ఎస్ఈసీ ఆదేశాలు పట్టించుకోను! నిమ్మగడ్డ పిచ్చొడన్న పెద్దిరెడ్డి
posted on Feb 6, 2021 @ 1:02PM
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితం చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమర్ ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఎస్ఈసీ నిర్ణయంపై స్పందించిన పెద్ది రెడ్డి.. మరోసారి నిమ్మగడ్డను టార్గెట్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమన్నారు పెద్దిరెడ్డి. ఆయన పిచ్చివాడని.. పట్టించుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ ఎస్ఈసీగా పనిచేయడం లేదని.. చంద్రబాబు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
''చంద్రబాబు లాగే నిమ్మగడ్డకు పిచ్చి ముదిరింది. నిమ్మగడ్డ ఎస్ఈసీలా కాకుండా చంద్రబాబు బంట్రోతులా పనిచేస్తున్నారు. ఆయన తెలిసీ తెలియని మూర్ఖుడు. నిమ్మగడ్డకు సిగ్గులేదు. ఇంగితజ్ఞానం లేదు. అలాంటి వ్యక్తులు జారీచేసిన ఆదేశాలను అమలు చేయలేం. మంత్రిని ఇంట్లో బంధించాలన్న ఆలోచన దుర్మార్గం. నాకు సంబంధించిన శాఖలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈయన ఎవరూ నాకు ఆదేశాలివ్వడానికి? నిమ్మగడ్డ ఇంకా నా వెంట ఉండాలి. కానీ చంద్రబాబు వెంట ఉండి ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. నిమ్మగడ్డ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిమ్మడ్డ రమేష్ కుమార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా జరిగేది జరుగుతుంది. నేను ఇంట్లో ఉంటా. బయటా ఉంటా. ఆయన ఆదేశాలను మేం పట్టించుకోం.'' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఎస్‌ఈసీ నుంచి తనకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎస్‌ఈసీ ఆర్డర్స్‌ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను రాజకీయాలు మాట్లాడను, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ తెలిపారు.