అందుకే మేం టీకాలు వేయించుకోవడంలేదు: కేటీఆర్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తెలంగాణలోనూ కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తొలి విడత వ్యాక్సిన్లు ఇస్తున్నారు. హైదరాబాద్‌ లోని తిలక్ నగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతోనే.. మొదటి విడత వ్యాక్సినేషన్ లో ప్రజాప్రతినిధులు టీకాలు వేయించుకోవడంలేదని తెలిపారు.    టీకా తీసుకునేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నా, ప్రధాని సూచనలు పాటించాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలి అనుకున్నామని తెలిపారు. అయితే, కరోనాపై ముందుండి పోరాడిన వారియర్స్‌కే ముందుగా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో తాము ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదన్నారు. త్వరలోనే తాము కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమని, ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

విజయవాడలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. అయితే, విజయవాడ జీజీహెచ్‌ లో వ్యాక్సిన్ వేయించుకున్న రాధ అనే హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేయించుకున్న వెంటనే రాధ కళ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్లు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు సమాచారం. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే కళ్లు తిరిగినట్టు అనిపించిందని రాధ తెలిపారు. వెంటనే డాక్టర్లు పరీక్షించారని, ప్రస్తుతం కొద్దిగా చలిగా ఉన్నా.. ఇబ్బందేమీలేదని రాధ చెప్పారు.

దూకుడు పెంచిన సోము వీర్రాజు.. ముద్రగడతో కీలక భేటీ 

ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈరోజు పలువురు ప్రముఖ నేతలను కలవనున్నట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా అయన ఇదే విషయమై కాపు ఉద్యమ నాయకుడు.. ముద్ర‌గ‌డ పద్మనాభం ‌ను క‌లిసి చ‌ర్చించారు. "మాజీ మంత్రి , కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలిశాన‌ని.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముద్రగడ ఒక కీల‌క పాత్ర పోషించాల్సిన‌ అవసరం ఉంద‌ని" సోము వీర్రాజు తెలిపారు.   "రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ, జనసేన కూటమి రాబోయే రోజులలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో మా మధ్య జరిగిన స్నేహపూర్వక భేటీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తమ పట్ల ముద్రగడ చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని అయన పేర్కొన్నారు.

డీజీపీ దొరా.. తాడేప‌ల్లి కొంపలో జగన్ మీకు భోగి ప‌ళ్లేమైనా పోశారా?

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని, దాడుల గురించి కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని తెలిపారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్చలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.   కాగా, డీజీపీ వ్యాఖ్యలను టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. విగ్ర‌హాలు ధ్వంసం చేసింది దొంగ‌లు, పిచ్చోళ్ల‌ని నిన్న చెప్పిన డీజీపీ దొరా.. నేడు రాజ‌కీయ కుట్ర కోణంవైపు మీ మాటెందుకు తిరిగింది! అని ప్రశ్నించారు. రాత్రికి తాడేప‌ల్లి కొంపలో వైఎస్ జగన్ మార్క్ భోగి ప‌ళ్లేమైనా మీకు పోశారా అని ఎద్దేవా చేశారు.   మీరు విడుద‌ల‌ చేసిన జాబితాలో కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్లులో ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూల్చేసిన‌ వైసీపీ నేత దామోదర్ రెడ్డి పేరు లేదేం?.. ఓంకార క్షేత్రంలో అర్చ‌కుల‌ను చిత‌క్కొట్టిన వైసీపీ నేత ప్రతాపరెడ్డి పేరు ప్ర‌స్తావించ‌లేదెందుకు?.. ఆంజ‌నేయుడు చేయి విరిగితే ర‌క్త‌మొస్తుందా? రాముడి తల తెగితే విగ్ర‌హం ప్రాణం పోతుందా? అని హిందుత్వంపైనే దాడికి దిగిన బూతుల‌ మంత్రి నానిపై కేసు ఎందుకు పెట్ట‌లేదు? అని డీజీపీపై నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.   హిందుత్వం మ‌నుగ‌డ‌నే ప్ర‌శ్నించేలా దాడులు జ‌రుగుతుంటే.. నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం చేత‌కాక చేవ‌చ‌చ్చిన మీపై ముందు కేసుపెట్టాలి అని విరుచుకుపడ్డారు. త‌ప్పుడు స‌మాచారంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందుకు కోర్టులు మీపై సుమోటోగా కేసు న‌మోదు చేయాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు. 

