పెళ్లి ఆఫర్‌తో ప్రత్యర్థికి మద్దతిచ్చిన బ్రహ్మచారి.. అక్కడి ఎన్నికలలో సూపర్ ట్విస్ట్
posted on Feb 5, 2021 9:08AM
దేశంలో ఆడపిల్లల జనాభా తగ్గిపోవడంతో బెండకాయలు ముదిరినట్లుగా యువకులు 40 ఏళ్ళు వచ్చినా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి చేసుకోవడం కోసం వారు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఎఫెక్ట్ అక్కడ పంచాయతి ఎన్నికలలో కూడా పడింది. తాజాగా కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రామనగర్ జిల్లా కోడంబళ్లి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు ఈనెల 11న షెడ్యూలు ఖరారు చేశారు. బీసీ ఏ కేటగిరికి అధ్యక్ష స్థానం రిజర్వు కాగా, కాంగ్రె్‌సకు చెందిన వ్యక్తి ఆ రేసులో ఉన్నారు. అతనికి ఇదే పంచాయతీలో జేడీఎస్‌కు చెందిన వార్డు సభ్యుడు రవి మద్దతు అవసరమైంది.
మరోపక్క రవి బ్రహ్మచారి.కావడంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామనగర్ జిల్లా గ్రామీణ కాంగ్రెస్ అధ్యక్షుడు "నువ్వు మాకు మద్దతు ఇవ్వు...ఒక మంచి పిల్లను చూసి నీ పెళ్లి చేసే బాధ్యత మాది’అంటూ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఇంకేముంది మనోడు కాంగ్రెస్ క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడానికి సిద్దమైపోయాడు. రవి తాజా వ్యవహారంతో జేడీఎస్ నాయకులు ఖంగుతిన్నారు. పెళ్లి కోసం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దంటూ స్థానిక నాయకులు హెచ్చరించారు. అయినా రావియా మాట వినకపోవడంతో చివరికి మాజీ సీఎం కుమారస్వామి చేత కూడా ఫోన్ చేయించారు. అయినా రవి మాత్రం ససేమిరా అన్నాడు. నాకు పాలిటిక్స్ కంటే నా పెళ్లి ముఖ్యమని తేల్చి చెప్పేశాడు. ఈ జగమొండి బ్రహ్మచారి తీరుతో మండిపడిన కుమారస్వామి అతడిపై వేటు వేయాలని సూచించినట్టు, స్థానిక నాయకత్వం తెలిపింది. ఐతే ఈనెల 11 దాకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం.