పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం.. ఏపీఎన్జీవో అధ్యక్షుడు హెచ్చరిక!
posted on Jan 23, 2021 @ 2:15PM
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉద్యోగుల సంఘాలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిలిపివేయాలని, లేదంటే ఎన్నికల బహిష్కరణకు తాము సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని, అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తాజాగా దీనిపై ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలకు వెళదామని తాము అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల సంఘాన్ని వేడుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎస్ఈసీ ఎంతో మొండిగా వ్యవహరించి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తాము ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం విచారణ ఉందని, ఈలోగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఇవేమీ సాధారణ ఎన్నికలు కాదని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఎస్ఈసీ ఎందుకింత పంతానికి పోతున్నారు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలంటే ప్రజలతో మమేకం అవ్వాల్సి ఉంటుంది. కొందరు ఉద్యోగులు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు దుష్పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు.ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం అని ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు? అయినప్పటికీ మేం భయపడం అని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కరోనా వ్యాప్తి అధికమైనట్టు తేలిందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంటే.. ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.