వాట్సాప్ చాట్ లీక్ పై మౌనమెందుకు?.. నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది!
posted on Jan 22, 2021 @ 3:30PM
జాతీయ భద్రతపై రాజీపడటం దారుణమని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోనియా.. బాలాకోట్ పై ఎయిర్ స్ట్రయిక్స్ చేయడానికి ముందే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌చీఫ్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లో ఈ దాడుల అంశం గురించి మాట్లాడిన ఘటనపై స్పందించారు. సైనిక రహస్యాలు బయటకు రావడం రాజద్రోహం కిందకు వస్తుందన్నారు. అర్నబ్ వాట్సాప్ చాట్ పై ఇంత గొడవ జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందని మండిపడ్డారు. జాతీయ భద్రత లాంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు. ఎప్పుడూ దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడుతూ ఇతరులకు సర్టిఫికెట్లను జారీ చేసే వారి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని విమర్శించారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై కూడా సోనియా స్పందించారు. ఆలోచన లేకుండా హడావుడిగా వ్యవసాయ చట్టాలను రూపొందించారనే విషయం రైతులు చేస్తున్న నిరసనలతో బయటపడిందని అన్నారు. రైతుల విషయంలో కేంద్రం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆహార భద్రతను ఈ చట్టాలు నాశనం చేస్తాయని అన్నారు. ఈ చట్టాల్లో ఉన్న లోటుపాటులను, లాభనష్టాలను పార్లమెంట్ చర్చించే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించలేదని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై తమ వైఖరి స్పష్టంగా ఉందని, మొదటి నుంచి వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నామని సోనియా అన్నారు.