ప్రాణాలు తీస్తామంటున్న ఉద్యోగ సంఘం నేత! జగన్ రెడ్డి అండతోనే బరి తెగింపా ?
posted on Jan 23, 2021 @ 2:21PM
అతనో ఉద్యోగ సంఘం నేత. కాని రాజకీయ నేతలను మించిపోయారు. పంచాయతీ ఎన్నికల అంశంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ నే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీపైనే ఆరోపణలు చేస్తున్నారు. ప్రాణాలు కూడా తీస్తామంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా ఉంటారనే ఆరోపణలు ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత .. తాజాగా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌పై మాట్లాడిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాసర్ల వెంకట్రాంరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు తాము ఎదురుచూస్తామని... అంతవరకు ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. జీవించే హక్కు, వాక్సిన్ పొందే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు వెంకటరామిరెడ్డి. అంతేకాదు ప్రాణాపాయం వస్తే ఎదుటివాటి ప్రాణం తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు చెప్పిందని...అయితే పరిస్థితులు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీపై కాకర్ల చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.
ప్రాణం తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందన్న వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీఎం జగన్ రెడ్డి అండతోనే కాకర్ల బరి తెగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండ లేకపోతే.. ఎన్నికల కమిషన్ నే టార్గెట్ చేసే ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కాకర్లపై టీడీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రస్థాయిలో స్పందించింది. ఆయన పోకడలు రోజురోజుకీ శృతిమించుతున్నాయని మండిపడింది. జగన్ రెడ్డి స్కూల్ నుంచి వచ్చిన కాకర్ల.. అవసరం అయితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ట్వీట్ చేసింది. ‘‘ఎవర్ని చంపుతాడు ? నిమ్మగడ్డ గారినా ? హైకోర్టు జస్టిస్‌లనా? సుప్రీం కోర్టు జస్టిస్‌లనా..? అని ప్రశ్నించింది. స్వామి భక్తి చూపడంలో కాకర్ల పీహెచ్ డీ కూడా పూర్తి చేసినట్లున్నారనే విమర్శలు సామాన్య జనాల నుంచి వస్తున్నాయి.
సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామ్ రెడ్డి ప్రకటనపై ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ద సంస్థపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఎస్ఈసీ ఆదేశం అమలు చేయనందుకు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేయవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. ఎవరో ఒకరికి ప్రయోజనం కలిగేలా మాట్లాడితే.. తర్వాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యత వహిస్తారని మరికొందరు ఉద్యోగులు నిలదీస్తున్నారు.