సామాన్యుడికి మరో షాక్.. వంట గ్యాస్ పై సబ్సిడీకి కేంద్రం రాంరాం..!
posted on Feb 5, 2021 @ 10:59AM
మీకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ ఉందా.. అయితే సబ్సిడీ సొమ్ము మీ అకౌంట్ లో జమ అవుతుందో లేదో గమనించారా.. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే గత ఏడాది మే నుండి బ్యాంకు అకౌంట్లలో కేవలం రూ.40.72 మాత్రమే పడుతోంది. అయితే నిజానికి వంటగ్యాస్ ధర పెరిగినకొద్దీ సబ్సిడీ మొత్తం కూడా పెరగాలి. కేంద్రంప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ ధర పెంచిన ప్రతి సారీ పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడాలి. అయితే కరోనా రావడానికి ముందు ప్రభుత్వం కూడా అలాగే చెల్లించేది. అయితే గత మే నుంచి ంటే కరోనా మొదలైనప్పటి నుండి కేంద్రం సైలెంట్ గా ఆ పద్ధతికి రాంరాం చెప్పింది. దీంతో సిలిండర్ ధర ఎంత ఉన్నా కేవలం రూ.40.72 మాత్రం వేసి చేతులు దులుపుకుంటోంది. 2014-15లో మోదీ సర్కారు వంట గ్యాస్ ధరలను బయటి మార్కెట్ రేట్లకు లింక్ చేయాలని నిర్ణయించినపుడు ఆ ఏడాదికి ఒక్కో సబ్సిడీ సిలిండర్ మీద రూ.563 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో ఒక్కో సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉండేది.అయితే గత ఆరేళ్లలో సిలిండర్ రేటుతో పాటు సబ్సిడీ కూడా తగ్గిపోతూ ఇప్పుడు కేవలం రూ.40 మాత్రమే బ్యాంకు అకౌంట్ లో పడుతోంది. ఈ సొమ్ము కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనినిబట్టి కేంద్రం వినియోగదారుడికి ఇస్తున్నది సున్నా. దీంతో వంట గ్యాస్ సబ్సిడీని కేంద్రం ఎత్తివేసినట్లేనని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ డీలర్లు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా దీనిపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోపక్క నిన్న మొన్నటివరకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 746.50 ఉండేది. అయితే గురువారం నుండి మరో రూ.25 పెంచడంతో రూ.771.50 పైసలకు చేరింది. ఇందులోవ్యక్తం చేస్తున్నారు కేంద్రం ఒక్క పైసా సబ్సిడీ ఇవ్వటంలేదు. కేవలం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఒక్కో సిలిండర్‌కు రూ.40 చొప్పున వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇపుడు ఒక్కో సిలిండర్ రూ. 731.50 కు వినియోగదారుడు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు వంటగ్యాస్ ధరలను నెలకోసారి (ఒకటో తేదీన) సవరించేవారు. దీంతో సిలిండర్ ధర పెరిగినా, తగ్గినా... నెల రోజులపాటు అదే రేటు అమలులో ఉండేది. ఇప్పటి నుండి వారానికొకసారి వంటగ్యాస్ ధరలను సవరించాలనే ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నెలకు నాలుగు సార్లు గ్యాస్ ధరల్లో మార్పు ఉంటుంది. ఇప్పటికే సబ్సిడీని దాదాపుగా ఎత్తివేయగా... ఇకముందు వారానికోసారి గ్యాస్ ధరలు సవరిస్తే మరింత అన్యాయం జరుగుతుందని వంట గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.