత కలిగింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే తనకు తల తిప్పుతుందని ఆమె వైద్యులకు తెలిపింది. ఆ తర్వాత ఆమె వాంతులు చేసుకోవడంతో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. అయితే, కొన్ని ల‌క్ష‌ల్లో ఒక‌రికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు కనపడతాయని… భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో డీల్!!

కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎమ్మెల్యే ఆర్థర్‌ కు, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య అస్సలు పడదనేది బహిరంగ రహస్యం. తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సిద్ధార్థరెడ్డిపై ఆర్థర్‌ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే నియోజకవర్గంలో ఒకటి చోటుచేసుకుంది. రేషన్‌ షాపుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో సిద్ధార్థరెడ్డి కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, చివరికి అధికారులే కల్పించుకొని వివాదానికి తెరదించారని తెలుస్తోంది.   నందికొట్కూరు నియోజకవర్గానికి అధికారులు 61 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయంలో పాములపాడు మినహా మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితానే ఫైనల్‌ చేయాలని అధికారులపై ఒత్తిడి వచ్చిందట. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్‌.. పార్టీ జిల్లా ఇంఛార్జ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే అయిన తనను ఒక్క మండలానికే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, అప్పటికే ఫైనల్‌ అయిన జాబితాను పక్కన పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని అధికారులకు ఫోన్‌ చేసి హెచ్చరించారట. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు 'ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా'ను తెరపైకి తీసుకొచ్చారట. పాములపాడు మండలం ఎమ్మెల్యేకు, పగిడ్యాల మండలం సిద్ధార్థరెడ్డికి ఇచ్చే విధంగా ఒప్పించారట. మిగిలిన మండలాలలతోపాటు నందికొట్కూరు అర్బన్‌, రూరల్‌ పరిధిలో ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తామని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారట. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఎంపిక చేసేలా డీల్ కుదిర్చారన్నమాట. ఈ డీల్ కి ఇరువురు నేతలు ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడిందని సమాచారం.

వెనక్కి తగ్గిన వాట్సాప్!!

ప్రైవసీ పాలసీపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇటీవల తీసుకొచ్చిన ఈ పాలసీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం కావడం.. సిగ్నల్, టెలిగ్రామ్‌ వంటి యాప్స్ కు ఆదరణ పెరుగుతుండడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ప్రైవసీ పాలసీ ఆప్‌డేట్‌ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి వచ్చే ఫిబ్రవరి 8 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో ఇది మూడు నెలలు వెనక్కి జరిగింది. కొత్త పాలసీపై ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ తెలిపింది. పాలసీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ మూడు నెలలను ఉపయోగించుకుంటామని తెలిపింది. కొత్త విధానాన్ని యూజర్లు అర్థం చేసుకున్న తర్వాతే దానిని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది.   ప్రైవసీ పాలసీలో భాగంగా యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఐపీ అడ్రస్‌ లను ఫేస్‌బుక్‌‌ తో పంచుకుంటామని, ఇందుకు అంగీకరిస్తేనే అకౌంట్ కొనసాగుతుందని ఇటీవల వాట్సాప్ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందన్న ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ ను డిలీట్‌ చేసి టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్స్‌కి మారారు. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వాట్సాప్.. కేవలం బిజినెస్ అకౌంట్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఈ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్‌ తన బ్లాగ్‌లో "మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా రహస్యంగానే ఉంటుంది. మీ వ్యక్తిగత సంభాషణని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ చదవదు. మీరు పంపే లోకేషన్‌లని చూడదు. మీరు ఎవరికి కాల్‌ చేశారు, ఎవరికి మెసేజ్‌ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. ఈ అప్‌డేట్‌ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్‌ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్‌డేట్‌ ని తీసుకొచ్చాం." అని తెలిపింది.