ఎయిమ్స్ డైరెక్టర్ కు వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో తొలి వ్యాక్సిన్ ఎవరికంటే?

దేశవ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మొదలైంది. వర్చువల్‌ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 వేల కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా మనీష్ కుమార్ అనే పారిశుద్ధ్యకార్మికునికి టీకా వేశారు. తరువాత ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకోవడం ద్వారా ఆయన టీకాపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించారు.   ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ జీజీహెచ్‌ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి టీకాను హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి వైద్యులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు.   తెలంగాణ‌లో 140 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుప‌త్రిలో కేంద్ర స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు తెలంగాణ‌ మంత్రి ఈటల రాజేంద‌ర్ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొద‌టి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణ‌మ్మకు వైద్యులు ఇచ్చారు.

వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ప్రారంభించిన మోడీ నోట.. మహాకవి గురజాడ మాట.. 

భారత్ లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొద్ది సేపటి క్రితం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు. మోడీ తన ప్రసంగంలో గురజాడ రాసిన దేశభక్తి గీతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురజాడ గేయంలోని "సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌" అన్న వాక్యాలను అయన గుర్తు చేసారు. గురజాడ సిద్ధాంతాన్ని మనదేశం ఆచరించిందని.. దీంతో టీకా వచ్చిందని మోదీ అన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని.. అంతేకాకుండా వ్యాక్సిన్‌ వచ్చిందని జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దని అయన ప్రజలను హెచ్చరించారు. టీకా వేసుకున్నా భౌతికదూరం, మాస్క్‌ తప్పనిసరి అని మోడీ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ‌లోని గాంధీ ఆసుప‌త్రిలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, ఆరోగ్య‌మంత్రి ఈటెల స‌మ‌క్షంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొద‌లుపెట్టారు. అందరికంటే ముందుగా ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి మొదటి వ్యాక్సిన్ ఇచ్చారు.

