ఒక్కో ఓటుకు 8 వేలు! కడప జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆఫర్
posted on Feb 5, 2021 @ 1:38PM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఏకగ్రీవాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతల బెదిరింపులకు సంబంధించిన వీడియో, ఆడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎన్నికల్లో అనవసర గొడవలు ఎందుకులే అని కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. మరి కొన్ని చోట్ల మాత్రం వేలం పాటలు సాగుతున్నాయి. వేలంలో గెలిచిన అభ్యర్థికే గ్రామ పెద్దలు సర్పంచ్ పీఠాన్ని కట్టబెడుతున్నారు.
వేలంలో వచ్చిన నగదుతో గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం వేలపాట డబ్బును ఓటర్లకే పంచాలని నిర్ణియించారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమలాపురం మండలంలోని చిన్నపంచాయతీగా ఉన్న ఆ గ్రామంలో కేవలం 240 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి రిజర్వేషన్ లో ఉండే ఈ పంచాయతీ ఈసారి జనరల్ కేటగిరీకి వచ్చింది. పంచాయతీ సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఓ అభ్యర్థి.. వైసీపీ మద్దతుతో బరిలో దిగుదామని భావించాడు.
గ్రామ పెద్దల ముందు ఓ బంపర్ ఆఫర్ ఇంచాడు. రూ20 లక్షలు ఇస్తానని.. సర్పంచ్ పదవి తనకే ఇవ్వాలని చెప్పాడు. అందుకు గ్రామస్తులు కూడా ఓకే చెప్పారు. అయితే ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా.. ఓటర్లకు పంచేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ లెక్కన గ్రామంలోని ఒక్కో ఓటుకు రూ.8వేల చొప్పున పంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులే సదరు అభ్యర్థికి పోటీ లేకుండా చేయడానికి ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఓ గ్రామపంచాయతీకి స్థానికులు వేలం నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పదవికి మొదట ఆరుగురు పోటీలో నిలిచారు. తనకు సర్పంచ్ పదవి ఇస్తే 29లక్షల రూపాయలిస్తానని ఓ అభ్యర్థి గ్రామ పెద్దలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు మాత్రం రూ.50 లక్షలు ఇస్తే ఓకే అని పరిశీలిస్తామన్నారు. దీంతో ఆ అభ్యర్థి దానికి అంగీకరించాడు. ఈ విషయంలో తెలుసుకున్న మరో వ్యక్తి తాను రూ.50.25 లక్షలు ఇస్తానని మందుకొచ్చాడు. చివరకు మొదటగా ముందుకొచ్చిన అభ్యర్థి రూ.50.50 లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. పాట పాడిన వెంటనే డబ్బులు కూడా చెల్లించడంతో మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నిధులను గ్రామమాభివృద్ధి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానించారు.