సోము వీర్రాజుతో జనసేన పరేషాన్! ఇక బీజేపీతో తెగతెంపులేనా ?
posted on Feb 5, 2021 @ 1:27PM
బీజేపీతో పొత్తుపై జనసేన యూ టర్న్ తీసుకోనుందా? సోము వీర్రాజుతో పవన్ పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తోంది జనసేన. అయితే బీజేపీ తీరుతో జనసేన నేతలు మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న ప్రకటనలపై పవన్ పార్టీ నేతలు అసహనంగా ఉంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా... ఆయన ఏకపక్ష ప్రకటనలు చేస్తున్నారని కొందరు జనసేన నేతల బహిరంగంగానే విమర్శించారు.
జనసేన నేతలు ఎంతగా మొత్తుకుంటున్నా తన తీరు మార్చుకోవడం లేదు సోము వీర్రాజు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏపీలో సంచలనంగా మారగా.. బీజేపీ-జనసేన కూటమిలో మాత్రం సెగలు రేపుతోంది. తమ కూటమి గద్దెనెక్కితే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు జనసేనలో మంట పుట్టిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి వంటి అత్యంత కీలకమైన అంశంలో సోము వీర్రాజు అలా ఎలా ప్రకటన చేస్తారని జనసేన నేతలు భగ్గుమంటున్నారు. కూటమి తరపున ప్రకటించారా లేక బీజేపీ తరపున ప్రకటించారో చెప్పాలంటున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని జనసేన నేతలు ఆక్షేపిస్తున్నారు.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. జిల్లాల వారిగా పర్యటిస్తూ కేడర్ ను బలోపేతం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నప్పుడు... అధికారంలోకి రాగానే తీరుస్తామని వారికి భరోసా ఇస్తున్నారు గబ్బర్ సింగ్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తమ నాయకుడు పవన్ ముఖ్యమంత్రి అవ్వాలన్నది జనసేన కార్యకర్తల అభిమతం. కాని ఇప్పుడు సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో .. పవన్ పార్టీ కార్యకర్తలు మండిపోతున్నారు. కూటమి తరపున బీసీ వ్యక్తి సీఎం అయితే.. తమ నాయకుడి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీర్రాజు వ్యాఖ్యలు తమలో గందరగోళాన్ని రేకెత్తించేలా ఉన్నాయని జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే దిగుతారని వీర్రాజు గతంలో చేసిన ప్రకటన రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమైంది. రెండు పార్టీల నేతలు అభ్యర్థి విషయంపై పోటాపోటీ ప్రకటనలు చేయడంతో పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే బీజేపీ పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. తిరుపతి పోటీ విషయంలో బీజేపీ పెద్దలతో పవన్ ఓ డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతిలో బీజేపీ బరిలో ఉంటే.. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కమలం పెద్దల ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు చేసిన బీసీ ముఖ్యమంత్రి ప్రకటన.. జనసేనలో ప్రకంపనలే రేపుతోంది.
ఇప్పుడు బీసీలను కాదనలేం.. పవన్‌ను వద్దనలేం.. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ఇప్పటికీ దళిత సీఎం వ్యాఖ్యల విషయంలో అక్కడి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. బీసీలపై ఆయనకు నిజంగా అంత ప్రేమ ఉంటే గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఎందుకు ఇప్పించలేకపోయారు’ అని జన సేన నేతలు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు రెండు పార్టీల పొత్తుపైనే ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.