క్యాంపుల్లోనే మంత్రులు, అధికారుల తిష్ట! ఏపీ సచివాలయంలో పడకేసిన పాలన!
posted on Jan 22, 2021 @ 4:10PM
సచివాలయం.. రాష్ట్ర పరిపాలనకు కేంద్రం. పాలకులకు కార్యక్షేత్రం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే జనాలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది సచివాలయం. కాని ఇప్పుడు అమరావతి సచివాలయాన్ని చూస్తే అంతా ఖాళీనే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రావడం లేదు.. దీంతో మంత్రులూ అటువైపు చూడటం లేదు. ముఖ్యమంత్రీ, మంత్రుల బాటలోనే ఉన్నతాధికారులు సచివాలయం రావడం మానేశారు.సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతుండటంతో జనాలు కూడా సచివాలయం సంగతి మర్చిపోయారు. దీంతో అమరావతి సచివాలయంలో పాలనంతా పడకేసింది.
గతంలో అమరావతి సచివాలయం సందడిగా ఉండేది. అప్పటి సీఎం చంద్రబాబు ఒకటో బ్లాకుకు ఉదయం పది గంటలకల్లా వచ్చేవారు. రాత్రి పొద్దుపోయేదాకా ఉండి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహించే వారు. ఆయనతోపాటు ఆయా శాఖల మంత్రులూ పాల్గొనేవారు. మంత్రులు కూడా తమ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలోనే సమీక్షలు నిర్వహించేవారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు సచివాలయం రద్దీగానే ఉండేది. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించేవారు జగన్, కేబినెట్ సమావేశాలు ప్రతి 15 రోజులకోసారి జరిపేవారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు సచివాలయంలోనే నిర్వహించేవారు. సీఎం రెగ్యులర్ గా వస్తుండటంతో ఉన్నతాధికారులంతా కంపల్సరిగా సచివాలయం వచ్చేవారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా కొన్ని నెలలగా రివ్యూ చేయడం లేదట. ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో, ఎలా ఇస్తున్నారో కూడా ఉన్నతాధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదంటే .. ఏపీ సచివాలయంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించవచ్చు.
కాని మూడు రాజధానుల ప్రతిపాదన రావడం... ఇంతలోనే కరోనా మహమ్మారి వెలుగుచూడటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గత 10 నెలలుగా మంత్రివర్గ సమావేశం ఉంటే మినహా... ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే ఆయన పాలన సాగిస్తున్నారు. సమీక్షలు కూడా అక్కడి నుంచే చేస్తున్నారు. మంత్రులు కూడా సచివాలయానికి చుట్టపుచూపుగానే వస్తున్నారు.కేబినెట్ భేటీకి ఒకరోజు ముందు, తర్వాత... అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం నిర్వహించే సమీక్షలకు హాజరై... అట్నుంచి అటే వెళ్లిపోతున్నారు. చివాలయంలో సొంత చాంబర్లు ఉన్నప్పటికీ... అనేక మంది మంత్రులు విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కూడా సచివాలయానికి రాకుండా తమ క్యాంపు కార్యాలయానికే వారిని పిలిపించుకుంటున్నారు.
వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా మంత్రుల దారిలోనే సచివాలయానికి రాకుండా విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులను సచివాలయం నుంచి అక్కడికే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి రావడం మానేశారు. సీనియర్ ఐఏఎస్ లు అనిల్ కుమార్ సింఘాల్, కరికాల వలవన్, ఏఆర్ అనురాధ, ప్రవీణ్ ప్రకాశ్, మధుసూదన్ రెడ్డి తదితరులు సొంతంగా క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చిపోతున్నారు.
ఉన్నతాధికారులు రాకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లకు సచివాలయంలో పని లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో వారంతా జాలీగా గడేపిస్తున్నారట. బయోమెట్రిక్ కావడంతో వారంతా సచివాలయానికి రావడం కంపల్సరి కాబట్టి వస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. లేదంటే అధికారుల బాటలోనే వీళ్లు కూడా సొంత క్యాంపులు ఏర్పాటు చేసుకునేవారనే సెటైర్లు పేలుతున్నాయి. సెక్షన్ ఆఫీసర్లు.. వాళ్ల కన్నా కింది స్థాయి ఉద్యోగులు సచివాలయం వస్తున్నా.. పనులేమి చేయడం లేదని చెబుతున్నారు. కొందరైతే మార్నింగ్ వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోయి... తిరిగి ఈవెనింగ్ వచ్చి మళ్లీ పంచ్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారుల పేషీ దగ్గరకు వెళ్లి సార్ ఎప్పుడొస్తారని ఆరా తీస్తున్న జనాలకు ఉద్యోగుల నుంచి ఒకటే సమాధానం వస్తుందట. తమ సార్ క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే.. లేదంటే సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే చెబుతున్నారట. నిజానికి తమ ఉన్నతాధికారి ఎక్కడ ఉన్నారో ..ఆయన ఆఫీసు సిబ్బందికి కూడా తెలియడం లేదంటున్నారు.
గతంలో ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది వరకు సందర్శకులు వివిధ పనుల కోసం సచివాలయం వచ్చేవారు. కాని ఇప్పుడు అధికారులు లేక పనులు కాకపోవడంతో పదుల సంఖ్యలోనే వస్తున్నారని సచివాలయ లెక్కలు చెబుతున్నాయి. అమరావతి సచివాలయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తున్న కొందరు మాజీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధికారులు సచివాలయంలో కాకుండా... క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం గతంలో ఎప్పుడు జరగలేదని చెబుతున్నారట. అధికారిక పర్యటనల్లో ఉన్నారా? లేదా క్యాంపు కార్యాలయాలకు వెళ్లారా? అనే విషయాన్ని సిబ్బంది స్పష్టంగా చెప్పలేకపోతుండటం మరీ దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.