వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్.. టీడీపీ నేతలైతే జైలు!
posted on Feb 6, 2021 @ 4:29PM
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఈసీ హెచ్చరిస్తున్నా వైసీపీ నేతల తీరు మారడం లేదు. పోలీసుల తీరు కూడా వివాదాస్పదంగానే ఉంటోంది. అధికార పార్టీ నేతలకు ఒకలా, టీడీపీ నేతలను మరోలా ట్రీట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకే రకమైన ఘటనలు అయినా కేసులు పెట్టడంలో తేడాలు చూపిస్తున్నట్లు కొన్ని ఘటనల ద్వారా తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్లు వేయకుండా బెదిరించారనే కేసులో విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసి వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడిచి పెట్టారు. రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ సీతపాలెం పదో వార్డు సభ్యుడిగా రుత్తల సత్యం అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అయితే ఎమ్మెల్యే కన్నబాబురాజు అభ్యర్థి రుత్తల సత్యం అల్లుడు సంతోష్ కి ఫోన్ చేసి బూతులు తిట్టారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ బయటికి రావడంతో సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదుతో ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై ఐపీసీ 506,171ఎఫ్‌తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే కన్నబాబు రాజును అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేశారు.
పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాళి పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఏ1గా కింజారపు హరిప్రసాద్, ఏ2గా సురేష్, ఏ3గా అచ్చెన్నాయుడు పేర్లను చేర్చారు. ఈ కేసులో అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధంచడంతో ఆయనను జైలుకు పంపించారు. అచ్చెన్నాయుడు వేసిన బెయిల్ పిటిషన్ కూడా వాయిదా పడటంతో సోమవారం నుంచి ఆయన జైలులోనే ఉన్నారు
వైసీసీ అభ్యర్థిని బెదిరించారన్న కేసులో మాజీ మంత్రి, ఏపీ టీడీపీ చీఫ్ గా ఉన్న అచ్చెన్నను జైలుకు పంపించిన పోలీసులు... అలాంటి ఘటనే జరిగినా వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడ, ఇక్కడ ఫోన్ లోనే సంభాషణ జరిగింది. అచ్చెన్నాయుడు ఆడియోలో బెదిరించినట్లు ఎక్కడా అనిపించలేదు. కాని వైసీపీ ఎమ్మెల్యే ఆడియోలో మాత్రం ఆయన బెదిరించినట్లు స్పష్టంగా ఉంది. అయినా వైసీపీ ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ రాగా.. సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని మాత్రం జైలుకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.