సీక్రెట్ సర్వేలో బీజేపీకి షాకింగ్ రిపోర్ట్.. స్వయంగా రంగంలోకి అమిత్ షా
posted on Feb 6, 2021 @ 11:15AM
ఏపీలో ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి అధికారం చేపట్టేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆ పార్టీకి నోటా కంటే కూడా తక్కువగా కేవలం ౦.84శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనతో జట్టు కట్టి బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎపి అభివృద్ధి చెందాలంటే మా కూటమిని గెలిపించాలంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాజధాని లేని ఏపీకి గొప్ప రాజధాని నిర్మించాలన్నా.., పోలవరం త్వరగా పూర్తి కావాలన్నా.. మావాళ్లే సాధ్యం అవుతుందని అటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రెస్ మీట్లలోనూ నాయకులు టెవ్వరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం "ఏపీ ఇలా ఉండడానికి మీ పార్టీ , మీ నేతల నిర్వాకమే కారణం.. అసలు ఏపీని కనీసం ఎదగకుండా నాశనం చేస్తున్నది కూడా మీరే" అంటూ బీజేపీని ఎక్కి పడేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ దన్నుతో అధికారం చేపట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నం లో జనసేనను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తికి గురౌతున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కూడా ఎక్కువ కాలం నిలిచేలా లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.
మరోపక్క బీజేపీకి బాగా కలిసి వచ్చిన హిందుత్వ ఎజెండాతో జనంలోకి చొచ్చుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఏపీలో దేవాలయాల పై జరుగుతన్న దాడులు, దేవత విగ్రహాల ధ్వంసం పై ఎక్కడికక్కడ ఉద్యమం చేస్తున్నా అనుకున్న ఫలితాలు కనిపించడం లేదు అయినా కానీ బీజేపీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. దీంతో ఏపీలో బీజేపీ తాజా పరిస్థితిపై పార్టీ కేంద్ర అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇక్కడ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం 2020 మధ్య లో ఓసారి, అలాగే గడచినా నెల జనవరిలో మరో సారి ఏపీలో బీజేపీ తీరుపై ఒక సీక్రెట్ సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా వచ్చిన రిపోర్ట్ ను అంతకు ముందు వచ్చిన రిపోర్ట్ తో పోల్చి చూసి పార్టీ అధిష్టానం కంగు తిన్నదట. గడచిన ఆరు నెలల్లో ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారిందని తెలిసిందట. 2020 మధ్యలో చేసిన సర్వేలో నాలుగు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో బీజేపీ పరిస్థితి కొంత మెరుగు పడిందని..అయితే గత నెల లో చేసిన సర్వేలో మళ్ళీ రాష్ట్ర బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాలేదని వెల్లడయినట్లు సమాచారం. దీంతో ఏపీ బీజేపీ పెద్దలు, అలాగే పరిశీలకులకు కేంద్ర పెద్దలు తలంటినట్లుగా తెలుస్తోంది.
ఇది ఇలాఉండగా త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో.. బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న మమతా బెనర్జీని ఓడించి అక్కడ అధికార పీఠం చేపట్టాలని బీజేపీ తీవ్రంగా పోరాడుతోంది. దీనికోసం స్వయంగా అమిత్ షా ఒక డేడికేటెడ్ టీమ్ తో వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి ఎన్నికలు పూర్తయిన తరువాత అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి ఏపీ రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారని.. దీని కోసం అయన ఏపీలో పలు పర్యటనలు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్ల శాతం సాధించిన ఏపీలో ఏ విధంగా బలపడుతుందో వేచి చూడాలి.