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్.. పోలీసులపై బౌన్సర్ల దాడి 

ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడుల ఘటనలు తీవ్ర దుమారానికి.. ఉద్రిక్తతలకు దారి తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో "రాష్ట్రంలోని వందలాది ఆలయాలపై దాడులు నేనే చేశాను. దేవతల విగ్రహాల తలలు తొలగించాను. పలు దేవతా విగ్రహాల భాగాలను ధ్వంసం చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మరి కొందరు పాస్టర్లతో పలుచోట్ల ఇలాంటి దాడులు చేయించాను. దేవుళ్ల విగ్రహాలు ఫేక్‌. నా అసోసియేషన్‌లో 3,642 మంది ఫాస్టర్లు ఉన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 699 గ్రామాలను పూర్తిగా క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశాము. త్వరలో మరి కొన్ని గ్రామాలను కూడా ఇలాగే చేస్తాం" అంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు ప్రవీణ్‌ చక్రవర్తి (పాస్టర్‌ చక్రవర్తి) చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. బెంగళూరు గాసిప్‌ అనే యూట్యూబ్‌ చానల్‌లో ఆయన గత కొంతకాలంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వాఖ్యలు చేస్తున్నారు.   పాస్టర్ ప్రవీణ్ ఆస్తుల చిట్టా చూసిన పోలీసులు గుడ్లు తేలేసినట్లుగా అయింది. 35 ఏళ్ల లోపే ఉన్న ఈ పాస్టర్ చక్రవర్తి దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చాడు. అయితే ప్రస్తుతం అతని ఆస్తుల విలువ దాదాపుగా రూ. వెయ్యి కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే అతనికి మాత్రం ఎటువంటి వ్యాపారాలు లేవు. అతడికి ఉన్న వ్యాపారం మొత్తం మత మార్పిళ్లు చేసి.. విదేశాల నుంచి నిధులు రాబట్టుకోవడమే. అంతేకాకుండా ఈ ఏడాది జనవరి 11న అమెరికాలోని ఒక క్రైస్తవ విరాళాలు ఇచ్చే దాతతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ దేవుడి విగ్రహాలు అంతా ఫేక్‌... ఎన్నో విగ్రహాలు నా చేతులతో ధ్వంసం చేశాను అంటూ అయన స్వయంగా వెల్లడించారు. తాజాగా ఈ వీడియోలు ఆడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు.. మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో చక్రవర్తిపైన 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో సీఐడీ పోలీసులపై చక్రవర్తి బౌన్సర్లు దాడికి కూడా పాల్పడ్డారు.   చక్రవర్తి గత కొన్నేళ్లుగా క్రైస్తవ మత ప్రచారకుడిగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి భారీస్థాయిలో అందుతున్న విరాళాలతో కాకినాడ, సామర్లకోటలో మదర్‌ థెరిస్సా పేరుతో పలు పాఠశాలలు, కేటీసీ చిల్డ్రన్‌ హోం, సిలోన్‌ బ్లైండ్‌ సెంటర్‌(ఎ్‌సబీసీ) నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వాకలపూడిలో శార్వాణి స్కూలును స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సామర్లకోట మండలం ఉండూరులో 15ఎకరాల్లో ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీవీఆర్‌ఎం) పేరుతో ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకూ పలు విద్యాసంస్థలు నడుపుతున్నారు. బాలికల కోసం పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అనాథలు, నిరుపేదలు, ఇటుక బట్టీల కార్మికులను ఎంపిక చేస్తున్నారు. వీరి చదువు పూర్తైన తరువాత వీరిని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయిస్తున్నట్టు, దీనికోసం విదేశాల నుంచి పెద్దమొత్తంలో నిధులు కూడా గుంజుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంధుల కోసం ఏర్పాటు చేసిన ఎస్‌బీసీలో అసలు అంధ విద్యార్థులు ఎవరూ లేరని వార్తలు వస్తున్నాయి.   ఈ పాస్టర్ ప్రవీణ్ చిట్టా తవ్వుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇతడు తనవద్ద పనిచేసే ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను లోబర్చుకుని చివరికి వదిలివేయడంతో బాధితురాలు అందోళనకు దిగింది. దీనిపై సర్పవరం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో తన రక్షణకు ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 50మందికి పైగా బాడీగార్డులకు ఒక్కొక్కరికి నెలకు రూ.15 నుండి 20 వేల వరకూ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన మంత్రి కన్నబాబుకు తాను అనుచరుడిగా చక్రవర్తి చెప్పుకుంటాడు. పాస్టర్ ప్రవీణ్, బ్రదర్‌ అనిల్‌కు చెందిన మత ప్రచార సంస్థతో సన్నిహితంగా ఉంటారు. ఇతడు ఒక రాష్ట్ర మంత్రితో పాటు, ఒక ఎంపీ, పలువురు వైసిపి నేతలతో సన్నిహితంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.   ఇది ఇలా ఉండగా పాస్టర్ ప్రవీణ్ ను అరెస్ట్ చేసినప్పటి నుండి ఏపీలో పరిస్థితులు మారిపోతున్నాయి. విగ్రహాలపై దాడి ఘటనలో ఎటువంటి రాజకీయకుట్ర లేదని రెండు రోజుల క్రితం ప్రకటించిన డీజీపీ.. మళ్ళీ మాట మార్చి… టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. అయితే ఈ కేసులలో ఎక్కువగా సోషల్ మీడియా ప్రచారాల గురించే ఉన్నాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం ఏమాత్రం హైలెట్ కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివేకానంద రెడ్డి హత్య వెనుక లోతైన కుట్ర... కేరళ హక్కుల కార్యకర్త సంచలనం..!

