మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం! ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం
posted on Feb 6, 2021 @ 11:52AM
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు . ఇప్పటివరకు అధికారులపైనే చర్యలకు సిఫారస్ చేసిన నిమ్మగడ్డ.. ఈసారి ఏకంగా మంత్రినే టార్గెట్ చేశారు. ఎన్నికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమిత చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 21 వరకు మంత్రి పెద్ది రెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మీడియాతో మాట్లాడేందుకు కూడా పెద్ది రెడ్డి అవకాశం ఇవ్వొద్దన్నారు. పంచాయతీ ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగడానికే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు .ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు . మంత్రి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, వైద్య సదుపాయాల కోసం కూడా వెళ్లవచ్చని ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఏకగ్రీవాలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ఉత్తర్వులకు ఎన్నికల కమిషన్ జతచేసింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఏకగ్రీవాలను ప్రోత్సహించడం కోసమేనని అర్థమవుతోందని పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఎస్‌ఈసీ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో స్వయం పాలన సాగాలని 73 రాజ్యాంగ సవరణలో ఉందని, ఇటువంటి వ్యాఖ్యలను గతంలో కోర్టులు కూడా తప్పుపట్టాయని ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ గుర్తుచేశారు.
స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఏకగ్రీవాలకు వెంటనే డిక్లరేషన్ లు ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్తూరు,గుంటూరు జిల్లాల అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలన్నారు. జిల్లా అధికారులను ఎస్ఈసీ భయపెడుతున్నారని పెద్ది రెడ్డి ఆరోపించారు. జిల్లా అధికారులు ఎస్ఈసీ మాటలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని చెప్పారు మంత్రి పెద్ది రెడ్డి.
ఉద్యోగస్తులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ సెక్రటరీకి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే కాబినెట్ నుంచి తొలగించాలని ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో బోండా ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మరెడ్డి శ్రీనివాసరెడ్డి, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు. టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ వెళ్లారు. అయితే గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని టీడీపీ నేతలు కలిశారు.