బిసికి సీఎం పీఠం పై ఒక్క రోజులోనే సోము వీర్రాజు యూ టర్న్
posted on Feb 5, 2021 @ 4:57PM
ఏపీలో బీసీలను సీఎం చేసే దమ్ము, ధైర్యం కేవలం బిజెపి కి మాత్రమే ఉందని.. చంద్రబాబు కానీ జగన్ కానీ తమ పార్టీ తరపున బీసీ ని ముఖ్యమంత్రి చేయగలరా అని నిన్న వీరావేశంగా సవాల్ విసిరిన ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క రోజులోనే యూ టర్న్ తీసుకున్నారు. నిన్న సోము వీర్రాజు పాత్రికేయులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్ లు బీసీలను కేవలం తమ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. అయితే వారిద్దరూ బీసీలకు చేసింది మాత్రం ఏంలేదని పేర్కొంటూ.. అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఒక బీసీ ని సీఎం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. కేవలం బీజేపీ మాత్రమే బీసీ ని సీఎం చేయగల దమ్ము కలిగిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలతో మీరు పక్షాలైన బిజెపి, జనసేన మధ్య చిచ్చు రేపినట్లుగా వార్తలు వచ్చాయి.
సోము వీర్రాజు తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిని నిర్ణయించే స్థాయి తనది కాదని, తమది జాతీయ పార్టీ కనుక తమ కూటమి తరపున సీఎం అభ్యర్థి ఎవరు అన్నది బీజేపీ జాతీయ అధినేత జేపీ నడ్డా మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, సీఎం జగన్ లు బీసీలను తమ స్వార్ధ రాజకీయాలకు ఓటు బ్యాంకుగా ఎలా వాడుతున్నాయో చెప్పటానికి మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.