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని.. దీని వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని కేరళకు చెందిన హక్కుల కార్యకర్త జోమున్‌ పుతెన్‌ పురక్కల్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక లోతైన కుట్ర ఉందని.. అయితే అనుమానితుల గురించి ఇపుడే మాట్లాడడం సరి కాదని.. దీనిపై రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి, మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతామని అయన ప్రకటించారు.   నిన్న ఢిల్లీలో ఒక తెలుగు న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. ఆయన వివేకానందరెడ్డి హత్య గురించి పలు విషయాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం తనను వివేకా కుమార్తె సునీతారెడ్డి కలిశారని.. ఈ విషయంపై తాము సుదీర్ఘంగా చర్చించామని అయన తెలిపారు. సీబీఐ దర్యాప్తు విషయంలో..  సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయంపై తాము చర్చించామని అయన తెలిపారు. వివేకా హత్య కేసులో హంతకులకు తప్పకుండా శిక్షపడేలా చేస్తామన్నారు.   కేరళలో పెను సంచలనం రేపిన సిస్టర్‌ అభయ కేసు విషయంలో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించి.. ఆమెది ఆత్మహత్యగా చెప్పి కేసును మూసేయించారని.. దీని వెనుక అక్కడి చర్చి కీలక పాత్ర పోషించిందని జోమున్‌ తెలిపారు. అయితే అప్పట్లో దీనిపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, సాక్ష్యాధారాలు సేకరించేలా చేశానన్నారు. తన సోదరుడితోనే తనను హత్య చేయించేందుకు చర్చి ఫాదర్‌ ప్రయత్నిస్తే..తాను గాయాలతో బయటపడ్డానని అయన చెప్పారు. చివరకు చర్చి ఫాదర్‌, నన్‌ కలిసి సిస్టర్‌ అభయను చంపారన్న విషయాన్ని సీబీఐ కోర్టు నిర్ధారించి నిందితులకు శిక్ష విధించిందని జోమున్ పురక్కల్ తెలిపారు.

అగ్గి మీద గుగ్గిలం అయిన మిస్టర్ కూల్ సీఎం.. సంగతేంటంటే...  

మిస్టర్ కూల్ సీఎం గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ ఈ మధ్య మండి పడుతున్నారు. తాజాగా అయన ఒక్క సారిగా సహనం కోల్పోయి.. మీడియాపై చిందులు తొక్కారు. ఇందుకు కారణం.. ఒక రిపోర్టర్ అడిగిన ఒకే ఒక ప్రశ్న. ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ సింగ్ హత్య విషయంలో ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సీఎం నితీశ్ ఒక్కసారిగా తన సహనం కోల్పోయారు. "మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, దయచేసి పోలీసులతో పంచుకోండి. నేరాన్ని రుజువు చేయడంలో వారికి సహాయపడండి. మీరంతా చాలా గొప్పవారు. నేను సూటిగా అడుగుతున్నా. అసలు మీరెవరికి మద్దతిస్తున్నారు చెప్పండి?’’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో అయన పరోక్షంగా లాలూ, రబ్రీదేవీ పాలనపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘పదిహేనేళ్లు వారు పాలించారు. భార్యా భర్తల పాలనలో ఎన్నో నేరాలు జరిగాయి. వాటినెందుకు మీరు హైలెట్ చేయరు?’’ అని సూటిగా ప్రశ్నించారు.   ఇది ఇలా ఉండగా ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజర్ రూపేశ్ కుమార్ హత్య సాక్షాత్తు సీఎం నితీశ్ నివాసానికి సమీపంలోనే జరగడంతో దీనికి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మీడియా అడిగిన ప్రశ్న పూర్తిగా తప్పని, పూర్తిగా నిరాధారమని అయన మండిపడ్డారు. ఓ హత్య జరగడానికి పలు ప్రేరేపణలు ఉంటాయని, వాటికి గల కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నితీష్ అన్నారు.

