విశాఖపై మాట్లాడొద్దని ఎంపీలకు జగన్ ఆదేశం! ఢిల్లీలో బయటపడిన వైసీపీ చీకటి బాగోతం
posted on Feb 5, 2021 @ 5:11PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీకటి బాగోతం బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ పై జగన్ రెడ్డి సర్కార్ కు ఎంత చిత్తశుద్ది ఉందో ఆయన సొంత మీడియా సాక్షి టివిలోనే బహిర్గతమైంది. కేంద్రంపై మాట్లాడకుంటా సైలెంట్ గా ఉండాలని తాడేపల్లి నుంచి అందిన ఆదేశాలు వచ్చాయని చెబుతూ.. ఆ పార్టీ ఎంపీలు అడ్డంగా దొరికి పోయారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. బాలశౌరితో పలువురు ఎంపీలు అప్పటికే కూర్చుని ఉండగా.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబాబు లేటుగా వచ్చారు. ఆయన వస్తూనే విశాఖ ఉక్కు గురించి నేను మాట్లాడాలా అని బాలశౌరిని అడిగారు. అయితే పిల్లి అలా అంటుంగానే వద్దు వద్దు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడొద్దని సీఎం చెప్పాడని బాలశౌరి చెప్పడం సాక్షి లైవ్ లో స్పష్టంగా వినిపించింది. అంతేకాదు పార్టీ స్టాండ్ తీసుకున్న తర్వాతే విశాఖపై మాట్లాడాలని చెప్పాడన్నారు బాలశౌరి. సీఎం స్టాండ్ తీసుకున్నాక చెబుతారని.. అప్పటిదాకా ఏం మాట్లాడొద్దని చెప్పారు. అయితే మరీ నేనేం మట్లాడాలని సుభాష్ చంద్రబోస్ అడగగా.. విశాఖ కాకుండా వేరే విషయాలు మాట్లాడండి.. చంద్రబాబును తిట్టండని పిల్లికి బాలశౌరి చెప్పడం స్పష్టంగా వినిపించింది..
విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తోంది కేంద్ర సర్కార్. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం అమ్మేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నజగన్ రెడ్డి సర్కార్ మాత్రం స్పందించడం లేదు. తమకేమి సంబంధం లేదన్నట్టుగా మొద్దు నిద్ర పోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోతోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై ఆంధ్రా జనం మండిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో పార్టీ ఎంపీల గుసగుసలు బయటికి రావడం, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడొద్దని సీఎం చెప్పినట్లు... లీక్ కావడంతో జనాలు మరింతగా రగిలిపోతున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ నారా లోకేష్ ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇలా ఒక్కో పరిశ్రమా అమ్మేయడం, అడవులు-కొండల్ని కబ్జా చేయడమేనా పరిపాలనా రాజధాని అంటే జగన్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వరకట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేటరైట్ గనులు బాబాయ్ సుబ్బారెడ్డికి బహూకరించారని, తన దోపిడీ మత్తుకి మంచింగ్‌గా మచిలీపట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీకరణ పరిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.