సీఈవోకు ఎస్ఈసీ పవర్ తెలియదా! గోపాలకృష్ణ ద్వివేది.. ఏందిది?
posted on Jan 23, 2021 @ 1:12PM
ఆయనో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.. చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న అధికారి.. ఎన్నికల కమిషన్ అంటో ఏంటో.. దానికుండే పవరో ఏంటో తెలిసిన వారు.. అయినా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనిప్పుడు సిల్లీగా వ్యవహరిస్తున్నారు. సర్కార్ పెద్దల ఒత్తిడో మరో కారణమో తెలియదు కాని.. ఆయన ఎన్నికల కమిషన్‌ను ధిక్కరిస్తుండటం అందరిని షాక్ కు గురి చేస్తోంది. బ్యూరోక్రాట్లలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆయన ప్రతిష్టకు భంగం కల్గిస్తుందనే చర్చ అధికార యంత్రాగంలో జరుగుతోంది.
చట్టాల గురించి తెలిసినా అభాసుపాలయ్యేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటోంది ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ. ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఆయన తీరు వివాదాస్పదమవుతోంది. ఎస్ఈసీకి సహకరించాల్సిన ఆ ఆఫీసర్.. తన విధులను నిర్వర్తించకుండా అడ్డదారుల్లో వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా
శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనరేటర్ కు వెళ్లిన ద్వివేది.. కమిషనర్ ను కలవకుండానే అక్కడ పేషిలో ఓ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేనని చెప్పడం ఆ లేఖ సారాంశం. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ స్థాయి అధికారాలు ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ సీనియర్ ఐఎఎస్ ఇలా లేఖ రాయడం సంచలనంగా మారింది. గోపాలకృష్ణ ద్వివేదీ ఇలా రాయడం మరింత విస్మయపరుస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నికల అధికారిగా పని చేశారు గోపాలకృష్ణ ద్వివేదీ. ఆ అధికారాల్ని పక్కాగా ఉపయోగించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ద్వివేదీ ఉన్నారు. ఎన్నికలు మొత్తం ఆయన చేతుల మీదే నడిచాయి. చంద్రబాబు సర్కార్ ను మూడు నెలల పాటు.. ఎన్నికల కోడ్ కారణంగా అధికారాలేమీ లేకుండా చేశారు ద్వివేది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఇంటలిజెన్స్ చీఫ్ సహా కొందరు కీలకమైన అధికారులను బదిలీ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మొత్తం పట్టు సాధించారు. అప్పటి చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించి…ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా ఎన్నికల కోడ్‌ను అత్యంత కఠినంగా అమలు చేయించారు ద్వివేది.
ఎన్నికలకు.. కౌంటింగ్‌కు మధ్య నెలన్నర గ్యాప్ ఉన్న సమయంలోనూ అప్పటి సీఎం చంద్రబాబును పని చేయనివ్వలేదు ద్వివేది . సీఎస్ ద్వారా సొంత పాలన చేశారు. చివరికి రుణమాఫీ రెండువిడతల నిధులకు బడ్జెట్ కేటాయింపులు.. జీవోలు వచ్చినా నిలిపివేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పాస్ చేయనివ్వలేదంటే ఆయన సీఈవోగా ఎంత అపరిమితమైన అధికారం చెలాయించారో ఊహించవచ్చు. తన అధికారాల్ని స్పష్టంగా .. సూటిగా వినియోగించుకున్నందుకు ఆయన బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు కూడా వచ్చింది. లక్ష నగదు బహుమతి కూడా అందుకున్నారు.ఎన్నికల విధుల్లో బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్జు తీసుకున్న గోపాలకృష్ణ ద్వివేదీ.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా తాను చేయలేనని చెప్పడం విస్మయపరుస్తోంది. హైకోర్టుకు హామీ ఇచ్చి కూడా.. ఓటర్ల జాబితాను ఆయన ప్రిపేర్ చేయలేదు. పంచాయతీల్లో ఎన్నికలు పెట్టడానికి ఉద్యోగుల్ని సిద్ధం చేయలేదు.
ద్వివేది ఇలా చేయడం వెనక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే చర్చ జరుగుతోంది. ట్విట్టర్ లో శుక్రవారం ఫీలింగ్స్ పేరుతో… కొన్ని సార్లు బాధ్యతల్ని పక్కన పెట్టి… మన ఇష్టం వచ్చినట్లుగా గడపాలని ఓ కొటేషన్‌తో ఆయన చిన్న వీడియో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి అయిష్టంగానే ద్వివేది ఈ పనులన్ని చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఆయన సుముఖంగానే ఉన్నా.. ప్రభుత్వ విధానం ప్రకారం ముందుకెళ్లాలి కాబట్టి అలా చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ విధానమైనా. నిబంధనల ప్రకారమే ఉండాలనేది సివిల్ సర్వీస్ ట్రైనింగ్ లక్ష్యం. అందులోనూ ప్రత్యేకమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ద్వివేది లాంటి అధికారులకు ఈ విషయాలన్నీ తెలుసు. అయినా ఆయన రాజ్యాంగ సంస్థకు సహకరించకుండా ఉండటం సరికాదనే అభిప్రాయమే నిపుణుల నుంచి వస్తోంది. కొన్ని రోజులుగా ద్వివేది వ్యవహరిస్తున్న తీరుతో ఆయనకు మచ్చ పడే అవకాశం వచ్చిందని చెబుతున్నారు.