ఏపీలో ఓటర్ల జాబితా విడుదల.. తన పని తాను చేసుకుపోతున్న ఎస్‌ఈసీ!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు వద్దంటోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేయగా.. జగన్ సర్కార్ హైకోర్టుకు ఆశ్రయించడంతో ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఎన్నికల సంఘం ఈ కేసును డివిజన్ బెంచ్ కు బదిలీ చేయాలని కోరింది. దీనిపై విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే, ఒకవైపు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా, హైకోర్టులో విచారణ జరగనున్నా.. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఏపీలో ఓటర్ల జాబితాను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 2021 జనవరి 15 నాటికి 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారని తెలిపింది. మహిళా ఓటర్లు 2,04,71,506 కాగా.. పురుషులు 1,99,66,737 ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 మంది ఉన్నట్లు తెలిపింది. 2021 జనవరికి కొత్తగా 4,25,860 మంది ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 4 రోజుల్లోనే 10 మంది మృతి!

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకునేందుకు బ్రిటన్ సహా పలు దేశాలు తమ ప్రజలకు అత్యవసర వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు జర్మనీ పాల్ ఎర్లిచ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల బృందం విచారణ మొదలుపెట్టింది. ఈ నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. చనిపోయిన పది మంది 79 నుంచి 93 సంవత్సరాల మధ్య వయసులోని వ్యక్తులని తెలిపారు. అయితే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన సమయం నుండి వారు చనిపోయిన సమయం మధ్య వ్యత్యాసం నాలుగు రోజులని వారు తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, బహుశా ఆ సమస్యల కారణంగానే చనిపోయారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు నిపుణుల బృందంలో ఒకరైన కెల్లర్ తెలిపారు.   గడచిన డిసెంబర్ నుండి వ్యాక్సినేషన్‌ పై జర్మనీ ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను జర్మనీలో కూడా ప్రజలకు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 8,42,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి దశలో 80 సంవత్సరాల పైన వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఐన వైద్య సిబ్బందితో పాటు కొందరు దేశ సాధారణ ప్రజలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వీరిలోని 325 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కు లోనయ్యారు. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల్లోనే మరణించిన 10 మంది మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమని ఆ దేశం ఇంకా నిర్ధారించలేదు.

బీజేపీలోకి కళా వెంకట్రావు?

తెలుగుదేశం పార్టీ కీలక నేత కిమిడి కళా వెంకట్రావును బీజేపీలోకి ఆహ్వానించాలనే యోచనలో కమలనాథులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా, మంత్రిగా పనిచేసిన కళా వెంకట్రావుకు దశాబ్దాల రాజకీయం అనుభవం ఉంది. అయితే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిష్టానం అచ్చెన్నాయుడుకి కట్టబెట్టిన తర్వాత కళా వెంకట్రావు అసంతృప్తితో ఉన్నారని.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న ఆయన్ను బీజేపీలో చేర్చుకుని కీలక పదవి ఇవ్వాలనే యోచనలో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కళా వెంకట్రావుతో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు భేటీ కానున్నారని కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఈ వార్తలను కళా వెంకట్రావు ఖండించారు. పార్టీ మార్పు వార్తల్లో వాస్తవం లేదని, అయినా పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. సోము వీర్రాజు తనతో భేటి కానున్నారన్న విషయం కూడా తనకి తెలియదని, చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానని స్పష్టం చేశారు.  

అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విరాళమిచ్చారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు తన వంతుగా రూ.5,00,100 విరాళాన్ని అందించారు.    రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్ లు నేడు ప్రారంభించాయి. విరాళాల సేకరణలో భాగంగా దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ ను రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్, వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి చెక్కును అందించారు.   స్వచ్ఛంద విరాళాల సేకరణ ద్వారా రామ మందిరం నిర్మాణం జరుగుతుందని, జనవరి 15 నుంచి విరాళాలను సేకరిస్తామని ట్రస్ట్ గతంలోనే ప్రకటించింది. ఫిబ్రవరి 27 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు ట్రస్ట్ తెలిపింది. అంతేకాదు, పారదర్శకత ఉండేందుకు రూ. 20 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలను చెక్ రూపంలో సేకరించనున్నారు. రూ. 2 వేల కంటే ఎక్కువ ఇచ్చిన వారికి రశీదు ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించింది.

