పాలన చేతకాని సీఎం కేసీఆర్!
posted on Jan 22, 2021 @ 4:36PM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పు, కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్ నేతల ప్రకటనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందని కొందరు చెబుతుండగా... ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని మరికొందరు చెబుతున్నారు. సీఎం మార్పు ప్రచారంపై విపక్ష నేతలు సీరియస్ గానే స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు, ముఖ్యమంత్రి అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాకే కేసీఆర్ దిగిపోవాలని అనుకుంటున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని... అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌కు వయస్సు మల్లిందని.. ఆ కారణంతోనే కేటీఆర్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారని తెలిపారు. పాలన చేతకాని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు జీవన్ రెడ్డి.
కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా రెండేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ అంత కంటే మెరుగు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయుష్మన్ భారత్ ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం కూడా రెండేళ్లు ఆలస్యం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వరుస పరాజయాలతో ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు జీవన్ రెడ్డి. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం కుడా అమలు చేయడం లేదని, చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ రాజ్యాంగ నిబంధన ఉల్లంగిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.