ముఖ్యమంత్రి దర్శనం మహాభాగ్యం!!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఎంత కష్టం?. మనలాంటి సామాన్యులు అయితే ముఖ్యమంత్రిని కలవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అనుకోకుండా కలిస్తే అది మన అదృష్టం అనుకోవడమే. అయితే, ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులకు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే అదృష్టం ఉండాలనే అభిప్రాయముంది. సీఎం వైఎస్ జగన్ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడటమే తప్ప.. ఎవరైనా ప్రజాప్రతినిధి ఏదైనా విషయమై సీఎంని కలవాలనుకుంటే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు అంటుంటారు. దీంతో ముసలోడికి దసరా పండగ అన్నట్టు.. ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు కలవొచ్చు.. అదే తమ అదృష్టం అన్నట్టు చెప్పుకుంటారు కొందరు. కానీ, నిజానికి మెజారిటీ ప్రజాప్రతినిధులకు ఆ అదృష్టం కూడా లేదనే చెప్పాలి.   సీఎం జగన్ ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఏదో ఒకరిద్దరు తప్ప మిగతా ప్రజాప్రతినిధులంతా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుంటారు. తాజాగా గోపూజ మహోత్సవంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక మిగతా ప్రజాప్రతినిధులు ఏదో దూరపు బంధువుల పెళ్ళికి వచ్చినట్టు దూరందూరంగా ఉండాల్సిది వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విడదల రజిని, అంబటి రాంబాబు వంటి వారికి కూడా సెక్యూరిటీని దాటుకొని వెళ్లి.. సీఎం కి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడటమే కష్టమైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.   మాములు సమయాల్లో ఎలాగూ సీఎం ఎవరికీ అంత తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వరు. ప్రజాపతినిధులకు క్షణాల్లో తిరుమల శ్రీవారి దర్శనం అవుతుంది కానీ.. రోజుల తరబడి ఎదురుచూసినా సీఎం దర్శనమవ్వడం మాత్రం కష్టమనే అభిప్రాయముంది. మరి అలాంటప్పుడు కనీసం ఏదైనా అధికార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడైనా.. ఆ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలకు దర్శనం ఇవ్వాలి కదా. అబ్బే లేదు. ఇలా అయితే ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను సీఎం దృష్టికి ఎలా తీసుకెళ్లగలరు?.. అసలు గ్రౌండ్ రియాలిటీ సీఎంకి ఎలా తెలుస్తుంది?.. ప్రజాప్రతినిధులకే సీఎంని కలవడం మహాభాగ్యమైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటూ సీఎం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఇకనైనా తన తీరుని మార్చుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాస్త నన్ను కూడా గుర్తించండి.. పాపం ఏపీ మంత్రికి ఎంత కష్టమొచ్చింది!!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం F2. అందులో ఎమ్మెల్యే పాత్రలో కనిపించిన రఘుబాబు క్యారెక్టర్ భలే సరదాగా ఉంటుంది. నేను ఎమ్మెల్యేని అయ్యా అంటూ ఆయన చెప్పే డైలాగ్ లు నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ మంత్రి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నేను దేవాదాయ శాఖ మంత్రిని అయ్యా, కాస్త నన్ను కూడా గుర్తించండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.   ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ గోపూజ మహోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా రెండు వేలకు పైగా ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమంలో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రినే పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.    నరసరావుపేటలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనగా ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం ఏదో ద్వితీయ శ్రేణి నేతలాగా ఎక్కడో దూరంగా ఉండిపోయారు. ఇక, టీటీడీ ఈవో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన కూడా మంత్రి లాగే పిలవని పేరంటానికి వచ్చినట్టుగా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది.  టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రిని, టీటీడీ ఈవోనే పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి వంటి వారికి వేదికపై అవమానం జరిగిన ఘటనలు చూశాం. మంత్రికి సముచిత గౌరవం ఇవ్వని ప్రభుత్వ పెద్దల తీరుని అందరూ తప్పుబట్టారు. అయినప్పటికీ జగన్ సర్కార్ తీరు మారకపోవడం గమనార్హం. వైసీపీ పాలనలో మంత్రులకే గౌరవం, గుర్తింపు దక్కట్లేదు.. ఇక మిగతా వారి పరిస్థితి ఏంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లిలోని తన నివాసంలో సుబ్బయ్య తుదిశ్వాస విడిచారు. కొంత కాలం క్రితం ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు.    పలమనేరులో ప్రభుత్వ డాక్టర్‌గా పని చేసిన సుబ్బయ్య.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు గెలిచారు. టీడీపీ హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ఆయన పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన సాధారణ జీవితం గడిపారు. ఒకప్పుడు మంత్రి హోదాలో ఉన్న సుబ్బయ్య.. అనంతరం స్కూటర్‌ పై తిరిగేవారు.    ప్రస్తుతం సుబ్బయ్య బీజేపీలో ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తున్న తరుణంలో సుబ్బయ్య బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం తిరిగి ఆయన గతేడాది జులైలో బీజేపీలో చేరిపోయారు.

జీవితంలో చివరి నిరాహార దీక్ష... అన్నాహజారే 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులతో జరుగుతున్న చర్చలలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీంతో ఒక వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజరే.. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల సమస్యల అంశంపై తానూ ఈ నెలాఖరులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అయన పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ చట్టాల రూపకల్పన చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఏరోజు దీక్ష చేస్తారన్న విషయాన్నీ మాత్రం అయన ఆ లేఖలో ప్రకటించలేదు.   ఇది ఇలా ఉండగా గత డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు అన్నా హజారే లేఖరాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని.. అలాగే అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ తాను ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని.. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన జీవితంలో చివరి నిరహార దీక్షను రైతుల కోసం చేయబోతున్నట్లు అయన స్పష్టం చేశారు.   దీనికోసం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరహార దీక్షకు అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు నాలుగు సార్లు లేఖ రాశానని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలిచింది. రామ్‌లీలా మైదానంలో అయన చేపట్టిన నిరహార దీక్షతో నాటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి,.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా అన్నా హజారే రైతుల సమస్యలపై దీక్ష చేయనున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

అదే నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి!!

జగన్ నాటకాలు నమ్మి ప్రజలంతా పూనకం వచ్చినట్టు ఓట్లేశారని.. తానేం తప్పు చేసానో తనకు తెలీదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తాను కోరుకున్నానని.. అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఏమాత్రం సంతోషంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని.. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అబద్దం చెప్పి అడ్డంగా దొరికిన దొంగ అని విమర్శించారు.   ప్రజావేదికను కూల్చి ఇంతవరకు ఆ శిథిలాలను తొలగించకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని అన్నారు. మీటర్లు వ్యవసాయ మోటార్లకు కాదు మంత్రులకు పెట్టాలని అన్నారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో తెలుస్తుందన్నారు.   ఈ ప్రభుత్వం చివరికి పెంపుడు జంతువులను కూడా వదలడం లేదని, వాటిపైనా పన్నులు విధిస్తోందని దుయ్యబట్టారు. రేపో మాపో పీల్చే గాలిపై పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపుతున్న భారాన్ని జీవితాంతం మోయాల్సిన దుస్థితి నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

మా గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతాం!

తమ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఒడిశాలో కలిసిపోతామని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు తేల్చిచెప్పిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు మండలం గిరిశిఖరంలోని కొదమ గ్రామ గిరిజనులు మంగళవారం ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఇంటికి తరలివచ్చారు. గత సెప్టెంబర్‌ 9న తమ గ్రామానికి వచ్చినప్పుడు 70 రోజుల్లో పట్టుచెన్నారు- చింతచెట్టు జంక్షన్‌ నుంచి కొదమకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి మూడు నెలలు దాటినా ఇంకా రోడ్డు పనులు ప్రారంభం కాలేదని, ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తమ గ్రామం పక్కన ఉన్న ఒడిశా గ్రామాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేసిందని తెలిపారు. రోడ్డు వేయకుంటే తాము కూడా ఒడిశాలో కలిసిపోతామని తేల్చిచెప్పారు. వారితో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. రోడ్డు పని ప్రారంభానికి అటవీశాఖ అనుమతి రాలేదని, అనుమతి రాగానే రోడ్డు నిర్మించి.. కొదమకు వస్తానని ఆయన సర్దిచెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.